jnu row
-
'కన్హయ్య' కథ అడ్డం తిరిగిందా!
న్యూఢిల్లీ: కథ అడ్డం తిరిగిందా? కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ లు చెప్పినవన్నీ కట్టు కథలని తేలాయా? దేశవ్యాప్తంగా రాజకీయ కలకలం సృష్టించిన జేఎన్‌యూ వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఉగ్రవాది అఫ్జల్ గురు సంస్మరణ ర్యాలీ సందర్భంగా విద్యార్థి నేతలు జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది ముమ్మాటికి నిజమేనని సీబీఐ ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశీలనలో తేలింది. సీబీఐ ల్యాబ్ తుది రిపోర్టుకూడా తమకు అందినట్లు ఢిల్లీ పోలీసులు ధృవీకరిస్తున్నారు. (చదవండి: 'కన్హయ్యపై గట్టి సాక్ష్యాలున్నాయి') నాటి ఘటనకు సంబంధించి ఓ హిందీ న్యూస్ చానెల్ ప్రసారం చేసిన వీడియో ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ దృశ్యాలను చిత్రీకరించిన కెమెరా, మెమరీ కార్డు, సీడీలు, వైర్లు తదితర పరికరాలన్నింటినీ ఢిల్లీలోని ప్రఖ్యాత సీబీఐ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. నాలుగు నెలల సుదీర్ఘ పరిశీలన అనంతరం సదరు వీడియోల్లోని దృశ్యాలు నిజమైనవేనని, ఎలాంటి మార్పుచేర్పులు చేయలేదని నిపుణులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక జూన్ 8నే పోలీసులకు చేరినట్లు సమాచారం. సీబీఐ ల్యాబ్ నుంచి రిపోర్టు అందిన మాట వాస్తవేనని ప్రత్యేక కమిషనర్ అరవింద్ దీప్ మీడియాకు చెప్పారు. (చదవండి: మళ్లీ అఫ్జల్ గురు ప్రకంపనలు!) టీవీ చానెళ్లలో ప్రసారమైన దృశ్యాల ఆధారంగా కాకుండా రా వీడియో ఫుటేజి ఆధారంగానే తాము ఎఫ్ఐఆర్ నమోదు చేసినందున ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకంగా మారింది. ఇప్పుడు రిపోర్టు పోలీసులకు అనుకూలంగా రావడంతో జేఎన్ యూ విద్యార్థి నాయకుల భవిష్యత్ పై చర్చలు మొదలయ్యాయి. అయితే సున్నితమైన అంశం కావడంతో ఆచితూచి వ్యవహరించాలని పోలీసులు భావిస్తున్నారు. దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్భన్ భట్టాచార్యలు బెయిల్ పై బయటే ఉన్న సంగతి తెలిసిందే. (చదవండి: బెయిల్ పై విడుదలైన కన్హయ్య కుమార్) -
'నాతో సెల్ ఫోన్ లేదు'
పట్నా: తనతో సెల్ ఫోన్ లేదని, ఆ స్థోమత కూడా లేదని జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ తెలిపాడు. కన్హయ్యతో ఐఫోన్ ఉందని, పీఆర్వో కూడా ఉన్నాడని అతడి వ్యవహారాలు ఆయన చూసుకుంటాడని వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో కన్హయ్య స్పందించాడు. తనకు సెల్ ఫోన్ ఉందని, పీఆర్వోతో వ్యవహారాలు డీలింగ్ చేస్తుంటాడని కొందరు వ్యక్తులు తనమీద కావాలనే ఆరోపణలు చేస్తున్నారని చెప్పాడు. రాజద్రోహం కేసులో ఆరోపణలతో అరెస్టయిన తర్వాత ఇంటికి రావడం ఇదే మొదటిసారని కన్హయ్య చెప్పాడు. తనకు గతేడాది జూలై నుంచి స్కాలర్ ఫిప్ రావడం లేదని, విమానంలో ప్రయాణించడానికి కొనే టిక్కెట్ డబ్బులు కూడా లేవన్నాడు. అందుకే జరిమానా కట్టలేనని చెప్పానని వివరించాడు. తన బ్యాంకు ఖాతాలో కేవలం రూ.200 మాత్రమే ఉన్నాయని వెల్లడించాడు. కొందరు నిర్వాహకులు తనకు మనీ ఇస్తే ఈ విధంగా ఇంటికి రాగలిగాలని చెప్పుకొచ్చాడు. వారి నిరసనకు మద్ధతు తెలిపేందుకు తనను ఇక్కడికి ఆహ్వానింవచారని తెలిపాడు. -
'అనుక్షణం భయపడుతూనే ఉన్నాం'
న్యూఢిల్లీ: దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై రాజద్రోహం కేసులో జైలు నుంచి విడుదల అయినప్పటి నుంచి తాము ఎంతో భయభ్రాంతులకు గురవుతున్నట్లు జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ వెల్లడించాడు. తనతో పాటు ఈ కేసులో అరెస్టయిన తన సహచరులు అనిర్బన్ భట్టాచార్య, కన్హయ్య కుమార్ లకు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారని శనివారం న్యూఢిల్లీలో మీడియాతో చెప్పాడు. హిందుత్వ గ్రూపులు, సంస్థలు తమపై దాడులు చేసేందుకు పథకాలు పన్నాయని, ఏ సమయంలో ఏం జరగుతుందోనని ఇప్పటికీ తాము ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నాడు. అప్పటినుంచి స్వేచ్ఛను కోల్పోతున్నట్లు అనిపిస్తుందన్నాడు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) ఈ విషయంలో కొత్త జిత్తులు వేయాలని చూస్తోందని, కానీ తీరు మాత్రం 'కొత్త సీసాలో పాతసారా' అనే విధంగా ఉందని ఎద్దేవా చేశాడు. జాతీయవాదం అంటే దేశంలో ప్రస్తుతం జరగుతున్నది కాదని, గతంలో ఇలాంటి పేర్లతోనే ప్రపంచ దేశాలలో ఎన్నో దుష్ప్రరిణామాలు జరిగాయని అన్నాడు. భారత్, పాకిస్తాన్ ల మధ్య కశ్మీర్ సమస్య ఎప్పటినుంచో ఉందని అయితే ఈ రెండు దేశాలు ఎప్పుడూ శాంతియుతంగా సమస్యను పరిస్కరించుకోవని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఉమర్ ఖలీద్, భట్టాచార్య లకు ఢిల్లీ అదనపు సెషన్స్ న్యాయస్థానం ఆరు నెలల మధ్యంతర బెయిలును మంజూరు చేసిన విషయం తెలిసిందే. -
'కన్హయ్యను కాలేజీలో అడుగుపెట్టనివ్వం'
విజయవాడ: సిద్ధార్థ అకాడమీ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. కన్హయ్య సభకు మొదట పర్మిషన్ ఎందుకు ఇచ్చారని సిద్ధార్థ అకాడమీ ఇంఛార్జ్ రమేష్ పై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి చర్యలను కాలేజీ ప్రతిష్టను మంటగలుపుతున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. జాతి వ్యతిరేక శక్తును కాలేజీలో అడుగుపెట్టనివ్వమని ఆ కాలేజీ విద్యార్థులు చెబుతున్నారు. ఐవీ ప్యాలెస్ లో జరగనున్న సదస్సుకు కన్హయ్య హాజరుకానున్న నేపథ్యంలో అక్కడ విద్యార్థులు తమ అందోళనను ఉధృతం చేశారు. -
అది దేశద్రోహం కాక మరేమిటి?
దేశభక్తి మా ఒక్కరి సొంతమని తాము ఏనాడూ అహంకరించలేదని చెప్పారు ఆరెస్సెస్ సహసర్కార్యవాహ్ (ఆలిండియా జాయింట్ జనరల్ సెక్రటరీ) భాగయ్య. కానీ అఫ్జల్‌గురును శ్లాఘించడం దేశద్రోహమేనని అన్నారు. రోహిత్ వేముల ఆత్మహత్య బాధాకరం, అదే సమయంలో యాకూబ్ మెమెన్‌కు అనుకూలంగా విద్యార్థులు నినదించడానికి దారి తీసిన పరిస్థితులను, అందుకు ప్రేరేపించిన వారిని కనిపెట్టాలని కోరారు. భాగయ్య ఇంటర్వ్యూలో కొన్ని అంశాలు. ప్రశ్న: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం పరిణామాల తరువాత మొదలైన చర్చ గురించి ఏమంటారు? జవాబు: జేఎన్‌యూలో సాంస్కృతిక ఉత్సవం పేరుతో భారత వ్యతిరేక నినాదాలు చేయడం, దేశం ముక్కలయ్యే వరకు సంఘర్షణ కొనసాగుతుందని చెప్పడం, జుడీషియల్ కిల్లింగ్స్ పేరుతో అఫ్జల్‌గురు, మక్బూల్ భట్‌లని సమర్థించడం దేశద్రోహమే. దేశమంతా ఇలాగే భావిస్తోంది కూడా. ఈ అంశాలన్నింటి మీద సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నా పట్టించుకోకపోవడం మావోయిస్టుల విధానం. జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్, ఎస్ఎఫ్ఐ, అలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఇవన్నీ భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో దేశ ద్రోహానికి పాల్పడు తున్నాయి. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. ఆక్రమిత కశ్మీర్ భూభాగాన్ని తిరిగి తీసుకోవాలని పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇది దేశభక్తి. సామ్రా జ్యవాదంతో భారత్ కశ్మీర్‌ను దురాక్రమించిందని చెప్పడం దేశద్రోహమే. ఇదంతా దేశ సమగ్రతకు భంగకరం. దీనిని ఆరెస్సెస్ సహించదు. ప్ర: ఆరెస్సెస్‌తో విభేదిస్తే దేశద్రోహ ముద్ర వస్తోందన్న విమర్శ ఉంది. జ: దేశభక్తి అంటే మాదే అని మేం ఎప్పుడూ అహంకరించలేదు. గుత్తాధిపత్యం ప్రకటించుకోలేదు. ఈ దేశంలో చాలామంది దేశభక్తులు ఉన్నారు. వారంతా స్వయం సేవకులని మేం చెప్పలేదు. స్వతంత్ర కశ్మీర్, ఇండియా గో బ్యాక్ అనడం; కార్గిల్ యుద్ధ సమయంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం, దంతేవాడలో 76 మంది జవాన్లను మావోయిస్టులు దుర్మార్గంగా హత్యచేస్తే ఒక రాత్రంతా ఉత్సవం జరుపుకోవడం జేఎన్‌యూకే సాధ్యం. అది దేశద్రోహమే. ప్ర: సాధారణంగా వినిపించే విమర్శ - తనతో ఏకీభవించనివారిని దేశద్రోహులుగా పేర్కొంటున్న బీజేపీ కశ్మీర్లో వేర్పాటువాదులను బాహాటంగా సమర్థించే పీడీపీతో ఎందుకు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది? మళ్లీ ఎందుకు ప్రయత్నిస్తున్నది? జ: ఇది పూర్తిగా బీజేపీకి సంబంధించిన వ్యవహారం. వారినే అడగాలి. ప్ర: భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లిందన్న ఆరోపణ గురించి ఏమంటారు? జ: అభిప్రాయ భేదం వేరు. ద్వేషం వేరు. ఆరెస్సెస్, బీజేపీ సహా ఏ సంస్థ సిద్ధాంతంతో అయినా విభేదించే హక్కు ఈ దేశ ప్రజలకు ఉంది. వాటికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. తప్పులేదు. కానీ ఈ సంస్థలను అడ్డం పెట్టుకుని దేశాన్ని ముక్కలు చేస్తాం అనే వరకు వెళ్లడం ఏమిటి? దీనికేనా భావ ప్రకటనా స్వేచ్ఛ అని పేరు? అసలు భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఇక్కడ జరుగుతున్న దేశ వ్యతిరేక కార్యకలాపాలను దేశం విస్తుపోయి చూస్తోంది. అరుంధతీరాయ్ మానవ హక్కుల రక్షణ పేరుతో భద్రతా దళాల హత్యను సమర్థించి, దానికి భావ ప్రకటనా స్వేచ్ఛ అని పేరుపెడుతున్నారు. ఇలాంటి ధోరణులకు ఒక వర్గం మీడియా రకరకాల పేర్లు పెట్టి సమర్థించడం ఇంకా దురదృష్టకరం. దీనితో మీడియా విశ్వసనీయత తగ్గుతోంది. ఏ వార్త వచ్చినా సోషల్ మీడియాలో చూసుకుని గాని ప్రజలు నిర్ధారణకు రాలేని పరిస్థితి తెచ్చారు. జేఎన్‌యూ విద్యార్థుల బెయిల్ పిటిషన్ వాదనల సమయంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు గుర్తుకు తెచ్చు కోండి. ఆమె ఉపకార్ సినిమాలో పాటను ఉటంకించారు. భగత్‌సింగ్ వంటి వారి రక్తతర్పణలతో విముక్తమైన దేశం, ఇది స్వర్ణభూమి అన్నారు న్యాయ మూర్తి. జేఎన్‌యూకి సంబంధించి హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛకే పరిమి తం కాలేమన్నారు. సీపీసీ సెక్షన్ 39 ప్రకారం దేశద్రోహ కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు చూసినవారు ఫిర్యాదు చేయాలి. కానీ జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు వాళ్లతో కలసి నినాదాలు ఇచ్చాడు. దీనినే కోర్టు తీవ్రంగా పరిగణించింది. జేఎన్‌యూ ఘటన తరువాత దేశంలో దేశభక్తులు, దేశ వ్యతిరేకులు అని రెండు శిబిరాలు ఏర్పడ్డాయి. ప్ర: భారత్‌మాతాకీ జై నినాదం గురించి తెలెత్తిన వివాదం మాటేమిటి? జ: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మతంతో ప్రమేయం లేకుండా దేశ ప్రజలంతా ఇచ్చిన నినాదాలు భారత్‌మాతాకీ జై, వందేమాతరం. ఇప్పుడు కేవలం రాజకీయాల కోసం కొందరు ఈ నినాదాన్ని అవమానించడమంటే, స్వరాజ్య సమరంలో మన పెద్దలు చేసిన త్యాగాలను అవమానించడమే. అధికారం కోల్పోయిన వారు మళ్లీ దాని కోసం ఆరాటపడతారు. తప్పులేదు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ మీద కక్షతో విద్రోహశక్తులను సమర్థించడం ఎంతవరకు సబబు? ప్ర: ఆ పని చేస్తున్నవారు ఎవరంటారు? జ: కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, మావోయిస్టులు సైద్ధాంతికంగా, రాజకీ యంగా ప్రాబల్యం కోల్పోయిన తరువాత పేదలు, దళితులు, విద్యార్థులను అడ్డం పెట్టుకుని రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారు. నిజానికి ఈ ధోరణిని కాంగ్రెస్‌లో కూడా అంతా సమర్థిస్తారని అనలేం. ఆ పార్టీలో ఇప్పుడు అంతర్మథనం మొదలైందనిపిస్తుంది. కమ్యూనిస్టులు మాత్రం తమ లబ్ధి కోసం ఎస్సీ ఎస్టీ విద్యార్థులను బలిచేయాలని చూస్తున్నారు. ప్ర: ఆరెస్సెస్ ఆలోచనా ధోరణిలో మనువాదం ఉంటుందన్న విమర్శ గురించి ఏమంటారు? జ: ఇది అవగాహనలేని విమర్శ. మనుస్మృతి గురించి మాకు కచ్చితమైన అవగాహన ఉంది. అదేమీ వేదం కాదు. స్మృతి. ఒక కాలానికి సంబంధించినది. దానికి ఎప్పుడో కాలదోషం పట్టింది. మనుస్మృతిని మేం ఏనాడూ ప్రస్తావించలేదు. ఈ విమర్శ ప్రధానంగా వామపక్షం వైపు నుంచి వస్తుంది. వారు కొన్ని ప్రశ్నలకు సంబంధించి ఈ దేశానికి సమాధానం చెప్పాలి. ఏ కమ్యూనిస్టు పార్టీ అయినా మహిళలకు అద్భుతమైన గౌరవం ఇచ్చి, సముచిత స్థానం కల్పించిందా? కేరళలో జరిగిన ఒక దురదృష్టకర ఉదంతాన్ని చెబుతాను. త్రిపుంతుర అనే చోట ఒక విద్యార్థిని ఎస్ఎఫ్ఐలో కొద్దికాలం పని చేసి బయటకు వచ్చింది. తరువాత ఏబీవీపీలో చేరింది. ఆ మరునాడే ఆమె శీలం గురించి అభాండాలు వేస్తూ పోస్టర్లు వెలిశాయి. ఆమె ఆత్మహత్యా యత్నం చేసింది. ఆ విద్యార్థిని పేరు స్మృతి. అదేం చిత్రమో ఎవరైనా సరే వామపక్షం వైపు ఉన్నంతకాలం సెక్యులర్. ఏవో కారణాలతో ఏబీవీపీ వంటి ఏ ఇతర సంస్థలోకో మారితే వాళ్లు వెంటనే ‘బ్రాహ్మణ వాదులు’ అయిపోతారు. వామపక్షాలకు నిలయంగా, ప్రగతిశీల భావాలకు ఆలవాలంగా చెప్పుకునే జేఎన్‌యూలో దుర్గాదేవి గురించి కరపత్రంలో ఎంత నీచంగా రాశారో అందరికీ తెలుసు. ఆ పేరు ఒక దేవతదే. కానీ ఆమె స్త్రీ. ఇలాంటివాళ్లు సంఘ్‌ని మనువాద సంస్థ అనడమే వింత. ప్ర: మీ దృష్టిలో ఈ పరిణామాల మీద సామాన్య ప్రజల స్పందన ఏమిటి? జ: దేశ విచ్ఛిత్తిని కోరుతున్న వారి అభిప్రాయాలకు సామాన్య ప్రజానీకం అంగీకారం లేదు. సాధారణ ప్రజానీకంలో ఆ విద్రోహ చింతనే ఉంటే దేశం ఏనాడో ముక్కలు చెక్కలు అయ్యేది. విద్యార్థుల విషయం కూడా అంతే. జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో కూడా జేఎన్‌యూ మాదిరే నినాదాలు మొదలయ్యాయి. ఆ మరునాడే కొందరు విద్యార్థులు అలాంటి నినాదాలు, ధోరణులు మాకు సమ్మతం కాదని అంతకంటే పెద్ద సభ నిర్వహించి నిరూపించారు. ఇది కూడా పత్రికలలో ప్రాధాన్యానికి నోచుకోలేదు. ప్ర: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, వేముల రోహిత్..... జ: రోహిత్ ఆత్మహత్య ముమ్మాటికీ దురదృష్టకరం. ఈ వాస్తవాన్ని గుర్తిస్తూనే ఇంకొక మాట కూడా చెప్పాలి. జేఎన్‌యూ గొడవలకు అఫ్జల్‌గురు కేంద్ర బిందువైతే, హెచ్‌సీయూ రగడకు కేంద్ర బిందువు యాకూబ్ మెమెన్ ఉరి. ఒక మెమెన్‌ను ఉరితీస్తే ఇంటికో మెమెన్ పుడతాడు అంటూ విశ్వవిద్యాల యంలో ఊరేగింపు తీసి, నినాదాలు చేయడం, అతడి ఆత్మశాంతికి ప్రార్థనలు చేయడం గర్హించక తప్పదు. రోహిత్ ఆత్మహత్యతో తీవ్రమైన ఈ అంశం తెర వెనక్కిపోయింది. అతడి కులం వ్యవహారం ఘటనను మరో మలుపు తిప్పింది. ఇలాంటి ధోరణులకు దారి తీసిన పరిస్థితుల మీద దర్యాప్తు చేయాలి. అక్కడ జరుగుతున్న వ్యవహారాల గురించి పదేళ్ల కాలాన్ని తీసుకుని దర్యాప్తు చేయించాలి. పుట్టుకను బట్టి వివక్ష చూపడాన్ని ఆరెస్సెస్ అంగీకరించదు. ధర్మం కూడా అంగీకరించదు. ఈ దేశంలో పుట్టినవారు ఎవరైనా అన్ని హక్కులు అనుభవించగలగాలి. దీని ఆచరణలో లోపాలు లేకపోలేదు. ఆ లోపం మనుషులది. ధర్మానిది కాదు. ప్ర: మీ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నవారి నోటంట వినిపించేదీ, మీ నోటంట వినిపించేదీ అంబేడ్కర్ పేరే. మరి ఎందుకీ ఘర్షణ. జ: కులం గురించి అంబేడ్కర్ చేసిన రచనలో భారతదేశంలో కేవలం భౌగోళిక ఐక్యతే కాకుండా, సాంస్కృతిక ఏకాత్మత ఉందని అభిప్రాయపడ్డారు. మేం దీనిని నమ్ముతున్నాం. చెబుతున్నాం. మత మార్పిడిని ముఖ్యంగా ఇస్లాం, క్రైస్తవంలోకి బడుగులను మార్చడం మీద ఆయన తీవ్ర అభ్యంతరాలనే వ్యక్తం చేశారు. ఈ అంశాలను మమ్మల్ని విమర్శించేవారు సౌకర్యంగా విస్మరిస్తారు. దేశ సమగ్రత, సామాజిక న్యాయం, సౌశీల్యం, స్వేచ్ఛ, సమత్వం, సౌభ్రాత్రం ఆధారంగా పౌరులంతా కలసి పని చేయాలని అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని అంబేడ్కర్ చెప్పారు. ప్ర: ఆర్థికాంశాల మీద ఆరెస్సెస్ వైఖరి సాధారణంగా వినిపించదంటారు. జ: ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా, తెలిసినా తెలియకున్నా మా కార్యక్రమం మాకు ఉంది. మొన్న జైపూర్ సమావేశాలలో వ్యవసాయం గురించి తీర్మానం చేశారు. పెట్టుబడులు తగ్గాలి. రాబడులు పెరగాలి. ఇందుకు గో ఆధారిత సేద్యం సరైనదని, సేంద్రియ వ్యవసాయం రావాలని ఆ తీర్మానం సారాంశం. రైతుల దగ్గర నుంచి చెరకు కొంటారు. చెరకు ఉప ఉత్పత్తి మొలాసిస్. మళ్లీ దాని నుంచి ఎథనాల్ తీస్తారు. వీటిలో రైతుకు భాగం ఉండాలని మా వాదన. రైతు ఆత్మగౌరవంతో బతకాలి. అందరికీ విద్య, అందరికీ వైద్యం అని కూడా చెబుతున్నాం. ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం రెండు దశాబ్దాలుగా సర్వ నాశనం అయినాయి. వాటిని పునరుద్ధరించాలి. మేం ఎన్నో సేవా కార్య క్రమాలు నిర్వహిస్తాం. కానీ ప్రచారం తక్కువ. అందుకు పాకులాడం. ప్ర: ఆరెస్సెస్ అనుకూల ప్రభుత్వం వచ్చింది కాబట్టి మందిర్ మళ్లీ తెరపైకి వస్తుందా? జ: ఈ దేశంలో ప్రజలు ఎన్నుకున్న ఏ ప్రభుత్వమైనా అది మనందరిది. అయో ధ్యలో రామాలయం తథ్యం. ప్రజాస్వామ్యబద్ధంగా అది జరుగుతుంది. ప్ర: మీ మీద వస్తున్న విమర్శల గురించి సూటిగా ఏం చెబుతారు? జ: మీమీద దుర్యోధనుడికి ఎందుకింత ద్వేషం అని పాండవులను అడగలేం. ద్వేషిస్తున్న దుర్యోధనుడిని అడగాలి ఆ ప్రశ్న. ఇంటర్వ్యూ: గోపరాజు నారాయణరావు -
'కన్హయ్యలాగా ఎవరూ పుట్టొద్దు'
జైపూర్: జేఎన్‌యూ విద్యార్థి కన్హయ్య కుమార్‌పై రాజస్థాన్ బీజేపీ ఎంపీ ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్హయ్య కుమార్లాగా మరొకరు పుట్టకూడదని తమ పాఠ్య పుస్తకాల్లో సమూల మార్పులు చేస్తున్నామని విద్యాశాఖ సహాయక మంత్రి వాసుదేవ్ దేవ్ నాని అన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు తాము పాఠ్యపుస్తకాలను దేశభక్తితో నిండిన అంశాలను చేరుస్తున్నామని, భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన యోధుల చరిత్రను, ఫొటోలను పుస్తకాల్లో పెడుతున్నామని తెలిపారు. జేఎన్‌యూ ఘటనను దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో జెండాను ఎగురవేయాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తాము రాష్ట్ర పుస్తకాల్లో దేశభక్తి అంశాలను చేరుస్తున్నట్లు చెప్పారు. -
జెఎన్యూ యుద్ధంలో మేమే గెలిచాం!
బృంద్రావన్(ఉత్తరప్రదేశ్): దేశాన్ని కుదిపేసిన జవహర్లాల్ నెహ్రూ వివాదంలోని సైద్ధాంతిక పోరులో తామే నైతిక విజయం సాధించామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. జెఎన్యూలో జాతి వ్యతిరేక ఆరోపణలు చేశారన్న ఆరోపణలతో కన్హయ్యకుమార్ సహా పలువురు విద్యార్థులు అరెస్టైన సంగతి తెలిసిందే. 'మనమే గెలిచాం. ఒకప్పుడు దేశాన్ని ముక్కలు చేస్తామని నినాదాలు చేసిన వారే జైలు నుంచి విడుదలైన తర్వాత 'జైహింద్' అంటూ నినదిస్తున్నారు. త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడిస్తున్నారు' అని జైట్లీ పేర్కొన్నారు. బృందావన్‌లో జరిగిన బీజేపీ యువమోర్చా కార్యక్రమంలో జైట్లీ ప్రసంగిస్తూ.. జైలు నుంచి విడుదలైన అనంతరం జెఎన్యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించారు. ఆయన ప్రసంగం బీజేపీ విజయానికి నిదర్శనమన్నారు. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. 'కొందరు యాకూబ్ మెమన్ సంస్మరణ నిర్వహించాలనుకుంటే, మరికొందరు అఫ్జల్ గురు సంస్మరణ నిర్వహించాలనుకుంటున్నారు. దేశాన్ని ముక్కలు చేస్తామని నినాదాలు చేస్తున్నారు. అలాంటివారికి కాంగ్రెస్ యువనాయకుడు సానుభూతి ప్రకటించడం దేశం చేసుకున్న దౌర్భాగ్యమ'ని ఆయన మండిపడ్డారు. జెఎన్యూ వివాదానికి కాంగ్రెస్ మద్దతు పలుకడం ఆ పార్టీ సైద్ధాంతిక దివాళాకోరుతనాన్ని చాటుతోందని జైట్లీ ధ్వజమెత్తారు. -
రోహితే నా ఆదర్శం
* అఫ్జల్ గురు కాదు: విద్యార్థి నేత కన్హయ్య * నేను దేశవ్యతిరేకిని కాదు * రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టయి గురువారం బెయిలుపై విడుదలైన జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య.. శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజద్రోహ చట్టాన్ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘పార్లమెంటుపై దాడి కేసు దోషి అఫ్జల్ గురు నాకు ఆదర్శం కాదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పాలకవర్గం వివక్ష వల్ల ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల నాకు ఆదర్శం. నేను ఉగ్రవాదిని కాను. నేను దేశ వ్యతిరేకిని కాదు. దేశ సరిహద్దును రక్షిస్తున్న జవాన్లు, దేశ ప్రజలందరికీ అన్నం పెట్టేందుకు శ్రమిస్తున్న రైతుల కోసం పోరాడే నిజమైన రైతు బిడ్డను. దేశంలో పేదరికం, అవినీతి నుంచి స్వేచ్ఛ లభించాలని మేం (విద్యార్థులు) కోరుకుంటున్నాం. న్యాయం కోరే వాళ్ల గొంతు నొక్కేందుకు బ్రిటిషర్లు రాజద్రోహం చట్టాన్ని ప్రయోగించేవారు. విద్యార్థుల వాణిని అణచివేసేందుకు ప్రభుత్వం రాజద్రోహం చట్టాన్ని వాడకూడదు’ అని వ్యాఖ్యానించారు. ‘దేశ రాజ్యాంగం ప్రకారం అఫ్జల్ గురు భారతీయుడు. అతనికి జరిగినదంతా (ఉరిశిక్ష విధింపు) దేశ చట్టం ప్రకారమే జరిగింది. మీరు (ప్రభుత్వం) ఎంత మంది రోహిత్‌లను చంపితే ఇంటింటి నుంచి అంతమంది రోహిత్‌లు పుట్టుకొస్తారు’ అని అన్నారు. రాజకీయాల్లో వస్తారా అని అడగ్గా.. ‘నేను రాజకీయ నాయకుడిని కాను. పీహెచ్డీ విద్యార్థిని. రాజకీయాల్లోకి వచ్చే లేదా ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు. చదువే నా లక్ష్యం. చదవాలని కోరిక వున్నా చదవలేకపోతున్న వారి కోసం పోరాడ్డమే నా పని’ అని పేర్కొన్నారు. ఏబీవీపీ ప్రచారం చేస్తున్న అఖండ భారత్ విధానానికి తాను వ్యతిరేకినన్నారు. భారత న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని.. దీనిపై ఆరెస్సెస్ ప్రభావం ఉండదని విశ్వసిస్తున్నానని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దేశ రాజ్యాంగం, న్యాయవ్యవస్థను నాగ్‌పూర్‌లో కూర్చున్న ఆరెస్సెస్ నాయకులు నిర్ణయించజాలరన్నారు. ‘మా సిద్ధాంతానికి అనుగుణంగా గొంతెత్తితే.. తరచూ జైలుకు వెళ్లి రావటం తప్పకపోవచ్చు’ అని తెలిపారు. మా తరఫున ప్రచారం చేస్తారు: లెఫ్ట్ కన్హయ్య వామపక్ష కార్యకర్త కనుక సహజంగా ఆయన వచ్చే ఐదు అసెంబ్లీల ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ తరఫున ప్రచారం చేస్తారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. కన్హయ్య ప్రచారం చేయాలని డిమాండ్ల వస్తున్నాయని సీపీఐ నేత డి.రాజా తెలిపారు. ఐఐఎంసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజీనామా న్యూఢిల్లీ: రోహిత్ ఆత్మహత్యను నిరసిస్తూ.. జేఎన్‌యూ, ఎఫ్టీఐఐల్లో జరిగిన నిరసనలకు సహకరించినందుకు ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుందని ఆరోపిస్తూ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ) అసిస్టెంట్ ప్రొఫెసర్ అమిత్ సేన్‌గుప్తా రాజీనామా చేశారు. ‘జోక్యం’ నుంచి ఆజాదీ కావాలి: కేజ్రీవాల్ ‘లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం నుంచి ఆజాదీ కావాలి, కేంద్ర జోక్యం నుంచి ఆజదీ కావాలి’ అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కన్హయ్య తరహా నినాదాలతో ట్వీట్ చేశారు. -
రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. జేఎన్‌యూ వివాదానికి సంబంధించి రాజద్రోహం ఆరోపణలతో సైబారాబాద్ పరిధిలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. రాహుల్ తోపాటు కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్ శర్మ, కేసీ త్యాగి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జేఎన్ యూ విద్యార్థి నేతలు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, వామపక్ష నేతలు డీ రాజా, సీతారం ఏచూరిపై కూడా కేసు నమోదు చేశారు. వీరిపై ఐపీసీ సెక్షన్లు 124(ఏ) 156 (3) కింద ఆరోపణలు నమోదు చేశారు. -
మరోసారి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహుజ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జేఎన్ యూ విద్యార్థులు క్యాంపస్ లో విచ్చలవిడిగా వ్యవహరిస్తారని అంతకుముందు వ్యాఖ్యానించిన ఆయన మళ్లీ తన నోటికి పదును పెట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో 50 శాతం అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసులకు జేఎన్ యూ విద్యార్థులే కారణమంటూ నోరు పారేసుకున్నారు. అంతకుముందుకు జేఎన్ యూ విద్యార్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వివరణ ఇవ్వాలని ఆయనను పార్టీ అధిష్టానం ఆదేశించింది. జేఎన్ యూ క్యాంపస్ లో ప్రతిరోజు 3 వేల కండోమ్ లు, గర్భనిరోధక ఇంజక్షన్లు వాడతారని అహుజ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. -
'నన్ను చూసి ప్రభుత్వం భయపడుతోంది'
న్యూఢిల్లీ: తనను చూసి మోదీ సర్కారు భయపడుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వం తనను పార్లమెంట్ లో మాట్లాడనీయడం లేదని విమర్శించారు. బుధవారం పార్లమెంట్ వెలుపల విలేకరులతో ఆయన మాట్లాడారు. 'అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతోంది. కానీ పార్లమెంట్ లో నన్ను మాట్లాడనీయడం లేదు. నేను మాట్లాడేటప్పుడు మీరే చూడండి. పార్లమెంట్ లో గళం విప్పకుండా నన్ను ప్రభుత్వం అడ్డుకుంటోంది. నేనేం మాట్లాడతానోనని ప్రభుత్వం భయపడుతోంద'ని రాహుల్ గాంధీ అన్నారు. జేఎన్ యూ వివాదం, హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని పార్లమెంట్ లో కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. జేఎన్ యూ వివాదంపై మధ్యాహ్నం 2 గంటలకు లోక్ సభలో చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. -
కన్హయ్యకు హైకోర్టు భరోసా
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టైన జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు 29కి వాయిదా వేసింది. కన్హయ్య భద్రతకు ఉన్నత న్యాయస్థానం హామీయిచ్చింది. తన భద్రతపై కన్హయ్య ఆందోళన వ్యక్తంగా చేయగా... 'నీకు ఎటువంటి ప్రమాదం లేదు. వాళ్లు నిన్నేమీ చేయకుండా పటిష్ట భద్రత కల్పిస్తాం. చిన్న దెబ్బ కూడా పడనీయమ'ని హైకోర్టు భరోసాయిచ్చింది. పటియాలా కోర్టు ఆవరణ కోర్టు ఆవరణలో కన్హయ్య కుమార్ పై లాయర్లు దాడి చేసిన సంగతి తెలిసిందే. అతడిపై మళ్లీ దాడులు చేస్తామని కూడా న్యాయవాదులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కన్హయ్యకు పటిష్ట భద్రత కల్పించాలని ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మనం బతికేం ప్రయోజనం?: సూపర్‌స్టార్
దేశాన్ని కుదిపేస్తున్న జెఎన్యూ వివాదంపై మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ భావోద్వేగభరితంగా స్పందించారు. జాతీయవాదాన్ని ప్రస్తావిస్తూ ఆర్మీ, జవాన్లు చేస్తున్న వీరోచిత త్యాగాలను కొనియాడారు. అదే సమయంలో జాతీయవాదం, స్వేచ్ఛ అంటూ దేశంలో సృష్టిస్తున్న రభసను ప్రస్తావించారు. 'భారతదేశమే చనిపోతుంటే మనం బతికి ఏం ప్రయోజనం?' అన్న శీర్షికతో మోహన్‌లాల్ తాజాగా తన బ్లాగ్‌లో ఓ ఆర్టికల్ రాశారు. దేశ రక్షణలో భాగంగా సియాచిన్‌లో జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది జవాన్లు ప్రాణాలొదిలిన అంశాన్ని ఆయన ఈ ఆర్టికల్‌లో ప్రస్తావించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన లాన్స్ నాయక్ సుధీష్ భౌతికకాయాన్ని ఆయన నాలుగేళ్ల కూతురికి చూపిస్తున్న ఫొటోను చూసి తాను చలించిపోయానని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ దేశ పౌరులు ఇంట్లో సుఖంగా కూర్చొని స్వేచ్ఛ, జాతీయవాదాలపై లెక్చర్లు దంచడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. 'చలికాలం వస్తుందన్న సంకేతం రావడంతోనే మనం మందపాటి దుప్పట్లలో దూరిపోతాం. వేడినీళ్లతో పళ్లు తోముకొని స్నానం చేస్తాం. ఇలాంటి సౌకర్యాలన్నింటినీ అనుభవిస్తూ మనం కాలేజీలకు, కార్యాలయాలకు వెళ్లి మన సైనికుల గురించి చర్చిస్తాం. వారిని దుర్భాషలాడుతాం. వారిని ప్రశ్నిస్తాం. మన దేశమంటే మనం ఉండటానికి తిరగడానికి వీలైన ఈ నేల. మన తలపై ఉన్న ఆకాశం. మనం పీల్చే గాలి. మనం తాగే నీరు. మనం చనిపోయాక మనతో ఏకమయ్యే ఈ ఆరడుగుల నేల' అంటూ ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలతో తెరపైకి వచ్చిన జెఎన్యూ వివాదంపై ఆయన నేరుగా స్పందించలేదు. తాను దేశంలోని ప్రస్తుత పరిస్థితుల గురించి వ్యాఖ్యానించదలుచుకోలేదన్న మోహన్ లాల్.. తల్లిదండ్రులు తమ పిల్లలకు దేశమంటే, స్వేచ్ఛ అంటే ఏమిటో నిజమైన అర్థాన్ని వివరించాలని కోరారు. స్వేచ్ఛను గౌరవించడం ముఖ్యమే అయినా దానిని పొందేందుకు చెల్లించే మూల్యాన్ని కూడా గౌరవించాలని ఆయన పేర్కొన్నారు. -
పటియాల ఘటనపై మార్చి 10న విచారణ
న్యూఢిల్లీ: పటియాల కోర్టులో జేఎన్‌యూ వివాదం నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఇప్పటికే తమకు అన్ని విధాలైన నివేదికలు అందినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీటిపై మార్చి 10న విచారణ చేపడతామని తెలిపింది. రాజద్రోహం కేసులో జేఎన్‌యూ విద్యార్థి కన్హయ్య కుమార్ ను అరెస్టు చేసిన పోలీసులు అతడిని పటియాల కోర్టుకు తీసుకురాగా ఆ సమయంలో న్యాయవాదులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. అక్కడి విద్యార్థులపై యూనివర్సిటీ టీచర్లపై వాడులు దాడులు చేయగా అది పెద్ద సంచలమైంది. దీనిపై తమకు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు నివేదిక సమర్పించగా పలు ఆరోపణల పేరిట ఇంకొందరు పిటిషన్లు సమర్పించారు. -
కన్హయ్య విడుదలకు డిమాండ్
జాబల్ పూర్: రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ ను విడుదల చేయాలని జేడీ(యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్ డిమాండ్ చేశారు. కన్హయ్య అమాయకుడని, అతడిని వెంటనే విడుదల చేయాలని అన్నారు. అతడిని అక్రమంగా కేసులో ఇరికించినట్టు కడబడుతోందని పేర్కొన్నారు. 'జేఎన్ యూను మిని ఇండియా'గా వర్ణించారు. జేఎన్ యూలో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే కన్హయ్య కుమార్ విడుదల చేయాల్సిందేనని చెప్పారు. పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే కశ్మీర్ లో దేశవ్యతిరేక నినాదాలు నిత్యకృత్యంగా మారాయని అన్నారు. బిహార్ ఎన్నికల సమయంలో బీఫ్ వివాదాన్ని లేవనెత్తి ప్రజల మనోభావాలు దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. -
ఎఫ్బీ అకౌంట్ హ్యాక్ చేసి.. మార్ఫింగ్ ఫొటో పెట్టారు!
న్యూఢిల్లీ: దేశద్రోహం ఆరోపణలపై జైలుపాలైన జెఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్ ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చి.. దానిస్థానంలో సైనికులు జాతీయ జెండాను ఎగురవేస్తున్న ఫొటోను పెట్టారు. కన్హయ్యకుమార్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉండగా.. ఆయన ప్రొఫైల్ పిక్చర్‌ను శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అప్డేట్ చేసినట్టు చూపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయన ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేశారని భావిస్తున్న ఆయన మద్దతుదారులు ఈ వ్యవహారంపై ఢిల్లీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. జెఎన్యూ వివాదంలో 'దేశద్రోహం' ఆరోపణలపై అరెస్టయిన కన్హయ్యకుమార్ ఫేస్బుక్ ఖాతాలో జాతీయవాది ముద్రను కలిగించేందుకు దానిని హ్యాక్ చేసి మార్చినట్టు తెలుస్తున్నది. నిజానికి కన్హయ్య అకౌంట్లో సీపీఎం లోగో ముందు ఆయన నిలబడి ఉన్న ఫొటో ప్రొఫైల్ పిక్చర్‌గా ఉండేది. దీని స్థానంలో పెట్టిన భారత జాతీయ జెండా ఫొటో కూడా ఫొటోషాప్ చేసి మార్పులు చేసినది కావడం గమనార్హం. అమెరికా సైనికులు తమ దేశ జెండాను నిలబెడుతున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోను మార్ఫింగ్ చేసి.. కలర్ లో ఉన్న భారత జాతీయ జెండాను అమెరికా జెండా స్థానంలో ఉంచారు. కన్హయ్యకుమార్ అకౌంట్ హ్యాక్ చేసి.. ఈ ఫొటో పెట్టడంపై ఆయనకు మద్దతుదారులైన విద్యార్థులు మండిపడుతున్నారు. కన్హయ్యకుమార్ విడుదల చేయాలని ఆందోళన కొనసాగిస్తున్న వారు.. ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. -
ఢిల్లీ హైకోర్టుకు వెళ్లండి
కన్హయ్య బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు పిటిషన్ విచారణకు నిరాకరణ హైకోర్టులో పిటిషన్ వేసిన జేఎన్‌యూ విద్యార్థి నేత ♦ ‘జేఎన్‌యూ’పై కొనసాగుతున్న నిరసనలు; జైపూర్‌లో ఘర్షణలు ♦ రాష్ట్రపతిని కలిసిన లెఫ్ట్, జేడీయూ, ఆర్జేడీ, ఎన్సీపీ ఎంపీలు న్యూఢిల్లీ: రాజద్రోహం కేసుకు సంబంధించి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ బెయిల్ పిటిషన్‌ను విచారించేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. కింది కోర్టులను కాదని నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రమాదకర ధోరణికి దారి తీస్తుందంటూ.. ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. కన్హయ్య లాయర్లకు హైకోర్టులో తగిన భద్రత కల్పించాలని కేంద్రాన్ని, ఢిల్లీ పోలీసులను.. పిటిషన్‌ను సత్వరమే విచారణకు స్వీకరించాలని హైకోర్టును ఆదేశించింది. దాంతో, వెంటనే పోలీసుల రక్షణలో ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన కన్హయ్య న్యాయవాదులు అక్కడి రిజిస్ట్రార్ వద్ద బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సోమ, బుధవారాల్లో హింస చోటుచేసుకున్న పటియాలా హౌజ్ కోర్టుకు దగ్గరలోనే ఉన్న ఢిల్లీ హైకోర్టు పరిసరాల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. కన్హయ్య పిటిషన్లో కొన్ని సాంకేతిక లోపాలున్నాయని, వాటిని సరిదిద్దుతూ మరికొన్ని పత్రాలు అవసరమయ్యాయని హైకోర్టు వర్గాలు తెలిపాయి. పిటిషన్‌పై సోమవారం కానీ మంగళవారం కానీ విచారణ జరగొచ్చన్నాయి. విచారణ సందర్భంగా.. పటియాలా హౌజ్ కోర్టులో హింసకు పాల్పడిన బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మను అరెస్ట్ చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ‘సంతోషం, కనీసం ఆయన్నైనా అరెస్ట్ చేశారు’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. పటియాలా హౌజ్ కోర్టులో చోటు చేసుకున్న హింసపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్‌ను కూడా శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. కన్హయ్య న్యాయవాది చందర్ ఉదయ్ సింగ్ ఆరెస్సెస్‌ను తీవ్రవాద సంస్థగా పేర్కొనడంపై మరో లాయర్ ఆర్పీ లూథ్రా గట్టిగా అరుస్తూ అభ్యంతరం లేవనెత్తారు. జాతీయవాద సంస్థ అయిన ఆరెస్సెస్‌ను తీవ్రవాద సంస్థగా పేర్కొనడం ప్రజలను రెచ్చగొట్టడమేనని, ఆ పదాలను వెనక్కు తీసుకునేలా ఆ లాయర్‌ను ఆదేశించాలని..జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ ఏఎం సప్రేల ధర్మాసనాన్ని కోరారు. కాగా, కొన్ని పార్టీల చేతుల్లో కీలుబొమ్మగా మారిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ.. కన్హయ్యపై రాజద్రోహం కేసును ప్రభావితం చేస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కొనసాగుతున్న నిరసనలు.. జేఎన్‌యూ వివాదంపై దేశవ్యాప్తంగా పోటాపోటీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో లాయర్లు.. ముఖ్యంగా పటియాలా హౌజ్ కోర్టు న్యాయవాదులు ఇండియా గేట్ చుట్లూ మార్చ్ నిర్వహించారు. జాతీయ పతాకాన్ని చేతబట్టి, దేశ వ్యతిరేకులను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి పటియాలా హౌజ్ కోర్టులో హింసకు పాల్పడిన లాయర్లూ ఆ మార్చ్‌లో పాల్గొన్నారు. జైపూర్‌లోని రాజస్తాన్ వర్సిటీలో ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘాల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. జేఎన్‌యూని పరిరక్షించాలంటూ బెంగళూరులో సాహితీ వేత్త గిరీశ్ కర్నాడ్ నేతృత్వంలో సాహితీవేత్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. లెఫ్ట్ నిరసనలు.. ఆరెస్సెస్, బీజేపీలు తమపై దేశవ్యతిరేక ముద్ర వేయడాన్ని నిరసిస్తూ వచ్చేవారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడ్తామని వామపక్షాలు ప్రకటించాయి. ఆరు వామపక్షపార్టీల భేటీ అనంతరం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ఫిబ్రవరి 23 నుంచి 25 వరకు ధర్నాలు చేస్తామన్నారు. అనంతరం జేడీయూ, ఆర్జేడీ, ఎన్సీపీ ఎంపీలతో పాటు వామపక్ష ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి జేఎన్‌యూ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. కాగా, జేఎన్‌యూలో కన్హయ్య కు సంబంధించిన ప్రసంగ వీడియోలో మార్పులు చేశారని సోషల్ మీడియా ధ్వజమెత్తింది. కశ్మీర్ స్వాతంత్య్రానికి సంబంధించి కన్హయ్య నినాదాలు చేశారన్న అభిప్రాయం కలిగేలా.. వాస్తవ వీడియో టేప్‌నకు ఆడియో టేప్‌ను జత చేశారని ఆరోపించింది. ‘నిజానికి.. పేదరికం, ఫాసిజం, సంఘ్వాదం, భూస్వామ్యవాదం, పెట్టుబడిదారీ విధానం, బ్రాహ్మణిజం, అసమానతల నుంచి స్వాతంత్య్రం కావాలని కన్హయ్య నినదించారు’ అని పేర్కొంది. బీజేపీ, ఆరెస్సెస్‌లను వ్యతిరేకించడమే ఈ దేశంలో అతిపెద్ద నేరంగా మారిందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. ‘రేప్ చేయండి, హత్య చేయండి. కొట్టండి. ఎవరైనా ప్రశ్నిస్తే.. దేశ వ్యతిరేక నినాదాలు చేశాడు అందుకే శిక్షించామనండి. మిమ్మల్ని వదిలేస్తారు’ అని ట్వీట్ చేశారు. కాగా జాదవ్‌పూర్ వర్సిటీ దేశవ్యతిరేక నినాదాలకు సంబంధించి ఏ విద్యార్థిపైనా తాము ఎఫ్ఐఆర్ దాఖలు చేయబోమని వర్సిటీ వీసీ సురంజన్ దాస్ చెప్పారు. గిలానీకి బెయిల్ తిరస్కరణ రాజద్రోహం కేసులో అరెస్టయిన ఢిల్లీ వర్సిటీ మాజీ లెక్చరర్ ఎస్ఏఆర్ గిలానీకి బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు నిరాకరించింది. ఆయనపై అభియోగాలు తీవ్రమైనవని, ఒకవేళ విడుదల చేస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో ఈ నెల 10న నిర్వహించిన కార్యక్రమం ద్వారా ఆయన భారత ప్రభుత్వంపై ద్వేషం పెంచేందుకు యత్నించారని, రాజద్రోహానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. గిలానీ దర్యాప్తునకు సహకరించడం లేదని, సహ నిందితుల జాడ చెప్పడం లేదన్నారు. ‘సమాచార కమిషనర్’ జాబితా నుంచి బస్సీ ఔట్ న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ పేరును కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)లో సమాచార కమిషన్ పోస్టు జాబితా నుంచి కేంద్రం తొలగించింది. ప్రధానిమోదీసారథ్యంలోని ఎంపిక కమిటీ శుక్రవారం సమావేశమై ఆయన పేరును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. సమాచార కమిషనర్లుగా ముగ్గురి పేర్లను(డీవోపీటీ మాజీ కార్యదర్శి శ్యామల్సర్కార్, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి అనుప్ కే. పుజారి, సమాచార,-ప్రసార శాఖ మాజీ కార్యదర్శి బిమల్ జుల్కా) కమిటీ ఖరారు చేసింది. పటియాలా కోర్టులో కన్హయ్య కేసు విచారణ సందర్భంగా కోర్టు కాంప్లెక్స్‌లో అల్లరి మూకలు జర్నలిస్టులు, టీచర్లు, విద్యార్థులపై దాడిచేసిన ఘటనలో చర్యలు తీసుకోవడంలో బస్సీ విఫలమయ్యారని, ఆయన పేరును తొలగించాలని కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు, సామాజిక కార్యకర్తలు పట్టుబట్టినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. -
జేఎన్‌యూ సెగకు బస్సీ కీలక పదవి ఆవిరి!
న్యూఢిల్లీ: బీఎస్ బస్సీని వరించనున్న కీలకపదవికి జేఎన్‌యూ వివాదం తిలోదకాలిచ్చింది. తన ఉద్యోగ బాధ్యతలు ముగిసిన అనంతరం మరో ఉన్నత స్థానంలో కొనసాగాల్సిన ఆయనకు ఆ అవకాశం దక్కేలా కనిపించడం లేదు. జేఎన్‌యూ సమస్యను పరిష్కరించలేకపోవడం ఆయనను ఈ బాధ్యతలకు అందకుండా చేసినట్లు కీలక వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ పోలీసు బాస్‌గా విధులు నిర్వర్తిస్తున్న బస్సీ ఈ నెలాఖరున పదవీ బాధ్యతల నుంచి విరమణ పొందనున్నారు. అయితే, భారత సమాచార కేంద్ర కమిషన్ (సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్-సీఐసీ)లో ఉన్న మూడు కమిషనర్ ఖాళీల భర్తీ కోసం కమిటీ సిద్ధం చేసిన జాబితాలో బస్సీ పేరు కూడా చేర్చినట్లు తెలిసింది. అయితే, గతంలో కేజ్రీవాల్ తో గొడవలు పెట్టుకొని బీజేపీ ఏజెంట్ అనిపించుకోవడం, తాజాగా జేఎన్‌యూ వివాదంలో అతి చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగేలా వ్యవహరించినందుకు ప్రస్తుతం ఆ కమిటీ నుంచి బస్సీ పేరును పక్కకు పెట్టినట్లు తెలిసింది. సీఐసీ కమిషనర్ల నియామకం కోసం ఏర్పాటుచేసిన కమిటీకి అధ్యక్షుడిగా ప్రధాని నరేంద్రమోదీ ఉండగా సభ్యుడిగా ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే కూడా ఉన్నారు. -
సుప్రీంకోర్టులో కన్హయ్యకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లిన జేఎన్‌యూ విద్యార్థి కన్హయ్య కుమార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం కేసు ఉన్న పరిస్థితుల్లో తాము విచారణను కొనసాగించలేమంటూ తోసిపుచ్చింది. కిందిస్థాయి(హైకోర్టు)కు వెళ్లాలని ఆదేశించింది. దేశద్రోహం ఆరోపణల కిందట పోలీసులు జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి కన్హయ్య కుమార్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై తొలుత శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ కాసేపు కొనసాగింది. ఈ సందర్భంగా హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని సుప్రీంకోర్టు తొలుత కన్హయ్య తరుపు న్యాయవాదులను ప్రశ్నించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు, కన్హయ్య తరుపు న్యాయవాదుల మధ్య ఈ విధంగా వాదనలు జరిగాయి. ఈ కేసులో ప్రముఖ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరాబ్జీ, అడ్వకేట్ రాజు రామచంద్రన్ కోర్టులో వాదనలు వినిపించారు. ఆ వాదనలు ఏమిటంటే.. న్యాయవాదులు: 'రాజద్రోహం చట్టం అనేది వాయిలెన్స్‌కు దిగినట్లు స్పష్టంగా తెలిసినప్పుడు మాత్రమే మోపాల్సింది. అంతేగానీ, ఓ న్యాయవాదుల గుంపు అది రాజద్రోహమే అని భావించినంతమాత్రానా, నిందితుడిపై, అతడి తరుపు న్యాయవాదులపై దాడులు జరిగినంత మాత్రానా అతడు రాజద్రోహి కాదు. స్పష్టత లేకుండా రాజద్రోహం పెట్టకూడదు' సుప్రీంకోర్టు: మీరు ఎందుకు నేరుగా సుప్రీంకోర్టుకు బెయిల్ కోసం వచ్చారు? హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు? న్యాయవాదులు: పటియాల హౌజ్ కోర్టులో ఒక్క కన్హయ్యకే కాదు.. అతడి తరుపు న్యాయవాదులమైన తమకు కూడా ప్రాణభయం ఉంది. (ఈ సమయంలో సుప్రీంకోర్టు కోరిన మేరకు ఢిల్లీ పోలీసులు పటియాల హౌజ్ కోర్టులో జరిగిన పరిణామాలకు సంబంధించి నివేదిక సమర్పించారు) సుప్రీంకోర్టు: కేసు ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో విచారణకు స్వీకరించలేం.. కొనసాగించలేం.. మీకు తగిన కోర్టుకు వెళ్లండి. పోలీసులు కన్హయ్యకు రక్షణ కల్పించాలి. దీని ప్రకారం ప్రస్తుతం కన్హయ్య ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. -
'హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు?'
ఢిల్లీ: దేశద్రోహం ఆరోపణల కిందట పోలీసులు అరెస్టు చేసిన జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి కన్హయ్య కుమార్ బెయిర్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని సుప్రీంకోర్టు కన్హయ్యను ప్రశ్నించింది. బెయిల్ వ్యతిరేకించ వద్దని ఇప్పటికే పోలీసులు నిర్ణయించిన విషయం తెలిసిందే. మరికాసేపట్లో అతడికి బెయిల్ వస్తుందా రాదా అనే విషయం తెలియనుంది. -
'నా కొడుకు ఉగ్రవాది కాదు.. పాక్ వెళ్లడు'
న్యూఢిల్లీ: తన కుమారుడు ఉగ్రవాది కాదని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్డీ చదువుతున్న ఉమర్ ఖలీద్ తండ్రి అన్నారు. జేఎన్‌యూ భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతోపాటు ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుగా కార్యక్రమాలు నిర్వహించారనే ఆరోపణలతో పోలీసులు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ మరో 15మంది యువతులపై కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా కన్హయ్యను అరెస్టు చేయగా ఖలీద్ ఇంకా దొరకలేదు. అతడు ఉగ్రవాదేనని, పాకిస్థాన్‌కు పారిపోయి ఉంటాడని పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఖలీద్ తండ్రి స్పందించాడు. 'నా కుమారుడు ఉగ్రవాది కాదు. అతడు అసలు పాకిస్థాన్ వెళ్లనే లేదు. అతడివద్ద పాస్ పోర్ట్ కూడా లేదు. నేను అతడికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడున్నా బయటకు రావాలని.. విచారణ ఎదుర్కోవాలని. నాకు ఈ భారత న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. నేను అతడి భద్రత గురించే భయపడుతున్నాను' అని చెప్పాడు. -
‘జేఎన్‌యూ’పై నిరసనల హోరు
ఢిల్లీలో భారీ ర్యాలీ; వేలాదిగా పాల్గొన్న విద్యార్థులు, జర్నలిస్టులు, పౌర సమాజం న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదం తీవ్రమవుతోంది. జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య అరెస్ట్‌కు అనుకూలంగా, వ్యతిరేకంగా ఢిల్లీసహా పలు నగరాలు, పట్టణాల్లో గురువారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. కన్హయ్యకుమార్ విచారణ సందర్భంగా ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టులో నెలకొన్న పరిస్థితి అసాధారణమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అక్కడి హింసాత్మక ఘటనలపై తమ నివేదికను సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ల బృందం గురువారం జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనానికి అందించింది. పటియాలా కోర్టు ఘటనలో పోలీసుల వ్యవహార తీరుపై ఆ బృందంలోని సభ్యుడు, సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ అనుమానం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడినవారితో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తిహార్ జైలులో తన ప్రాణాలకు ముప్పుందని బెయిల్ అభ్యర్థనతో కన్హయ్య సుప్రీంకోర్టు తలుపుతట్టారు. దానిపై నేడు విచారణ జరగనుంది. హెచ్‌సీయూ టు జేఎన్‌యూ రాజద్రోహం కేసులో అరెస్టైన కన్హయ్యను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వేలాదిగా విద్యార్థులు, జర్నలిస్టులు, అధ్యాపకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, పౌర సమాజం సభ్యులు.. ఢిల్లీలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ‘లాంగ్ లివ్ జేఎన్‌యూ’, ‘కన్హయ్య.. వి ఆర్ విత్ యూ’, ‘హెచ్‌సీయూ టు జేఎన్‌యూ’ అని నినాదాలు చేస్తూ వేలాదిగా నిరసనకారులు మండీ హౌజ్ సర్కిల్ నుంచి జంతర్‌మంతర్ వరకు కదం తొక్కారు. జేఎన్‌యూలో పోలీస్ యాక్షన్‌ను నిరసిస్తూ, మోదీ సర్కారును విమర్శిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రముఖ జర్నలిస్ట్ సాయినాథ్, ఎన్ఎస్డీ మాజీ డెరైక్టర్ అనురాధా కపూర్ సహా జేఎన్‌యూ, ఢిల్లీ వర్సిటీ, అంబేడ్కర్ వర్సిటీల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, కళాకారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హైదరాబాద్ సహా పలు నగరాలు, పట్టణాల్లో పలు వర్సిటీల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ప్రతిగా ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో ఎబీవీపీ కార్యకర్తలు జాతివ్యతిరేకులను శిక్షించాలంటూ ప్రదర్శనలు చేపట్టారు. చెన్నైలో కన్హయ్యకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన తమిళ జానపద గాయకుడు కోవన్ సహా 57 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హెచ్‌సీయూలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి, నిరసన ప్రదర్శన నిర్వహించారు. పట్నాలో బీజేపీ కార్యకర్తలకు, సీపీఐ విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్, ఆర్జేడీ యువజన విభాగం కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. ‘పటియాలా’ హింస అసాధారణం పటియాలా హౌజ్ కోర్టులో బుధవారం చోటు చేసుకున్న హింస అసాధారణమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అక్కడ శాంతిభద్రతల పరిస్థితిపై తాము దృష్టి పెట్టామంది. పటియాలా కోర్టులో బుధవారం లాయర్ల రౌడీయిజంపై తాము రూపొందించిన నివేదికను సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ల కమిటీ సీల్డ్ కవర్లో జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ ఏఎం సప్రేల ధర్మాసనానికి అందించింది. అయితే, సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, దుష్యంత్ దవే, హరేన్ రావల్, ప్రశాంత్ భూషణ్‌లు ఆ నివేదికపై సంతకం చేయగా..నివేదికను చదివిన తరువాతే సంతకం చేస్తానని కమిటీలో సభ్యుడైన ఢిల్లీ పోలీస్ తరఫు న్యాయవాది అజిత్ కే సిన్హా చెప్పారు. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కన్హయ్య కేసును కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించాలన్న పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరపనుంది. ‘తమ కళ్లముందే దాడి చేసిన వ్యక్తి కనిపిస్తుంటే అరెస్ట్ చేయకుండా వదిలేయడం కుమ్మక్కు కావడం కాదా?’ అని రాజీవ్ ధావన్ మీడియాతో అన్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా తిహార్ జైళ్లో ఉన్న కన్హయ్య కుమార్. కాగా, హింసకు పాల్పడిన లాయర్లను గుర్తించి, వారి లెసైన్సులను రద్దు చేస్తామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. బీజేపీ ఎమ్మెల్యే శర్మ అరెస్ట్.. పటియాలా కోర్టులో హింసలో పాలుపంచుకున్న బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. 8 గంటల పాటు ప్రశ్నించి, తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. కోర్టులో దాడులకు దిగిన విక్రమ్ సింగ్ చౌహాన్ సహా ముగ్గురు లాయర్లకు పోలీసులు సమన్లు జారీ చేసినప్పటికీ.. వారు గురువారం వరకు పోలీసుల ముందు హాజరుకాలేదు. కాగా, అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా జేఎన్‌యూలో జరిగిన కార్యక్రమానికి సంబంధించి ఒక హిందీ వార్తాచానెల్ ప్రసారం చేసిన కథనం ఆధారంగానే పోలీసులు కన్హయ్యపై కేసు నమోదు చేశారని సమాచారం. రౌడీ లాయర్‌కు సన్మానం సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. పటియాలా హౌజ్ కోర్టులో విచ్చలవిడి దాడులకు పాల్పడి, స్వేచ్ఛగా తిరుగుతున్న న్యాయవాది విక్రమ్ సింగ్ చౌహాన్‌ను ఢిల్లీ జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘం గురువారం సన్మానించింది. విక్రమ్ సింగ్ చౌహాన్ ప్రతినిధిగా ఉన్న కర్కర్దూమా కోర్టు బార్ అసోసియేషన్ ఆయనను పూలమాలతో సత్కరించింది. పటియాలా కోర్టులో హింసకు పాల్పడింది తమవారు కాదని, నల్ల కోట్లు వేసుకుని వచ్చిన బయటివ్యక్తులని పేర్కొంది. కొడుకుపై కక్షగట్టారు బిహార్‌లోని బిహత్ గ్రామంలో నివసిస్తున్న కన్హయ్య కుమార్ కుటుంబసభ్యులకు స్థానిక పోలీసులు భద్రత కల్పించారు. అయితే, తమకు కల్పించిన భద్రతను కన్హయ్య కుమార్ తండ్రి జైశంకర్ సింగ్ తిరస్కరించారు. జేఎన్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ అభ్యర్థిని ఓడించినందుకే తన కుమారుడిపై బీజేపీ, ఆరెస్సెస్‌లు కక్షకట్టాయని ఆయన ఆరోపించారు. కన్హయ్యకుమార్ టైస్ట్ కాదని తేలుతుందని, అయితే ఈ లోపే కస్టడీలో ఉన్న తన కొడుకు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని కన్హయ్య తల్లి మీనాదేవి ప్రశ్నించారు. కన్హయ్యకు చరిత్రకారుల మద్దతు న్యూఢిల్లీ: జేఎన్‌యూలో జరుగుతున్న ఆందోళనలకు చరిత్రకారులు, రచయితలు, కళాకారులు మద్దతు ప్రకటించారు. వర్సిటీ విద్యార్థి నేత కన్హయ్యపై రాజద్రోహం కేసు పెట్టడం అన్యాయమని రోమిలా థాపర్, జీత్ థాయిల్ వంటి ప్రముఖులు విమర్శించారు. విద్యాసంస్థల్లో వివాదాలను చర్చ ల ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు. కన్హయ్య విడుదలకు డిమాండ్ చేస్తూ.. దాదాపు 9వేల మంది కళాకారులు, చరిత్రకారులు, రచయితలు ఓ పిటిషన్‌పై సంతకం చేశారు. మరోవైపు జేఎన్‌యూలో పోలీసు చర్యను ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జితోపాటు యూకేలోని 8 ప్రముఖ వర్సిటీలు ఖండించాయి. జేఎన్‌యూలో ర్యాలీకి పలువురు కన్హయ్య చిత్రం ఉన్న టీ-షర్టులను వేసుకుని వచ్చారు. అటు పటియాలా కోర్టులో ఘర్షణకు దిగిన విక్రమ్ సింగ్ చౌహాన్ అనే న్యాయవాదిని కొందరు లాయర్లు సన్మానించటాన్ని ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్టు బార్ అసోసియేషన్ ఖండించింది. కాగాయూట్యూబ్లో జర్మనీకి చెందిన జేఎన్‌యూ విద్యార్థి సిల్వీ గిటారు వాయిస్తూ.. ‘మమ్మల్ని ఎంతగా అణిచేయాలని చూస్తే.. మా గొంతులు అంతలా నినదిస్తాయి. విఆర్ జేఎన్‌యూ’ అని ఆలపించిన గీతం వైరల్‌లా విస్తరించింది. అటు, భారతదేశంలో విషం చిమ్ముతున్న లష్కర్ చీఫ్ హఫీజ్ తోపాటు లష్కరే, జమాత్-ఉద్-దవాకు సంబంధించిన ట్విటర్ అకౌంట్‌ను ఆపేయాలని నిఘా వర్గాలు.. ట్విటర్ ఇండియాను కోరనున్నాయి. -
కన్హయ్య కుమార్ ను రక్షించనున్న అసలు వీడియో
న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ దేశద్రోహానికి పాల్పడ్డారనడానికి ఇదిగో సాక్ష్యం అంటూ న్యూస్ ఎక్స్, ఇండియా న్యూస్ ఛానళ్లు బుధవారం ప్రసారం చేసిన వీడియోను ఉద్దేశపూర్వకంగా తమకు అనుకూలంగానే ఎడిట్ చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. ‘ఆజాది (స్వేచ్ఛ), లేకే రహెంగే ఆజాది’ కుమార్ అన్న పదాలను ఈ ఛానళ్లు వక్రీకరించాయని ఏబీపి న్యూస్ ఛానెల్ వెల్లడించి, అసలు వీడియోను ప్రసారం చేసింది. ‘ఆకలి నుంచి స్వేచ్ఛ (ఆజాది) కావాలి. సంఘ్వాది (ఆరెస్సెస్) నుంచి స్వేచ్ఛ కావాలి. భూస్వామం, పెట్టుబడిదారి విధానం, బ్రాహ్మణిజం, మనుయిజం నుంచి స్వేచ్ఛ కావాలి’ అని కన్హయ్య కుమార్ నినదించినట్లు అసలు వీడియోలో ఉంది. ఇప్పుడు ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. తొందరపడి ఎడిట్ చేసిన వీడియోను ప్రసారం చేసిన నెటిజన్లు కొందరు ఆ వీడియోను తొలగించడమే కాకుండా క్షమాపణలు కూడా చెప్పారు. క్షమాపణ చెప్పిన వారిలో స్వరాజ్య కాలమిస్ట్ రూపా సుబ్రమణ్యం కూడా ఉన్నారు. దీనికి ఢిల్లీ పోలీసులు కన్హయ కుమార్‌కు క్షమాపణలు చెప్పాలని సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. ఇక కుమార్ పట్ల ఢిల్లీ పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తారని మరో సీనియర్ జర్నలిస్ట్ బర్ఖాదత్ అన్నారు. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం గురువారం సమర్పించిన నివేదికలో అసలు కన్హయ్య కుమార్ పేరే లేదని తెల్సింది. అఫ్జల్ గురు సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ కార్యకర్త ఉమర్ ఖలీద్, మరికొంత మంది సహచరులు కలిసి అఫ్జల్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 18 విశ్వ విద్యాలయాల్లో నిర్వహించాలని ప్లాన్ వేసినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలో పేర్కొన్నారని, కన్హయ్య కుమార్ పేరును మాట మాత్రంగా కూడా ఎక్కడ ప్రస్తావించలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
కన్హయ్య కుమార్‌పై 'దేశద్రోహం' ఎత్తివేత!
న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్పై మోపిన దేశద్రోహం అభియోగాలను ఎత్తివేసే అవకాశముందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తున్నది. ఆయనపై విధించిన దేశద్రోహం అభియోగాలకు మద్దతుగా ఇప్పటివరకు ఎలాంటి బలమైన ఆధారాలు లభించలేదని కేంద్ర హోంశాఖకు చెందిన వర్గాలు తెలిపాయి. మరోవైపు ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి కార్యాలయానికి జేఎన్‌యూ వ్యవహారంపై నివేదించారు. కన్హయ్య కుమార్‌కు ఇప్పటివరకు క్లీన్చిట్ ఇవ్వలేదని, ఆయనకు వ్యతిరేకంగా తమ వద్ద గట్టి ఆధారాలు ఉన్నాయని బస్సీ మీడియాకు చెప్తున్నారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా జరిగిన కార్యక్రమంలో జాతివ్యతిరేక నినాదాలు చేయడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. అయితే తాను ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని, అఫ్జల్ గురుకు ఎప్పుడూ మద్దతు తెలుపలేదని కన్హయ్యకుమార్ స్పష్టంచేశారు. భారత రాజ్యాంగంపై తనకు అపారమైన నమ్మకముందని, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడలేదని ఆయన వివరణ ఇచ్చారు. దేశద్రోహం కేసులో ఢిల్లీ కోర్టు ఆయనకు మార్చి 2వతేదీవరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. -
'ప్రధాని ఇంకా సొంత రాష్ట్రం మోజులోనే ఉన్నారు'
ముంబై: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ గుజరాత్ పైనే ఇష్టంతో ఉన్నారని, ఆయన దేశం మొత్తానికి ప్రధానిగా కనపించడం లేదంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. జాతీయత, జాతి అంటూ బీజేపీ ఇచ్చే సర్టిఫికెట్లు ఎవ్వరికీ అవసరం లేవని అభిప్రాయపడ్డారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వివాదంలో కేంద్ర జోక్యం అనవసరమని సూచించారు. సర్టిఫికెట్లు ఇవ్వకూడదంటూ బీజేపీ నేతలకు ఆయన సూచించారు. జేఎన్‌యూలో జరిగిన అంశంపై మరింత దుమారం రేపాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోకూడదని, ఇది ఏబీవీపీ కి మార్గం ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తుందన్నారు. ఎవరు జాతీయవాది.. ఎవరు జాతి వ్యతిరేకులో బీజేపీ తేల్చాల్సిన గత్యంతరం లేదంటూ విమర్శించారు. ముంబైలో ఈ నెలలో జరిగిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ.. కార్యక్రమాల నిర్వహణపైనే బీజేపీ దృష్టిపెట్టిందని చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి పనులు ముందుగు సాగలేదని.. ప్రతి రెండు నెలలకు ప్రధాని ఓ కార్యక్రమం అంటూ ప్రజలు ముందుకు వస్తారని రాజ్ ఠాక్రే విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా ఉద్దేశం ఏంటో అర్ధం కావడం లేదని, ఢిల్లీలో జరపకుండా ఈ వేడుకలు ముంబైలో ఎందుకు చేస్తున్నారో తనకు అర్ధం కావడం లేదన్నారు.