సంతానం లేనివారి పనేనా?
న్యూఢిల్లీ: సంతానం లేని జంటే చిన్నారి జాహ్నవి అపహరణకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై అదనపు పోలీస్ కమిషనర్ ఎస్.బి.త్యాగి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ‘సంతానం లేని ఏదో జంట అపహరణకు పాల్పడి ఉండొచ్చు. పాపను ఎవరూ గుర్తించకుండా చేసేందుకుగాను వెంట్రుకలను కత్తిరించారు. అయినప్పటికీ పాపను ఎంతో బాగా చూసుకున్నారు. అయితే పాప గల్లంతుపై వార్తలు మీడియాలో పుంఖానుపుంఖాలుగా రావడంతో వారు భయపడిపోయి ఉంటారు. ఈ కారణంగానే వదిలేసి పోయారు’అని అన్నారు. జాహ్నవిని అపహరించినప్పటికీ నిందితులు డబ్బు కోసం ఎందుకు బెదిరించలేదనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. దీని వెనుక ఏదైనా ముఠా ఉందా అనే కోణంలోకూడా దర్యాప్తు జరుపుతున్నారు. కాగా తనను అపహరించి తీసుకుపోయినవారు అమ్మా... నాన్నా.. అని పిలవాలంటూ బలవంతం చేశారని జాహ్నవి పోలీసులకు చె ప్పినప్పటికీ అంతకుమించి ఎటువంటి వివరాలూ తెలియజేయలేదు. ఇదిలాఉంచితే తమ చిన్నారి తిరిగి తమ గూటికి రావడానికి సహకరించినసామాజిక మీడియాకు జాహ్నవి కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.
‘ఫేస్‌బుక్, వాట్సప్‌లలో పెయిడ్ క్యాంపయిన్లను చేపడదామని అనుకున్నాం. అలా చేస్తే పాప తప్పిపోయిందనే విషయం అనేకమంది దృష్టికి వస్తుందనేది మా భావన’అని జాహ్నవి మేనమామ తరుణ్ గ్రోవర్ మీడియాకు తెలియజేశారు. తామంతా పది బృందాలుగా ఏర్పడ్డామని, పనిని విభజించుకున్నామని చెప్పారు. వృత్తిపరంగా పెట్టుబడిదారుడైన తరుణ్... సామాజిక మీడియాకు సంబంధించిన బాధ్యతలను నిర్వర్తించారు. కాగా అటు పోలీసు శాఖ అధికారులతోపాటు కుటుంబసభ్యులను తీవ్ర గందరగోళానికి గురిచేసిన చిన్నారి జాహ్నవి ఆహుజా ఆదివారం సామంత్రం రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న సంగతి విదితమే. జాతీయ రాజధాని నడిబొడ్డునగల ఇండియా గేట్ వద్ద జాహ్నవి వారం క్రితం తప్పిపోయిన సంగతి విదితమే. జాహ్నవిని వెంటబెట్టుకుని ఆదివారం సాయంత్రం సరదాగా కుటుంబసభ్యులంతా ఇండియాగేట్ వద్దకు వచ్చారు. అయితే రాత్రి తొమ్మిది గంటల సమయంలో జాహ్నవి కనిపించలేదు. దీంతో కుటుంబసభ్యులు తిలక్‌మార్గ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
అనంతరం నగర పోలీసు విభాగం సిబ్బందితోపాటు క్రైంబ్రాంచ్, స్పెషల్ సెల్‌కుచెందిన బృందాలు జాహ్నవి ఆచూకీ కోసం గాలింపు చర్యలను చేపట్టిన సంగతి విదితమే. ఇండియాగేట్ వద్ద తప్పిపోయిన మూడేళ్ల పసిపాప జాహ్నవి ఆచూకీ కనుగొన్నవారికి రూ. 50 వేల నగదు బహుమతిని అందజేస్తామంటూ నగర పోలీస్ కమిషనర్ భీంసేన్ బసి ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. కాగా ఆదివారం సాయంత్రం జాహ్నవి నగరంలోని మాయాపురి పోలీస్‌స్టేషన్ సమీపంలో ధీరేందర్ అనే ఓ కళాశాల విద్యార్థి కంటపడింది. ఆ సమయంలో పాప మెడలో ఆమె పేరుతోపాటు ఓ ఫోన్ నంబర్ ఉండడాన్ని గమనించిన ఆ విద్యార్థి పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు జాహ్నవిని వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో ఎట్టకేలకు కథ సుఖాంతమైంది.
ఇదిలాఉంచితే జాహ్నవిని అపహరించిన వ్యక్తులు ఇప్పటి కీ పరారీలోనే ఉన్నారు. వారి ఆచూకీ ఇప్పటికీ దొరలేదు. అపహరణ అనంతర పరిణామాల క్రమాన్ని గుర్తించేందుకు యత్నిస్తున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. తనను కొంతమంది తీసుకుపోయారని, వారిలో ఓ మహిళ కూడా ఉందని జాహ్నవి తమకు తెలిపిందన్నారు. అయితే వయసులో బాగా చిన్నదైనందువల్ల జాహ్నవి వారిని గుర్తించలేకపోవచ్చన్నారు.