‘జేఎన్‌యూ’పై నిరసనల హోరు | JNU row: Did a fake video fuel the anti-national fire? | Sakshi
Sakshi News home page

‘జేఎన్‌యూ’పై నిరసనల హోరు

Published Fri, Feb 19 2016 12:58 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

‘జేఎన్‌యూ’పై నిరసనల హోరు

‘జేఎన్‌యూ’పై నిరసనల హోరు

ఢిల్లీలో భారీ ర్యాలీ; వేలాదిగా పాల్గొన్న విద్యార్థులు, జర్నలిస్టులు, పౌర సమాజం
న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదం తీవ్రమవుతోంది. జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య అరెస్ట్‌కు అనుకూలంగా, వ్యతిరేకంగా ఢిల్లీసహా పలు నగరాలు, పట్టణాల్లో గురువారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. కన్హయ్యకుమార్ విచారణ సందర్భంగా ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టులో నెలకొన్న పరిస్థితి అసాధారణమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అక్కడి హింసాత్మక ఘటనలపై తమ నివేదికను సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ల బృందం గురువారం జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనానికి అందించింది.

పటియాలా కోర్టు ఘటనలో పోలీసుల వ్యవహార తీరుపై ఆ బృందంలోని సభ్యుడు, సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ అనుమానం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడినవారితో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తిహార్ జైలులో తన ప్రాణాలకు ముప్పుందని బెయిల్ అభ్యర్థనతో కన్హయ్య సుప్రీంకోర్టు తలుపుతట్టారు.  దానిపై నేడు విచారణ జరగనుంది.
 
హెచ్‌సీయూ టు జేఎన్‌యూ
రాజద్రోహం కేసులో అరెస్టైన కన్హయ్యను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వేలాదిగా విద్యార్థులు, జర్నలిస్టులు, అధ్యాపకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, పౌర సమాజం సభ్యులు.. ఢిల్లీలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు.  ‘లాంగ్ లివ్ జేఎన్‌యూ’, ‘కన్హయ్య.. వి ఆర్ విత్ యూ’, ‘హెచ్‌సీయూ టు జేఎన్‌యూ’ అని నినాదాలు చేస్తూ వేలాదిగా నిరసనకారులు మండీ హౌజ్ సర్కిల్ నుంచి జంతర్‌మంతర్ వరకు కదం తొక్కారు. జేఎన్‌యూలో పోలీస్ యాక్షన్‌ను నిరసిస్తూ, మోదీ సర్కారును విమర్శిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.

ప్రముఖ జర్నలిస్ట్  సాయినాథ్, ఎన్‌ఎస్‌డీ మాజీ డెరైక్టర్ అనురాధా కపూర్ సహా జేఎన్‌యూ, ఢిల్లీ వర్సిటీ, అంబేడ్కర్ వర్సిటీల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, కళాకారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హైదరాబాద్ సహా పలు నగరాలు, పట్టణాల్లో  పలు వర్సిటీల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ప్రతిగా ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో ఎబీవీపీ కార్యకర్తలు జాతివ్యతిరేకులను శిక్షించాలంటూ ప్రదర్శనలు చేపట్టారు.

చెన్నైలో కన్హయ్యకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన తమిళ జానపద గాయకుడు కోవన్ సహా 57 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హెచ్‌సీయూలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి, నిరసన ప్రదర్శన నిర్వహించారు. పట్నాలో బీజేపీ కార్యకర్తలకు, సీపీఐ విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్, ఆర్జేడీ యువజన విభాగం కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది.
 
‘పటియాలా’ హింస అసాధారణం

పటియాలా హౌజ్ కోర్టులో బుధవారం చోటు చేసుకున్న హింస అసాధారణమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అక్కడ శాంతిభద్రతల పరిస్థితిపై తాము దృష్టి పెట్టామంది. పటియాలా  కోర్టులో బుధవారం లాయర్ల రౌడీయిజంపై తాము రూపొందించిన నివేదికను సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ల కమిటీ సీల్డ్ కవర్‌లో జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ ఏఎం సప్రేల ధర్మాసనానికి అందించింది. అయితే, సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, దుష్యంత్ దవే, హరేన్ రావల్, ప్రశాంత్ భూషణ్‌లు ఆ నివేదికపై సంతకం చేయగా..నివేదికను చదివిన తరువాతే సంతకం చేస్తానని కమిటీలో సభ్యుడైన ఢిల్లీ పోలీస్ తరఫు న్యాయవాది అజిత్ కే సిన్హా  చెప్పారు.

తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కన్హయ్య కేసును కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించాలన్న పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరపనుంది.  ‘తమ కళ్లముందే దాడి చేసిన వ్యక్తి కనిపిస్తుంటే అరెస్ట్ చేయకుండా వదిలేయడం కుమ్మక్కు కావడం కాదా?’ అని రాజీవ్ ధావన్ మీడియాతో అన్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా తిహార్ జైళ్లో ఉన్న కన్హయ్య కుమార్. కాగా, హింసకు పాల్పడిన లాయర్లను గుర్తించి, వారి లెసైన్సులను రద్దు చేస్తామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.
 
బీజేపీ ఎమ్మెల్యే శర్మ అరెస్ట్..
పటియాలా కోర్టులో హింసలో పాలుపంచుకున్న బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. 8 గంటల పాటు ప్రశ్నించి, తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. కోర్టులో దాడులకు దిగిన విక్రమ్ సింగ్ చౌహాన్ సహా ముగ్గురు లాయర్లకు పోలీసులు సమన్లు జారీ చేసినప్పటికీ.. వారు గురువారం వరకు పోలీసుల ముందు హాజరుకాలేదు. కాగా, అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా జేఎన్‌యూలో జరిగిన కార్యక్రమానికి సంబంధించి ఒక హిందీ వార్తాచానెల్ ప్రసారం చేసిన కథనం ఆధారంగానే పోలీసులు కన్హయ్యపై కేసు నమోదు చేశారని సమాచారం.
 
రౌడీ లాయర్‌కు సన్మానం
సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. పటియాలా హౌజ్ కోర్టులో విచ్చలవిడి దాడులకు పాల్పడి, స్వేచ్ఛగా తిరుగుతున్న న్యాయవాది విక్రమ్ సింగ్ చౌహాన్‌ను ఢిల్లీ జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘం గురువారం సన్మానించింది. విక్రమ్ సింగ్ చౌహాన్ ప్రతినిధిగా ఉన్న కర్కర్దూమా కోర్టు బార్ అసోసియేషన్ ఆయనను పూలమాలతో సత్కరించింది. పటియాలా కోర్టులో హింసకు పాల్పడింది తమవారు కాదని, నల్ల కోట్లు వేసుకుని వచ్చిన బయటివ్యక్తులని పేర్కొంది.
 
కొడుకుపై కక్షగట్టారు
బిహార్లోని బిహత్ గ్రామంలో నివసిస్తున్న కన్హయ్య కుమార్ కుటుంబసభ్యులకు స్థానిక పోలీసులు భద్రత కల్పించారు. అయితే, తమకు కల్పించిన భద్రతను కన్హయ్య కుమార్ తండ్రి జైశంకర్ సింగ్ తిరస్కరించారు. జేఎన్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ అభ్యర్థిని ఓడించినందుకే తన కుమారుడిపై బీజేపీ, ఆరెస్సెస్‌లు కక్షకట్టాయని ఆయన ఆరోపించారు. కన్హయ్యకుమార్ టైస్ట్ కాదని తేలుతుందని, అయితే ఈ లోపే కస్టడీలో ఉన్న తన కొడుకు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని కన్హయ్య తల్లి మీనాదేవి ప్రశ్నించారు.
 
కన్హయ్యకు చరిత్రకారుల మద్దతు

న్యూఢిల్లీ: జేఎన్‌యూలో జరుగుతున్న ఆందోళనలకు చరిత్రకారులు, రచయితలు, కళాకారులు మద్దతు ప్రకటించారు. వర్సిటీ విద్యార్థి నేత కన్హయ్యపై రాజద్రోహం కేసు పెట్టడం అన్యాయమని రోమిలా థాపర్, జీత్ థాయిల్ వంటి ప్రముఖులు విమర్శించారు. విద్యాసంస్థల్లో వివాదాలను చర్చ ల ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు. కన్హయ్య విడుదలకు డిమాండ్ చేస్తూ..

దాదాపు 9వేల మంది కళాకారులు, చరిత్రకారులు, రచయితలు ఓ పిటిషన్‌పై సంతకం చేశారు. మరోవైపు జేఎన్‌యూలో పోలీసు చర్యను ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జితోపాటు యూకేలోని 8 ప్రముఖ వర్సిటీలు ఖండించాయి. జేఎన్‌యూలో ర్యాలీకి పలువురు కన్హయ్య చిత్రం ఉన్న టీ-షర్టులను వేసుకుని వచ్చారు.  అటు పటియాలా కోర్టులో ఘర్షణకు దిగిన విక్రమ్ సింగ్ చౌహాన్ అనే న్యాయవాదిని కొందరు లాయర్లు సన్మానించటాన్ని ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్టు బార్ అసోసియేషన్ ఖండించింది.

కాగాయూట్యూబ్‌లో జర్మనీకి చెందిన జేఎన్‌యూ విద్యార్థి సిల్వీ  గిటారు వాయిస్తూ.. ‘మమ్మల్ని ఎంతగా అణిచేయాలని చూస్తే.. మా గొంతులు అంతలా నినదిస్తాయి. విఆర్ జేఎన్‌యూ’ అని ఆలపించిన గీతం వైరల్‌లా విస్తరించింది.  అటు, భారతదేశంలో విషం చిమ్ముతున్న లష్కర్ చీఫ్ హఫీజ్ తోపాటు లష్కరే, జమాత్-ఉద్-దవాకు సంబంధించిన ట్విటర్ అకౌంట్‌ను ఆపేయాలని నిఘా వర్గాలు.. ట్విటర్ ఇండియాను
 కోరనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement