Defence employees
-
ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
రక్షణ మంత్రిత్వ శాఖలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. డిఫెన్స్ సివిలియన్ ఉద్యోగుల ప్రమోషన్‌కు అవసరమైన కనీస అర్హత సర్వీస్ నిబంధనలను మంత్రిత్వ శాఖ సవరించింది. 7వ పే కమీషన్ పే మ్యాట్రిక్స్ అండ్ పే లెవెల్స్‌ను అనుసరించే వేతనాలు చెల్లించే రక్షణ పౌర ఉద్యోగులకు ఈ సవరించిన నిబంధనలు వర్తిస్తాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 3 శాతం డీఏ పెంపుపై భారీ ఆశలు డియర్నెస్ అలవెన్స్ పెంపునకు సమయం దగ్గర పడుతుండడంతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రం ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం విశేషం. మరోవైపు ఈ సారి 3 శాతం డీఏ పెంపుపై ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కేంద్రం తన కోటి మందికి పైగా ఉద్యోగులు ,పెన్షనర్లకు కరువు భత్యాన్ని (DA) 3 శాతం నుండి 45 శాతానికి పెంచవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. జూలైలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠ స్థాయిని దాటిన నేపథ్యంలో ఈ పెంపు ఉంటుందని అంచనా. తాజా పెంపు డియర్నెస్ అలవెన్స్ జూలై 1, 2023 కి వర్తిస్తుంది. డీఏను చివరిసారిగా మార్చి 2023లో 4 శాతం పెంచి 42 శాతానికి చేర్చారు. (వర్క్ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్ అంటున్న ఐటీ దిగ్గజం) డీఏ పెంపు ఎలా ? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల కోసం డియర్నెస్ అలవెన్స్ ప్రతి నెలా లేబర్ బ్యూరో ద్వారా విడుదల చేయబడిన పారిశ్రామిక కార్మికుల కోసం (CPI-IW) తాజా వినియోగదారుల ధరల సూచికలోని అంశాల ఆధారంగా లెక్కిస్తారు. ఉద్యోగులు, పెన్షనర్ల ప్రస్తుత జీతాలపై పెరుగుతున్న ధరల భారం ఆధారంగా కేంద్రం డియర్నెస్ అలవెన్స్‌ను మంజూరు చేస్తుంది. ( వర్క్ ఫ్రం హోం: ఐటీ ఉద్యోగులకు భారీ ఝలక్) -
హనీట్రాప్స్ కోసం ప్రాజెక్ట్ షేర్నీ!
సాక్షి, హైదరాబాద్: దేశంలోని త్రివిధ దళాలు, రక్షణ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, సైంటిస్టులను హనీట్రాప్ చేయడానికి పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ‘ప్రాజెక్టు షేర్నీ’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఇందులో పని చేయడానికి 300 మంది ఆకర్షణీయమైన యువతులను ఎంపిక చేసుకుని వీరికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. డీఆర్డీఓలో పని చేస్తున్న ఓ సీనియర్ సైంటిస్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో, కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఇంజినీర్ దుక్కా మల్లికార్జున్ రెడ్డి శుక్రవారం అరెస్టు అయ్యారు. వీరిద్దరూ ప్రాజెక్ట్ షేర్నీలో పని చేస్తున్న యువతుల వల్లో చిక్కి రహస్య సమాచారం చేరవేశారు. షేర్నీ అంటే ‘ఆడసింహం’ అని అర్థం. ఆరు నెలల పాటు వివిధ అంశాల్లో శిక్షణ.. వీరంతా తమ తమ ప్రాంతాల్లోనే ఉండి ఐఎస్ఐ కోసం పని చేస్తున్నారు. వీరికి ఐఎస్ఐ ఏ స్థాయిలో బ్రెయిన్ వాష్ చేసిందంటే... టార్గెట్ చేసిన వ్యక్తిని హనీ ట్రాప్ చేయడానికి వీడియో కాల్లో నగ్నంగా కనిపించడానికీ వెనుకాడరు. ఎంపికైన 300 మందికీ వివిధ అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. భారత్‌లోని జీవనస్థితిగతులు, భాష, మతపరమైన నమ్మకాలతో పాటు డార్క్ వెబ్ వినియోగం, హనీ ట్రాప్ చేయడం తదితర అంశాల్లో ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చింది. విదేశాలకు చెందిన ఒక్కో యువతికి దాదాపు 50 వరకు భారతీయుల పేర్లతో ప్రొఫైల్స్ ఏర్పాటు చేసిన ఐఎస్ఐ వీటి ద్వారానే హనీట్రాప్స్ చేయిస్తోంది. వీరి కట్టు, బొట్టు, నడక, నడత ప్రతీ అంశమూ భారతీయ యువతుల మాదిరిగా ఉండేలా వీరిని తయారు చేసింది. హనీట్రాప్‌లో విజయం సాధించి, రహస్య సమాచారం సేకరించిన వారికి ప్రత్యేక నజరానాలూ ఐఎస్ఐ అందిస్తోంది. అబోటాబాద్‌లో సోషల్‌మీడియా యూనిట్... దేశంలోని త్రివిధ దళాలు, రక్షణ సంస్థల్లో పని చేస్తున్న అధికారులు, సైంటిస్టులు, ఇతర ఉద్యోగులకు సంబంధించిన సమాచారం ఐఎస్ఐకి వారి సోషల్‌మీడియా ఖాతాల ద్వారానే తెలుస్తోంది. వీటిని విశ్లేషించడం కోసం ఐఎస్ఐ పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో ప్రత్యేక సోషల్‌మీడియా యూనిట్ ఏర్పాటు చేసింది. ఇందులో సుశిక్షితులైన ఐఎస్ఐ ఉద్యోగులతో పాటు పాక్ ఆర్మీ సిబ్బంది, కొందరు హ్యాకర్లు పని చేస్తున్నారు. వీరి ప్రతినిత్యం భారతీయులకు సంబంధించిన సోషల్‌మీడియా ప్రొఫైల్స్‌ను విశ్లేషిస్తుంటారు. వీటిలో తమకు అవసరమైన వారివి ఎంపిక చేసుకుని అధ్యయనం చేస్తారు. అలా తుదిజాబితా రూపొందించిన తర్వాత దాన్ని ప్రాజెక్ట్ షేర్నీలోని యువతకులకు అందిస్తుంది. వీటి ఆధారంగానే ఈ యువతులు టార్గెట్లకు వల వేసి ఆకర్షిస్తారు. అందచందాలతో పాటు డబ్బు ఎర వేసి రహస్య సమాచారం సేకరిస్తారు. తమ పని పూర్తయ్యే వరకు ఐఎస్ఐ కోసం పని చేస్తున్నట్లు ఎదుటి వారికి అనుమానం కూడా రానీయరు. హనీట్రాప్స్‌ను కనిపెట్టడానికి నిఘా వర్గాలతో పాటు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) పని చేస్తున్నాయి. పాకిస్థానీయులు లేకుండా బెటాలియన్.. ప్రాజెక్టు షేర్నీ కోసం కొన్నేళ్లుగా వ్యహాత్మకంగా పని చేసింది. ఇందులో పని చేయడానికి యువతుల ఎంపిక, వారికి శిక్షణ తదితర అంశాల్లో పలు జాగ్రత్తలు తీసుకుంది. 300 మందితో ఏర్పడిన ఈ బెటాలియన్‌లో కనీసం ఒక్క పాకిస్థానీ యువతి కూడా లేదు. ఇందులో పని చేస్తున్న వారంతో భారత్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు చెందిన వాళ్లే ఉన్నారు. ఆయా దేశాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపుల్లో వీరి ఎంపికను రహస్యంగా పూర్తి చేశారు. అక్కడ ఉన్న తమ ఏజెంట్ల ద్వారా ప్రధానం మధ్య, దిగువ మ«ధ్య తరగతి వర్గాల్లో ఆకర్షణీయమైన యువతులను ఉద్యోగాల పేరుతో వల వేసింది. ఆపై డబ్బు ఆశచూపి వారిని ప్రాజెక్టు షేర్నీలో పని చేసేలా ఐఎస్ఐ ఒప్పించింది. (చదవండి: మెర్సీ కిల్లింగ్‌కు అనుమతివ్వాలని ట్వీట్) -
రెండో రోజుకు చేరిన రక్షణ రంగ ఉద్యోగుల సమ్మె
సాక్షి, విశాఖపట్నం : కేంద్ర ప్రభుత్వ విధాలను వ్యతిరేకిస్తూ రక్షణ రంగ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరింది. రక్షణ రంగ సంస్థల్లో ఎఫ్‌డీఐల అనుమతిని వ్యతిరేకించడంతోపాటు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మూడు రోజుల సమ్మెకు రక్షణ రంగ ఉద్యోగ సంఘాలకు చెందిన 3 ఫెడరేషన్లు పిలుపునిచ్చాయి. నావల్ డాక్ యార్డ్‌లోని విజయ్‌నగర్ గేట్ వద్ద ఉద్యోగులు, కార్మికులు మీటింగ్ ఏర్పాటుచేసుకుని నిరసన తెలుపుతున్నారు. వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ ఈ సమ్మెకు సంఘీభావం తెలిపింది. వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ నేతలు కె.శ్రీనివాసరావు, విజయప్రకాష్, ఐఎన్‌సీఈ నేత బి.శ్రీనివాసరెడ్డి, ఎన్సీఆర్ యూనియన్ నేత పి.నాగేశ్వరరావు, సీఐటీయూ నేత జగ్గునాయుడు, ఆలిండియా డిఫెన్స్ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి రెడ్డి వెంకటరావు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రక్షణశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ఉద్యోగిని ఢీ కొన్న చేతక్ యువకుడిని చితకబాదిన రక్షణశాఖ ఉద్యోగులు గేటు, నాలుగు బస్సులు ధ్వంసం సంతోష్‌నగర్: రక్షణ శాఖ ఉద్యోగికి జరిగిన ఓ రోడ్డు ప్రమాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉద్యోగులు ప్రమాదానికి కారణమైన యువకుడిని చితకబాదడంతో బస్తీవాసులు పెద్ద సంఖ్యలో వచ్చి సంబంధిత రక్షణ సంస్థ కార్యాలయంపై ఎదురుదాడికి దిగారు. ఈ ఘటనలో రక్షణ సంస్థ కార్యాలయం గేటుతో పాటు నాలుగు ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జీ చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. అఫీస్బాబానగర్కు చెందిన మహ్మదా షా నవాజ్ (19) రాత్రి 8.30 గంటలకు తన చేతక్‌పై సంతోష్‌నగర్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. రక్షాపురం చౌరస్తా వద్దకు రాగానే సైకిల్‌పై వెళ్తున్న రక్షణ శాఖ ఉద్యోగి అస్వాన్కోనిని ఢీ కొట్టాడు. దీంతో ఆవేశపడ్డ ఆ ఉద్యోగి తన తోటి ఉద్యోగుల సహాయంతో నవాజ్‌ను చితకబాది సమీపంలో ఉన్న రక్షణశాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈ విషయం గమనించిన స్థానికులు వారి బంధువులకు సమాచారం అందించారు. అఫీజ్బాబానగర్కు చెందిన సుమారు 15 వందల మంది యువకులు సంబంధిత కార్యాలయం వద్దకు వచ్చి ప్రతిదాడికి దిగారు. కార్యాలయం గేట్‌ను కూడా ధ్వంసం చేశారు. అలాగే చాంద్రాయగుట్ట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులపైకి రాళ్లురువ్వారు. నాలుగు బస్సులు ధ్వంసం అయ్యాయి. విషయం తెలుసుకున్న కంచన్‌బాగ్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని లాఠీచార్జి చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాషాఖాద్రి అక్కడికి వచ్చి గాయపడ్డ నవాజ్‌ను పరామర్శించారు. ఇరుపక్షాల ఫిర్యాదుల మేరకు కంచ న్‌బాగ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా అదనపు బలగాలు ఘటనా స్థలంలో మోహరించారు. కొంత మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.