Honey Trapping Special Magazine Story In Telugu: ఐఎస్‌ఐ ఏజెంట్‌ పట్టించిన రా ఏజెంట్‌ నిధి! - Sakshi
Sakshi News home page

హనీ ట్రాపింగ్‌.. ఐఎస్‌ఐ ఏజెంట్‌ పట్టించిన రా ఏజెంట్‌ నిధి!

Dec 19 2021 11:02 AM | Updated on Dec 19 2021 9:31 PM

The Trip Crime story In funday magazine - Sakshi

రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) ఆఫీస్‌.
మూడు అంతస్తుల భవనం.
ఆ భవనంలోని మూడవ అంతస్తులో ఒక సౌండ్‌ ప్రూఫ్‌ గది.
ఆ గదిలో ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. వారి మొహాలలో తెలియని ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ఆ ముగ్గురిలో ఒకరు ‘రా చీఫ్‌’ శ్రీకర్‌ అగర్వాల్‌ .. మిగిలిన ఇద్దరు రా ఏజెంట్స్‌.. తుషార్‌ సింగ్, ఆకాష్‌ వర్మ.
చీఫ్‌ మిగిలిన ఇద్దరినీ చూస్తూ .. ‘మనదేశానికి సంబంధించిన రహస్యాలను సేకరించిన ఐఎస్‌ఐ ఏజెంట్‌ జుబ్బార్‌ అలీ ఇప్పుడు ఎక్కడున్నాడు?’ ప్రశ్నించాడు.
అందుకు సమాధానంగా ఆకాష్‌ వర్మ ‘బాస్‌ ఆ జుబ్బార్‌ అలీ ఇప్పుడు మారుపేరుతో తిరుగుతున్నట్టు కనిపెట్టాం. ఇంకో నాలుగైదు రోజులలో అతడు ఇస్లామాబాద్‌ వెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడు. అతడితో పాటే మన దేశ రహస్యాలు కూడా వెళ్లిపోతాయి’ ఆందోళనగా వివరించాడు.
చీఫ్‌ శ్రీకర్‌ అగర్వాల్‌ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత .. వారిని చూస్తూ ‘జుబ్బార్‌ అలీ ప్రతి కదలికని జాగ్రత్తగా గమనించండి. అతడు ఇస్లామాబాద్‌ ఎప్పుడు బయలుదేరుతున్నాడో సమాచారం సేకరించండి’ అని చెప్తూ ఎవరికో ఫోన్‌ చేశాడు.
చీఫ్‌ ఫోన్‌లో చెప్తున్న విషయం వింటుండగానే ఆకాష్‌ వర్మ .. తుషార్‌ సింగ్‌ మొహాల్లో ఉన్న ఆందోళన ఒక్కసారిగా మాయమైపోయింది. లేచి నిలబడి  తమ చీఫ్‌కు విష్‌ చేసి వారిద్దరూ బయటకు నడిచారు.  

ముంబై ...
ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ ..
ముంబై నుండి పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌ వెళ్ళవలసిన జెట్‌ ఎయిర్‌ వేస్‌ విమానం సిద్ధంగా ఉంది.
విమానం ఎక్కుతున్న ప్రయాణికులందరినీ ఎయిర్‌ హోస్టెస్‌ నిధి.. చిరునవ్వుతో లోపలకు ఆహ్వానిస్తోంది.
చిన్న సూట్‌కేసు పట్టుకుని అటూ ఇటూ గమనిస్తూ విమానం ఎక్కుతున్న జయంత్‌కు  ‘స్వాగతం’ అంటూ నమస్కరించింది నిధి.
నిధిని చూడగానే ఆమె అందం జయంత్‌ను ఆకర్షించింది. ఆమెతో పరిచయం పెంచుకోవాలని మనసులో తహతహలాడిపోయాడు. తాను ఇస్లామాబాద్‌ వెళ్ళడానికి దాదాపు పది గంటల సమయం పడుతుంది. ఈ లోపు ఆమెతో పరిచయం పెంచుకుని తనకున్న ఒకే ఒక్క  బలహీనతను ఉపయోగించుకోవాలని  నిశ్చయించుకున్నాడు.
నిధి కూడా జయంత్‌ని చూసి నవ్వుతూ చనువుగా మాట్లాడటం మొదలుపెట్టింది. కూల్‌ డ్రింక్స్‌ అందించింది. ఆమె నవ్వులు చూస్తూ తనను తాను మరచిపోయాడు జయంత్‌. తానొక బిజినెస్‌ మాగ్నెట్‌ని అని అత్యవసర పని మీద ఇస్లామాబాద్‌  వెళ్ళవలసి ఉందని తనను తాను పరిచయం చేసుకున్నాడు జయంత్‌.
విమానంలో వడ్డించే ఆహార పదార్థాలన్నింటినీ తన వలపువన్నెలతో కలిపి వడ్డించింది.

నిధిని చూస్తూ తినబోతున్న జయంత్‌కు అతడు కట్టుకున్న వాచీలో ఏదో మెసేజ్‌ వచ్చింది. అది చదువుతూ ఉన్న జయంత్‌ లో ఒక్కసారిగా టెన్షన్‌ మొదలైంది. తినడం ఆపేసి ఆలోచిస్తున్న అతడిని నిధి గమనిస్తోంది.
వెంటనే అతడి వద్దకు వచ్చి ‘ఏమైంది?’ అని అడుగుతూ చనువుగా తినిపించడం ప్రారంభించింది.
నిధి చనువు అతడిలో ఏవో అలోచనలను రేపుతోంది. నిధిని చూస్తూ  అతడు.. ‘నిధీ వచ్చే ఎయిర్‌ పోర్ట్‌  దోహా ఎయిర్‌ పోర్ట్‌ కదా!’ అని అడిగాడు.
ఔనని తలాడిస్తూ ఎందుకన్నట్టు చూసింది నిధి. 
‘అక్కడ విమానం ఎంతసేపు ఆగుతుంది?’ అని అడిగాడు మళ్లీ. 
‘దాదాపు మూడు గంటలు ఆగుతుంది’ అని  చెప్పింది నిధి. 
‘అక్కడ నాకు చిన్న సహాయం చేస్తావా?’ అభ్యర్థించాడు జయంత్‌.
 ‘ తప్పకుండా! మీరు  ఎలాంటి సాయం చేయమన్నా చేస్తాను’ భరోసా ఇచ్చింది నిధి.  

ఖతార్‌లోని దోహా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ ...
విమానం నుండి దిగిన జయంత్‌ , నిధి..  ఇద్దరూ బయటకు వచ్చారు. 
జయంత్‌ చూడకుండా తన మణికట్టుకున్న వాచీ లాంటి దాంట్లో ‘స్టార్ట్‌’ అని మెసెజ్‌ పంపింది నిధి.
ఇద్దరూ కలసి ముందుకు నడుస్తున్నారు. 
‘మనం ఎక్కడికి వెళ్తున్నాం?’  ఏమీ తెలియనట్టు అడిగింది నిధి.
అందుకు జయంత్‌ ‘ఇక్కడ ఒక నెట్‌ సెంటర్‌లో చిన్న పని ఉంది. అది పూర్తి చేసుకున్న తర్వాత నువ్వు ఎక్కడికి అంటే అక్కడికి వెళ్దాం’ అన్నాడు.. నిధితో గడపబోయే క్షణాలను ఊహించుకుంటూ.  
‘ఇంకో రెండుగంటల్లో విమానం తిరిగి బయలుదేరబోతుంది కదా.. మనం ఆ లోపే వెళ్ళాలి కదా!’ అన్నది నిధి అమాయకంగా కళ్ళు ఆర్పుతూ. 
‘కేవలం గంటలో తిరిగి వెళ్ళిపోదాం’  అన్నాడు అతడు. 
‘సరే’ అంటూనే ‘ఇప్పుడు మనం నెట్‌ సెంటర్‌కి వెళ్లి తీరాలా? టైం వేస్ట్‌ కదా! మనం ఇక్కడ నుండి ఇటే హోటల్‌ రూమ్‌కి వెళ్లి.. తిరిగి ఎయిర్‌ పోర్ట్‌కి వచ్చేద్దాం’ క్రీగంట అతడిని గమనిస్తూ సూచించింది నిధి.
ఆ మాటలు వినగానే గతుక్కుమన్నాడు జయంత్‌. ‘నెట్‌ సెంటర్‌లో చాలా అత్యవసరమైన పని ఉంది’ అని చెప్పాడు. 
‘నాకంటే అత్యవసరమైన పనా?’ గోముగా ప్రశ్నించింది నిధి. 
ఆమె మాటలకు ఉలిక్కిపడి సర్దుకుంటూ ‘అలా కాదు డియర్‌ ..  నా బ్రీఫ్‌కేసులో కొన్ని ముఖ్యమైన పేపర్లు ఉన్నాయి. ఆ పేపర్లలో ఉన్న సమాచారాన్ని మొత్తం ఒక చిప్‌లో కాపీ చేసుకోవాలి. అందుకే’ అంటూ ఆమెను సముదాయించే ప్రయత్నం చేశాడు. 

‘సరే అయితే పదండి వెళ్దాం’ అంటున్న నిధితో కలసి చిన్న సందులో.. లోపలికి ఉన్న ఒక నెట్‌ సెంటర్‌లోకి అడుగుపెట్టాడు జయంత్‌.
లోపల ఎవరూ లేరు. తనకు బాగా అలవాటు ఉన్నట్టుగా లోపలికి వెళ్ళాడు జయంత్‌. ఒక సిస్టం ముందు కూర్చుని తన బ్రీఫ్‌కేసు తెరిచాడు. అందులో ఉన్న పేపర్లను బయటకు తీశాడు. అందులో ఉర్దూలో రాసి ఉంది. ఆ పేపర్లను జాగ్రత్తగా పట్టుకుని ఒక చిప్‌ బయటకు తీశాడు. అదంతా గమనిస్తున్న నిధిని దగ్గరకు తీసుకుంటూ తన పని చేసుకుంటున్నాడు జయంత్‌.
ఇంతలో నిధి లేచి స్పీడ్‌గా బయటకు వెళ్ళింది. నిధి కదలికను నిశితంగా గమనిస్తున్న జయంత్‌ కంగారుగా పైకి లేచాడు. అక్కడ నుండి బయటకు వెళ్ళేలోపు ...
ఒక పక్కగా దాక్కుని ఉన్న  తుషార్‌ సింగ్, ఆకాష్‌ వర్మ.. జయంత్‌ను చూడగానే తమ చేతిలో ఉన్న తుపాకిని పేల్చారు. వెంటనే కిందపడిపోయాడు జయంత్‌.
అతడి చేతిలోని చిప్‌ను తీసుకుంటూ..‘ఈ రోజుతో నీ ఆట కట్టింది.. మిస్టర్‌ జయంత్‌ అలియాస్‌ జుబ్బార్‌ అలీ’ అంది నిధి. 
ఆ మాటలకు  జుబ్బార్‌ అలీ మొహం ఒక్కసారిగా మాడిపోయింది.
ఇంతలో అక్కడికి వచ్చిన ఆకాష్‌ వర్మ, తుషార్‌ సింగ్‌లిద్దరూ జుబ్బార్‌ అలీని తమ అదుపులోకి తీసుకున్నారు.
ఆకాష్‌ వర్మ తమ చీఫ్‌కు ఫోన్‌ చేశాడు.
‘బాస్‌ .. మన యంగ్‌ అండ్‌ డైనమిక్‌ ఏజెంట్‌ నిధి అలియాస్‌ సోహానా.. మీరు అప్పగించిన టాస్క్‌ను విజయవంతంగా పూర్తి  చేసింది. ప్రస్తుతం జుబ్బార్‌ అలీ మా వద్దనే ఉన్నాడు. మనదేశ రహస్యాలు జుబ్బార్‌ అలీ చేతి నుండి  సోహానా చేతిలోకి వచ్చి భద్రంగా ఉన్నాయి. మేము వెంటనే ఇండియా బయల్దేరుతున్నాం’ అని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు.
అంతా వింటున్న ఐఎస్‌ఐ ఏజెంట్‌ జుబ్బార్‌ అలీ మొహం పాలిపోయింది. తనకున్న బలహీనత మాత్రమే ఈ రోజు తాను దొరికిపోవడానికి కారణం అయింది అనుకుంటూ చింతిస్తూ వారి వెంట నడిచాడు.

రా ఆఫీస్‌ ...
చీఫ్‌ శ్రీకర్‌ అగర్వాల్‌ ఎదుట ఉన్నారు సోహానా.. తుషార్‌ సింగ్‌.. ఆకాష్‌ వర్మ.
సోహానా తనకు అప్పగించిన చిప్‌లో ఏమున్నాయో చూస్తున్నాడు చీఫ్‌.
‘సోహానా.. వాడిని దోహాలో విమానం దింపి నెట్‌ సెంటర్‌కి ఎలా తీసుకొచ్చావు?’ అంటూ సోహానాను ప్రశ్నించాడు ఆకాష్‌ వర్మ.
‘అతడు కట్టుకున్న వాచీకి నేనే మెసేజ్‌ పంపించాను. నీ మీద నిఘా ఎక్కువగా ఉంది. నువ్వు వెంటనే నీ వద్ద ఉన్న సమాచారాన్ని చిప్‌ రూపంలో ఉంచడం మంచిది అని. వాడు వెంటనే నన్నే సహాయం చేయమని అడిగాడు’ అని నవ్వుతూ చెప్పింది సోహానా.
విమానం ఎక్కగానే జుబ్బార్‌ అలీ దృష్టిలోపడి అతడిని ఆకర్షించాను. జయంత్‌గా వేషం వేసినా అతడి పోలికలను కనిపెట్టాను. అతడికి అనుకూలంగా మాట్లాడుతూ చనువుగా ఉన్నట్టు నటించాను. ఇస్లామాబాద్‌ వెళితే మనకి అతడు దొరకడని అర్థమైంది. అందుకే దోహా ఎయిర్‌ పోర్ట్‌లో దిగేటట్టు చేశాను’ అని చెప్తూ ముగించింది సోహానా.
 ‘వెరీ గుడ్‌ డియర్‌ సోహానా..  మీరందరూ మనదేశ పరువు ప్రతిష్ఠలను కాపాడారు’ అంటూ ఆ ముగ్గురినీ అభినందించాడు రా చీఫ్‌ శ్రీకర్‌ అగర్వాల్‌.

రాటుదేలిన సైనికాధికారి అయినా .. కాకలు తీరిన కార్పొరేట్‌ దిగ్గజమైనా ఆ గూఢచర్య వ్యూహంలో.. ఆ తీయని తంత్రంలో చిక్కుకుని రహస్యాలు కక్కాల్సిందే.
వేయి ఫిరంగులు, వంద శతఘ్నులు కలిస్తే... ఒక మహిళా గూఢచారి.
చాణక్యవ్యూహం, శకుని తంత్రం కలిస్తే
‘ది... ట్రా... ప్‌...’
ఈ హనీ ట్రాపింగ్‌లో ఇప్పటివరకు చాలామంది చిక్కుకుని ఎన్నో రహస్యాలను అవలీలగా అవతలివారికి అందచేశారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement