బస్సీ ఐఎస్‌ఐ ఏజెంట్.....
న్యూఢిల్లీ: మరో వారం రోజుల్లో పదవీ విరమణ చేయనున్న ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ మంచికో, చెడుకో పది కాలాల పాటు తన పేరు ప్రజల్లో మారుమోగిపోవాలని కోరుకుంటున్నట్లున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ను దేశద్రోహం కేసు కింద అరెస్టు చేయించి వార్తల్లో వ్యక్తిగా మారిన బస్సీ.. పటియాల కోర్టు ఆవరణలో జర్నలిస్టులను, విద్యార్థులను, అధ్యాపకులను చితక్కొట్టిన సంఘటనలకు కారుకుడై మరింత పేరు సంపాదించుకున్నారు.
బీజేపీతో అంటగాకే బస్సీ, దేశద్రోహం అభియోగాలపై అరెస్టైన అయిదుగురు విద్యార్థులు నిర్దోషులైతే అందుకు వారు సరైన సాక్ష్యాధారాలను చూపి నిరూపించుకోవాలని వ్యాఖ్యానించడం ద్వారా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాన్ని సంపాదించుకున్నారు. ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియా దుమ్మెత్తి పోసింది. వ్యంగ్యోక్తులు విసిరింది. ‘బస్సీ, నీవు ఐఎస్‌ఐ ఏజెంట్‌వని నేను అంటున్నా, నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో!... దోషిగా తేలేవరకు ప్రతివ్యక్తి అమాయకుడని చట్టం చెబుతుందని నేను భావిస్తున్నా. నా నిర్దోషిత్వానికి నా వద్ద సాక్ష్యాలు లేవు.
బస్సీ నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు నీ వద్ద సాక్ష్యాధారాలున్నాయా?.....సీపీ పదవి పోవడంతో మరో పదవి కోసం అవాకులు, చెవాకులు పేలుతున్నారు.... విద్యార్థులు చేసిన నేరాన్ని నిరూపించాల్సిన బాధ్యత నీది. అలా చేయలేకపోతే క్షమాపణలు చెప్పుకో!.....మరో జోక్ పేల్చినందుకు థాంక్స్ బస్సీ...మరో లూజ్ రిమార్క్. కొంతమందికి నిజంగా పీఆర్‌లో శిక్షణ అవసరం... కొంత మంది మినహా దేశంలోని పౌరులంతా నేరస్థులన్నది బస్సీ అభిప్రాయం కాబోలు. అంతమందిని విచారించడం కష్టం గనుక నిర్దోషులను సాక్ష్యాధారాలు చూపమని అడుగుతున్నారు...’ ఇలా ట్విట్టర్ యూజర్లు తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు.