Missing child
-
తప్పిపోయినా.. శునకం వద్ద క్షేమం..!
మిషిగన్: రాత్రి వేళ రెండు పెంపుడు కుక్కలతోపాటు కనిపించకుండా పోయిన ఓ చిన్నారి కోసం పోలీసులు, స్థానికులు కలిసి అటవీ ప్రాంతంలో భారీగా గాలించారు. ఇందుకోసం డ్రోన్లు, పోలీసు జాగిలాలను సైతం వాడారు. చివరికి ఆల్ టెర్రయిన్ వెహికల్(ఏటీవీ) చిన్నారి జాడను కనిపెట్టింది. అప్పటికే ఆ చిన్నారి ఒక పెంపుడు కుక్కను దిండుగా చేసుకుని నిద్రిస్తుండగా మరో శునకం జాగ్రత్తగా కాపలా కాస్తూ కనిపించింది. ఇది చాలా అద్భుతమైన విషయమని అందరూ అంటున్నారు. అమెరికాలో మిషిగన్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫెయిత్ హార్న్‌కు చెందిన థియా చేజ్ అనే రెండేళ్ల బాలిక బుధవారం రాత్రి 8 గంటలప్పుడు ఇంటి నుంచి కనిపించకుండాపోయింది. ఆమె వెంట రెండు కుక్కలు కూడా ఉన్నాయి. విషయం తెలిసిన పోలీసులు స్థానికులతో కలిసి పరిసర అటవీప్రాంతంలో భారీగా అన్వేషణ మొదలుపెట్టారు. ఆల్ టెర్రయిన్ వెహికిల్(ఏటీవీ), డ్రోన్లు, పోలీసు జాగిలాలతో కొన్ని గంటల పాటు గాలించారు. చివరికి వారి ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో థియా ఉన్న విషయాన్ని ఏటీవీ పసిగట్టింది. పోలీసులు వెళ్లే సరికి ఓ చోట వెంట ఉన్న ఒక శునకాన్ని దిండుగా చేసుకుని చిన్నారి నిద్రిస్తుండగా, మరో జాగిలం అప్రమత్తంగా కాపలా కాస్తూ ఉండటం కనిపించింది. ఈ దృశ్యం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. -
రెండేళ్ల చిన్నారి అదృశ్యం
నెల్లూరు (వీఆర్సీసెంటర్): తల్లి ఒడిలో ఆడుకునే రెండేళ్ల చిన్నారి అదృశ్యమైన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెం గిరిజన కాలనీకి చెందిన రామయ్య, పాపమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరు బిడ్డలను వెంటబెట్టుకుని రోడ్ల వెంబడి చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి సెకండ్ షో సినిమా చూసి కుక్కలగుంట వద్ద ఉన్న మహాలక్ష్మి అమ్మవారి గుడి మెట్ల వద్ద పిల్లలతో కలిసి నిద్రించారు. ఆదివారం తెల్లవారుజామున లేచి చూసే సరికి రెండేళ్ల మూగ బాలిక పాపమ్మ కనిపించలేదు. దీంతో చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభ్యంకాకపోవడంతో స్థానికుల సహకారంతో చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఇన్చార్జి సీఐ అన్వర్‌బాషా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నాలుగు ప్రత్యేక టీమ్‌లు, మరో రెండు టెక్నికల్ టీమ్‌లను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చేపట్టారు. -
‘లాక్ డౌన్’ దొరికాడు! 2 రోజుల తర్వాత బస్సులో ప్రత్యక్షం
సాక్షి, చెన్నై : అంబత్తూరులో అదృశ్యమైన చిన్నారి ‘లాక్డౌన్’ బుధవారం కోయంబేడు బస్టాండ్‌లోని ఓ బస్సులో ప్రత్యక్షం అయ్యాడు. ఈ బిడ్డను కిడ్నాప్ చేసి ఇక్కడ పడేసిన గుర్తు తెలియని వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. చెన్నై అంబత్తూరు గాంధీనగర్‌లో ఓ భవనం నిర్మాణ పనుల్లో ఒడిశాకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో కిషోర్, పుత్తిని దంపతులు కూడా ఉన్నారు. వీరికి ఆకాష్, లాక్డౌన్(ప్రకాష్) అనే చిన్నారులు కూడా ఉన్నారు. ఏడాదిన్నర వయస్సు కల్గిన ప్రకాష్ సరిగ్గా లాకౌడౌన్ సమయంలో జన్మించాడు. అందుకే ఆ బిడ్డకు లాక్డౌన్ అని నామకరణం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం రాత్రి తమతో పాటుగా గుడిసెలో నిద్రించిన బిడ్డ అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు అంబత్తూరు పోలీసుల్ని ఆశ్రయించారు. ఇన్స్పెక్టర్ రామస్వామి నేతృత్వంలో బృందం దర్యాప్తులో నిమగ్నమైంది. కాగా బుధవారం కోయంబేడు బస్టాండ్‌లో చెన్నై నుంచి సేలంకు వెళ్లే బస్సులో చిన్నారి లాక్డౌన్ ప్రత్యక్షం అయ్యాడు. డ్రైవర్ గుర్తించి కోయంబేడు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే అన్ని పత్రికల్లో లాక్డౌన్ అదృశ్యం వార్త, ఫొటోలు రావడంతో ఆ బిడ్డను పోలీసులు గుర్తించారు. బస్సులో లాక్డౌన్ దొరికినట్టు అంబత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాపర్ల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. -
పదేళ్ల తర్వాత తల్లి చెంతకు..
గద్వాల అర్బన్ : పదేళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లిన ఆ కుటుంబానికి అప్పట్లో విషాదం ఎదురైంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న భర్త చనిపోయిన కొన్నాళ్లకే కూతురు కూడా కనిపించకుండా పోయింది. అలా పదేళ్లుగా ఆ తల్లి కూతురి కోసం దుఖిస్తుండగా ఇప్పుడు బిడ్డ ఆచూకీ తెలిసిన వైనమిది. గద్వాలలోని వడ్డెగేరికి చెందిన పద్మ, రాముడు భార్యాభర్తలు. భర్త మరణం తర్వాత పొత్తిళ్లలో ఉన్న కుమారుడు, ఆరేళ్ల కుమార్తెతో కలిసి పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్ వెళ్లింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో అడ్డా కూలీగా మారింది. ఇదే క్రమంలో పద్మ తల్లి చనిపోయిందని సమాచారం రాగానే కాచిగూడ రైల్వేస్టేషన్‌కు ఆమె వచ్చింది. అక్కడ రద్దీ ఉండడంతో ఆరు నెలల కుమారుడిని కుమార్తె హైమావతి చేతిలో పెట్టి టికెట్ తెచ్చేందుకు వెళ్లి వచ్చే సరికి కుమారుడు మాత్రమే ఉన్నాడు. దీంతో అప్పటి నుంచి కుమార్తె కోసం వెతుకుతున్నా ఫలితం కనిపించలేదు. కాగా, అప్పట్లో హైమావతిని చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది సికింద్రాబాద్‌లోని నవజీవన హోంకు, ఆతర్వాత నింబోలి అడ్డాలోని ప్రత్యేక చిల్డ్రన్ హోం(బాలికల), రాజేంద్రనగర్‌లోని కేజీబీవీ పాఠశాలకు తరలించారు. 6, 8వ తరగతి వరకు చదవిన హైమావతి తన తల్లి గద్వాలలో ఉన్నారని నిర్వాహకులకు చెప్పగా వారు జిల్లా బాలల సంరక్షణ అధికారి రాములుకు మహబూబ్‌నగర్ అధికారులు ఫొటోతో పాటు సమాచారం ఇచ్చారు. ఆయన ఇచ్చిన సమాచారంతో వడ్డేగేరి అంగన్వాడీ కార్యకర్త ఫొటోలో ఉన్న బాలికను గుర్తు పట్టి ఆమె తల్లి పద్మకు చూయించింది. తన కుమార్తెను ఆమె గుర్తించగా.. మహబూబ్‌నగర్ స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలిక హైమావతిని తల్లి పద్మకు గురువారం అప్పగించారు. -
గల్లంతైన బాలుడి మృతి
గార్లదిన్నె : హెచ్చెల్సీ కాలువలో గల్లంతైన రాము (16) మృతి చెందాడు. గురువారం గ్రామస్తులు యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. మండల పరిధిలోని పెనకచెర్ల డ్యాంకు చెందిన చాకలి లక్ష్మీదేవి, నరసింహుల ఏకైక కుమారుడు రాము బుధవారం దుస్తులు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో గల్లంతైన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి వరకు గ్రామస్తులు, పోలీసులు గాలించినా యువకుడి ఆచూకీ తెలియరాలేదు. గురువారం మధ్యాహ్న సమయంలో నీటి ప్రవాహంలో కొట్టుకు పోతు ఉండటాన్ని గ్రామస్తులు గమనించి సస్పెన్సన్ బ్రిడ్జి వద్ద గ్రామస్తులు మృతదేహాన్ని బయటికి తీశారు. రాము మృతదేహం వద్ద తల్లిదండ్రులతో పాటు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బిడ్డా.. ఎక్కడున్నావ్ రా!
తప్పిపోయిన బిడ్డ కోసం తల్లి ఆరాటం వలిగొండ : మాటలురాని బిడ్డ మూడురోజులనుంచి కనిపించకుండా పోయాడు. ఎక్కడున్నాడో.. ఏం చేస్తున్నాడోనని ఆ తల్లి ఆరాటం అంతాఇంతాకాదు. మండలకేంద్రంలోని జంగాలకాలనీలో ఉండే మోతే సారంగం, విజయ దంపతులు భవన నిర్మాణ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి నలుగురు కుమారులుండగా పెద్ద కుమారుడు రవీందర్ (15)కు పుట్టుకతో మాటలు రావు. వారికున్న ఆర్థిక పరిస్థితిని బట్టి అతడిని పాఠశాలలో చేర్పించకుండా ఇంటి వద్దనే కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఇటీవలే వలిగొండలో ఏర్పాటు చేసిన వికలాంగుల కేంద్రానికి పంపించడానికి ఏర్పాట్లు చేశారు. అది ఇష్టంలేని రవీందర్ మంగళవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లోను ఫిర్యాదు చేసినా ఇంత వరకు కనిపించలేదు. మాటలు రాని బిడ్డ ఎక్కడకు వెళ్లాడో..ఏ ఊరో చెప్పలేని, రాయలేని కొడుకు ఏం తిన్నాడోనని తల్లి వెయ్యికళ్లతో ఎదురుచూస్తోంది. ఎవరికైనా ఆచూకీ లభిస్తే 8499836185, 9848808713 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని వేడుకుంటున్నారు. -
వచ్చామా...మాట్లాడామా... రోజులు గడిచాయా..
అంతులేని కథలుగా శిశు విక్రయాలు 1997 నుంచి ఎంతో మంది వచ్చారు...వెళ్లారు... దత్తత, మరెన్నో కమిషన్ల సర్వేలు అయినా కించిత్తు రాని మార్పు దేవరకొండ : కౌన్సిలింగ్... అధ్యయనం... సమీక్షా... ఎంక్వైరీ... గిరిజనులకు ఈ పదాలు దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు ఒకప్పుడు చాలా పెద్దవి. కానీ ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. 1999లో జాతీయ మహిళా కమిషన్ సర్వే నిర్వహించినప్పుడు, 2001లో గవర్నర్ చందంపేట మండలాన్ని దత్తత తీసుకున్నపుడు... ఇదే మండలం గురించి అసెంబ్లీ హౌస్ కమిటీలో చర్చ జరిగినప్పుడు ఇక చందంపేట తలరాతే మారిపోతుందనుకున్నారు. కానీ పరిస్థితిలో కించిత్తు మార్పులేదు. చాటుమాటున శిశు విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణాలోపం, పేదరికాన్ని నిర్మూలించలేని పాలకులు, తమకెందుకులే అని పట్టించుకోని అధికారగణం కారణంగా ఇటువంటి ఘటనలు మరుగున పడుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014లో డిండి మండలం వీరబోయినపల్లి గ్రామపంచాయతీలో నగారాదుబ్బతండాలో ఓ గిరిజన దంపతులు శిశువు చంపి గ్రామంలోనే ఓ ట్యాంక్ పక్కన పూడ్చిపెట్టారు. ఈ ఘటన జరిగినప్పుడు మీడియా ఈ సంఘటనను పతాక శీర్షికన ప్రచురించడంతో అప్పుడు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులందరూ గ్రామంలో దిగిపోయారు. మళ్ళీ ఆ సంఘటన తర్వాత ఓ జాతీయ మీడియా చానల్ శిశు విక్రయాల ఘటనను ప్రసారం చేయడంతో మళ్ళీ రాష్ట్ర స్థాయి అధికారులు తండాల బాట పట్టారు. తాజాగా మంగళవారం స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి శైలజా రామయ్య, కమిషనర్ విజయేంద్రలు తాజాగా శిశు విక్రయం వెలుగు చూసిన గ్రామాన్ని సందర్శించారు. ఇది సర్వసాధారణమైన సందర్శన అని గిరిజన పెద్దలు మాట్లాడుకోవడం కనిపించింది. -
తప్పిపోయిన పిల్లాడిని.. పట్టిచ్చిన వాట్సప్!
పోలీసులు కూడా సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు. దాంతో నేరాలు త్వరగా అదుపులోకి వస్తున్నాయి. ఫేస్బుక్, వాట్సప్ కలిసి తప్పిపోయిన ఓ పిల్లాడి ఆచూకీని అరగంటలోనే కనిపెట్టేలా చేశాయి. జార్ఖండ్‌కు చెందిన రూపేష్ (14) తన తల్లి కిరణ్బోడితో కలిసి బంజారాహిల్స్‌లోని జగన్నాథ ఆలయానికి వచ్చాడు. అయితే అక్కడ తప్పిపోయి కేబీఆర్ పార్కు చుట్టుపక్కల తిరుగుతుండగా పోలీసులు చేరదీశారు. వివరాల కోసం ప్రశ్నించగా భాష సమస్య కావడంతో సరిగా చెప్పలేకపోయాడు. తన కొడుకు కనిపించడం లేదంటూ తల్లి అదే రోజు రాత్రి తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి 9.30కి కేబీఆర్ పార్కు వద్ద రూపేష్‌ను గుర్తించిన పోలీసులు ఆ సమాచారాన్ని అతడి ఫొటోతో వాట్సప్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్లకు పంపారు. దాంతోపాటు.. బంజారాహిల్స్ పీఎస్ ఫేస్‌బుక్‌లోనూ ఫొటోలు అప్లోడ్ చేసి వివరాలు ఉంచారు. ఈ విషయాన్ని తిరుమలగిరి పోలీసులు వెంటనే తెలుసుకొని అదృశ్యమైన బాలుడి తల్లి తమవద్ద ఫిర్యాదు చేసిందని చెప్పారు. వెంటనే బాలుడిని తీసుకెళ్లి తల్లికి అప్పగించారు. -
ఢిల్లీ పోలీసులా... మజాకా!
న్యూఢిల్లీ: గల్లంతైన బాలుడి ఆచూకీని మూడుగంటల్లోనే కనుగొన్నారు ఢిల్లీ పోలీసులు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తన కుమారుడు ఢిల్లీ జల్‌బోర్డు మైదానంలో ఆడుకోవడానికి వెళ్లాడని, ఆ తర్వాత కనిపించలేదంటూ శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో తండ్రి గోపాల్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అక్కడ ఆడుకుంటుండగా తాను చూశానని, ఆ తరువాత తాను కార్యాలయానికి వెళ్లానని తెలిపాడు. ఆ సమయంలో తన భార్య ఇంటి పనుల్లో నిమగ్నమైందన్నాడు. కొంతసేపటి తర్వాత కుమారుడి కోసం వెదకగా కనిపించలేదని, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగావారు కిడ్నాప్ కింద కేసు నమోదు చేశారన్నారు. ఫిర్యాదు అందగానే డీసీపీ ప్రేమ్‌నాథ్ నేతృత్వంలో 12 పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. నగరంలోని అన్ని పోలీస్స్టేషన్లకు ఈ సమాచారం పంపారు. పెద్దసంఖ్యలో పోలీసు బలగాలు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తుండడంతో ఈ విషయం అనేకమంది నగరవాసుల దృష్టికికూడా వచ్చింది. దీంతో వారు కూడా ఇందులో భాగస్వాములయ్యారు. మాలవీయనగర్‌కు చెందిన కమల్ అనే ఓ ప్రైవేటు బస్సు క్లీనర్‌వద్ద ఈ బాలుడు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. తక్షణమే పోలీసులు మాలవీయనగర్‌కు చేరుకోగా అక్కడికి సమీపంలోని బేగంపూర్ మసీదు వద్ద ఆ బాలుడితో కమల్ కనిపించాడు. పోలీసులకు బాలుడిని అప్పగించాడు. ఈ విషయమై కమల్ మాట్లాడుతూ మాలవీయనగర్‌లో ఈ బాలుడు ఒంటరిగా తిరుగుతుండగా సాయంత్రం ఐదు గంటల సమయంలో చూశానని, తన ఇంటి చిరునామాగానీ లేదా అమ్మనాన్నల పేర్లుగానీ చెప్పలేకపోతున్నాడన్నారు. ఈ విషయమై డీసీపీ ప్రేమ్‌నాథ్ మాట్లాడుతూ కమల్‌కు తగిన అవార్డు కోసం ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు. -
సంతానం లేనివారి పనేనా?
న్యూఢిల్లీ: సంతానం లేని జంటే చిన్నారి జాహ్నవి అపహరణకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై అదనపు పోలీస్ కమిషనర్ ఎస్.బి.త్యాగి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ‘సంతానం లేని ఏదో జంట అపహరణకు పాల్పడి ఉండొచ్చు. పాపను ఎవరూ గుర్తించకుండా చేసేందుకుగాను వెంట్రుకలను కత్తిరించారు. అయినప్పటికీ పాపను ఎంతో బాగా చూసుకున్నారు. అయితే పాప గల్లంతుపై వార్తలు మీడియాలో పుంఖానుపుంఖాలుగా రావడంతో వారు భయపడిపోయి ఉంటారు. ఈ కారణంగానే వదిలేసి పోయారు’అని అన్నారు. జాహ్నవిని అపహరించినప్పటికీ నిందితులు డబ్బు కోసం ఎందుకు బెదిరించలేదనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. దీని వెనుక ఏదైనా ముఠా ఉందా అనే కోణంలోకూడా దర్యాప్తు జరుపుతున్నారు. కాగా తనను అపహరించి తీసుకుపోయినవారు అమ్మా... నాన్నా.. అని పిలవాలంటూ బలవంతం చేశారని జాహ్నవి పోలీసులకు చె ప్పినప్పటికీ అంతకుమించి ఎటువంటి వివరాలూ తెలియజేయలేదు. ఇదిలాఉంచితే తమ చిన్నారి తిరిగి తమ గూటికి రావడానికి సహకరించినసామాజిక మీడియాకు జాహ్నవి కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ‘ఫేస్బుక్, వాట్సప్‌లలో పెయిడ్ క్యాంపయిన్లను చేపడదామని అనుకున్నాం. అలా చేస్తే పాప తప్పిపోయిందనే విషయం అనేకమంది దృష్టికి వస్తుందనేది మా భావన’అని జాహ్నవి మేనమామ తరుణ్ గ్రోవర్ మీడియాకు తెలియజేశారు. తామంతా పది బృందాలుగా ఏర్పడ్డామని, పనిని విభజించుకున్నామని చెప్పారు. వృత్తిపరంగా పెట్టుబడిదారుడైన తరుణ్... సామాజిక మీడియాకు సంబంధించిన బాధ్యతలను నిర్వర్తించారు. కాగా అటు పోలీసు శాఖ అధికారులతోపాటు కుటుంబసభ్యులను తీవ్ర గందరగోళానికి గురిచేసిన చిన్నారి జాహ్నవి ఆహుజా ఆదివారం సామంత్రం రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న సంగతి విదితమే. జాతీయ రాజధాని నడిబొడ్డునగల ఇండియా గేట్ వద్ద జాహ్నవి వారం క్రితం తప్పిపోయిన సంగతి విదితమే. జాహ్నవిని వెంటబెట్టుకుని ఆదివారం సాయంత్రం సరదాగా కుటుంబసభ్యులంతా ఇండియాగేట్ వద్దకు వచ్చారు. అయితే రాత్రి తొమ్మిది గంటల సమయంలో జాహ్నవి కనిపించలేదు. దీంతో కుటుంబసభ్యులు తిలక్‌మార్గ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అనంతరం నగర పోలీసు విభాగం సిబ్బందితోపాటు క్రైంబ్రాంచ్, స్పెషల్ సెల్‌కుచెందిన బృందాలు జాహ్నవి ఆచూకీ కోసం గాలింపు చర్యలను చేపట్టిన సంగతి విదితమే. ఇండియాగేట్ వద్ద తప్పిపోయిన మూడేళ్ల పసిపాప జాహ్నవి ఆచూకీ కనుగొన్నవారికి రూ. 50 వేల నగదు బహుమతిని అందజేస్తామంటూ నగర పోలీస్ కమిషనర్ భీంసేన్ బసి ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. కాగా ఆదివారం సాయంత్రం జాహ్నవి నగరంలోని మాయాపురి పోలీస్‌స్టేషన్ సమీపంలో ధీరేందర్ అనే ఓ కళాశాల విద్యార్థి కంటపడింది. ఆ సమయంలో పాప మెడలో ఆమె పేరుతోపాటు ఓ ఫోన్ నంబర్ ఉండడాన్ని గమనించిన ఆ విద్యార్థి పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు జాహ్నవిని వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో ఎట్టకేలకు కథ సుఖాంతమైంది. ఇదిలాఉంచితే జాహ్నవిని అపహరించిన వ్యక్తులు ఇప్పటి కీ పరారీలోనే ఉన్నారు. వారి ఆచూకీ ఇప్పటికీ దొరలేదు. అపహరణ అనంతర పరిణామాల క్రమాన్ని గుర్తించేందుకు యత్నిస్తున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. తనను కొంతమంది తీసుకుపోయారని, వారిలో ఓ మహిళ కూడా ఉందని జాహ్నవి తమకు తెలిపిందన్నారు. అయితే వయసులో బాగా చిన్నదైనందువల్ల జాహ్నవి వారిని గుర్తించలేకపోవచ్చన్నారు.