దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్ యూ విద్యార్థి సంఘం నేతలు కన్హన్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్భన్ భట్టాచార్య
న్యూఢిల్లీ: కథ అడ్డం తిరిగిందా? కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ లు చెప్పినవన్నీ కట్టు కథలని తేలాయా? దేశవ్యాప్తంగా రాజకీయ కలకలం సృష్టించిన జేఎన్యూ వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఉగ్రవాది అఫ్జల్ గురు సంస్మరణ ర్యాలీ సందర్భంగా విద్యార్థి నేతలు జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది ముమ్మాటికి నిజమేనని సీబీఐ ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశీలనలో తేలింది. సీబీఐ ల్యాబ్ తుది రిపోర్టుకూడా తమకు అందినట్లు ఢిల్లీ పోలీసులు ధృవీకరిస్తున్నారు. (చదవండి: 'కన్హయ్యపై గట్టి సాక్ష్యాలున్నాయి')
నాటి ఘటనకు సంబంధించి ఓ హిందీ న్యూస్ చానెల్ ప్రసారం చేసిన వీడియో ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ దృశ్యాలను చిత్రీకరించిన కెమెరా, మెమరీ కార్డు, సీడీలు, వైర్లు తదితర పరికరాలన్నింటినీ ఢిల్లీలోని ప్రఖ్యాత సీబీఐ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. నాలుగు నెలల సుదీర్ఘ పరిశీలన అనంతరం సదరు వీడియోల్లోని దృశ్యాలు నిజమైనవేనని, ఎలాంటి మార్పుచేర్పులు చేయలేదని నిపుణులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక జూన్ 8నే పోలీసులకు చేరినట్లు సమాచారం. సీబీఐ ల్యాబ్ నుంచి రిపోర్టు అందిన మాట వాస్తవేనని ప్రత్యేక కమిషనర్ అరవింద్ దీప్ మీడియాకు చెప్పారు. (చదవండి: మళ్లీ అఫ్జల్ గురు ప్రకంపనలు!)
టీవీ చానెళ్లలో ప్రసారమైన దృశ్యాల ఆధారంగా కాకుండా రా వీడియో ఫుటేజి ఆధారంగానే తాము ఎఫ్ఐఆర్ నమోదు చేసినందున ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకంగా మారింది. ఇప్పుడు రిపోర్టు పోలీసులకు అనుకూలంగా రావడంతో జేఎన్ యూ విద్యార్థి నాయకుల భవిష్యత్ పై చర్చలు మొదలయ్యాయి. అయితే సున్నితమైన అంశం కావడంతో ఆచితూచి వ్యవహరించాలని పోలీసులు భావిస్తున్నారు. దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్భన్ భట్టాచార్యలు బెయిల్ పై బయటే ఉన్న సంగతి తెలిసిందే. (చదవండి: బెయిల్ పై విడుదలైన కన్హయ్య కుమార్)