'అనుక్షణం భయపడుతూనే ఉన్నాం'
న్యూఢిల్లీ: దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై రాజద్రోహం కేసులో జైలు నుంచి విడుదల అయినప్పటి నుంచి తాము ఎంతో భయభ్రాంతులకు గురవుతున్నట్లు జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ వెల్లడించాడు. తనతో పాటు ఈ కేసులో అరెస్టయిన తన సహచరులు అనిర్బన్ భట్టాచార్య, కన్హయ్య కుమార్ లకు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారని శనివారం న్యూఢిల్లీలో మీడియాతో చెప్పాడు. హిందుత్వ గ్రూపులు, సంస్థలు తమపై దాడులు చేసేందుకు పథకాలు పన్నాయని, ఏ సమయంలో ఏం జరగుతుందోనని ఇప్పటికీ తాము ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నాడు. అప్పటినుంచి స్వేచ్ఛను కోల్పోతున్నట్లు అనిపిస్తుందన్నాడు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) ఈ విషయంలో కొత్త జిత్తులు వేయాలని చూస్తోందని, కానీ తీరు మాత్రం 'కొత్త సీసాలో పాతసారా' అనే విధంగా ఉందని ఎద్దేవా చేశాడు. జాతీయవాదం అంటే దేశంలో ప్రస్తుతం జరగుతున్నది కాదని, గతంలో ఇలాంటి పేర్లతోనే ప్రపంచ దేశాలలో ఎన్నో దుష్ప్రరిణామాలు జరిగాయని అన్నాడు. భారత్, పాకిస్తాన్ ల మధ్య కశ్మీర్ సమస్య ఎప్పటినుంచో ఉందని అయితే ఈ రెండు దేశాలు ఎప్పుడూ శాంతియుతంగా సమస్యను పరిస్కరించుకోవని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఉమర్ ఖలీద్, భట్టాచార్య లకు ఢిల్లీ అదనపు సెషన్స్ న్యాయస్థానం ఆరు నెలల మధ్యంతర బెయిలును మంజూరు చేసిన విషయం తెలిసిందే.