bs bassi
-
కేజ్రీవాల్ డిగ్రీని తవ్వేందుకు ఐపీఎస్ బస్సీ
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సభ్యుడిగా ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీని కేంద్రం నియమించడం పట్ల సోషల్ మీడియా మంగళవారం తనదైన శైలిలో తీవ్రంగా మండిపడింది. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమారు అరెస్టు వ్యవహారంలో బస్సీ వ్యవహరించిన తీరు ప్రధానంగా వివాదాస్పదమైన విషయం తెల్సిందే. కేంద్రంలోని బీజేపీ నాయకులకు ఒత్తాసు పలికే బస్సీ పాటియాల కోర్టులో కన్హయ్య కుమార్‌పై జరిగిన దాడిని కూడా అడ్డుకోలేకపోయారు. పైగా యూనివ ర్శిటీలో జాతి వ్యతిరేక నినాదాలు ఇచ్చిన విద్యార్ధులకు పాకిస్తాన్ టైస్టు హఫీజ్ సయాద్ మద్దతు కూడా ఉందంటూ ఓ నకిలీ మెయిల్‌ను సృష్టించి అభాసుపాలు కూడా అయ్యారు. అలాంటి వ్యక్తిని భారత అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీసు సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు తదితర ముఖ్యమైన సర్వీసులకు అభ్యర్థులను ఎంపికచేసే యూపీఎస్సీ సభ్యుడిగా నియమించడం ఏమిటంటూ ట్విట్టర్లో పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో విభేదిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నిజంగా ఐఆర్ఎస్ చదివారా? లేదా తెలుసుకునేందుకుగాను పాత ఫైళ్లను వెతికించడం కోసమే ఆయన్ని యూపీఎస్సీ సభ్యుడిగా నియమించారు అని ఒకరు....చేతకాని చెత్త బ్యూరోక్రట్లను ఎంపిక చేయడం కోసమే నియమించారని కొందరు వ్యాఖ్యానించారు. యూపీఎస్సీలో కూడా హిందూత్వ ఎజెండాను అమలు చేయడం కోసమని కొందరు, 2016కు యూపీఎస్సీ టాపర్ బస్సీయేనని ఒకరిద్దరు వ్యాఖ్యానించారు. తిమ్మిని బమ్మి చేయడం కోసం బస్సీ రాకను పురస్కరించుకొని అప్పుడే యూపీఎస్సీలో ఫొటోషాప్, వీడియో టేప్‌ల ఎడిటింగ్ తరగతులను ప్రారంభించారని మరొకరు వ్యంగ్యోక్తులు విసిరారు. ఒక చైర్మన్ పది మంది సభ్యులుండే యూపీఎస్సీలో సభ్యుడి పదవి కాలం ఆరేళ్లయినప్పటికీ 60 ఏళ్ల బస్సీ ఐదేళ్ల పాటే ఆ పదవిలో కొనసాగుతారు. ఎందుకంటే అందులో పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లు. అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం 1977 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ బస్సీ. -
బస్సీ ఐఎస్ఐ ఏజెంట్.....
న్యూఢిల్లీ: మరో వారం రోజుల్లో పదవీ విరమణ చేయనున్న ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ మంచికో, చెడుకో పది కాలాల పాటు తన పేరు ప్రజల్లో మారుమోగిపోవాలని కోరుకుంటున్నట్లున్నారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ను దేశద్రోహం కేసు కింద అరెస్టు చేయించి వార్తల్లో వ్యక్తిగా మారిన బస్సీ.. పటియాల కోర్టు ఆవరణలో జర్నలిస్టులను, విద్యార్థులను, అధ్యాపకులను చితక్కొట్టిన సంఘటనలకు కారుకుడై మరింత పేరు సంపాదించుకున్నారు. బీజేపీతో అంటగాకే బస్సీ, దేశద్రోహం అభియోగాలపై అరెస్టైన అయిదుగురు విద్యార్థులు నిర్దోషులైతే అందుకు వారు సరైన సాక్ష్యాధారాలను చూపి నిరూపించుకోవాలని వ్యాఖ్యానించడం ద్వారా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాన్ని సంపాదించుకున్నారు. ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియా దుమ్మెత్తి పోసింది. వ్యంగ్యోక్తులు విసిరింది. ‘బస్సీ, నీవు ఐఎస్ఐ ఏజెంట్‌వని నేను అంటున్నా, నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో!... దోషిగా తేలేవరకు ప్రతివ్యక్తి అమాయకుడని చట్టం చెబుతుందని నేను భావిస్తున్నా. నా నిర్దోషిత్వానికి నా వద్ద సాక్ష్యాలు లేవు. బస్సీ నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు నీ వద్ద సాక్ష్యాధారాలున్నాయా?.....సీపీ పదవి పోవడంతో మరో పదవి కోసం అవాకులు, చెవాకులు పేలుతున్నారు.... విద్యార్థులు చేసిన నేరాన్ని నిరూపించాల్సిన బాధ్యత నీది. అలా చేయలేకపోతే క్షమాపణలు చెప్పుకో!.....మరో జోక్ పేల్చినందుకు థాంక్స్ బస్సీ...మరో లూజ్ రిమార్క్. కొంతమందికి నిజంగా పీఆర్లో శిక్షణ అవసరం... కొంత మంది మినహా దేశంలోని పౌరులంతా నేరస్థులన్నది బస్సీ అభిప్రాయం కాబోలు. అంతమందిని విచారించడం కష్టం గనుక నిర్దోషులను సాక్ష్యాధారాలు చూపమని అడుగుతున్నారు...’ ఇలా ట్విట్టర్ యూజర్లు తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. -
జేఎన్‌యూ సెగకు బస్సీ కీలక పదవి ఆవిరి!
న్యూఢిల్లీ: బీఎస్ బస్సీని వరించనున్న కీలకపదవికి జేఎన్‌యూ వివాదం తిలోదకాలిచ్చింది. తన ఉద్యోగ బాధ్యతలు ముగిసిన అనంతరం మరో ఉన్నత స్థానంలో కొనసాగాల్సిన ఆయనకు ఆ అవకాశం దక్కేలా కనిపించడం లేదు. జేఎన్‌యూ సమస్యను పరిష్కరించలేకపోవడం ఆయనను ఈ బాధ్యతలకు అందకుండా చేసినట్లు కీలక వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ పోలీసు బాస్‌గా విధులు నిర్వర్తిస్తున్న బస్సీ ఈ నెలాఖరున పదవీ బాధ్యతల నుంచి విరమణ పొందనున్నారు. అయితే, భారత సమాచార కేంద్ర కమిషన్ (సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్-సీఐసీ)లో ఉన్న మూడు కమిషనర్ ఖాళీల భర్తీ కోసం కమిటీ సిద్ధం చేసిన జాబితాలో బస్సీ పేరు కూడా చేర్చినట్లు తెలిసింది. అయితే, గతంలో కేజ్రీవాల్ తో గొడవలు పెట్టుకొని బీజేపీ ఏజెంట్ అనిపించుకోవడం, తాజాగా జేఎన్‌యూ వివాదంలో అతి చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగేలా వ్యవహరించినందుకు ప్రస్తుతం ఆ కమిటీ నుంచి బస్సీ పేరును పక్కకు పెట్టినట్లు తెలిసింది. సీఐసీ కమిషనర్ల నియామకం కోసం ఏర్పాటుచేసిన కమిటీకి అధ్యక్షుడిగా ప్రధాని నరేంద్రమోదీ ఉండగా సభ్యుడిగా ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే కూడా ఉన్నారు. -
కన్హయ్య కుమార్‌పై 'దేశద్రోహం' ఎత్తివేత!
న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్పై మోపిన దేశద్రోహం అభియోగాలను ఎత్తివేసే అవకాశముందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తున్నది. ఆయనపై విధించిన దేశద్రోహం అభియోగాలకు మద్దతుగా ఇప్పటివరకు ఎలాంటి బలమైన ఆధారాలు లభించలేదని కేంద్ర హోంశాఖకు చెందిన వర్గాలు తెలిపాయి. మరోవైపు ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి కార్యాలయానికి జేఎన్‌యూ వ్యవహారంపై నివేదించారు. కన్హయ్య కుమార్‌కు ఇప్పటివరకు క్లీన్చిట్ ఇవ్వలేదని, ఆయనకు వ్యతిరేకంగా తమ వద్ద గట్టి ఆధారాలు ఉన్నాయని బస్సీ మీడియాకు చెప్తున్నారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా జరిగిన కార్యక్రమంలో జాతివ్యతిరేక నినాదాలు చేయడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. అయితే తాను ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని, అఫ్జల్ గురుకు ఎప్పుడూ మద్దతు తెలుపలేదని కన్హయ్యకుమార్ స్పష్టంచేశారు. భారత రాజ్యాంగంపై తనకు అపారమైన నమ్మకముందని, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడలేదని ఆయన వివరణ ఇచ్చారు. దేశద్రోహం కేసులో ఢిల్లీ కోర్టు ఆయనకు మార్చి 2వతేదీవరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. -
కన్హయ్యను ఎవరూ కొట్టలేదు: బస్సీ
న్యూఢిల్లీ : జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ను పాటియాలా కోర్టుకు తీసుకువస్తుండగా అతడిని ఎవరూ కొట్టినట్లు తాను భావించడంలేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ బుధవారం పేర్కొన్నారు. కన్హయ్య కుమార్ కు వ్యతిరేకంగా తమ వద్ద తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని బస్సీ మరోసారి స్పష్టం చేశారు. విద్యార్థి నాయకుడ్ని కోర్టుకు తీసుకెళ్తుండగా పరిస్థి కాస్త అదుపుతప్పిందని అయితే, ఆ సమయంలో ఎవరూ కన్హయ్యపై దాడి చేసినట్లు తాను అనుకోవడం లేదన్నారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ మీడియాతో మాట్లాడారు. విద్యార్థి సంఘం నాయకుడ్ని పాటియాలా హౌస్ కోర్టుకు పటిష్ట భద్రతతో తీసుకొచ్చామన్నారు. అయితే, అనుకోకుండా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో ఆ సమయంలో కన్హయ్య తన చెప్పులు పోగొట్టుకున్నాడని వివరించారు. ఈ వివాదంలో కేవలం జేఎన్‌యూ విద్యార్థులే కాక మరికొంతమంది బయటివాళ్లు కూడా ఈ ఘటనలో ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని, ఈ కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు. తమవద్ద గట్టి ఆధారాలున్నాయని, ఎలాంటి పక్షపాతం లేకుండానే తాము ఈ కేసు విషయంలో ముందుకు వెళ్తున్నామని బస్సీ తెలిపారు. -
'ఆ యువతిని అరెస్ట్ చేశాం'
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఇంకు చల్లిన యువతిని అరెస్ట్ చేశామని, ఆమెపై కేసు నమోదు చేశామని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. కేజ్రీవాల్ కు తగిన సదుపాయాలు, భద్రత కల్పించామని ఆయన చెప్పారు. సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... కేజ్రీవాల్ పై ఇంకు దాడి ఘటనకు సంబంధించి చట్టప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తమపై ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేజ్రీవాల్‌పై ఆదివారం భావన అరోరా(26) అనే యువతి ఇంకు చల్లింది. ఢిల్లీలో సరి-బేసి వాహన విధానం విజయవంతం కావడంపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తుండగా, వేదికకు దగ్గరగా వెళ్లిన ఆమె ఇంకుతో దాడికి పాల్పడింది. కాగా, కేజ్రీపై ఇంకు దాడిలో బీజేపీ కుట్ర ఉందని, ఢిల్లీ పోలీసులూ భాగస్వాములని మనీశ్ సిసోడియా ఆరోపించారు. సరి-బేసి విధానం విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక, మనుషుల్ని చంపేందుకూ వెనకాడబోరని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. -
'కేరళ హౌస్‌పై అసలు దాడి చేయలేదు'
అందరూ చెబుతున్నట్లుగా అసలు తమ పోలీసు సిబ్బంది కేరళ హౌస్ మీద దాడి చేయనేలేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. అక్కడ బీఫ్ వండి వడ్డిస్తున్నట్లు పోలీసు కంట్రోల్ రూంకు తప్పుడు ఫోన్ కాల్ వచ్చిందని, అయితే ఇలాంటి సందర్భంలో మతపరమైన అల్లర్లు జరిగే ప్రమాదం ఉన్నందున తమ సిబ్బంది వెంటనే అక్కడకు వెళ్లిన మాట వాస్తవమే గానీ, వాళ్లు అక్కడ సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా మాత్రమే వెళ్లారన్నారు. విష్ణుగుప్తా, అతడి అనుచరులు అక్కడ ఏమైనా వివాదం సృష్టిస్తే అడ్డుకునేందుకు మాత్రమే వాళ్లు వెళ్లారన్నారు. కేరళ హౌస్‌పై అసలు పోలీసులు దాడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కంట్రోల్ రూంకు ఫోన్ చేసిన విష్ణు గుప్తా అనే వ్యక్తి ఇప్పటికే పోలీసుల దృష్టిలో ఉన్నాడని, కానీ ఈ ఘటన విషయంలో ఎవరూ అతడిపై ఫిర్యాదు చేయలేదని బస్సీ చెప్పారు. అయినా సెక్షన్ 182 (తప్పుడు సమాచారం) కింద అతడిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. -
'థరూర్ ను మరోసారి ప్రశ్నిస్తాం'
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై ఆమె భర్త, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌ను మరోసారి ప్రశ్నించే అవకాశముందని ఢిల్లీ పోలీస్ చీఫ్ బీఎస్ బాసీ తెలిపారు. అవసరమైతే మరోసారి ఆయన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పలువురి విచారించామని, ఇంకా కొందరిని ప్రశ్నిస్తున్నామని అన్నారు. సోమవారం రాత్రి థరూర్ ను మూడున్నర గంటల పాటు ప్రశ్నించామని, అవసరమైతే రెండవసారి పశ్నించేందుకు ఆయనను పిలుస్తామని వెల్లడించారు. థరూర్ ఏం సమాధానం చెప్పారనేది వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. -
సునంద హత్యకేసు:'నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయి'
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ అంతర అవయవాల నమూనాలను పరీక్షల నిమిత్తం ఏ దేశం పంపాలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) రెండు రోజుల్లో నిర్ణయిస్తుందని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ చెప్పారు. సునందది అసహజ మరణమని ఎయిమ్స్ ఆస్పత్రి ఇచ్చిన నివేదిక ఆధారంగా జనవరి 1న ఐపీసీ 302 సెక్షన్ కింద హత్యకేసుగా నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ కోసం సిట్‌ను ఏర్పాటుచేశారు. ఈ కేసులో ప్రాథమిక విచారణ నివేదిక(ఎఫ్ఐఆర్)ను నమోదు చేసేందుకు సునంద అంతర అవయవాల నమూనాలను ల్యాబ్‌లో పరీక్షల నిమిత్తం అమెరికా లేదా ఇంగ్లండ్‌కు పంపుతామని జనవరి 6న బస్సీ చెప్పారు. అప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేమన్నారు. శశి థరూర్‌ను ఎప్పుడు విచారించాలో సిట్ నిర్ణయిస్తుందని బస్సీ స్పష్టంచేశారు. ఈ కేసు విషయమై మీడియాలో వస్తున్న వార్తల్లో నిజానిజాలేమిటో త్వర లోనే తెలుస్తాయని ఆయన అన్నారు. -
నగరంలో పోలీసు భద్రత కట్టుదిట్టం
సాక్షి, న్యూఢిల్లీ: సిడ్నీ, పెషావర్లలో ఉగ్రవాద ఘటనల నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు నగరంలోని కీలక ప్రదేశాలన్నింటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీస్ కమిషనర్ బీ. ఎస్. బస్సీ నగరంలో అలర్ట్ ప్రకటించారు. తమ పరిధిలోని అన్ని ప్రముఖ మాల్స్, మార్కెట్లు, సినిమాహాళ్లు, రాయబార కార్యాలయాలు, చారిత్రక కట్టడాలు, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ వెట్రో, ఐదు నక్షత్రాల హోటళ్లు, ధార్మికస్థలాల వద్ద భద్రతను పెంచాలని ఆయన అన్ని పోలీసుస్టేషన్ల ఇన్చార్జిలను ఆదేశించారు. స్కూళ్ల వద్ద భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలో నివాసం ఉంటున్న ఇరాక్, సిరియా సానుభూతిపరులు, విదేశీయులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ముప్పు ఉందని నిఘా సంస్థల హెచ్చరికలతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. విదేశీయులు ఉండే ప్రాంతాల్లో విదేశీయులు ఎక్కువగా నివసించే పహాడ్ గంజ్, లాజ్‌పత్‌నగర్, చాణక్యపురి, మయూర్ విహార్, పాత ఢిల్లీ ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించారు. సెలవుపై వెళ్లిన పోలీసు సిబ్బంది వెంటనే విధులల్లో చేరాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన నేపథ్యంలో జనవరి 23 నుంచి జనవరి 28 మధ్యకాలంలో ఐఎస్ఐఎస్ దాడి జరగవచ్చని ఇంటెలిజెన్స్ నివేదికలు హెచ్చరించాయి. రిపబ్లిక్ డే కంటే ముందు 26/11 లేదా పార్లమెంటుపై దాడి తరహాలో నగరంలో మరో దాడి జరిగే ప్రమాదం ఉన్నదని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిక చేశాయి. కమాండోలు సిద్ధం ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ స్థితినైనా ఎదుర్కోవడానికి స్వాట్ (స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్), ఎన్స్జీ కమాండోలు సంసిద్ధంగా ఉన్నారని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. స్పెషల్ సెల్ కిందకు వచ్చే స్వాట్ కింద 160 మంది కమాండోలు ఉన్నారు. కామన్వెల్త్ క్రీడల సమయంలో క్రీడాకారులకు భద్రతను ఇచ్చేందుకు ఏర్పాటుచేసిన ఈ బలగంలోని కమాండోలకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చారు, వారి వద్ద అనేక అత్యాధునిక ఆయుధాలను కలిగి ఉన్న నాలుగు గ్రూపులు స్పెషల్ కింద ఉన్నాయి. ఒక్కొక్క గ్రూపులో 40 మంది కమాండోలు ఉన్నారు. ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టడానికి పోలీస్‌శాఖ అన్నిరకాల చర్యలను తీసుకొందని ఉన్నతాధికారులు చెప్పారు. -
మరింత శ్రద్ధ వహిస్తున్నాం
న్యూఢిల్లీ: డిసెంబర్, 16 నాటి సామూహిక అత్యాచార ఘటన అనంరతం మహిళలపై నేరాల విషయంలో మరింత శ్రద్ధ వహిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సి పేర్కొన్నారు. మహిళా సాధికారత అంశంపై స్థానిక ఫిక్కి హౌస్‌లో ఫిక్కి మహిళా సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. డిసెంబర్, 16 నాటి సామూహిక అత్యాచార కేసు నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నామన్నారు. అంతకుముందు బాధితురాలు అయిష్టత వ్యక్తం చేస్తే తమ సిబ్బంది కేసులు నమోదు చేసేవారు కాదని, అయితే 2013లో చట్టంలో చేసిన సవరణల కారణంగా ఇప్పుడు విధిగా కేసు నమోదు చేయాల్సిందేనన్నారు. ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసులు నిరాకరించకూడదని అన్నారు. దీంతో కేసుల నమోదు దాదాపు 500 శాతం మేర పెరిగిందన్నారు. 2012లో నగరంలో మొత్తం 706 అత్యాచార కేసులు నమోదయ్యాయన్నారు. 2013లో వీటి సంఖ్య 1,636కు చేరుకుందన్నారు. 2014 సంవత్సరంలో ఇప్పటిదాకా దాదాపు 984 కేసులు నమోదయ్యాయన్నారు. జూన్ నాటికి ఇందులో 759 కేసులను పరిష్కరించామన్నారు. అనేక కేసులపై తాను కూడా స్వయంగా దృష్టి సారిస్తూనే ఉన్నానన్నారు. బాధితురాలు, నిందితుడి మధ్య పరిచయమున్న కేసులు కూడా తమ వద్దకు వస్తున్నాయని, వీటి సంఖ్య కూడా బాగా పెరిగిపోయిందన్నారు. మరింత మంది మహిళా సిబ్బంది అవసరం తమ శాఖలో మహిళా సిబ్బంది కొరత సమస్య తీవ్రంగా ఉందని బస్సి పేర్కొన్నారు. డిసెంబర్, 16 నాటి సామూహిక అత్యాచార ఘటన అనంతరం మహిళా సిబ్బంది ప్రాధాన్యం తెలిసొచ్చిందన్నారు. అందువల్లనే వివిధ ర్యాంకుల్లో మొత్తం రెండు వేల మంది మహిళా సిబ్బందిని నియమించుకున్నామన్నారు. -
రికార్డులు దాటిన నేరాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో నేరాల సంఖ్య గత ఏడాది రికార్డులను దాటిపోయింది. 2012 ఏడాదితో పోలిస్తే 2013లో 43.6 శాతంమేర నేరాలు పెరిగినట్టు పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ వెల్లడించారు. ఢిల్లీ పోలీసులు ఏటా నిర్వహించే వార్షిక పత్రికా సమావేశంలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. మహిళలపై దాడులు 412 శాతం పెరిగినట్టు పోలీస్ కమిషనర్ స్వయంగా వెల్లడించారు. 2013లో 1,559 అత్యాచార కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. 2012తో పోలిస్తే 129 శాతం అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. నిర్భ య అత్యాచార ఘటన తర్వాతకూడా నగరంలో మహిళల రక్షణ మెరుగుపడలేదనడానికి ఇదే నిదర్శనం. ఢిల్లీ సీపీ పేర్కొన్న ప్రకారం 2012లో 51,479 కేసులు నమోదవగా, 2013లో 73,958 కేసులతో 43.67 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. మొత్తం నమోదైన కేసుల్లో నగర పోలీసు లు 48.8 కేసులను పరిష్కరించగలిగారు.‘ ప్రతి ఫిర్యాదును నమోదు చేయాలంటూ అన్ని పోలీస్ స్టేషన్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ప్రజలకు నిర్లక్ష్యం చెయ్యొద్దన్నాం. అందుకే కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది’ అని ఆయన పేర్కొన్నా రు. ప్రజలకు పోలీసు వ్యవస్థను మరింత చేరువచేసేలా పీపుల్స్ ఫెండ్రీ పోలీసింగ్‌ను అమలులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నామన్నారు. సీపీ వెల్లడించిన వివరాలు నగరంలో ఈ ఏడాది నమోదైన అత్యాచార కేసుల్లో 96 శాతం కేసుల్లో నిందితులు బాధితురాళ్లకు తెలిసినవారే. ఇలాంటి 90 శాతం కేసులను పోలీసులు పరిష్కరించారు. మహిళలపై నేరాలకు పాల్పడినట్టు నమోదైన కేసుల్లో 77 శాతం కేసులను ఫిర్యాదు అందిన వారంలోనే పరిష్కరించారు. అత్యాచార కేసుల్లో చార్జిషీట్ తప్పనిసరి చేస్తూ వచ్చిన కొత్త నిబంధనతో 20 రోజులలోగానే నిందితుడి అరెస్టు అనివార్యమైంది. బాలికలు, మహిళల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పీసీఆర్ వ్యాన్ల సంఖ్యను పెంచారు. మహిళల రక్షణకు 1091 హెల్ప్‌లైన్ ఏర్పాటు. 370 పీసీఆర్ వ్యాన్లను అదనంగా అందుబాటులోకి తెచ్చారు. దీంతో నగరంలో పీసీఆర్ వ్యాన్ల సంఖ్య 807కి చేరింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన 30,130 మంది ని పీసీఆర్ వ్యాన్ల సిబ్బంది ఆసుపత్రుల్లో చేర్పించింది. అదృశ్యమవుతున్న చిన్నారుల జాడ కనిపెట్టడంపైనా నగర పోలీసులు దృష్టి సారించారు. చిన్నారుల అదృశ్యం కేసుల్లో ఫిర్యాదులు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. 2012లో 3,503 అపహరణ కేసులు నమోదవగా 2013లో కిడ్నాప్ కేసుల సంఖ్య 5,565కి చేరింది. వృద్ధుల రక్షణలో భాగంగా ఢిల్లీ పోలీస్ సీనియర్ సిటిజన్ లిస్టులో 18,574 మందిని చేర్చుకున్నారు. నగరంలో భద్రతా చర్యల్లో భాగంగా నగరవ్యాప్తంగా మార్కెట్లు, పలు కీలక ప్రదేశాల్లో కలిపి మొత్తం 5,333 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా 2013లో మద్యం తాగి వాహనాలను నడుపుతు న్న 24,564 మందిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటి ంచని 3,397 మందిని కారాగారానికి పంపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారివద్ద నుంచి చలాన్ల రూపంలో 59.34 కోట్లు వసూలు చేశారు. 2013లో మొత్తం 11 మంది ఉగ్రవాదులను అరె స్టు చేశారు. 536 మందిని మద్యం సరఫరా చేస్తుండగా అరె స్టు చేశారు. 9,432 మందిని క్రిమినల్ కేసుల్లో అరెస్టు చేశారు.