అది దేశద్రోహం కాక మరేమిటి? | JNU row: interview with RSS leader Bhagaiah | Sakshi
Sakshi News home page

అది దేశద్రోహం కాక మరేమిటి?

Published Wed, Mar 23 2016 2:38 AM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

అది దేశద్రోహం కాక మరేమిటి?

అది దేశద్రోహం కాక మరేమిటి?

దేశభక్తి మా ఒక్కరి సొంతమని తాము ఏనాడూ అహంకరించలేదని చెప్పారు ఆరెస్సెస్ సహసర్‌కార్యవాహ్ (ఆలిండియా జాయింట్ జనరల్ సెక్రటరీ) భాగయ్య. కానీ అఫ్జల్‌గురును శ్లాఘించడం దేశద్రోహమేనని అన్నారు. రోహిత్ వేముల ఆత్మహత్య బాధాకరం, అదే సమయంలో యాకూబ్ మెమెన్‌కు అనుకూలంగా విద్యార్థులు నినదించడానికి దారి తీసిన పరిస్థితులను, అందుకు ప్రేరేపించిన వారిని కనిపెట్టాలని కోరారు. భాగయ్య ఇంటర్వ్యూలో కొన్ని అంశాలు.
 
ప్రశ్న: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం పరిణామాల తరువాత మొదలైన చర్చ గురించి ఏమంటారు?
జవాబు: జేఎన్‌యూలో సాంస్కృతిక ఉత్సవం పేరుతో భారత వ్యతిరేక నినాదాలు చేయడం, దేశం ముక్కలయ్యే వరకు సంఘర్షణ కొనసాగుతుందని చెప్పడం, జుడీషియల్ కిల్లింగ్స్ పేరుతో అఫ్జల్‌గురు, మక్బూల్ భట్‌లని సమర్థించడం దేశద్రోహమే. దేశమంతా ఇలాగే భావిస్తోంది కూడా. ఈ అంశాలన్నింటి మీద సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నా పట్టించుకోకపోవడం మావోయిస్టుల విధానం. జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్, ఎస్‌ఎఫ్‌ఐ, అలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఇవన్నీ భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో దేశ ద్రోహానికి పాల్పడు తున్నాయి. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. ఆక్రమిత కశ్మీర్ భూభాగాన్ని తిరిగి తీసుకోవాలని పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇది దేశభక్తి. సామ్రా జ్యవాదంతో భారత్ కశ్మీర్‌ను దురాక్రమించిందని చెప్పడం దేశద్రోహమే. ఇదంతా దేశ సమగ్రతకు భంగకరం. దీనిని ఆరెస్సెస్ సహించదు.

ప్ర: ఆరెస్సెస్‌తో విభేదిస్తే దేశద్రోహ ముద్ర వస్తోందన్న విమర్శ ఉంది.
జ: దేశభక్తి అంటే మాదే అని మేం ఎప్పుడూ అహంకరించలేదు. గుత్తాధిపత్యం ప్రకటించుకోలేదు. ఈ దేశంలో చాలామంది దేశభక్తులు ఉన్నారు. వారంతా స్వయం సేవకులని మేం చెప్పలేదు. స్వతంత్ర కశ్మీర్, ఇండియా గో బ్యాక్ అనడం; కార్గిల్ యుద్ధ సమయంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం, దంతేవాడలో 76 మంది జవాన్లను మావోయిస్టులు దుర్మార్గంగా హత్యచేస్తే ఒక రాత్రంతా ఉత్సవం జరుపుకోవడం జేఎన్‌యూకే సాధ్యం. అది దేశద్రోహమే.

ప్ర: సాధారణంగా వినిపించే విమర్శ - తనతో ఏకీభవించనివారిని దేశద్రోహులుగా పేర్కొంటున్న బీజేపీ కశ్మీర్‌లో వేర్పాటువాదులను బాహాటంగా సమర్థించే పీడీపీతో ఎందుకు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది? మళ్లీ ఎందుకు ప్రయత్నిస్తున్నది?
జ: ఇది పూర్తిగా బీజేపీకి సంబంధించిన వ్యవహారం. వారినే అడగాలి.

ప్ర: భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లిందన్న ఆరోపణ గురించి ఏమంటారు?
జ: అభిప్రాయ భేదం వేరు. ద్వేషం వేరు. ఆరెస్సెస్, బీజేపీ సహా ఏ సంస్థ సిద్ధాంతంతో అయినా విభేదించే హక్కు ఈ దేశ ప్రజలకు ఉంది. వాటికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. తప్పులేదు. కానీ ఈ సంస్థలను అడ్డం పెట్టుకుని దేశాన్ని ముక్కలు చేస్తాం అనే వరకు వెళ్లడం ఏమిటి? దీనికేనా భావ ప్రకటనా స్వేచ్ఛ అని పేరు? అసలు భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఇక్కడ జరుగుతున్న దేశ వ్యతిరేక కార్యకలాపాలను దేశం విస్తుపోయి చూస్తోంది. అరుంధతీరాయ్ మానవ హక్కుల రక్షణ పేరుతో భద్రతా దళాల హత్యను సమర్థించి, దానికి భావ ప్రకటనా స్వేచ్ఛ అని పేరుపెడుతున్నారు. ఇలాంటి ధోరణులకు ఒక వర్గం మీడియా రకరకాల పేర్లు పెట్టి సమర్థించడం ఇంకా దురదృష్టకరం. దీనితో మీడియా విశ్వసనీయత తగ్గుతోంది. ఏ వార్త వచ్చినా సోషల్ మీడియాలో చూసుకుని గాని ప్రజలు నిర్ధారణకు రాలేని పరిస్థితి తెచ్చారు. జేఎన్‌యూ విద్యార్థుల బెయిల్ పిటిషన్ వాదనల సమయంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు గుర్తుకు తెచ్చు కోండి. ఆమె ఉపకార్ సినిమాలో పాటను ఉటంకించారు. భగత్‌సింగ్ వంటి వారి రక్తతర్పణలతో విముక్తమైన దేశం, ఇది స్వర్ణభూమి అన్నారు న్యాయ మూర్తి. జేఎన్‌యూకి సంబంధించి హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛకే పరిమి తం కాలేమన్నారు. సీపీసీ సెక్షన్ 39 ప్రకారం దేశద్రోహ కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు చూసినవారు ఫిర్యాదు చేయాలి. కానీ జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు వాళ్లతో కలసి నినాదాలు ఇచ్చాడు. దీనినే కోర్టు తీవ్రంగా పరిగణించింది. జేఎన్‌యూ ఘటన తరువాత దేశంలో దేశభక్తులు, దేశ వ్యతిరేకులు అని రెండు శిబిరాలు ఏర్పడ్డాయి.

ప్ర: భారత్‌మాతాకీ జై నినాదం గురించి తెలెత్తిన వివాదం మాటేమిటి?
జ: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మతంతో ప్రమేయం లేకుండా దేశ ప్రజలంతా ఇచ్చిన నినాదాలు భారత్‌మాతాకీ జై, వందేమాతరం. ఇప్పుడు కేవలం రాజకీయాల కోసం కొందరు ఈ నినాదాన్ని అవమానించడమంటే, స్వరాజ్య సమరంలో మన పెద్దలు చేసిన త్యాగాలను అవమానించడమే. అధికారం కోల్పోయిన వారు మళ్లీ దాని కోసం ఆరాటపడతారు. తప్పులేదు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ మీద కక్షతో విద్రోహశక్తులను సమర్థించడం ఎంతవరకు సబబు?

ప్ర: ఆ పని చేస్తున్నవారు ఎవరంటారు?
జ: కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, మావోయిస్టులు సైద్ధాంతికంగా, రాజకీ యంగా ప్రాబల్యం కోల్పోయిన తరువాత పేదలు, దళితులు, విద్యార్థులను అడ్డం పెట్టుకుని రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారు. నిజానికి ఈ ధోరణిని కాంగ్రెస్‌లో కూడా అంతా సమర్థిస్తారని అనలేం. ఆ పార్టీలో ఇప్పుడు అంతర్మథనం మొదలైందనిపిస్తుంది. కమ్యూనిస్టులు మాత్రం తమ లబ్ధి కోసం ఎస్సీ ఎస్టీ విద్యార్థులను బలిచేయాలని చూస్తున్నారు.  

ప్ర: ఆరెస్సెస్ ఆలోచనా ధోరణిలో మనువాదం ఉంటుందన్న విమర్శ గురించి ఏమంటారు?
జ: ఇది అవగాహనలేని విమర్శ. మనుస్మృతి గురించి మాకు కచ్చితమైన అవగాహన ఉంది. అదేమీ వేదం కాదు. స్మృతి. ఒక కాలానికి సంబంధించినది. దానికి ఎప్పుడో కాలదోషం పట్టింది. మనుస్మృతిని మేం ఏనాడూ ప్రస్తావించలేదు. ఈ విమర్శ ప్రధానంగా వామపక్షం వైపు నుంచి వస్తుంది. వారు  కొన్ని ప్రశ్నలకు సంబంధించి ఈ దేశానికి సమాధానం చెప్పాలి. ఏ కమ్యూనిస్టు పార్టీ అయినా మహిళలకు అద్భుతమైన గౌరవం ఇచ్చి, సముచిత స్థానం కల్పించిందా? కేరళలో జరిగిన ఒక దురదృష్టకర ఉదంతాన్ని చెబుతాను. త్రిపుంతుర అనే చోట ఒక విద్యార్థిని ఎస్‌ఎఫ్‌ఐలో కొద్దికాలం పని చేసి బయటకు వచ్చింది. తరువాత ఏబీవీపీలో చేరింది. ఆ మరునాడే ఆమె శీలం గురించి అభాండాలు వేస్తూ పోస్టర్లు వెలిశాయి. ఆమె ఆత్మహత్యా యత్నం చేసింది. ఆ విద్యార్థిని పేరు స్మృతి. అదేం చిత్రమో ఎవరైనా సరే వామపక్షం వైపు ఉన్నంతకాలం సెక్యులర్. ఏవో కారణాలతో ఏబీవీపీ వంటి ఏ ఇతర సంస్థలోకో మారితే వాళ్లు వెంటనే ‘బ్రాహ్మణ వాదులు’ అయిపోతారు. వామపక్షాలకు నిలయంగా, ప్రగతిశీల భావాలకు ఆలవాలంగా చెప్పుకునే జేఎన్‌యూలో దుర్గాదేవి గురించి కరపత్రంలో ఎంత నీచంగా రాశారో అందరికీ తెలుసు. ఆ పేరు ఒక దేవతదే. కానీ ఆమె స్త్రీ. ఇలాంటివాళ్లు సంఘ్‌ని మనువాద సంస్థ అనడమే వింత.

ప్ర: మీ దృష్టిలో ఈ పరిణామాల మీద సామాన్య ప్రజల స్పందన ఏమిటి?
జ: దేశ విచ్ఛిత్తిని కోరుతున్న వారి అభిప్రాయాలకు సామాన్య ప్రజానీకం అంగీకారం లేదు. సాధారణ ప్రజానీకంలో ఆ విద్రోహ చింతనే ఉంటే దేశం ఏనాడో ముక్కలు చెక్కలు అయ్యేది. విద్యార్థుల విషయం కూడా అంతే. జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో కూడా జేఎన్‌యూ మాదిరే నినాదాలు మొదలయ్యాయి. ఆ మరునాడే కొందరు విద్యార్థులు అలాంటి నినాదాలు, ధోరణులు మాకు సమ్మతం కాదని అంతకంటే పెద్ద సభ నిర్వహించి నిరూపించారు. ఇది కూడా పత్రికలలో ప్రాధాన్యానికి నోచుకోలేదు.

ప్ర:  హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, వేముల రోహిత్.....
జ: రోహిత్ ఆత్మహత్య ముమ్మాటికీ దురదృష్టకరం. ఈ వాస్తవాన్ని గుర్తిస్తూనే ఇంకొక మాట కూడా చెప్పాలి. జేఎన్‌యూ గొడవలకు అఫ్జల్‌గురు కేంద్ర బిందువైతే, హెచ్‌సీయూ రగడకు కేంద్ర బిందువు యాకూబ్ మెమెన్ ఉరి. ఒక మెమెన్‌ను ఉరితీస్తే ఇంటికో మెమెన్ పుడతాడు అంటూ విశ్వవిద్యాల యంలో ఊరేగింపు తీసి, నినాదాలు చేయడం, అతడి ఆత్మశాంతికి ప్రార్థనలు చేయడం గర్హించక తప్పదు. రోహిత్ ఆత్మహత్యతో తీవ్రమైన ఈ అంశం తెర వెనక్కిపోయింది. అతడి కులం వ్యవహారం ఘటనను మరో మలుపు తిప్పింది. ఇలాంటి ధోరణులకు దారి తీసిన పరిస్థితుల మీద దర్యాప్తు చేయాలి. అక్కడ జరుగుతున్న వ్యవహారాల గురించి పదేళ్ల కాలాన్ని తీసుకుని దర్యాప్తు చేయించాలి. పుట్టుకను బట్టి వివక్ష చూపడాన్ని ఆరెస్సెస్ అంగీకరించదు. ధర్మం కూడా అంగీకరించదు. ఈ దేశంలో పుట్టినవారు ఎవరైనా అన్ని హక్కులు అనుభవించగలగాలి. దీని ఆచరణలో లోపాలు లేకపోలేదు. ఆ లోపం మనుషులది. ధర్మానిది కాదు.

ప్ర:  మీ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నవారి నోటంట వినిపించేదీ, మీ నోటంట వినిపించేదీ అంబేడ్కర్ పేరే. మరి ఎందుకీ ఘర్షణ.
జ: కులం గురించి అంబేడ్కర్ చేసిన రచనలో భారతదేశంలో కేవలం భౌగోళిక ఐక్యతే కాకుండా, సాంస్కృతిక ఏకాత్మత ఉందని అభిప్రాయపడ్డారు. మేం దీనిని నమ్ముతున్నాం. చెబుతున్నాం. మత మార్పిడిని ముఖ్యంగా ఇస్లాం, క్రైస్తవంలోకి బడుగులను మార్చడం మీద ఆయన తీవ్ర అభ్యంతరాలనే వ్యక్తం చేశారు. ఈ అంశాలను మమ్మల్ని విమర్శించేవారు సౌకర్యంగా విస్మరిస్తారు. దేశ సమగ్రత, సామాజిక న్యాయం, సౌశీల్యం, స్వేచ్ఛ, సమత్వం, సౌభ్రాత్రం ఆధారంగా పౌరులంతా కలసి పని చేయాలని అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని అంబేడ్కర్ చెప్పారు.

ప్ర:  ఆర్థికాంశాల మీద ఆరెస్సెస్ వైఖరి సాధారణంగా వినిపించదంటారు.
జ: ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా, తెలిసినా తెలియకున్నా మా కార్యక్రమం మాకు ఉంది. మొన్న జైపూర్ సమావేశాలలో వ్యవసాయం గురించి తీర్మానం చేశారు. పెట్టుబడులు తగ్గాలి. రాబడులు పెరగాలి. ఇందుకు గో ఆధారిత సేద్యం సరైనదని, సేంద్రియ వ్యవసాయం రావాలని ఆ తీర్మానం సారాంశం. రైతుల దగ్గర నుంచి చెరకు కొంటారు. చెరకు ఉప ఉత్పత్తి మొలాసిస్. మళ్లీ దాని నుంచి ఎథనాల్ తీస్తారు. వీటిలో రైతుకు భాగం ఉండాలని మా వాదన. రైతు ఆత్మగౌరవంతో బతకాలి. అందరికీ విద్య, అందరికీ వైద్యం అని కూడా చెబుతున్నాం. ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం రెండు దశాబ్దాలుగా సర్వ నాశనం అయినాయి. వాటిని పునరుద్ధరించాలి. మేం ఎన్నో సేవా కార్య క్రమాలు నిర్వహిస్తాం. కానీ ప్రచారం తక్కువ. అందుకు పాకులాడం.
 

ప్ర: ఆరెస్సెస్ అనుకూల ప్రభుత్వం వచ్చింది కాబట్టి మందిర్ మళ్లీ తెరపైకి వస్తుందా?
జ: ఈ దేశంలో ప్రజలు ఎన్నుకున్న ఏ ప్రభుత్వమైనా అది మనందరిది. అయో ధ్యలో రామాలయం తథ్యం. ప్రజాస్వామ్యబద్ధంగా అది జరుగుతుంది.

ప్ర:  మీ మీద వస్తున్న విమర్శల గురించి సూటిగా ఏం చెబుతారు?

జ: మీమీద దుర్యోధనుడికి ఎందుకింత ద్వేషం అని పాండవులను అడగలేం. ద్వేషిస్తున్న దుర్యోధనుడిని అడగాలి ఆ ప్రశ్న.

ఇంటర్వ్యూ: గోపరాజు నారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement