భూసేకరణపై జనంలోకి | Land public appearance | Sakshi
Sakshi News home page

భూసేకరణపై జనంలోకి

Published Sun, Apr 5 2015 12:24 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

భూసేకరణపై జనంలోకి - Sakshi

భూసేకరణపై జనంలోకి

  • కాంగ్రెస్ దుష్ర్పచారాన్ని ఎండగట్టాలని బీజేపీ నిర్ణయం
  • బిల్లులోని సానుకూలాంశాలను ప్రచారం చేసేందుకు కార్యాచరణ
  • మా ప్రభుత్వానిది పేదలకు అనుకూలమైన అభివృద్ధి: ప్రధాని మోదీ
  • బెంగళూరులో ముగిసిన రెండ్రోజుల పార్టీ జాతీయ కార్యవర్గ భేటీ
  • ఎనిమిది రాష్ట్రాలకు ఇన్‌చార్జ్‌లను నియమించిన పార్టీ
  • తెలంగాణకు హన్స్‌రాజ్ గంగారాం, ఏపీకి జేపీ నడ్డా
  • సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుపై ప్రభుత్వానికి మద్దతుగా ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. కాంగ్రెస్, ప్రతిపక్షాల దుష్ర్పచారాన్ని తిప్పికొడుతూ పల్లెపల్లెనా తిరిగి బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు సిద్ధమైంది. బిల్లులో రైతులకు మేలు చేసే అంశాలను కూలంకషంగా వివరిస్తూ, ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేయాలని తమ శ్రేణులకు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేదికగా పిలుపునిచ్చింది. ఈ మేరకు సమావేశాల్లో రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. బెంగళూరులో   రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం ముగిశాయి.

    ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానిది పేదల అనుకూలమైన అభివృద్ధి అని స్పష్టంచేశారు. గత యూపీఏ ప్రభుత్వం ధనవంతుల కోసం దేశాన్ని గంపగుత్తగా అమ్మేసిందని ధ్వజమెత్తారు. ‘మాది పేదల వ్యతిరేక ప్రభుత్వమని ప్రచారం చేస్తున్నారు. కానీ గత యూపీఏ ప్రభుత్వమే ధనవంతుల కోసం పనిచేసింది. ఆ ప్రభుత్వం కేవలం ఓ నోట్ ఆధారంగా ఇష్టారాజ్యంగా బొగ్గు గనులను కట్టబెట్టింది. మేం అధికారంలోకి వచ్చాక 20 బొగ్గు బ్లాకులకు వేలం వేసి ధనవంతుల నుంచి రూ.2 లక్షల కోట్లు వసూలు చేసి ఆయా రాష్ట్రాలకు ఇచ్చాం. ఇప్పుడు చెప్పండి ఎవరిది పేదలకు మేలు చేసే ప్రభుత్వమో..?’ ఆయన ప్రశ్నించారు.

    అభివృద్ధి ఫలాలు పేదలకు అందాలన్నదే తమ ప్రభుత్వ విధానమన్నారు. సమావేశాల్లో చివరిరోజు భూసేకరణ బిల్లు, ప్రతిపక్షాల పోరు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై  చర్చించారు. సమావేశాలు ముగిసిన అనంతరం కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ విలేకర్లతో మాట్లాడారు. భూసేకరణ బిల్లు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు దోహదడపడుతుందని, పేదలకే లబ్ధి చేకూరుతుందని అన్నారు. భూసేకరణ బిల్లుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో చర్చించామని మరో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. బిల్లుపై ప్రతిపక్షాల అవాస్తవ ప్రచారాన్ని అడ్డుకునేందుకు ‘ప్రజల ముందుకు వాస్తవాలు’ పేరుతో బుక్‌లెట్‌ను విడుదల చేశామని, ఇందులోని అంశాలను గ్రామగ్రామాన ప్రచారం చే స్తామన్నారు.
     
    పార్టీ కమిటీల్లో నిర్మల, మురళీధర్‌రావు
     
    బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కొత్తగా ఏర్పాటు చేసిన తొమ్మిది కమిటీల్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావులకు చోటు దక్కింది. ‘భేటీ బచావ్-బేటీ పఢావ్’ కమిటీలో నిర్మలతో పాటు రేణుదేవి తదితరులు ఉన్నారు. శిక్షణ కమిటీలో మురళీధర్‌రావుతోపాటు వి.సతీష్, రాంప్యారే పాండే, మహేశ్ శర్మ తదితరులు ఉన్నారు. క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడుగా గణేష్‌లాల్‌గా నియమితులయ్యారు. కార్యాలయ నిర్మాణ కమిటీ  ఆజీవన్ సహయోగ్ కమిటీ, సంపర్క్ అభియాన్, పార్టీ కార్యాలయాల ఆధునీకరణ, స్వచ్ఛతా అభియాన్, నమామీ గంగే కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.
     
    మాట్లాడని అద్వానీ!

    పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ప్రసంగించకపోవడం చర్చనీయాంశమైంది. 2013లో మినహా ఈ సమావేశాలు ఎప్పుడు జరిగినా ఆయన మాట్లాడారు. ఈసారి ప్రసంగించకపోవడం వెనుక ఏ కారణమూ లేదని పార్టీ  చెబుతున్నా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీలో తనను పక్కన పెట్టడం, మోదీ తిరుగులేని నేతగా చలామణి అవుతుండడంపై ఆయన కినుక వహించారని కొందరు అంటున్నారు.

    ప్రసంగ పాఠాన్ని ముందుగా చూపించాలని కొందరు పార్టీ నేతలు కోరారని, అందుకు అద్వానీ ఆగ్రహించి మాట్లాడలేదని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై విలేకరులు జైట్లీని ప్రశ్నించగా.. ఆర్టీఐ చట్టం వచ్చినా పార్టీలోని కొన్ని అంతర్గత విషయాలు మీతో పంచుకోలేనన్నారు. పార్టీలో అద్వానీ సీనియర్ నేత అని, ఎప్పుడైనా, ఏ వేదిక మీద నుంచైనా పార్టీకి మార్గనిర్దేశనం చేయవచ్చని ఆయన చెప్పారు.
     
    8 రాష్ట్రాలకు ఇన్‌చార్జ్‌ల నియామకం

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు మరో ఆరు రాష్ట్రాల్లో పార్టీ పటిష్టతకు చర్యలపై రోడ్‌మ్యాప్ రూపొందించాల్సిందిగా ఆయా రాష్ట్రాల చీఫ్‌లకు పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా సూచించారు. పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉన్న ఏపీ, తెలంగాణలతోపాటు మొత్తం8 రాష్ట్రాల్లో  బీజేపీని పటిష్టం చేసేందుకు ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. ఏపీకి కేంద్రమంత్రి జేపీ నడ్డా, తెలంగాణకు కేంద్రమంత్రి హన్స్‌రాజ్ గంగారాం అయ్యర్ ఇన్‌చార్జ్‌లుగా ఉంటారు. 2019 నాటికి ఇరు రాష్ట్రాల్లోనూ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను మేలో బెంగళూరు లేదా చెన్నైలో జరిగే దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో ఆమోదించే అవకాశం ఉంది. అంతకుముందు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లు ఆయా రాష్ట్రాల్లో గ్రామస్థాయి కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల్లోనూ మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో సొంత కేడర్ రూపొందించుకునే దిశగా ప్రణాళికలు రచించాలని,  తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి  తీసుకెళ్లాలని షా సూచించినట్లు సమాచారం. నడ్డా ఈనెల రెండోవారంలో విశాఖ రానున్నారని ఏపీ బీజేపీ శాఖ చీఫ్ కంభంపాటి హరిబాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement