సుప్రీంకోర్టులో కన్హయ్యకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టుకు వెళ్లిన జేఎన్యూ విద్యార్థి కన్హయ్య కుమార్కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం కేసు ఉన్న పరిస్థితుల్లో తాము విచారణను కొనసాగించలేమంటూ తోసిపుచ్చింది. కిందిస్థాయి(హైకోర్టు)కు వెళ్లాలని ఆదేశించింది. దేశద్రోహం ఆరోపణల కిందట పోలీసులు జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి కన్హయ్య కుమార్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్ పై తొలుత శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ కాసేపు కొనసాగింది. ఈ సందర్భంగా హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని సుప్రీంకోర్టు తొలుత కన్హయ్య తరుపు న్యాయవాదులను ప్రశ్నించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు, కన్హయ్య తరుపు న్యాయవాదుల మధ్య ఈ విధంగా వాదనలు జరిగాయి. ఈ కేసులో ప్రముఖ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరాబ్జీ, అడ్వకేట్ రాజు రామచంద్రన్ కోర్టులో వాదనలు వినిపించారు.
ఆ వాదనలు ఏమిటంటే..
న్యాయవాదులు: 'రాజద్రోహం చట్టం అనేది వాయిలెన్స్కు దిగినట్లు స్పష్టంగా తెలిసినప్పుడు మాత్రమే మోపాల్సింది. అంతేగానీ, ఓ న్యాయవాదుల గుంపు అది రాజద్రోహమే అని భావించినంతమాత్రానా, నిందితుడిపై, అతడి తరుపు న్యాయవాదులపై దాడులు జరిగినంత మాత్రానా అతడు రాజద్రోహి కాదు. స్పష్టత లేకుండా రాజద్రోహం పెట్టకూడదు'
సుప్రీంకోర్టు: మీరు ఎందుకు నేరుగా సుప్రీంకోర్టుకు బెయిల్ కోసం వచ్చారు? హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
న్యాయవాదులు: పటియాల హౌజ్ కోర్టులో ఒక్క కన్హయ్యకే కాదు.. అతడి తరుపు న్యాయవాదులమైన తమకు కూడా ప్రాణభయం ఉంది. (ఈ సమయంలో సుప్రీంకోర్టు కోరిన మేరకు ఢిల్లీ పోలీసులు పటియాల హౌజ్ కోర్టులో జరిగిన పరిణామాలకు సంబంధించి నివేదిక సమర్పించారు)
సుప్రీంకోర్టు: కేసు ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో విచారణకు స్వీకరించలేం.. కొనసాగించలేం.. మీకు తగిన కోర్టుకు వెళ్లండి. పోలీసులు కన్హయ్యకు రక్షణ కల్పించాలి.
దీని ప్రకారం ప్రస్తుతం కన్హయ్య ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది.