జెఎన్‌యూ యుద్ధంలో మేమే గెలిచాం!
బృంద్రావన్(ఉత్తరప్రదేశ్): దేశాన్ని కుదిపేసిన జవహర్‌లాల్ నెహ్రూ వివాదంలోని సైద్ధాంతిక పోరులో తామే నైతిక విజయం సాధించామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. జెఎన్‌యూలో జాతి వ్యతిరేక ఆరోపణలు చేశారన్న ఆరోపణలతో కన్హయ్యకుమార్ సహా పలువురు విద్యార్థులు అరెస్టైన సంగతి తెలిసిందే. 'మనమే గెలిచాం. ఒకప్పుడు దేశాన్ని ముక్కలు చేస్తామని నినాదాలు చేసిన వారే జైలు నుంచి విడుదలైన తర్వాత 'జైహింద్' అంటూ నినదిస్తున్నారు. త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడిస్తున్నారు' అని జైట్లీ పేర్కొన్నారు.
బృందావన్‌లో జరిగిన బీజేపీ యువమోర్చా కార్యక్రమంలో జైట్లీ ప్రసంగిస్తూ.. జైలు నుంచి విడుదలైన అనంతరం జెఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించారు. ఆయన ప్రసంగం బీజేపీ విజయానికి నిదర్శనమన్నారు. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. 'కొందరు యాకూబ్ మెమన్ సంస్మరణ నిర్వహించాలనుకుంటే, మరికొందరు అఫ్జల్ గురు సంస్మరణ నిర్వహించాలనుకుంటున్నారు. దేశాన్ని ముక్కలు చేస్తామని నినాదాలు చేస్తున్నారు. అలాంటివారికి కాంగ్రెస్ యువనాయకుడు సానుభూతి ప్రకటించడం దేశం చేసుకున్న దౌర్భాగ్యమ'ని ఆయన మండిపడ్డారు. జెఎన్‌యూ వివాదానికి కాంగ్రెస్ మద్దతు పలుకడం ఆ పార్టీ సైద్ధాంతిక దివాళాకోరుతనాన్ని చాటుతోందని జైట్లీ ధ్వజమెత్తారు.