సోషల్ మీడియాపై కాంగ్రెస్ కన్ను
Published Sun, Mar 16 2014 10:52 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఓటర్లను తమవైపు ఎలా ఆకట్టుకోవాలన్న దానిపైనే అన్ని పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. ప్రజాక్షేత్రంలో బరిలోకి దిగిన రాజకీయ పార్టీలు అనేక విధాలుగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే సామాజిక అనుసంధాన వేదికగా ప్రచారం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీల సరసన తాజాగా ఢిల్లీ కాంగ్రెస్ విభాగం కూడా వచ్చి చేరుతోంది. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశ రాజధానిలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు సోషల్ మీడియా ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా వివరించేందుకు సిద్ధమైంది. పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేయనున్న ఐటీ సెంటర్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుందని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి ముకేశ్ శర్మ ఆదివారం మీడియాకు తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలోనే ఉన్న ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలను తిరిగి చేజిక్కించుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు.
శిక్షణ పొందిన యువకులతో ఈ ఐటీ విభాగం పార్టీ వైఖరిని, తమ పాలనలో చేసిన అభివృద్ధిని ఓటర్ల వద్దకు చేరేలా పనిచేస్తుందన్నారు. ఇతర పార్టీల కన్నా ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ప్రచారంలో ముందుంటామని పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు. ప్రధానంగా మధ్య తరగతి ప్రజల దృష్టిలో ఉంచుకొని ఈ ఐటీ ప్రచారానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. ఈ వెబ్‌సైట్ ద్వారా దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయాలనుకుంటుందనే విషయాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళుతోందని తెలిపారు. ఇప్పటికే సామాజిక అనుసంధాన వేదిక ప్రచారంలో ఆప్, బీజేపీ ముందుండగా, కాంగ్రెస్ వెనుకబడి ఉంది. ఐటీ విభాగాన్ని ఆలస్యంగా ప్రారంభిస్తున్న మిగతా పార్టీల కన్నా మంచి స్పందనే వస్తుందని శర్మ ధీమా వ్యక్తం చేశాచు.
బీజేపీ ఢిల్లీ విభాగం నిర్వహిస్తున్న ఫేస్‌బుక్‌కి 4,39,511 మంది లైక్‌లు కొట్టారు. కాంగ్రెస్ రాష్ట్ర విభాగానికి 2,166 మంది ఫాలోవర్‌లు ఉన్నారు. బీజేపీ రాష్ట్ర విభాగ అధ్యక్షుడు హర్షవర్ధన్ ఫేస్‌బుక్‌కి తొమ్మిది వేల మంది, కాంగ్రెస్ నేత అరవిందర్ సింగ్ లవ్లీకి కేవలం 562 మంది ఫాలోవర్‌లు ఉన్నారు. ఇంకా ఆప్ విషయానికివస్తే 17,05,480 మంది మందికి పైగా ఫేస్‌బుక్‌లో లైక్‌లు కొట్టారు. కేజ్రీవాల్‌కి 40 లక్షల మంది ఫాలోవర్‌లు ఉన్నారు. ఇదిలావుండగా ఢిల్లీ కాంగ్రెస్‌కు 700 మంది, బీజేపీ 24 వేల మంది ఫాలోవర్‌లు ఉన్నారు. ట్విట్టర్‌లో ఆప్ పార్టీకి అత్యధికంగా ఐదు లక్షల మంది ఫాలోవర్‌లు ఉండటం రాజకీయ పార్టీలను సోషల్ మీడియా వైపు నడిచేలా చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా, ఏప్రిల్ ఏడు నుంచి ప్రారంభం కానున్న తొమ్మిది దశల లోక్‌సభ పోలింగ్ ఢిల్లీలో పదిన ఎన్నికలు జరగనున్నాయి. మే 16న ఫలితాలు వెలువడనున్నాయి.
Advertisement
Advertisement