RAW agent
-
హనీ ట్రాపింగ్.. ఐఎస్ఐ ఏజెంట్ పట్టించిన రా ఏజెంట్ నిధి!
రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) ఆఫీస్. మూడు అంతస్తుల భవనం. ఆ భవనంలోని మూడవ అంతస్తులో ఒక సౌండ్ ప్రూఫ్ గది. ఆ గదిలో ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. వారి మొహాలలో తెలియని ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆ ముగ్గురిలో ఒకరు ‘రా చీఫ్’ శ్రీకర్ అగర్వాల్ .. మిగిలిన ఇద్దరు రా ఏజెంట్స్.. తుషార్ సింగ్, ఆకాష్ వర్మ. చీఫ్ మిగిలిన ఇద్దరినీ చూస్తూ .. ‘మనదేశానికి సంబంధించిన రహస్యాలను సేకరించిన ఐఎస్ఐ ఏజెంట్ జుబ్బార్ అలీ ఇప్పుడు ఎక్కడున్నాడు?’ ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా ఆకాష్ వర్మ ‘బాస్ ఆ జుబ్బార్ అలీ ఇప్పుడు మారుపేరుతో తిరుగుతున్నట్టు కనిపెట్టాం. ఇంకో నాలుగైదు రోజులలో అతడు ఇస్లామాబాద్ వెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడు. అతడితో పాటే మన దేశ రహస్యాలు కూడా వెళ్లిపోతాయి’ ఆందోళనగా వివరించాడు. చీఫ్ శ్రీకర్ అగర్వాల్ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత .. వారిని చూస్తూ ‘జుబ్బార్ అలీ ప్రతి కదలికని జాగ్రత్తగా గమనించండి. అతడు ఇస్లామాబాద్ ఎప్పుడు బయలుదేరుతున్నాడో సమాచారం సేకరించండి’ అని చెప్తూ ఎవరికో ఫోన్ చేశాడు. చీఫ్ ఫోన్లో చెప్తున్న విషయం వింటుండగానే ఆకాష్ వర్మ .. తుషార్ సింగ్ మొహాల్లో ఉన్న ఆందోళన ఒక్కసారిగా మాయమైపోయింది. లేచి నిలబడి తమ చీఫ్‌కు విష్ చేసి వారిద్దరూ బయటకు నడిచారు. ముంబై ... ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ .. ముంబై నుండి పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ వెళ్ళవలసిన జెట్ ఎయిర్ వేస్ విమానం సిద్ధంగా ఉంది. విమానం ఎక్కుతున్న ప్రయాణికులందరినీ ఎయిర్ హోస్టెస్ నిధి.. చిరునవ్వుతో లోపలకు ఆహ్వానిస్తోంది. చిన్న సూట్‌కేసు పట్టుకుని అటూ ఇటూ గమనిస్తూ విమానం ఎక్కుతున్న జయంత్‌కు ‘స్వాగతం’ అంటూ నమస్కరించింది నిధి. నిధిని చూడగానే ఆమె అందం జయంత్‌ను ఆకర్షించింది. ఆమెతో పరిచయం పెంచుకోవాలని మనసులో తహతహలాడిపోయాడు. తాను ఇస్లామాబాద్ వెళ్ళడానికి దాదాపు పది గంటల సమయం పడుతుంది. ఈ లోపు ఆమెతో పరిచయం పెంచుకుని తనకున్న ఒకే ఒక్క బలహీనతను ఉపయోగించుకోవాలని నిశ్చయించుకున్నాడు. నిధి కూడా జయంత్‌ని చూసి నవ్వుతూ చనువుగా మాట్లాడటం మొదలుపెట్టింది. కూల్ డ్రింక్స్ అందించింది. ఆమె నవ్వులు చూస్తూ తనను తాను మరచిపోయాడు జయంత్. తానొక బిజినెస్ మాగ్నెట్ని అని అత్యవసర పని మీద ఇస్లామాబాద్ వెళ్ళవలసి ఉందని తనను తాను పరిచయం చేసుకున్నాడు జయంత్. విమానంలో వడ్డించే ఆహార పదార్థాలన్నింటినీ తన వలపువన్నెలతో కలిపి వడ్డించింది. నిధిని చూస్తూ తినబోతున్న జయంత్‌కు అతడు కట్టుకున్న వాచీలో ఏదో మెసేజ్ వచ్చింది. అది చదువుతూ ఉన్న జయంత్ లో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. తినడం ఆపేసి ఆలోచిస్తున్న అతడిని నిధి గమనిస్తోంది. వెంటనే అతడి వద్దకు వచ్చి ‘ఏమైంది?’ అని అడుగుతూ చనువుగా తినిపించడం ప్రారంభించింది. నిధి చనువు అతడిలో ఏవో అలోచనలను రేపుతోంది. నిధిని చూస్తూ అతడు.. ‘నిధీ వచ్చే ఎయిర్ పోర్ట్ దోహా ఎయిర్ పోర్ట్ కదా!’ అని అడిగాడు. ఔనని తలాడిస్తూ ఎందుకన్నట్టు చూసింది నిధి. ‘అక్కడ విమానం ఎంతసేపు ఆగుతుంది?’ అని అడిగాడు మళ్లీ. ‘దాదాపు మూడు గంటలు ఆగుతుంది’ అని చెప్పింది నిధి. ‘అక్కడ నాకు చిన్న సహాయం చేస్తావా?’ అభ్యర్థించాడు జయంత్. ‘ తప్పకుండా! మీరు ఎలాంటి సాయం చేయమన్నా చేస్తాను’ భరోసా ఇచ్చింది నిధి. ఖతార్‌లోని దోహా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ... విమానం నుండి దిగిన జయంత్ , నిధి.. ఇద్దరూ బయటకు వచ్చారు. జయంత్ చూడకుండా తన మణికట్టుకున్న వాచీ లాంటి దాంట్లో ‘స్టార్ట్’ అని మెసెజ్ పంపింది నిధి. ఇద్దరూ కలసి ముందుకు నడుస్తున్నారు. ‘మనం ఎక్కడికి వెళ్తున్నాం?’ ఏమీ తెలియనట్టు అడిగింది నిధి. అందుకు జయంత్ ‘ఇక్కడ ఒక నెట్ సెంటర్లో చిన్న పని ఉంది. అది పూర్తి చేసుకున్న తర్వాత నువ్వు ఎక్కడికి అంటే అక్కడికి వెళ్దాం’ అన్నాడు.. నిధితో గడపబోయే క్షణాలను ఊహించుకుంటూ. ‘ఇంకో రెండుగంటల్లో విమానం తిరిగి బయలుదేరబోతుంది కదా.. మనం ఆ లోపే వెళ్ళాలి కదా!’ అన్నది నిధి అమాయకంగా కళ్ళు ఆర్పుతూ. ‘కేవలం గంటలో తిరిగి వెళ్ళిపోదాం’ అన్నాడు అతడు. ‘సరే’ అంటూనే ‘ఇప్పుడు మనం నెట్ సెంటర్‌కి వెళ్లి తీరాలా? టైం వేస్ట్ కదా! మనం ఇక్కడ నుండి ఇటే హోటల్ రూమ్‌కి వెళ్లి.. తిరిగి ఎయిర్ పోర్ట్‌కి వచ్చేద్దాం’ క్రీగంట అతడిని గమనిస్తూ సూచించింది నిధి. ఆ మాటలు వినగానే గతుక్కుమన్నాడు జయంత్. ‘నెట్ సెంటర్లో చాలా అత్యవసరమైన పని ఉంది’ అని చెప్పాడు. ‘నాకంటే అత్యవసరమైన పనా?’ గోముగా ప్రశ్నించింది నిధి. ఆమె మాటలకు ఉలిక్కిపడి సర్దుకుంటూ ‘అలా కాదు డియర్ .. నా బ్రీఫ్‌కేసులో కొన్ని ముఖ్యమైన పేపర్లు ఉన్నాయి. ఆ పేపర్లలో ఉన్న సమాచారాన్ని మొత్తం ఒక చిప్‌లో కాపీ చేసుకోవాలి. అందుకే’ అంటూ ఆమెను సముదాయించే ప్రయత్నం చేశాడు. ‘సరే అయితే పదండి వెళ్దాం’ అంటున్న నిధితో కలసి చిన్న సందులో.. లోపలికి ఉన్న ఒక నెట్ సెంటర్లోకి అడుగుపెట్టాడు జయంత్. లోపల ఎవరూ లేరు. తనకు బాగా అలవాటు ఉన్నట్టుగా లోపలికి వెళ్ళాడు జయంత్. ఒక సిస్టం ముందు కూర్చుని తన బ్రీఫ్‌కేసు తెరిచాడు. అందులో ఉన్న పేపర్లను బయటకు తీశాడు. అందులో ఉర్దూలో రాసి ఉంది. ఆ పేపర్లను జాగ్రత్తగా పట్టుకుని ఒక చిప్ బయటకు తీశాడు. అదంతా గమనిస్తున్న నిధిని దగ్గరకు తీసుకుంటూ తన పని చేసుకుంటున్నాడు జయంత్. ఇంతలో నిధి లేచి స్పీడ్‌గా బయటకు వెళ్ళింది. నిధి కదలికను నిశితంగా గమనిస్తున్న జయంత్ కంగారుగా పైకి లేచాడు. అక్కడ నుండి బయటకు వెళ్ళేలోపు ... ఒక పక్కగా దాక్కుని ఉన్న తుషార్ సింగ్, ఆకాష్ వర్మ.. జయంత్‌ను చూడగానే తమ చేతిలో ఉన్న తుపాకిని పేల్చారు. వెంటనే కిందపడిపోయాడు జయంత్. అతడి చేతిలోని చిప్‌ను తీసుకుంటూ..‘ఈ రోజుతో నీ ఆట కట్టింది.. మిస్టర్ జయంత్ అలియాస్ జుబ్బార్ అలీ’ అంది నిధి. ఆ మాటలకు జుబ్బార్ అలీ మొహం ఒక్కసారిగా మాడిపోయింది. ఇంతలో అక్కడికి వచ్చిన ఆకాష్ వర్మ, తుషార్ సింగ్‌లిద్దరూ జుబ్బార్ అలీని తమ అదుపులోకి తీసుకున్నారు. ఆకాష్ వర్మ తమ చీఫ్‌కు ఫోన్ చేశాడు. ‘బాస్ .. మన యంగ్ అండ్ డైనమిక్ ఏజెంట్ నిధి అలియాస్ సోహానా.. మీరు అప్పగించిన టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం జుబ్బార్ అలీ మా వద్దనే ఉన్నాడు. మనదేశ రహస్యాలు జుబ్బార్ అలీ చేతి నుండి సోహానా చేతిలోకి వచ్చి భద్రంగా ఉన్నాయి. మేము వెంటనే ఇండియా బయల్దేరుతున్నాం’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అంతా వింటున్న ఐఎస్ఐ ఏజెంట్ జుబ్బార్ అలీ మొహం పాలిపోయింది. తనకున్న బలహీనత మాత్రమే ఈ రోజు తాను దొరికిపోవడానికి కారణం అయింది అనుకుంటూ చింతిస్తూ వారి వెంట నడిచాడు. రా ఆఫీస్ ... చీఫ్ శ్రీకర్ అగర్వాల్ ఎదుట ఉన్నారు సోహానా.. తుషార్ సింగ్.. ఆకాష్ వర్మ. సోహానా తనకు అప్పగించిన చిప్‌లో ఏమున్నాయో చూస్తున్నాడు చీఫ్. ‘సోహానా.. వాడిని దోహాలో విమానం దింపి నెట్ సెంటర్‌కి ఎలా తీసుకొచ్చావు?’ అంటూ సోహానాను ప్రశ్నించాడు ఆకాష్ వర్మ. ‘అతడు కట్టుకున్న వాచీకి నేనే మెసేజ్ పంపించాను. నీ మీద నిఘా ఎక్కువగా ఉంది. నువ్వు వెంటనే నీ వద్ద ఉన్న సమాచారాన్ని చిప్ రూపంలో ఉంచడం మంచిది అని. వాడు వెంటనే నన్నే సహాయం చేయమని అడిగాడు’ అని నవ్వుతూ చెప్పింది సోహానా. విమానం ఎక్కగానే జుబ్బార్ అలీ దృష్టిలోపడి అతడిని ఆకర్షించాను. జయంత్‌గా వేషం వేసినా అతడి పోలికలను కనిపెట్టాను. అతడికి అనుకూలంగా మాట్లాడుతూ చనువుగా ఉన్నట్టు నటించాను. ఇస్లామాబాద్ వెళితే మనకి అతడు దొరకడని అర్థమైంది. అందుకే దోహా ఎయిర్ పోర్ట్‌లో దిగేటట్టు చేశాను’ అని చెప్తూ ముగించింది సోహానా. ‘వెరీ గుడ్ డియర్ సోహానా.. మీరందరూ మనదేశ పరువు ప్రతిష్ఠలను కాపాడారు’ అంటూ ఆ ముగ్గురినీ అభినందించాడు రా చీఫ్ శ్రీకర్ అగర్వాల్. రాటుదేలిన సైనికాధికారి అయినా .. కాకలు తీరిన కార్పొరేట్ దిగ్గజమైనా ఆ గూఢచర్య వ్యూహంలో.. ఆ తీయని తంత్రంలో చిక్కుకుని రహస్యాలు కక్కాల్సిందే. వేయి ఫిరంగులు, వంద శతఘ్నులు కలిస్తే... ఒక మహిళా గూఢచారి. చాణక్యవ్యూహం, శకుని తంత్రం కలిస్తే ‘ది... ట్రా... ప్...’ ఈ హనీ ట్రాపింగ్‌లో ఇప్పటివరకు చాలామంది చిక్కుకుని ఎన్నో రహస్యాలను అవలీలగా అవతలివారికి అందచేశారని సమాచారం. -
రా ఏజెంట్‌గా ప్రభాస్..హాలీవుడ్ స్టయిల్లో ఉంటుందట!
‘సాహో’ చిత్రం తర్వాత ప్రభాస్ జోరు పెంచారు.. వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలను అంగీకరిస్తున్నారు. ఇప్పటికే ‘రాధేశ్యామ్’ సినిమా దాదాపు పూర్తి కాగా ‘ఆదిపురుష్, సలార్’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కమిట్ అయిన సినిమా షూటింగ్ ఆరంభం కావాల్సి ఉంది. ఇవి కాకుండా హిందీ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారనే వార్త వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారన్నది తాజా టాక్. ఈ క్యారెక్టర్ హాలీవుడ్ స్టయిల్లో ఉంటుందని సమాచారం. -
మహానగరంలో ‘మాయగాడు’
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్ : మహానగరంలో మాయగాడు ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. విశాఖ కేంద్రంగా మోసాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న మోసగాడిని ఏలూరు వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. మెడికల్ సీటు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి రూ.15 లక్షలు కాజేసి చేతులెత్తేయటంతో బాధితుడు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు శ్రీరామ్‌నగర్‌కు చెందిన పడాల సత్యనారాయణ కుమారుడు 2016లో ఎంసెట్ రాయగా పెద్ద ర్యాంకు వచ్చింది. ఎలాగైనా తన కుమారుడిని డాక్టర్ చదివిం చా లని భావించిన సత్యనారాయణ ఏలూరు వన్‌టౌ న్కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ సేనాపతి లక్ష్మీశ్రీ నివాస్ అశోక్ అల్లుడు కిలపర్తి సందర్శ్‌ను కలి శాడు. సందర్శ్ తాను విశాఖ నేవీలో కమాండర్‌గా ఉద్యోగం చేస్తున్నట్టు, తనకు బడా అధికారులు, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని, మెడికల్ సీటు కావాలంటే రూ.15 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని నమ్మించాడు. దీంతో సత్యనారాయణ తన ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి సందర్శ్‌కు ఇచ్చాడు. ఏలూరు ఆశ్రంలో మెడికల్ సీటు వచ్చేస్తుందని నమ్మించాడు. అయినా ఎంతకీ సీటు రాకపోవడంతో సత్యనారాయణ గతేడాది నవంబర్ 17న కేసు పెట్టాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సందర్శ్‌ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచగా, న్యాయమూర్తి అతడికి 14 రోజుల రిమాండ్ విధించారు. రా ఏజెంట్ అంటూ నకిలీ గుర్తింపు కార్డులు రా ఏజెంట్‌గా, ప్రధానికి సెక్యూరిటీగా ఉంటానంటూ, నేవీలో కమాండర్‌ని అంటూ నకిలీ గుర్తింపు కార్డులు చూపిస్తూ జనాలను మోసాలు చేయటం సందర్శ్ నైజం. ఏలూరులోనూ కొందరు యువకులు, వ్యక్తుల వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. అయితే సందర్శ్ పోలీసు కానిస్టేబుల్ అల్లుడు కావటంతో పోలీసు అధికారులు అతడిపై ఈగ కూడా వాలనివ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. సందర్శ్‌పై విశాఖ పట్నం టూటౌన్, మువ్వలపాలెంలో స్టేషన్లలోనూ కేసులు ఉన్నాయి. -
యూ టర్న్ తీసుకున్న పాకిస్థాన్
-
యూ టర్న్ తీసుకున్న పాకిస్థాన్
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్ గూఢచారిగా పాకిస్థాన్ ఆరోపణలు చేసిన కుల్‌భూషణ్ జాదవ్ అప్పగింత విషయంలో ఆ దేశం యూ టర్న్ తీసుకుంది. తమ దేశంలో జాదవ్ విద్రోహ చర్యలకు పాల్పడ్డాడని, తమ దగ్గర బలమైన ఆధారాలున్నాయని, ఆయన్ను భారత్‌కు అప్పగించబోమని పాక్ విదేశీ వ్యవహారాల శాఖ అధికారి సర్తాజ్ అజీజ్ చెప్పారు. జాదవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. గతేడాది మార్చి 3న పాకిస్థాన్‌లోని బెలూచిస్తాన్‌లో జాదవ్‌ను అరెస్ట్ చేశారు. జాదవ్ రా ఏజెంట్ అని, ఆయన 2013 నుంచి తమ దేశంలో విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడని పాక్ అధికారులు ఆరోపించారు. పాక్ ఆరోపణలను భారత్ అప్పట్లో ఖండించింది. గతేడాది డిసెంబర్లో అజీజ్ మాట్లాడుతూ.. జాదవ్ నేరం చేసినట్టు తగిన ఆధారాలు లేవని చెప్పారు. దీంతో ఆయన్ను భారత్‌కు అప్పగిస్తారని భావించారు. అజీజ్ తాజాగా మాటమారుస్తూ.. పాక్‌లో జాదవ్ విద్రోహ, ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డాడని, ఆయనపై కేసు నమోదు చేశామని చెప్పారు. పాక్ ఆరోపణల్ని భారత్ తోసిపుచ్చింది. పాక్ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని, జాదవ్ దారితప్పి పాక్ భూభాగంలోకి వెళ్లాడని భారత్ అధికారులు చెప్పారు.