delhi jal board
-
వేసవి కార్యాచరణ ప్రణాళిక రెడీ
సాక్షి, న్యూఢిల్లీ: వేసవిలో నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కోవడం కోసం ఢిల్లీ జల్ బోర్డు(డీజేబీ) వేసవి కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. నిజానికి నీటి సమస్యను పరిష్కరించేందుకు ట్యాంకర్లు, ట్యూబ్‌వెల్స్ మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. అందుకే వేసవిలో ట్యాంకర్ల ట్రిప్పుల సంఖ్యను పెంచడంతో పాటు ట్యూబ్‌వెల్స్ వేయాలని డీజేబీ నిర్ణయించింది. నీటి కొరతను దృష్టిలో పెట్టుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలని నగరవాసులకు విజ్ఞప్తి చేసింది. వేసవిలో సాధారణంగా నీటి డిమాండ్ పెరిగిపోతుంది. కానీ ఇతర సీజన్లలో లభించినంత నీరే వేసవిలోనూ డీజేబీకి లభిస్తుంది. ఢిల్లీ జల్ బోర్డు ప్రతి రోజు 840 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తోంది. మునాక్ కెనాల్ నుంచి అదనంగా 80 ఎంజీడీల నీరు లభించకపోతే వేసవిలో ఢిల్లీవాసుల దాహార్తిని తీర్చడానికి డీజేబీ ఇబ్బందులు పడకతప్పదు. 716 కాలనీల్లో నీటిపైపులు లేవు: ఢిల్లీలో 1,630 అనధికార కాలనీలు ఉన్నాయి. వాటిలో 716 కాలనీల్లో పైపులైన్లు ఇంకా వేయలేదు. పైపులైన్లు వేసిన 937 అనధికార కాలనీల్లో 24 కాలనీలకేమో నీరు అందడం లేదు. అంటే 913 కాలనీలకు మాత్రమే పైపులైను ద్వారా నీరు అందుతోంది. మిగతా అనధికార కాలనీ వాసులు నీటి కోసం ట్యాంకర్లపైనే ఆధారపడవలసివస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ట్యాంకర్ల ట్రిప్పుల సంఖ్య పెంచాలని డీజేబీ నిర్ణయించింది. వేసవిలో ట్యాంకర్లు ప్రతి రోజు 6,400 ట్రిప్పులు వేయాలని అధికారులను ఆదేశించింది. గత సంవత్సరం ట్యాంకర్లు దాదాపు 4,100 ట్రిప్పులు వేశాయి. అలాగే నీటి సరఫరా సమస్య మరింత తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో 78 ట్యూబ్‌వెల్స్ వేయించాలని సర్కారు నిర్ణయించింది. వేసవి రాకముందే పాతబడిన పైపులైన్లను తీసేసి వాటి స్థానంలో కొత్తవి వేయాలని ఆదేశించింది. పాత ట్యూబ్‌వెల్స్, నీటి పైపులైన్లతో పాటు నగరంలోని అన్ని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు మరమ్మతులు త్వరగా జరిపించాలని సూచించింది. నీటి ట్యాంకర్లపై నిఘా: నీటి కొరత దృష్ట్యా నీటి ట్యాంకర్లపై డీజేబీ నిఘాను పెంచింది. డీజేబీకి చెందిన అన్ని ఎమర్జెన్సీ కేంద్రాల్లో నోడల్ అధికారులను నియమిస్తారు. ట్యాంకర్లు సరైన సమయానికి వస్తున్నారా లేదా అన్నది వారు పరిశీలిస్తారు. 4,400 పైపులైన్లలో లీకేజీ సమస్య ఉందని గుర్తించిన డీజేబీ వాటికి మర్మతులు చేయిం చింది. సావ్దాగ్రేవ్రా, ద్వారకా, మహావీర్ ఎన్క్లేవ్ ప్రాంతాల్లో ఇప్పటికే వాటర్ ఏటీఎంలను ఏర్పాటుచేశారు. మరికొన్ని చోట్ల కూడా వాటిని ఏర్పాటుచేస్తున్నట్లు సమాచారం. -
నీటిశుద్ధి కేంద్రాలకు మరమ్మతులు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా సరైన నీటిసరఫరా లేక నిరుపయోగంగా మూలనపడి ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను పునరుద్ధరించేందుకు ఢిల్లీ జల్ బోర్డ్ (డీ జేబీ) నిర్ణయించింది. హరియాణా రాష్ట్రం మరో నెలన్నర రోజుల్లో మునాల్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయనున్నందున అప్పట్లోగా వాటర్ ప్లాంట్ల మరమ్మతులు పూర్తిచేసి పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని డీజేబీ అధికారులు యోచిస్తున్నారు. ఈ మేరకు కార్యాచరణ రూపొందించినట్లు వారు తెలిపారు. ఈ నీటిశుద్ధి కేంద్రాలు అందుబాటులోకి వస్తే దక్షిణ, నైరుతి,వాయవ్య, పశ్చిమ ఢిల్లీలో నివసించే సుమారు 20 లక్షల మంది పేదలకు మంచినీటిని సరఫరాచేయగలుగుతామని డీజేబీ తెలిపింది. నగరంలో పరిశుద్ధ నీటి సరఫరా విషయమై ఇటీవల డీజేబీని హైకోర్టు ఆక్షేపించిన విషయం తెలిసిందే. దాంతో ఇరాదత్నగర్లో ఉన్న రావాటర్ పంప్ హౌజ్‌ను మునాక్ కెనాల్‌తో అనుసంధానించే పనిని బోర్డు పూర్తిచేసింది. ప్రస్తుతం నీటిశుద్ధి కర్మాగారం పనితీరును పరీక్షిస్తున్నారు. పంప్ హౌజ్ నుంచి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు ముడినీరు తీసుకువచ్చే లైన్లను పూర్తిచేయడం కోసం బోర్డు తాత్కాలిక అలైన్మెంట్ చేసింది. అమర్‌కాలనీ, భాగ్యవిహార్లలో ఇంకా పూర్తి కాని పనులను ఎలాంటి కూల్చివేతలు జరుపకుండా పోలీసు రక్షణతో నిర్మిస్తున్నారు. ఈ నీటిలైన్ల కనెక్షన్లు 20 రోజుల్లో పూర్తవుతాయని, నెలరోజుల్లో ద్వారకా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనిచేయడం మొదలవుతుందని డీజేబీ తెలిపింది. 40 ఎంజీడీల సామర్థ్యం కలిగిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటును మూడేళ్ల కింద నిర్మించారు. పదేళ్ల కిందట నిర్మించిన 20 ఎంజీడీల సామర్థ్యం కలిగిన బవానా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు ముడినీటి సరఫరా లేకపోవడం వల్ల అది ఇప్పటి వరకు పనిచేయలేదు. ఇన్నాళ్లుగా మూలనపడిన ఈ ప్లాంటులో ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహించి పాతబడిన యంత్రాలను పరీక్షిస్తున్నారు. అవసరమైన మరమ్మతులు చేసి దాన్ని వినియోగించుకోవడానికి డీజేబీ యత్నిస్తోంది. ఇప్పటికే ఫిల్టరు బెడ్లను, క్లారిఫైయర్లను శుభ్రం చేశారు, ఫిల్టర్ మీడియాను మార్చారు. ఈ ప్లాంటు కూడా మరో 20 రోజుల్లో వినియోగంలోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.అలాగే సగం సామర్థ్యంతో పనిచేస్తున్న ఓఖ్లా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి ఢిల్లీ జల్‌బోర్డు సిబ్బంది కషిచేస్తున్నారు. -
ఢిల్లీ పోలీసులా... మజాకా!
న్యూఢిల్లీ: గల్లంతైన బాలుడి ఆచూకీని మూడుగంటల్లోనే కనుగొన్నారు ఢిల్లీ పోలీసులు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తన కుమారుడు ఢిల్లీ జల్‌బోర్డు మైదానంలో ఆడుకోవడానికి వెళ్లాడని, ఆ తర్వాత కనిపించలేదంటూ శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో తండ్రి గోపాల్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అక్కడ ఆడుకుంటుండగా తాను చూశానని, ఆ తరువాత తాను కార్యాలయానికి వెళ్లానని తెలిపాడు. ఆ సమయంలో తన భార్య ఇంటి పనుల్లో నిమగ్నమైందన్నాడు. కొంతసేపటి తర్వాత కుమారుడి కోసం వెదకగా కనిపించలేదని, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగావారు కిడ్నాప్ కింద కేసు నమోదు చేశారన్నారు. ఫిర్యాదు అందగానే డీసీపీ ప్రేమ్‌నాథ్ నేతృత్వంలో 12 పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. నగరంలోని అన్ని పోలీస్స్టేషన్లకు ఈ సమాచారం పంపారు. పెద్దసంఖ్యలో పోలీసు బలగాలు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తుండడంతో ఈ విషయం అనేకమంది నగరవాసుల దృష్టికికూడా వచ్చింది. దీంతో వారు కూడా ఇందులో భాగస్వాములయ్యారు. మాలవీయనగర్‌కు చెందిన కమల్ అనే ఓ ప్రైవేటు బస్సు క్లీనర్‌వద్ద ఈ బాలుడు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. తక్షణమే పోలీసులు మాలవీయనగర్‌కు చేరుకోగా అక్కడికి సమీపంలోని బేగంపూర్ మసీదు వద్ద ఆ బాలుడితో కమల్ కనిపించాడు. పోలీసులకు బాలుడిని అప్పగించాడు. ఈ విషయమై కమల్ మాట్లాడుతూ మాలవీయనగర్‌లో ఈ బాలుడు ఒంటరిగా తిరుగుతుండగా సాయంత్రం ఐదు గంటల సమయంలో చూశానని, తన ఇంటి చిరునామాగానీ లేదా అమ్మనాన్నల పేర్లుగానీ చెప్పలేకపోతున్నాడన్నారు. ఈ విషయమై డీసీపీ ప్రేమ్‌నాథ్ మాట్లాడుతూ కమల్‌కు తగిన అవార్డు కోసం ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు. -
పరిశుభ్ర రాజధాని కోసం ప్రత్యేక కార్యక్రమం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ సుందరీకరణకు త్వరలోనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూళన శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వివిధ శాఖల అధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. పచ్చదనం-పరిశుభ్రతకు సమగ్ర కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వశాఖల మధ్య సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవచ్చన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి, డీడీఏ ముఖ్యకార్యనిర్వహణ అధికారి, ఎన్డీఎమ్సీ, మూడు ఎమ్సీడీలు, ఢిల్లీ జల్‌బోర్డు అధికారులతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గురువారం ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యచరణ ప్రణాళికపై చర్చించారు. నగర ప్రజలకు నాణ్యమైన జీవనాన్ని అందించడానికి పచ్చదనం, పరిశుభ్రతపై దృష్టిని కేంద్రీకరిస్తూ తగు చర్యలు చేపట్టాలన్నారు. తక్షణ చర్యల కింద చేపట్టాల్సిన అంశాలను సూచించారు. రోడ్డుపక్కల, ఫుట్‌పాత్‌ల పక్కల ఉండే బురద (మల్బా)ను తొలిగించాలన్నారు. రోడ్లు, ఫుట్‌పాత్‌లకు మరమ్మతులు పేయింటింగులు చేయాలని సూచించారు. రహదారులు, ఫుట్‌పాత్ ఆక్రమణలు, అక్రమ పార్కింగ్‌లను సత్వరమే తొలిగించాలన్నారు. నీటి నిల్వలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజా మూత్రశాలలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాల్వల్లో మురుగుపేరుకుపోకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో వృథా సామాగ్రిని ఎత్తివేయాలని ఆదేశించారు. పార్కులను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. బస్సు టెర్మినళ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో పరిశుభత్రకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటను వికేంద్రీకరించాలని సూచించారు. పారిశుధ్య కార్యక్రమాల్లో ప్రజలు, వ్యాపారసంఘాలు, వర్తక సంఘాలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, విద్యాసంస్థలు, ఎన్సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌లను భాగస్వాములు చేయాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ నిబంధనలు ఉల్లఘించేవారిపై చర్యలు తీసుకోవడం, చలాన్లు కట్టించడానికి సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. ఆరు నెలల్లో తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ.. పారిశుద్ధ్య నిబంధనలపై ప్రకటనలు జారీ చేయలని, ప్రజామరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణను ‘నిర్మించు, నిర్వహించు బదలాయించు’ (బీఓటీ) పద్దతిలో ప్రైవేటు వ్యక్తులకు కేటాయించాలని, ఇంటింటి నుంచి చెత్త సేకరించాలని, గాజీపుర్, నరేలా, బవానాలో చెత్త నుంచి ఇంధనం ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. దీర్ఘకాలిక ప్రణాళికలో చేయాల్సిన పనులను వివరిస్తూ... జీరో వేస్ట్ మేనేజ్మెంట్, గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్, జీపీఎస్, వేస్ట్ కలెక్షన్, డిస్పోజల్ విధానాన్ని ఐటీ ఆధారితంగా పర్యవేక్షణ జరిపించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ప్రాణాలు హరీ...!
న్యూఢిల్లీ: నగరంలోని మ్యాన్‌హోళ్లు మత్యువుకు చిరునామాగా మారాయి. వీటివల్ల ప్రతి ఏడాది వందమంది పారిశుధ్య సిబ్బంది చనిపోతున్నారు. విపరీతమైన ఉష్ణోగ్రత, కాలుపెడితే సర్రున జారిపోయేవిధంగా ఉండే గోడలు, విషవాయువులు ఇందుకు కారణమవుతున్నాయి. నగరంలోని మురుగుకాల్వలపై ఇటీవల ఓ సంస్థ జరిపిన అధ్యయనంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. మరమతు పనులకోసం వీటిలో దిగుతున్న సిబ్బంది అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. మరికొంతమంది ఏకంగా చనిపోతున్నారు. నేషనల్ క్యాంపెయిన్ ఫర్ డిగ్నిటీ అండ్ రైట్స్ ఫర్ సీవరేజ్ అల్లైడ్ వర్కర్స్ (ఎన్‌సీడీఏఆర్‌ఎస్‌ఏడబ్ల్యూ)తోపాటు ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఓహెచ్‌ఎస్‌ఎంసీఎస్) అనే రెండు సంస్థల సహకారంతో ప్రాక్సిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ పార్టిసిపేటరీ ప్రాక్టీసెస్ అనే మరో సంస్థ ఈ అంశంపై అధ్యయనం చేసింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం నగరంలో ప్రతిరోజూ 2,871 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతుంది. దాదాపు ఐదువేల మంది పారిశుధ్య సిబ్బంది వీటిని తరచూ శుభ్రం చేస్తుంటారు. అయితే వారికి కల్పిస్తున్న వైద్యసదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతోపాటు వారి భద్రతకు ఆయా కార్పొరేషన్లు తీసుకుంటున్న చర్యలు కూడా నామమాత్రమనే విమర్శలు లేకపోలేదు.ఈ కారణంగా వారు అనేకమైన భీకర వ్యాధులబారినపడుతున్నారని సదరు నివేదిక పేర్కొంది. ఇదిలాఉంచితే వారికి ఇస్తున్న వేతనాలు కూడా అంతంతే. దీనికితోడు కులవివక్ష, పక్షపాతం, వత్తిపరమైన భద్రత లేమి తదితర సమస్యలు వారిని నీడమాదిరిగా వెన్నాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పారి శుధ్య సిబ్బంది జీవన ప్రమాణాలపై అందరికీ అవగాహన కల్పించి వారి జీవితాలు మెరుగుపడేందుకు ఆయా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసేందుకే తాము ఈ అధ్యయనం నిర్వహించామని ప్రాక్సిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ పార్టిసిపేటరీ ప్రాక్టీసెస్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయమై ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) కార్మిక సంఘం సభ్యుడు వేద్‌ప్రకాశ్ మాట్లాడుతూ రహదారిపైగల మ్యాన్‌హోళ్లలో దిగి వీరంతా మరమ్మతు పనులు నిర్వర్తిస్తుంటారని, దీంతో వీరిని మత్యుభయం వెన్నాడుతుందన్నారు. పారిశుధ్య సిబ్బందికి మౌలిక వసతులు కరువయ్యాయన్నారు. రహదారులపై రాకపోకలు సాగించేవారు వారిని దుర్భాషలాడుతుంటారన్నారు. రోడ్డుపై మురుగు పోస్తున్నావంటూ మండిపడుతుంటారన్నారు. -
అనధికార కాలనీల క్రమబద్ధీకరణకు పక్షం రోజుల్లో ముసాయిదా
అనధికార కాలనీల క్రమబద్ధీకరణకు కేంద్ర ప్రభుత్వం కేంద్రం నడుం బిగించింది. ఇందులోభాగంగా 15 రోజుల్లో సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ ముసాయిదాను రూపకల్పన చేయనుంది. న్యూఢిల్లీ: అనధికార కాలనీ వాసులకు త్వరలో మంచిరోజులు రానున్నాయి. ఈ కాలనీల క్రమబద్ధీకరణ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులోభాగంగా పదిహేనురోజుల్లోగా ఓ ముసాయిదాను రూపొందించనుంది. ఇందుకుసంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిందిగా తన శాఖ అధికారులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం జరిగిన సమీక్షా సమీవేశంలో ఆదేశించారు. ఈ సమావేశం అనంతరం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలోని జాతీయ ప్రాదేశిక ప్రాంత అభివృద్ధి, పట్టణీకరణ తదితర అంశాలపై ఆయన చర్చించారు. వీట న్నింటికీ ఇక మంచిరోజులు రానున్నాయన్నారు. డీడీఏతోపాటు ఆయా కార్పొరేషన్లు తమ పరిధిలోని భూమిని వీలైనంత త్వరగా గుర్తించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం జీఐఎస్‌ను వినియోగించాలని కూడా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తమ తమ వెబ్సైట్ల ద్వారా అందుబాటులో ఉంచాలని కూడా నిర్ణయించారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఇంకా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను అందజేయాల్సిందిగా డీడీయేని ఆదేశించారు. ఆక్రమణల తొలగింపునకు సంబంధించి నోటీసులు జారీ చేయాలని ప్రచార కార్యక్రమం చేపట్టాల్సిందిగా డీడీయేని కోరారు. ద్వారక తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా కోసం డీడీయే నిర్మించిన మౌలిక వసతులను తన అధీనంలోకి తీసుకోవాల్సిందిగా ఢిల్లీ జల్‌బోర్డును ఆదేశించారు. కాగా ఈ సమీక్షా సమావేశంలో ఢిల్లీకి చెందిన పార్టీ ఎంపీలు, పట్టణ అభివృద్ధి శాఖ కార్యదర్శి, మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు, ముగ్గురు మున్సిపల్ కమిషనర్లు, డీజేబీ అధికారులు, ఎన్డీఎంసీ, సీపీడబ్ల్యూడీకి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పునరాలోచించండి కాగా అనధికార కాలనీల క్రమబద్ధీకరణ అంశాన్ని పునరాలోచించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ నగరంలోని అనేక అనధికార కాలనీలు 2007కు ముందు ఏర్పాటైనవేనన్నారు. కాగా షీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 895 అనధికార కాలనీలను క్రమబద్ధీకరించిన సంగతి విదితమే. -
ప్రజావ్యతిరేక నిర్ణయాల వెనుక బీజేపీ, కాంగ్రెస్ కుట్ర: ఆప్
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని కూడా రద్దుచేసే కుట్ర జరుగుతున్నట్లు తెలిసిందని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాల వెనుక కాంగ్రెస్, బీజేపీల కుట్ర ఉందని ఆరోపించింది. ఒకవేళ తమకు అందిన సమాచారం సరైనదై, ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని రద్దు చేస్తే.. తమను ఓడించిన ఢిల్లీ ప్రజలపై యూపీఏ ప్రభుత్వం క్షక్ష తీర్చుకుంటోందనే విషయం రుజువైనట్లేనని ఆప్ పేర్కొంది. దీనిపై తమ పార్టీ ప్రజల్లోకి వెళ్తుందని, బీజేపీ, కాంగ్రెస్‌ల అపవిత్ర పొత్తును ప్రజల్లోనే ఎండగడతామని ఆప్ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీ జల్‌బోర్డు స్వయం ప్రతిపత్తిగల సంస్థ అయినందున అది తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆదేశించే అధికారం కేంద్రానికిగానీ, లెఫ్టినెంట్ గవర్నర్‌కుగానీ లేదని పేర్కొంది. తమ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకం వల్ల ప్రభుత్వంపై పెద్ద భారమేమీ పడదన్నారు. డీజేబీకి కావలసినన్ని వనరులు ఉన్నందున పథకాన్ని అమలు చేస్తుందనే తాము భావిస్తున్నామన్నామని ఆ పార్టీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే తమ ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలు అమలు కాకుండా బీజేపీ, కాంగ్రెస్‌లు అడ్డుపడ్డాయని, చివరికి మంచినీటి సరఫరా విషయంలో కూడా నగరవాసులకు మేలు జరిగేలా ఆ రెండు పార్టీలు వ్యవహరించడంలేదని ఆయన విమర్శించారు. విద్యుత్ బిల్లుల మాఫీ విషయంలో కూడా తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు నిలిపివేయడాన్ని గుర్తుచేశారు. ఎన్నికలు జరిగితే అధికారంలోకి వచ్చేది తామేనని, అప్పుడైనా ఈ పథకాలను అమలు చేసి తీరుతామన్నారు. -
ఢిల్లీలో కొనసాగుతున్న అధికారులు బదిలీ పర్వం
అధికారుల బదిలీ పర్వాన్ని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం జోరుగా కొనసాగిస్తూనే ఉంది. తాజాగా నగర అభివృద్దిశాఖ ప్రధాన కార్యదర్శి అరుణ్ గోయల్ పై బదిలీ వేటు వేసింది. గోయల్ స్థానంలో ఎస్ఎస్ యాదవ్ ను ప్రధాన కార్యదర్శి గా నియమిస్తూ... అదనంగా పౌర సరఫరాల కమిషనర్ బాధ్యతలను అప్పగిస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 6 తేదిన ఢిల్లీ జల్ బోర్డులో 800 మంది అధికారులను బదిలీ చేయడం దేశ రాజధానిలో సంచలనం రేపింది. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (ఎన్ డిఎంసీ) డిప్యూటీ చైర్మన్ పదర్మిని సింగ్లాను విద్యాశాఖ డైరెక్టర్ గా బదిలీ చేశారు. పౌర సరఫరాల అదనపు కార్యదర్శిగా బాధ్యతలను చేపట్టిన నిహారికా రాయ్ ని డిప్యూటేషన్ పై ఎన్ డిఎంసీ డిప్యూటి కమిషనర్ గా నియమించారు.