కరతాళ ధ్వనులతో వెంకయ్య సహా పదవీకాలం పూర్తయిన ఎంపీలకు వీడ్కోలు పలుకుతున్న ప్రధాని, విపక్షనేత
పదవీకాలం ముగియనున్న మరో 16 మంది రాజ్యసభ ఎంపీలకు కూడా..
న్యూఢిల్లీ: త్వరలో పదవీకాలం ముగియనున్న 17 మంది సభ్యులకు రాజ్యసభ మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికింది. బడ్జెట్ తొలి, మలి సమావేశాల నడుమ, మార్చి 17- ఏప్రిల్ 25 మధ్య రిటైర్ అవుతున్న వెంకయ్యనాయుడు(బీజేపీ), అశ్వని కుమార్(కాంగ్రెస్), ఎంఎస్ గిల్(కాంగ్రెస్), మణిశంకర్ అయ్యర్(కాంగ్రెస్), అవినాశ్ రాయ్ ఖన్నా(బీజేపీ), జావేద్ అఖ్తర్(నామినేటెడ్), టీఎన్ సీమ(సీపీఎం) సహా 17 మంది సభ్యులను చైర్మన్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్, సభానాయకుడు అరుణ్ జైట్లీ, సభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ సహా పలువురు సభ్యులు ప్రశంసల్లో ముంచెత్తారు.
ప్రజా సమస్యలను లేవనెత్తడంలో, చర్చల్లో వారి ప్రతిభను కొనియాడారు. పదవీకాలం ముగుస్తున్న సభ్యులు సైతం తమ అనుభవాలను సహచరులతో పంచుకున్నారు. పార్టీలు వేరైనా ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసేందుకు కృషి చేశామన్నారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు. ఈ 17 మందిలో ఐదుగురు నామినేటెడ్ సభ్యులు కాగా, 12 మంది త్రిపుర, కర్ణటక, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, అస్సాం రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యారు.