ఢిల్లీ హైకోర్టుకు వెళ్లండి
కన్హయ్య బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు
పిటిషన్ విచారణకు నిరాకరణ
హైకోర్టులో పిటిషన్ వేసిన జేఎన్‌యూ విద్యార్థి నేత
♦ ‘జేఎన్‌యూ’పై కొనసాగుతున్న నిరసనలు; జైపూర్‌లో ఘర్షణలు
♦ రాష్ట్రపతిని కలిసిన లెఫ్ట్, జేడీయూ, ఆర్జేడీ, ఎన్సీపీ ఎంపీలు
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసుకు సంబంధించి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ బెయిల్ పిటిషన్‌ను విచారించేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. కింది కోర్టులను కాదని నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రమాదకర ధోరణికి దారి తీస్తుందంటూ.. ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. కన్హయ్య లాయర్లకు హైకోర్టులో తగిన భద్రత కల్పించాలని కేంద్రాన్ని, ఢిల్లీ పోలీసులను.. పిటిషన్‌ను సత్వరమే విచారణకు స్వీకరించాలని హైకోర్టును ఆదేశించింది. దాంతో, వెంటనే పోలీసుల రక్షణలో ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన కన్హయ్య న్యాయవాదులు అక్కడి రిజిస్ట్రార్ వద్ద బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా సోమ, బుధవారాల్లో హింస చోటుచేసుకున్న పటియాలా హౌజ్ కోర్టుకు దగ్గరలోనే ఉన్న ఢిల్లీ హైకోర్టు పరిసరాల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. కన్హయ్య పిటిషన్‌లో కొన్ని సాంకేతిక లోపాలున్నాయని, వాటిని సరిదిద్దుతూ మరికొన్ని పత్రాలు అవసరమయ్యాయని హైకోర్టు వర్గాలు తెలిపాయి. పిటిషన్‌పై సోమవారం కానీ మంగళవారం కానీ విచారణ జరగొచ్చన్నాయి. విచారణ సందర్భంగా.. పటియాలా హౌజ్ కోర్టులో హింసకు పాల్పడిన బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మను అరెస్ట్ చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ‘సంతోషం, కనీసం ఆయన్నైనా అరెస్ట్ చేశారు’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. పటియాలా హౌజ్ కోర్టులో చోటు చేసుకున్న హింసపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్‌ను కూడా శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది.
కన్హయ్య న్యాయవాది చందర్ ఉదయ్ సింగ్ ఆరెస్సెస్‌ను తీవ్రవాద సంస్థగా పేర్కొనడంపై మరో లాయర్ ఆర్‌పీ లూథ్రా గట్టిగా అరుస్తూ అభ్యంతరం లేవనెత్తారు. జాతీయవాద సంస్థ అయిన ఆరెస్సెస్‌ను తీవ్రవాద సంస్థగా పేర్కొనడం ప్రజలను రెచ్చగొట్టడమేనని, ఆ పదాలను వెనక్కు తీసుకునేలా ఆ లాయర్‌ను ఆదేశించాలని..జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ ఏఎం సప్రేల ధర్మాసనాన్ని కోరారు. కాగా, కొన్ని పార్టీల చేతుల్లో కీలుబొమ్మగా మారిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ.. కన్హయ్యపై రాజద్రోహం కేసును ప్రభావితం చేస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
కొనసాగుతున్న నిరసనలు.. జేఎన్‌యూ వివాదంపై దేశవ్యాప్తంగా పోటాపోటీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో లాయర్లు.. ముఖ్యంగా పటియాలా హౌజ్ కోర్టు న్యాయవాదులు ఇండియా గేట్ చుట్లూ మార్చ్ నిర్వహించారు. జాతీయ పతాకాన్ని చేతబట్టి, దేశ వ్యతిరేకులను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి పటియాలా హౌజ్ కోర్టులో హింసకు పాల్పడిన లాయర్లూ ఆ మార్చ్‌లో పాల్గొన్నారు. జైపూర్‌లోని రాజస్తాన్ వర్సిటీలో ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘాల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. జేఎన్‌యూని పరిరక్షించాలంటూ బెంగళూరులో సాహితీ వేత్త గిరీశ్ కర్నాడ్ నేతృత్వంలో సాహితీవేత్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
లెఫ్ట్ నిరసనలు.. ఆరెస్సెస్, బీజేపీలు తమపై దేశవ్యతిరేక ముద్ర వేయడాన్ని నిరసిస్తూ వచ్చేవారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడ్తామని వామపక్షాలు ప్రకటించాయి. ఆరు వామపక్షపార్టీల భేటీ అనంతరం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ఫిబ్రవరి 23 నుంచి 25 వరకు ధర్నాలు చేస్తామన్నారు. అనంతరం జేడీయూ, ఆర్జేడీ, ఎన్సీపీ ఎంపీలతో పాటు వామపక్ష ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి జేఎన్‌యూ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. కాగా, జేఎన్‌యూలో కన్హయ్య కు సంబంధించిన ప్రసంగ వీడియోలో మార్పులు చేశారని సోషల్ మీడియా ధ్వజమెత్తింది. కశ్మీర్ స్వాతంత్య్రానికి సంబంధించి కన్హయ్య నినాదాలు చేశారన్న అభిప్రాయం కలిగేలా.. వాస్తవ వీడియో టేప్‌నకు ఆడియో టేప్‌ను జత చేశారని ఆరోపించింది. ‘నిజానికి.. పేదరికం, ఫాసిజం, సంఘ్‌వాదం, భూస్వామ్యవాదం, పెట్టుబడిదారీ విధానం, బ్రాహ్మణిజం, అసమానతల నుంచి స్వాతంత్య్రం కావాలని కన్హయ్య నినదించారు’ అని పేర్కొంది. బీజేపీ, ఆరెస్సెస్‌లను వ్యతిరేకించడమే ఈ దేశంలో అతిపెద్ద నేరంగా మారిందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. ‘రేప్ చేయండి, హత్య చేయండి. కొట్టండి. ఎవరైనా ప్రశ్నిస్తే.. దేశ వ్యతిరేక నినాదాలు చేశాడు అందుకే శిక్షించామనండి. మిమ్మల్ని వదిలేస్తారు’ అని ట్వీట్ చేశారు. కాగా జాదవ్‌పూర్ వర్సిటీ దేశవ్యతిరేక నినాదాలకు సంబంధించి ఏ విద్యార్థిపైనా తాము ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయబోమని వర్సిటీ వీసీ సురంజన్ దాస్ చెప్పారు.
గిలానీకి బెయిల్ తిరస్కరణ
రాజద్రోహం కేసులో అరెస్టయిన ఢిల్లీ వర్సిటీ మాజీ లెక్చరర్ ఎస్‌ఏఆర్ గిలానీకి బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు నిరాకరించింది. ఆయనపై అభియోగాలు తీవ్రమైనవని, ఒకవేళ విడుదల చేస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో ఈ నెల 10న నిర్వహించిన కార్యక్రమం ద్వారా ఆయన భారత ప్రభుత్వంపై ద్వేషం పెంచేందుకు యత్నించారని, రాజద్రోహానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. గిలానీ దర్యాప్తునకు సహకరించడం లేదని, సహ నిందితుల జాడ చెప్పడం లేదన్నారు.
‘సమాచార కమిషనర్’ జాబితా నుంచి బస్సీ ఔట్
న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ పేరును కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)లో సమాచార కమిషన్ పోస్టు జాబితా నుంచి కేంద్రం తొలగించింది. ప్రధానిమోదీసారథ్యంలోని ఎంపిక కమిటీ శుక్రవారం సమావేశమై ఆయన పేరును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. సమాచార కమిషనర్లుగా ముగ్గురి పేర్లను(డీవోపీటీ మాజీ కార్యదర్శి శ్యామల్‌సర్కార్, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి అనుప్ కే. పుజారి, సమాచార,-ప్రసార శాఖ మాజీ కార్యదర్శి బిమల్ జుల్కా) కమిటీ ఖరారు చేసింది. పటియాలా కోర్టులో కన్హయ్య కేసు విచారణ సందర్భంగా కోర్టు కాంప్లెక్స్‌లో అల్లరి మూకలు జర్నలిస్టులు, టీచర్లు, విద్యార్థులపై దాడిచేసిన ఘటనలో చర్యలు తీసుకోవడంలో బస్సీ విఫలమయ్యారని, ఆయన పేరును తొలగించాలని కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు, సామాజిక కార్యకర్తలు పట్టుబట్టినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.