న్యూఢిల్లీ: గల్లంతైన బాలుడి ఆచూకీని మూడుగంటల్లోనే కనుగొన్నారు ఢిల్లీ పోలీసులు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తన కుమారుడు ఢిల్లీ జల్‌బోర్డు మైదానంలో ఆడుకోవడానికి వెళ్లాడని, ఆ తర్వాత కనిపించలేదంటూ శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో తండ్రి గోపాల్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అక్కడ ఆడుకుంటుండగా తాను చూశానని, ఆ తరువాత తాను కార్యాలయానికి వెళ్లానని తెలిపాడు. ఆ సమయంలో తన భార్య ఇంటి పనుల్లో నిమగ్నమైందన్నాడు. కొంతసేపటి తర్వాత కుమారుడి కోసం వెదకగా కనిపించలేదని, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగావారు కిడ్నాప్ కింద కేసు నమోదు చేశారన్నారు.
ఫిర్యాదు అందగానే డీసీపీ ప్రేమ్‌నాథ్ నేతృత్వంలో 12 పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. నగరంలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు ఈ సమాచారం పంపారు. పెద్దసంఖ్యలో పోలీసు బలగాలు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తుండడంతో ఈ విషయం అనేకమంది నగరవాసుల దృష్టికికూడా వచ్చింది. దీంతో వారు కూడా ఇందులో భాగస్వాములయ్యారు. మాలవీయనగర్‌కు చెందిన కమల్ అనే ఓ ప్రైవేటు బస్సు క్లీనర్‌వద్ద ఈ బాలుడు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. తక్షణమే పోలీసులు మాలవీయనగర్‌కు చేరుకోగా అక్కడికి సమీపంలోని బేగంపూర్ మసీదు వద్ద ఆ బాలుడితో కమల్ కనిపించాడు. పోలీసులకు బాలుడిని అప్పగించాడు.
ఈ విషయమై కమల్ మాట్లాడుతూ మాలవీయనగర్‌లో ఈ బాలుడు ఒంటరిగా తిరుగుతుండగా సాయంత్రం ఐదు గంటల సమయంలో చూశానని, తన ఇంటి చిరునామాగానీ లేదా అమ్మనాన్నల పేర్లుగానీ చెప్పలేకపోతున్నాడన్నారు. ఈ విషయమై డీసీపీ ప్రేమ్‌నాథ్ మాట్లాడుతూ కమల్‌కు తగిన అవార్డు కోసం ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు.
ఢిల్లీ పోలీసులా... మజాకా!
Published Sun, Nov 30 2014 10:28 PM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM
Advertisement