కన్హయ్యను ఎవరూ కొట్టలేదు: బస్సీ
న్యూఢిల్లీ : జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ను పాటియాలా కోర్టుకు తీసుకువస్తుండగా అతడిని ఎవరూ కొట్టినట్లు తాను భావించడంలేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ బుధవారం పేర్కొన్నారు. కన్హయ్య కుమార్ కు వ్యతిరేకంగా తమ వద్ద తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని బస్సీ మరోసారి స్పష్టం చేశారు. విద్యార్థి నాయకుడ్ని కోర్టుకు తీసుకెళ్తుండగా పరిస్థి కాస్త అదుపుతప్పిందని అయితే, ఆ సమయంలో ఎవరూ కన్హయ్యపై దాడి చేసినట్లు తాను అనుకోవడం లేదన్నారు.
ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ మీడియాతో మాట్లాడారు. విద్యార్థి సంఘం నాయకుడ్ని పాటియాలా హౌస్ కోర్టుకు పటిష్ట భద్రతతో తీసుకొచ్చామన్నారు. అయితే, అనుకోకుండా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో ఆ సమయంలో కన్హయ్య తన చెప్పులు పోగొట్టుకున్నాడని వివరించారు. ఈ వివాదంలో కేవలం జేఎన్‌యూ విద్యార్థులే కాక మరికొంతమంది బయటివాళ్లు కూడా ఈ ఘటనలో ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని, ఈ కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు. తమవద్ద గట్టి ఆధారాలున్నాయని, ఎలాంటి పక్షపాతం లేకుండానే తాము ఈ కేసు విషయంలో ముందుకు వెళ్తున్నామని బస్సీ తెలిపారు.