ఎఫ్‌బీ అకౌంట్ హ్యాక్ చేసి.. మార్ఫింగ్ ఫొటో పెట్టారు!
న్యూఢిల్లీ: దేశద్రోహం ఆరోపణలపై జైలుపాలైన జెఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్ ఫేస్‌బుక్ ఖాతాను హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చి.. దానిస్థానంలో సైనికులు జాతీయ జెండాను ఎగురవేస్తున్న ఫొటోను పెట్టారు. కన్హయ్యకుమార్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉండగా.. ఆయన ప్రొఫైల్ పిక్చర్‌ను శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అప్‌డేట్ చేసినట్టు చూపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయన ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేశారని భావిస్తున్న ఆయన మద్దతుదారులు ఈ వ్యవహారంపై ఢిల్లీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
జెఎన్‌యూ వివాదంలో 'దేశద్రోహం' ఆరోపణలపై అరెస్టయిన కన్హయ్యకుమార్ ఫేస్‌బుక్ ఖాతాలో జాతీయవాది ముద్రను కలిగించేందుకు దానిని హ్యాక్ చేసి మార్చినట్టు తెలుస్తున్నది. నిజానికి కన్హయ్య అకౌంట్‌లో సీపీఎం లోగో ముందు ఆయన నిలబడి ఉన్న ఫొటో ప్రొఫైల్ పిక్చర్‌గా ఉండేది. దీని స్థానంలో పెట్టిన భారత జాతీయ జెండా ఫొటో కూడా ఫొటోషాప్ చేసి మార్పులు చేసినది కావడం గమనార్హం. అమెరికా సైనికులు తమ దేశ జెండాను నిలబెడుతున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోను మార్ఫింగ్ చేసి.. కలర్ లో ఉన్న భారత జాతీయ జెండాను అమెరికా జెండా స్థానంలో ఉంచారు. కన్హయ్యకుమార్ అకౌంట్ హ్యాక్ చేసి.. ఈ ఫొటో పెట్టడంపై ఆయనకు మద్దతుదారులైన విద్యార్థులు మండిపడుతున్నారు. కన్హయ్యకుమార్ విడుదల చేయాలని ఆందోళన కొనసాగిస్తున్న వారు.. ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.