సోషల్ మీడియా ప్రచారంపై ఎన్నికల సంఘం నిఘా!
Published Mon, Mar 10 2014 10:35 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా వాడకాన్ని నియంత్రించడంపై ఎన్నికల సంఘం దృష్టిసారించింది. లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సోషల్ మీడియాలో ప్రచారం కోసం చేసే ఖర్చును అభ్యర్థి ఎన్నికల వ్యయంలో చేర్చనుంది. అంటే సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారం చేయడం కోసం నిపుణుల సేవలను ఉపయోగించుకునే అభ్యర్థులు ఇకపై ఇబ్బందుల పాలవుతారు. సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారం చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు దానిపై అయ్యే ఖర్చును ఎన్నికల వ్యయంలో చేర్చవలసి ఉంటుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి సోషల్ మీడియాలో ప్రచారానికి కూడా వర్తిస్తుంది. టెలీఫోన్ నంబరుపై ఉన్న ట్విటర్, యూట్యూబ్ ఫేస్‌బుక్ అకౌంట్ల గురించి, అప్లికేషన్ల గురించిన సమాచారాన్ని అభ్యర్థులు తమ ఈ మెయిల్ ఐడీతోసహా అన్ని వివరాలను ఎన్నికల కమిషన్‌కు తెలియజేయవలసి ఉంటుంది.
దరఖాస్తులు సమర్పించేటప్పుడు ఫారం 26లోని అఫిడవిట్లలో ఈ వివరాలను అభ్యర్థులు నింపవలసి ఉంటుందని ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి విజయ్ దేవ్ చెప్పారు. వెబ్‌లో ప్రచారం కోసం అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సంబంధిత అధికారుల నుంచి ముందస్తుగా సర్టిఫికెట్ పొందవలసి ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా ప్రచారం కోసం ఉపయోగించే ప్రకటనల ఖర్చును కూడా రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో చేర్చవలసి ఉంటుంది. ప్రకటనలను ప్రసారం చేయడం కోసం ఇంటర్నెట్ కంపెనీలకు చేసే చెల్లింపులు, అటువంటి కంటెంట్ రూపొందించడం కోసం చేసే చెల్లింపులు, సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించడం కోసం అభ్యర్థులు, రాజకీయ పార్టీలు నియమించిన సిబ్బందికి చెల్లించే వేతనాలు తదితర ఖర్చులన్నీ పార్టీలు, అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయంలో చేర్చవలసి ఉంటుంది.
Advertisement