జేఎన్యూ సెగకు బస్సీ కీలక పదవి ఆవిరి!
న్యూఢిల్లీ: బీఎస్ బస్సీని వరించనున్న కీలకపదవికి జేఎన్యూ వివాదం తిలోదకాలిచ్చింది. తన ఉద్యోగ బాధ్యతలు ముగిసిన అనంతరం మరో ఉన్నత స్థానంలో కొనసాగాల్సిన ఆయనకు ఆ అవకాశం దక్కేలా కనిపించడం లేదు. జేఎన్యూ సమస్యను పరిష్కరించలేకపోవడం ఆయనను ఈ బాధ్యతలకు అందకుండా చేసినట్లు కీలక వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ పోలీసు బాస్గా విధులు నిర్వర్తిస్తున్న బస్సీ ఈ నెలాఖరున పదవీ బాధ్యతల నుంచి విరమణ పొందనున్నారు.
అయితే, భారత సమాచార కేంద్ర కమిషన్ (సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్-సీఐసీ)లో ఉన్న మూడు కమిషనర్ ఖాళీల భర్తీ కోసం కమిటీ సిద్ధం చేసిన జాబితాలో బస్సీ పేరు కూడా చేర్చినట్లు తెలిసింది. అయితే, గతంలో కేజ్రీవాల్ తో గొడవలు పెట్టుకొని బీజేపీ ఏజెంట్ అనిపించుకోవడం, తాజాగా జేఎన్యూ వివాదంలో అతి చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగేలా వ్యవహరించినందుకు ప్రస్తుతం ఆ కమిటీ నుంచి బస్సీ పేరును పక్కకు పెట్టినట్లు తెలిసింది. సీఐసీ కమిషనర్ల నియామకం కోసం ఏర్పాటుచేసిన కమిటీకి అధ్యక్షుడిగా ప్రధాని నరేంద్రమోదీ ఉండగా సభ్యుడిగా ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే కూడా ఉన్నారు.