హనీట్రాప్స్‌ కోసం ప్రాజెక్ట్‌ షేర్నీ! | Shirney Project Under ISI To Honeytrap Scientists Defense Employees In Country | Sakshi
Sakshi News home page

హనీట్రాప్స్‌ కోసం ప్రాజెక్ట్‌ షేర్నీ!

Published Mon, Jun 20 2022 7:49 AM | Last Updated on Mon, Jun 20 2022 9:58 AM

Shirney Project Under ISI To Honeytrap Scientists Defense Employees In Country - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని త్రివిధ దళాలు, రక్షణ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, సైంటిస్టులను హనీట్రాప్‌ చేయడానికి పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) ‘ప్రాజెక్టు షేర్నీ’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. ఇందులో పని చేయడానికి 300 మంది ఆకర్షణీయమైన యువతులను ఎంపిక చేసుకుని వీరికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. డీఆర్‌డీఓలో పని చేస్తున్న ఓ సీనియర్‌ సైంటిస్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో, కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేస్తున్న ఇంజినీర్‌ దుక్కా మల్లికార్జున్‌ రెడ్డి శుక్రవారం అరెస్టు అయ్యారు. వీరిద్దరూ ప్రాజెక్ట్‌ షేర్నీలో పని చేస్తున్న యువతుల వల్లో చిక్కి రహస్య సమాచారం చేరవేశారు. షేర్నీ అంటే ‘ఆడసింహం’ అని అర్థం.  

ఆరు నెలల పాటు వివిధ అంశాల్లో శిక్షణ..
వీరంతా తమ తమ ప్రాంతాల్లోనే ఉండి ఐఎస్‌ఐ కోసం పని చేస్తున్నారు. వీరికి ఐఎస్‌ఐ ఏ స్థాయిలో బ్రెయిన్‌ వాష్‌ చేసిందంటే... టార్గెట్‌ చేసిన వ్యక్తిని హనీ ట్రాప్‌ చేయడానికి వీడియో కాల్‌లో నగ్నంగా కనిపించడానికీ వెనుకాడరు. ఎంపికైన 300 మందికీ వివిధ అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. భారత్‌లోని జీవనస్థితిగతులు, భాష, మతపరమైన నమ్మకాలతో పాటు డార్క్‌ వెబ్‌ వినియోగం, హనీ ట్రాప్‌ చేయడం తదితర అంశాల్లో ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చింది.  విదేశాలకు చెందిన ఒక్కో యువతికి దాదాపు 50 వరకు భారతీయుల పేర్లతో ప్రొఫైల్స్‌ ఏర్పాటు చేసిన ఐఎస్‌ఐ వీటి ద్వారానే హనీట్రాప్స్‌ చేయిస్తోంది. వీరి కట్టు, బొట్టు, నడక, నడత ప్రతీ అంశమూ  భారతీయ యువతుల మాదిరిగా ఉండేలా వీరిని తయారు చేసింది. హనీట్రాప్‌లో విజయం సాధించి, రహస్య సమాచారం సేకరించిన వారికి ప్రత్యేక నజరానాలూ ఐఎస్‌ఐ అందిస్తోంది.  

అబోటాబాద్‌లో సోషల్‌మీడియా యూనిట్‌... 
దేశంలోని త్రివిధ దళాలు, రక్షణ సంస్థల్లో పని చేస్తున్న అధికారులు, సైంటిస్టులు, ఇతర ఉద్యోగులకు సంబంధించిన సమాచారం ఐఎస్‌ఐకి వారి సోషల్‌మీడియా ఖాతాల ద్వారానే తెలుస్తోంది. వీటిని విశ్లేషించడం కోసం ఐఎస్‌ఐ పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో ప్రత్యేక సోషల్‌మీడియా యూనిట్‌ ఏర్పాటు చేసింది. ఇందులో సుశిక్షితులైన ఐఎస్‌ఐ ఉద్యోగులతో పాటు పాక్‌ ఆర్మీ సిబ్బంది, కొందరు హ్యాకర్లు పని చేస్తున్నారు.

వీరి ప్రతినిత్యం భారతీయులకు సంబంధించిన సోషల్‌మీడియా ప్రొఫైల్స్‌ను విశ్లేషిస్తుంటారు. వీటిలో తమకు అవసరమైన వారివి ఎంపిక చేసుకుని అధ్యయనం చేస్తారు. అలా తుదిజాబితా రూపొందించిన తర్వాత దాన్ని ప్రాజెక్ట్‌ షేర్నీలోని యువతకులకు అందిస్తుంది. వీటి ఆధారంగానే ఈ యువతులు టార్గెట్లకు వల వేసి ఆకర్షిస్తారు. అందచందాలతో పాటు డబ్బు ఎర వేసి రహస్య సమాచారం సేకరిస్తారు. తమ పని పూర్తయ్యే వరకు ఐఎస్‌ఐ కోసం పని చేస్తున్నట్లు ఎదుటి వారికి అనుమానం కూడా రానీయరు. హనీట్రాప్స్‌ను కనిపెట్టడానికి నిఘా వర్గాలతో పాటు నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్టీఆర్వో) పని చేస్తున్నాయి.     

పాకిస్థానీయులు లేకుండా బెటాలియన్‌.. 
ప్రాజెక్టు షేర్నీ కోసం కొన్నేళ్లుగా వ్యహాత్మకంగా పని చేసింది. ఇందులో పని చేయడానికి యువతుల ఎంపిక, వారికి శిక్షణ తదితర అంశాల్లో పలు జాగ్రత్తలు తీసుకుంది. 300 మందితో ఏర్పడిన ఈ బెటాలియన్‌లో కనీసం ఒక్క పాకిస్థానీ యువతి కూడా లేదు. ఇందులో పని చేస్తున్న వారంతో భారత్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్‌ దేశాలకు చెందిన వాళ్లే ఉన్నారు. ఆయా దేశాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపుల్లో వీరి ఎంపికను రహస్యంగా పూర్తి చేశారు. అక్కడ ఉన్న తమ ఏజెంట్ల ద్వారా ప్రధానం మధ్య, దిగువ మ«ధ్య తరగతి వర్గాల్లో ఆకర్షణీయమైన యువతులను ఉద్యోగాల పేరుతో వల వేసింది. ఆపై డబ్బు ఆశచూపి వారిని ప్రాజెక్టు షేర్నీలో పని చేసేలా ఐఎస్‌ఐ ఒప్పించింది.  

(చదవండి: మెర్సీ కిల్లింగ్‌కు అనుమతివ్వాలని ట్వీట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement