- ఉద్యోగిని ఢీ కొన్న చేతక్
- యువకుడిని చితకబాదిన రక్షణశాఖ ఉద్యోగులు
- గేటు, నాలుగు బస్సులు ధ్వంసం
సంతోష్‌నగర్: రక్షణ శాఖ ఉద్యోగికి జరిగిన ఓ రోడ్డు ప్రమాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉద్యోగులు ప్రమాదానికి కారణమైన యువకుడిని చితకబాదడంతో బస్తీవాసులు పెద్ద సంఖ్యలో వచ్చి సంబంధిత రక్షణ సంస్థ కార్యాలయంపై ఎదురుదాడికి దిగారు. ఈ ఘటనలో రక్షణ సంస్థ కార్యాలయం గేటుతో పాటు నాలుగు ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జీ చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.
అఫీస్‌బాబానగర్‌కు చెందిన మహ్మదా షా నవాజ్ (19) రాత్రి 8.30 గంటలకు తన చేతక్‌పై సంతోష్‌నగర్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. రక్షాపురం చౌరస్తా వద్దకు రాగానే సైకిల్‌పై వెళ్తున్న రక్షణ శాఖ ఉద్యోగి అస్వాన్‌కోనిని ఢీ కొట్టాడు. దీంతో ఆవేశపడ్డ ఆ ఉద్యోగి తన తోటి ఉద్యోగుల సహాయంతో నవాజ్‌ను చితకబాది సమీపంలో ఉన్న రక్షణశాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈ విషయం గమనించిన స్థానికులు వారి బంధువులకు సమాచారం అందించారు. అఫీజ్‌బాబానగర్‌కు చెందిన సుమారు 15 వందల మంది యువకులు సంబంధిత కార్యాలయం వద్దకు వచ్చి ప్రతిదాడికి దిగారు. కార్యాలయం గేట్‌ను కూడా ధ్వంసం చేశారు. అలాగే చాంద్రాయగుట్ట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులపైకి రాళ్లురువ్వారు.
నాలుగు బస్సులు ధ్వంసం అయ్యాయి. విషయం తెలుసుకున్న కంచన్‌బాగ్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని లాఠీచార్జి చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాషాఖాద్రి అక్కడికి వచ్చి గాయపడ్డ నవాజ్‌ను పరామర్శించారు. ఇరుపక్షాల ఫిర్యాదుల మేరకు కంచ న్‌బాగ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా అదనపు బలగాలు ఘటనా స్థలంలో మోహరించారు. కొంత మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.