సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ సుందరీకరణకు త్వరలోనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూళన శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వివిధ శాఖల అధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. పచ్చదనం-పరిశుభ్రతకు సమగ్ర కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వశాఖల మధ్య సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవచ్చన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి, డీడీఏ ముఖ్యకార్యనిర్వహణ అధికారి, ఎన్డీఎమ్సీ, మూడు ఎమ్సీడీలు, ఢిల్లీ జల్‌బోర్డు అధికారులతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గురువారం ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యచరణ ప్రణాళికపై చర్చించారు.
నగర ప్రజలకు నాణ్యమైన జీవనాన్ని అందించడానికి పచ్చదనం, పరిశుభ్రతపై దృష్టిని కేంద్రీకరిస్తూ తగు చర్యలు చేపట్టాలన్నారు. తక్షణ చర్యల కింద చేపట్టాల్సిన అంశాలను సూచించారు. రోడ్డుపక్కల, ఫుట్‌పాత్‌ల పక్కల ఉండే బురద (మల్బా)ను తొలిగించాలన్నారు. రోడ్లు, ఫుట్‌పాత్‌లకు మరమ్మతులు పేయింటింగులు చేయాలని సూచించారు. రహదారులు, ఫుట్‌పాత్ ఆక్రమణలు, అక్రమ పార్కింగ్‌లను సత్వరమే తొలిగించాలన్నారు. నీటి నిల్వలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజా మూత్రశాలలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాల్వల్లో మురుగుపేరుకుపోకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో వృథా సామాగ్రిని ఎత్తివేయాలని ఆదేశించారు.
పార్కులను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. బస్సు టెర్మినళ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో పరిశుభత్రకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటను వికేంద్రీకరించాలని సూచించారు. పారిశుధ్య కార్యక్రమాల్లో ప్రజలు, వ్యాపారసంఘాలు, వర్తక సంఘాలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, విద్యాసంస్థలు, ఎన్సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌లను భాగస్వాములు చేయాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ నిబంధనలు ఉల్లఘించేవారిపై చర్యలు తీసుకోవడం, చలాన్లు కట్టించడానికి సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. ఆరు నెలల్లో తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ.. పారిశుద్ధ్య నిబంధనలపై ప్రకటనలు జారీ చేయలని, ప్రజామరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణను ‘నిర్మించు, నిర్వహించు బదలాయించు’ (బీఓటీ) పద్దతిలో ప్రైవేటు వ్యక్తులకు కేటాయించాలని, ఇంటింటి నుంచి చెత్త సేకరించాలని, గాజీపుర్, నరేలా, బవానాలో చెత్త నుంచి ఇంధనం ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
దీర్ఘకాలిక ప్రణాళికలో చేయాల్సిన పనులను వివరిస్తూ... జీరో వేస్ట్ మేనేజ్‌మెంట్, గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్, జీపీఎస్, వేస్ట్ కలెక్షన్, డిస్పోజల్ విధానాన్ని ఐటీ ఆధారితంగా పర్యవేక్షణ జరిపించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
పరిశుభ్ర రాజధాని కోసం ప్రత్యేక కార్యక్రమం
Published Thu, Sep 11 2014 11:06 PM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM
Advertisement
Advertisement