తప్పిపోయిన పిల్లాడిని.. పట్టిచ్చిన వాట్సప్!
పోలీసులు కూడా సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు. దాంతో నేరాలు త్వరగా అదుపులోకి వస్తున్నాయి. ఫేస్బుక్, వాట్సప్ కలిసి తప్పిపోయిన ఓ పిల్లాడి ఆచూకీని అరగంటలోనే కనిపెట్టేలా చేశాయి. జార్ఖండ్‌కు చెందిన రూపేష్ (14) తన తల్లి కిరణ్‌బోడితో కలిసి బంజారాహిల్స్‌లోని జగన్నాథ ఆలయానికి వచ్చాడు. అయితే అక్కడ తప్పిపోయి కేబీఆర్ పార్కు చుట్టుపక్కల తిరుగుతుండగా పోలీసులు చేరదీశారు. వివరాల కోసం ప్రశ్నించగా భాష సమస్య కావడంతో సరిగా చెప్పలేకపోయాడు. తన కొడుకు కనిపించడం లేదంటూ తల్లి అదే రోజు రాత్రి తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రాత్రి 9.30కి కేబీఆర్ పార్కు వద్ద రూపేష్‌ను గుర్తించిన పోలీసులు ఆ సమాచారాన్ని అతడి ఫొటోతో వాట్సప్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్లకు పంపారు. దాంతోపాటు.. బంజారాహిల్స్ పీఎస్ ఫేస్‌బుక్‌లోనూ ఫొటోలు అప్‌లోడ్ చేసి వివరాలు ఉంచారు. ఈ విషయాన్ని తిరుమలగిరి పోలీసులు వెంటనే తెలుసుకొని అదృశ్యమైన బాలుడి తల్లి తమవద్ద ఫిర్యాదు చేసిందని చెప్పారు. వెంటనే బాలుడిని తీసుకెళ్లి తల్లికి అప్పగించారు.