DJB
-
వేసవి కార్యాచరణ ప్రణాళిక రెడీ
సాక్షి, న్యూఢిల్లీ: వేసవిలో నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కోవడం కోసం ఢిల్లీ జల్ బోర్డు(డీజేబీ) వేసవి కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. నిజానికి నీటి సమస్యను పరిష్కరించేందుకు ట్యాంకర్లు, ట్యూబ్‌వెల్స్ మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. అందుకే వేసవిలో ట్యాంకర్ల ట్రిప్పుల సంఖ్యను పెంచడంతో పాటు ట్యూబ్‌వెల్స్ వేయాలని డీజేబీ నిర్ణయించింది. నీటి కొరతను దృష్టిలో పెట్టుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలని నగరవాసులకు విజ్ఞప్తి చేసింది. వేసవిలో సాధారణంగా నీటి డిమాండ్ పెరిగిపోతుంది. కానీ ఇతర సీజన్లలో లభించినంత నీరే వేసవిలోనూ డీజేబీకి లభిస్తుంది. ఢిల్లీ జల్ బోర్డు ప్రతి రోజు 840 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తోంది. మునాక్ కెనాల్ నుంచి అదనంగా 80 ఎంజీడీల నీరు లభించకపోతే వేసవిలో ఢిల్లీవాసుల దాహార్తిని తీర్చడానికి డీజేబీ ఇబ్బందులు పడకతప్పదు. 716 కాలనీల్లో నీటిపైపులు లేవు: ఢిల్లీలో 1,630 అనధికార కాలనీలు ఉన్నాయి. వాటిలో 716 కాలనీల్లో పైపులైన్లు ఇంకా వేయలేదు. పైపులైన్లు వేసిన 937 అనధికార కాలనీల్లో 24 కాలనీలకేమో నీరు అందడం లేదు. అంటే 913 కాలనీలకు మాత్రమే పైపులైను ద్వారా నీరు అందుతోంది. మిగతా అనధికార కాలనీ వాసులు నీటి కోసం ట్యాంకర్లపైనే ఆధారపడవలసివస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ట్యాంకర్ల ట్రిప్పుల సంఖ్య పెంచాలని డీజేబీ నిర్ణయించింది. వేసవిలో ట్యాంకర్లు ప్రతి రోజు 6,400 ట్రిప్పులు వేయాలని అధికారులను ఆదేశించింది. గత సంవత్సరం ట్యాంకర్లు దాదాపు 4,100 ట్రిప్పులు వేశాయి. అలాగే నీటి సరఫరా సమస్య మరింత తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో 78 ట్యూబ్‌వెల్స్ వేయించాలని సర్కారు నిర్ణయించింది. వేసవి రాకముందే పాతబడిన పైపులైన్లను తీసేసి వాటి స్థానంలో కొత్తవి వేయాలని ఆదేశించింది. పాత ట్యూబ్‌వెల్స్, నీటి పైపులైన్లతో పాటు నగరంలోని అన్ని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు మరమ్మతులు త్వరగా జరిపించాలని సూచించింది. నీటి ట్యాంకర్లపై నిఘా: నీటి కొరత దృష్ట్యా నీటి ట్యాంకర్లపై డీజేబీ నిఘాను పెంచింది. డీజేబీకి చెందిన అన్ని ఎమర్జెన్సీ కేంద్రాల్లో నోడల్ అధికారులను నియమిస్తారు. ట్యాంకర్లు సరైన సమయానికి వస్తున్నారా లేదా అన్నది వారు పరిశీలిస్తారు. 4,400 పైపులైన్లలో లీకేజీ సమస్య ఉందని గుర్తించిన డీజేబీ వాటికి మర్మతులు చేయిం చింది. సావ్దాగ్రేవ్రా, ద్వారకా, మహావీర్ ఎన్క్లేవ్ ప్రాంతాల్లో ఇప్పటికే వాటర్ ఏటీఎంలను ఏర్పాటుచేశారు. మరికొన్ని చోట్ల కూడా వాటిని ఏర్పాటుచేస్తున్నట్లు సమాచారం. -
నీటి చార్జీలను 10 శాతం పెంచనున్న డీజేబీ
సాక్షి, న్యూఢిల్లీ: నీటి చార్జీలను 10 శాతం మేర పెంచాలని ఢిల్లీ జల్ బోర్డు(డీజేబీ) నిర్ణయించింది. కానీ, ఈ చార్జీల పెంపును అందరికీ కాకుండా నెలకు 20 వేల లీటర్లకు పైగా నీటిని వినియోగించే కుటుంబాలకు వర్తింపు చేయాలని డీజేబీ భావిస్తోంది. కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా అందిస్తామన్న హామీతో ఆప్ ఆద్మీ పార్టీ(ఆప్) ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. ఆప్ సర్కారు ఏర్పాటు కాగానే ఉచిత నీటి హామీని నిలబెట్టుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కొక్క కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని, అంతకు మించి ఒక్క లీటరును ఎక్కువగా వినియోగించినా పూర్తి చార్జీలను చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఇప్పుడు ఉచిత నీటి సరఫరా వల్ల తగ్గిన ఆదాయన్ని పూడ్చుకోవడం కోసం నీటి చార్జీలను పది శాతం పెంచాలని డీజేబీ నిర్ణయించింది. గురువారం జరిగిన ఢిల్లీ జల్ బోర్డు సమావేశంలో 20 వేల లీటర్లకు పైగా వినియోగించే కుటుంబాల నీటి చార్జీలను 10 శాతం పెంచడంతోపాటు, 250 వాటర ట్యాంకర్లను కొనాలని నిర్ణయించారు. సమావేశంలో ఇతర అంశాలతో పాటు అనధికార కనెక్షన్లను క్రమబద్ధీకరించడంపై కూడా చర్చ జరిగింది. నగరంలోని అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరించాలని సమావేశం నిర్ణయించింది. రాజధానిలో 23 వేల అక్రమ కనెక్షన్లు ఉన్నాయనేది డీజేబీ అంచనా. కొత్త కనెక్షన్ కోసం డెవలప్మెంట్ చార్జీ వసూలు చేయరాదని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. నీటి కనెక్షన్ల కోసం ప్రభుత్వం త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకురానుంది. దీని కింద రూ. 3,500 కొత్త కనెక్షన్ ఇస్తారు. -
జరిమానాలతోనే అంతా దారిలోకి..
న్యూఢిల్లీ: ఆకస్మిక తనిఖీలతో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం సాధ్యం కాదని నగరంలోని మూడు కార్పొరేషన్లు హైకోర్టుకు తెలియజేశాయి. వాటి స్థానంలో ఆర్థిక ప్రతిబంధాలను విధిస్తే బాగుంటుందని సూచించాయి. జస్టిస్ బదర్ దురేజ్ అహ్మద్, జస్టిస్ సిద్ధార్ధ్ మృదుల్ నేతృత్వంలోని ధర్మాసనానికి బుధవారం సమగ్ర వివరాలతో కూడిన ఓ నివేదికను అందజేశాయి. నగరంలో ప్రస్తుతం 1.52 లక్షల అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు అందులో పేర్కొన్నాయి. వీటి తొలగింపు విషయంలో తాము ఏమాత్రం సందేహించబోమని తెలిపాయి. ఇందుకు స్పందించిన ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణనాటికి అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి ఓ కార్యాచరణ ప్రణాళికను తమకు అందజేయాలని సూచించింది. పట్టణ అభివృద్ధి విభాగం, ఢిల్లీ ప్రభుత్వ సలహాలు, సూచనలను జత చేయాలని పేర్కొంది. ఈ సమస్య పరిష్కారం విషయంలో ఈ మూడు కార్పొరేషన్లకు సహకరించాలంటూ ఢిల్లీ జల్‌బోర్డు (డీజేబీ), ఢిల్లీ విద్యుత్ నియంత్రణ సంస్థ (డీఈఆర్సీ)లను ఆదేశించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో ఏ విభాగమూ బాధ్యతలనుంచి తప్పుకునేందుకు యత్నించవద్దని హితవు పలికింది. తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎంసీ) కమిషనర్ తన వాదనను కోర్టుకు వినిపిస్తూ తమ పరిధిలో కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయన్నారు. వాటి యజమానులు క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు తాము ఎంతగానో యత్నించామని, అయినప్పటికీ పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోయామన్నారు. ఇటువంటి నిర్మాణాలకు నీటి సరఫరాను నిలిపివేస్తే మున్ముందు ఈ సమస్య తీవ్రత తగ్గుతుందన్నారు. దీంతోపాటు పోలీసు నిఘా కూడా అవసరమన్నారు. నీరు, విద్యుత్ సరఫరాలను నిలిపివేయాల్సిందిగా ఢిల్లీ జల్ బోర్డుతోపాటు పంపిణీ సంస్థలకు తాము లేఖలు రాస్తున్నప్పటికీ ప్రయోజనం లేకపోతోందన్నారు. ఈ సంస్థలు అక్రమ నిర్మాణదారుల విషయంలో ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు.