Delhi Police Chief
-
జేఎన్‌యూ సెగకు బస్సీ కీలక పదవి ఆవిరి!
న్యూఢిల్లీ: బీఎస్ బస్సీని వరించనున్న కీలకపదవికి జేఎన్‌యూ వివాదం తిలోదకాలిచ్చింది. తన ఉద్యోగ బాధ్యతలు ముగిసిన అనంతరం మరో ఉన్నత స్థానంలో కొనసాగాల్సిన ఆయనకు ఆ అవకాశం దక్కేలా కనిపించడం లేదు. జేఎన్‌యూ సమస్యను పరిష్కరించలేకపోవడం ఆయనను ఈ బాధ్యతలకు అందకుండా చేసినట్లు కీలక వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ పోలీసు బాస్‌గా విధులు నిర్వర్తిస్తున్న బస్సీ ఈ నెలాఖరున పదవీ బాధ్యతల నుంచి విరమణ పొందనున్నారు. అయితే, భారత సమాచార కేంద్ర కమిషన్ (సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్-సీఐసీ)లో ఉన్న మూడు కమిషనర్ ఖాళీల భర్తీ కోసం కమిటీ సిద్ధం చేసిన జాబితాలో బస్సీ పేరు కూడా చేర్చినట్లు తెలిసింది. అయితే, గతంలో కేజ్రీవాల్ తో గొడవలు పెట్టుకొని బీజేపీ ఏజెంట్ అనిపించుకోవడం, తాజాగా జేఎన్‌యూ వివాదంలో అతి చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగేలా వ్యవహరించినందుకు ప్రస్తుతం ఆ కమిటీ నుంచి బస్సీ పేరును పక్కకు పెట్టినట్లు తెలిసింది. సీఐసీ కమిషనర్ల నియామకం కోసం ఏర్పాటుచేసిన కమిటీకి అధ్యక్షుడిగా ప్రధాని నరేంద్రమోదీ ఉండగా సభ్యుడిగా ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే కూడా ఉన్నారు. -
మీరేం చేస్తున్నారు..?
న్యూఢిల్లీ: ‘మిమ్నల్ని మేం అడిగాం.. మీరు ఏవిధంగా స్పందిస్తున్నారు..’ అని ఢిల్లీ పోలీస్ చీఫ్‌పై సుప్రీం కోర్టు బుధవారం మండిపడింది. ఒక కోర్టు ఆర్డర్‌ను అందజేయడానికి వెళ్లిన సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదిపై లాజ్‌పత్‌నగర్ పోలీసు అధికారి చేయి చేసుకోవడాన్ని సుప్రీం కోర్టు సీరియస్‌గా తీసుకుంది. ‘ మేం అడిగిన దానికి మీరు సరిగా స్పందించలేదు..’ అని బెంచ్ న్యాయవాదులు జస్టిస్ జె.ఎస్.ఖేదర్, జస్టిస్ సి.నాగప్పన్ పోలీస్ చీఫ్ పనితీరును ఆక్షేపించారు. మిహ ళా న్యాయవాది కేసుపై విచారణ జరిపించాలని గతంలో తామిచ్చిన ఆర్డర్‌ను పోలీస్ కమిషనర్ నిర్లక్ష్యం చేశారని బెంచ్ అభిప్రాయపడింది. ‘గత ఏప్రిల్ నాలుగో తేదీన దక్షిణ ఢిల్లీలోని లాజ్‌పత్ పోలీస్‌స్టేషన్‌కు మహిళా న్యాయవాది వెళ్లింది. అక్కడ కూరగాయల వ్యాపారుల బండ్లను పోలీసులు జప్తు చేయడంపై సాకేత్ కోర్టు ఇచ్చిన నోటీసును స్టేషన్ అధికారికి అందజేసింది. ఆ సమయంలో ఆమెపై సదరు అధికారి అనుచితంగా ప్రవర్తించారు. ఆమెపై భౌతికంగా దాడిచేశారు. దీనిపై విచారణకు మేం మీకు ఇదివరకే ఆదేశించాం. మీరు పోలీస్ కమిషనర్‌గా బాధ్యతగల పదవిలో ఉన్నారు. మీరిచ్చే సమాచారమంతా పారదర్శకంగానే ఉందని నమ్మాల్సి ఉంటుంది. మిమ్మల్ని మేం నమ్ముతున్నాం కాబట్టి సవ్యమైన బాటలో మీ విచారణ నడవాలి..’ అని బెంచ్ సూచించింది. ఢిల్లీ పోలీసుల తరఫు న్యాయవాది మాట్లాడేందుకు యత్నించగా న్యాయమూర్తులు మధ్యలో కల్పించుకుని ‘ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు యత్నించకండి..’ అని అతని వాదనను అడ్డుకున్నారు. ‘ఈ కేసులో సాక్ష్యులందరినీ పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాల్సిందిగా ఎందుకు సమన్లు పంపారు.. కేసులో ఎవరి వాదన నిజమో, ఏది వాస్తవమో అనేది బయటపడాలి..’ అని జస్టిస్ ఖేహర్ అన్నారు. పోలీస్ కమిషనర్‌ను కోర్టు ఇబ్బంది పెట్టదలుచుకోలేదని ఆయన స్పష్టం చేశారు.కాగా, ఈ విషయమై పోలీసులు కోర్టుకు విన్నవిస్తూ మొత్తం కేసును క్రైం బ్రాంచికి అప్పగించేశామని తెలిపారు. సాక్షులను వారికి అనుకూలమైన స్థలంలోనే విచారించాలని వారికి ఆదేశాలు జారీచేశామన్నారు. అలాగే లాజ్‌పత్‌నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది బాధిత మహిళా న్యాయవాది ఇంటికి వెళ్లడం లేదా వారి న్యాయవాదిని సంప్రదించడం వంటి చర్యలకు పాల్పడకుండా కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఆమెకు తగిన భద్రతను కూడా కల్పించినట్లు వివరించారు.