సుప్రీంకోర్టులో 'వందేమాతరం'.. నిర్ఘాంతపోయిన జడ్జీలు!
న్యూఢిల్లీ: ఓ న్యాయవాది బుధవారం సుప్రీంకోర్టు లోపల 'వందేమాతరం' అంటూ బిగ్గరగా అరిచాడు. ఈ ఘటనతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిర్ఘాంతపోయారు. 'సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానంలోనే ఇలాంటి ఘటన జరిగితే ఇంకా మేం ఏం చెప్పగలం' అంటూ న్యాయమూర్తులు పేర్కొన్నారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు, ఉపాధ్యాయులపై ఢిల్లీ కోర్టులో జరిగిన దాడి కేసులో సుప్రీంకోర్టు విచారణ జరపుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 'వందేమాతరం' అని నినాదం చేసిన న్యాయవాది తర్వాత క్షమాపణ చెప్పాడు.
కోర్టు గదిలో వాదనలు కొనసాగుతుండగా న్యాయవాది రాజీవ్ యాదవ్ ఈ చర్యకు పాల్పడ్డాడు. 'లాయర్‌గా నువ్వు చేసిన ప్రమాణం గుర్తుందా? ఒక లాయర్‌గా ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడవచ్చా? న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకు ఎంతో విశ్వాసముంది. దయచేసి ఈ వ్యవస్థ పరిరక్షణ కోసం పనిచేయ్. కొంచెం సభ్యత పాటించు' అని అతనిని ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అభయ్ సప్రే అన్నారు. ఈ విచారణ సందర్భంగా న్యాయవాదులు కోర్టు హాల్‌లో జాతీయ జెండాలు ప్రదర్శించారు. నినాదాలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది.
సోమవారం ఢిల్లీలోని పటియాల కోర్టు ఆవరణలో జరిగిన దాడి నేపథ్యంలో జేఎన్‌యూ విద్యార్థి కన్నయ్య కుమార్ కేసులో కోర్టు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు గదిలోకి న్యాయవాదులను అనుమతించకుండా ఆంక్షలు విధించింది. కోర్టు విచారణ సందర్భంగా నిందితుడికి భద్రత కల్పించాలని, పరిమిత సంఖ్యలోనే జర్నలిస్టులను అనుమతించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీచేసింది. విచారణ సందర్భంగా డిపెన్స్, ప్రాసిక్యూషన్ లాయర్లు తప్ప ఎవరిని కోర్టు గదిలోకి అనుమతించరాదని పేర్కొంది.