సాక్షి, న్యూఢిల్లీ: వేసవిలో నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కోవడం కోసం ఢిల్లీ జల్ బోర్డు(డీజేబీ) వేసవి కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. నిజానికి నీటి సమస్యను పరిష్కరించేందుకు ట్యాంకర్లు, ట్యూబ్‌వెల్స్ మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. అందుకే వేసవిలో ట్యాంకర్ల ట్రిప్పుల సంఖ్యను పెంచడంతో పాటు ట్యూబ్‌వెల్స్ వేయాలని డీజేబీ నిర్ణయించింది. నీటి కొరతను దృష్టిలో పెట్టుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలని నగరవాసులకు విజ్ఞప్తి చేసింది. వేసవిలో సాధారణంగా నీటి డిమాండ్ పెరిగిపోతుంది. కానీ ఇతర సీజన్లలో లభించినంత నీరే వేసవిలోనూ డీజేబీకి లభిస్తుంది. ఢిల్లీ జల్ బోర్డు ప్రతి రోజు 840 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తోంది. మునాక్ కెనాల్ నుంచి అదనంగా 80 ఎంజీడీల నీరు లభించకపోతే వేసవిలో ఢిల్లీవాసుల దాహార్తిని తీర్చడానికి డీజేబీ ఇబ్బందులు పడకతప్పదు.
716 కాలనీల్లో నీటిపైపులు లేవు:
ఢిల్లీలో 1,630 అనధికార కాలనీలు ఉన్నాయి. వాటిలో 716 కాలనీల్లో పైపులైన్లు ఇంకా వేయలేదు. పైపులైన్లు వేసిన 937 అనధికార కాలనీల్లో 24 కాలనీలకేమో నీరు అందడం లేదు. అంటే 913 కాలనీలకు మాత్రమే పైపులైను ద్వారా నీరు అందుతోంది. మిగతా అనధికార కాలనీ వాసులు నీటి కోసం ట్యాంకర్లపైనే ఆధారపడవలసివస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ట్యాంకర్ల ట్రిప్పుల సంఖ్య పెంచాలని డీజేబీ నిర్ణయించింది. వేసవిలో ట్యాంకర్లు ప్రతి రోజు 6,400 ట్రిప్పులు వేయాలని అధికారులను ఆదేశించింది. గత సంవత్సరం ట్యాంకర్లు దాదాపు 4,100 ట్రిప్పులు వేశాయి. అలాగే నీటి సరఫరా సమస్య మరింత తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో 78 ట్యూబ్‌వెల్స్ వేయించాలని సర్కారు నిర్ణయించింది. వేసవి రాకముందే పాతబడిన పైపులైన్లను తీసేసి వాటి స్థానంలో కొత్తవి వేయాలని ఆదేశించింది. పాత ట్యూబ్‌వెల్స్, నీటి పైపులైన్లతో పాటు నగరంలోని అన్ని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు మరమ్మతులు త్వరగా జరిపించాలని సూచించింది.
నీటి ట్యాంకర్లపై నిఘా:
నీటి కొరత దృష్ట్యా నీటి ట్యాంకర్లపై డీజేబీ నిఘాను పెంచింది. డీజేబీకి చెందిన అన్ని ఎమర్జెన్సీ కేంద్రాల్లో నోడల్ అధికారులను నియమిస్తారు. ట్యాంకర్లు సరైన సమయానికి వస్తున్నారా లేదా అన్నది వారు పరిశీలిస్తారు. 4,400 పైపులైన్లలో లీకేజీ సమస్య ఉందని గుర్తించిన డీజేబీ వాటికి మర్మతులు చేయిం చింది. సావ్దాగ్రేవ్రా, ద్వారకా, మహావీర్ ఎన్‌క్లేవ్ ప్రాంతాల్లో ఇప్పటికే వాటర్ ఏటీఎంలను ఏర్పాటుచేశారు. మరికొన్ని చోట్ల కూడా వాటిని ఏర్పాటుచేస్తున్నట్లు సమాచారం.
వేసవి కార్యాచరణ ప్రణాళిక రెడీ
Published Wed, Apr 1 2015 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM
Advertisement
Advertisement