సాక్షి, న్యూఢిల్లీ: సిడ్నీ, పెషావర్‌లలో ఉగ్రవాద ఘటనల నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు నగరంలోని కీలక ప్రదేశాలన్నింటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీస్ కమిషనర్ బీ. ఎస్. బస్సీ నగరంలో అలర్ట్ ప్రకటించారు. తమ పరిధిలోని అన్ని ప్రముఖ మాల్స్, మార్కెట్లు, సినిమాహాళ్లు, రాయబార కార్యాలయాలు, చారిత్రక కట్టడాలు, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ వెట్రో, ఐదు నక్షత్రాల హోటళ్లు, ధార్మికస్థలాల వద్ద భద్రతను పెంచాలని ఆయన అన్ని పోలీసుస్టేషన్ల ఇన్‌చార్జిలను ఆదేశించారు. స్కూళ్ల వద్ద భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలో నివాసం ఉంటున్న ఇరాక్, సిరియా సానుభూతిపరులు, విదేశీయులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ముప్పు ఉందని నిఘా సంస్థల హెచ్చరికలతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు.
విదేశీయులు ఉండే ప్రాంతాల్లో
విదేశీయులు ఎక్కువగా నివసించే పహాడ్ గంజ్, లాజ్‌పత్‌నగర్, చాణక్యపురి, మయూర్ విహార్, పాత ఢిల్లీ ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించారు. సెలవుపై వెళ్లిన పోలీసు సిబ్బంది వెంటనే విధులల్లో చేరాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన నేపథ్యంలో జనవరి 23 నుంచి జనవరి 28 మధ్యకాలంలో ఐఎస్‌ఐఎస్ దాడి జరగవచ్చని ఇంటెలిజెన్స్ నివేదికలు హెచ్చరించాయి. రిపబ్లిక్ డే కంటే ముందు 26/11 లేదా పార్లమెంటుపై దాడి తరహాలో నగరంలో మరో దాడి జరిగే ప్రమాదం ఉన్నదని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిక చేశాయి.
కమాండోలు సిద్ధం
ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ స్థితినైనా ఎదుర్కోవడానికి స్వాట్ (స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్), ఎన్‌స్‌జీ కమాండోలు సంసిద్ధంగా ఉన్నారని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. స్పెషల్ సెల్ కిందకు వచ్చే స్వాట్ కింద 160 మంది కమాండోలు ఉన్నారు. కామన్వెల్త్ క్రీడల సమయంలో క్రీడాకారులకు భద్రతను ఇచ్చేందుకు ఏర్పాటుచేసిన ఈ బలగంలోని కమాండోలకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చారు, వారి వద్ద అనేక అత్యాధునిక ఆయుధాలను కలిగి ఉన్న నాలుగు గ్రూపులు స్పెషల్ కింద ఉన్నాయి. ఒక్కొక్క గ్రూపులో 40 మంది కమాండోలు ఉన్నారు. ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టడానికి పోలీస్‌శాఖ అన్నిరకాల చర్యలను తీసుకొందని ఉన్నతాధికారులు చెప్పారు.
నగరంలో పోలీసు భద్రత కట్టుదిట్టం
Published Tue, Dec 16 2014 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM
Advertisement