స్వర భాస్కర్... బాలీవుడ్ హీరోయిన్, నటిగా కొందరికి తెలుసు. హిందుత్వ వ్యతిరేకిగా... తప్పును తప్పు అని ఎత్తిచూపగల వ్యక్తిగా మరికొందరికి పరిచయం! ముస్లిం స్నేహితుడిని పెళ్లాడి.. ఇటీవలే తల్లిఅయిన స్వర భాస్కర్ తాజాగా మళ్లీ తన ధిక్కార స్వరంతో మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తుల తీరును నేరుగా ప్రశ్నించారు.
ఏళ్లుగా నిర్బంధంలో మగ్గుతున్న జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్, గుజరాత్ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ వంటి వారికి మద్దతుగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో స్వర భాస్కర్ మాట్లాడుతూ... ‘‘నేను ఈ రోజు న్యాయవ్యవస్థను ఒక ప్రశ్న అడగదలిచాను. దేనికి మీకు భయం? సామాన్య ప్రజలకైతే బతుకు సాగాలన్న భయం ఉంటుంది. ఎవరైనా దాడి చేసి కొడతారన్న భయం ఉంటుంది. దేశంలో ముస్లింలను ఎక్కడపడితే అక్కడ దాడి చేసి కొట్టేస్తున్నారు.
పాపం ఈ దేశంలో దళితులపై కూడా విచ్చలవిడి దాడులు జరుగుతున్నాయి. మాలాంటి వాళ్లకు కూడా పని దొరకదనో.. కామెడీ షోల్లాంటివి చేయనివ్వరని, నటించిన సినిమాలు రిలీజ్ కాకుండా అడ్డుకంటారనో భయాలు ఉండవచ్చు. మరి మీకే రకమైన భయాలు ఉన్నాయి? అధికారం మీ చేతుల్లో ఉంది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఉంది. అరవై, డెబ్భై ఏళ్ల వయసు వాళ్లు.. హైకోర్టుల్లో, సుప్రీంకోర్టుల్లోకి చేరిపోతున్నారు. మీ పిల్లలు కూడా పెద్దవాళ్లై పోయి ఉంటారు. ఖరీదైన.. మంచి కాలేజీల్లో, విదేశాల్లో చదువుకుని ఉంటారు. పెళ్లాం పిల్లలతో వాళ్లు జీవితంలో స్థిరపడి పోయి ఉంటారు.
అలాంటి మీకు ఈ వృద్ధాప్యంలో ఎందుకు భయం? ఇంకా ఎలాంటి ఆశ మిగిలిపోయింది మీలో? ఏం కావాలి మీకు? రాజ్య సభ సభ్యత్వం, గవర్నర్ పదవుల అవసరం ఏమిటి? ఇన్ని ఆశలు పెట్టుకున్న మీరు మీ పని చేయమని మాత్రమే కదా మేము అడుగుతున్నది? అది కూడా మీరు చేయలేకపోతున్నారు ఎందుకు?’’ అంటూ న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
Why are you so scared at this age? What is the greed you have at this age? Do you want a Governor or Rajya Sabha post at this age?
- @ReallySwara#UmarKhalidpic.twitter.com/2CSyEGWUFL— Mohammed Zubair (@zoo_bear) September 18, 2024
ఉమర్, ఖాలిద్, అతర్, గుష్‌ఫా, షెర్జీల్ ఇమామ్ వంటి ఎందరో మూడు నాలుగైదేళ్లుగా జైళ్లలో మగ్గిపోతున్నారని గుర్తు చేసిన స్వర.. ‘‘న్యాయవ్యవస్థ వీరిని పూర్తిగా మరచిపోయినట్లు అనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. బెయిల్ లేకుండా.. విచారణ కూడా మొదలు కాకుండా ఇలాంటి వాళ్లు ఎంతకాలం నుంచి మగ్గిపోతున్నారో కూడా న్యాయవ్యవస్థ పట్టించుకోవడం లేదని అన్నారు.
‘‘అందుకే నేను ఈ వేదికపై నుంచి నాలుగేళ్ల కాలం అనేది ఎంత పెద్ద సమయమో చెప్పదలుచుకున్నాను. ఉమర్ ఖలీద్ 2020 సెప్టెంబరులో ఇరవయ్యవ తేదీ అరెస్ట్ అయ్యాడు. ఆ తరువాత మూడుసార్లు కోవిడ్ వచ్చి పోయింది. వ్యాధి కారక వైరస్ మూడు నాలుగు మార్లు రూపం మార్చుకుంది కూడా. ప్రాణాంతక మహమ్మారి జబ్బుకు చికిత్స కూడా దాదాపుగా అందుబాటులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం ఫహాద్ (భర్త)ను కలిశా. అప్పట్లో ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉండింది. తరువాత మా దోస్తీ కాస్తా ప్రేమగా మారింది.. రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకున్నాయి. పెళ్లికి నిర్ణయించాం. అదీ పూర్తయ్యింది. కానీ... అప్పుడూ.. ఇప్పుడూ వాళ్లు (ఉమర్ తదితరులు) జైళ్లల్లోనే ఉండిపోయారు. బెయిల్ రాలేదు.. విచారణ మొదలు కాలేదు.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment