కన్హయ్య కుమార్ ను రక్షించనున్న అసలు వీడియో
న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ దేశద్రోహానికి పాల్పడ్డారనడానికి ఇదిగో సాక్ష్యం అంటూ న్యూస్ ఎక్స్, ఇండియా న్యూస్ ఛానళ్లు బుధవారం ప్రసారం చేసిన వీడియోను ఉద్దేశపూర్వకంగా తమకు అనుకూలంగానే ఎడిట్ చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. ‘ఆజాది (స్వేచ్ఛ), లేకే రహెంగే ఆజాది’ కుమార్ అన్న పదాలను ఈ ఛానళ్లు వక్రీకరించాయని ఏబీపి న్యూస్ ఛానెల్ వెల్లడించి, అసలు వీడియోను ప్రసారం చేసింది. ‘ఆకలి నుంచి స్వేచ్ఛ (ఆజాది) కావాలి. సంఘ్‌వాది (ఆరెస్సెస్) నుంచి స్వేచ్ఛ కావాలి. భూస్వామం, పెట్టుబడిదారి విధానం, బ్రాహ్మణిజం, మనుయిజం నుంచి స్వేచ్ఛ కావాలి’ అని కన్హయ్య కుమార్ నినదించినట్లు అసలు వీడియోలో ఉంది. ఇప్పుడు ఈ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.
తొందరపడి ఎడిట్ చేసిన వీడియోను ప్రసారం చేసిన నెటిజన్లు కొందరు ఆ వీడియోను తొలగించడమే కాకుండా క్షమాపణలు కూడా చెప్పారు. క్షమాపణ చెప్పిన వారిలో స్వరాజ్య కాలమిస్ట్ రూపా సుబ్రమణ్యం కూడా ఉన్నారు. దీనికి ఢిల్లీ పోలీసులు కన్హయ కుమార్‌కు క్షమాపణలు చెప్పాలని సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. ఇక కుమార్ పట్ల ఢిల్లీ పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తారని మరో సీనియర్ జర్నలిస్ట్ బర్ఖాదత్ అన్నారు.
ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం గురువారం సమర్పించిన నివేదికలో అసలు కన్హయ్య కుమార్ పేరే లేదని తెల్సింది. అఫ్జల్ గురు సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ కార్యకర్త ఉమర్ ఖలీద్, మరికొంత మంది సహచరులు కలిసి అఫ్జల్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 18 విశ్వ విద్యాలయాల్లో నిర్వహించాలని ప్లాన్ వేసినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలో పేర్కొన్నారని, కన్హయ్య కుమార్ పేరును మాట మాత్రంగా కూడా ఎక్కడ ప్రస్తావించలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.