'ప్రధాని ఇంకా సొంత రాష్ట్రం మోజులోనే ఉన్నారు'
ముంబై: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ గుజరాత్ పైనే ఇష్టంతో ఉన్నారని, ఆయన దేశం మొత్తానికి ప్రధానిగా కనపించడం లేదంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. జాతీయత, జాతి అంటూ బీజేపీ ఇచ్చే సర్టిఫికెట్లు ఎవ్వరికీ అవసరం లేవని అభిప్రాయపడ్డారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వివాదంలో కేంద్ర జోక్యం అనవసరమని సూచించారు. సర్టిఫికెట్లు ఇవ్వకూడదంటూ బీజేపీ నేతలకు ఆయన సూచించారు. జేఎన్యూలో జరిగిన అంశంపై మరింత దుమారం రేపాల్సిన అవసరం లేదన్నారు.
ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోకూడదని, ఇది ఏబీవీపీ కి మార్గం ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తుందన్నారు. ఎవరు జాతీయవాది.. ఎవరు జాతి వ్యతిరేకులో బీజేపీ తేల్చాల్సిన గత్యంతరం లేదంటూ విమర్శించారు. ముంబైలో ఈ నెలలో జరిగిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ.. కార్యక్రమాల నిర్వహణపైనే బీజేపీ దృష్టిపెట్టిందని చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి పనులు ముందుగు సాగలేదని.. ప్రతి రెండు నెలలకు ప్రధాని ఓ కార్యక్రమం అంటూ ప్రజలు ముందుకు వస్తారని రాజ్ ఠాక్రే విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా ఉద్దేశం ఏంటో అర్ధం కావడం లేదని, ఢిల్లీలో జరపకుండా ఈ వేడుకలు ముంబైలో ఎందుకు చేస్తున్నారో తనకు అర్ధం కావడం లేదన్నారు.