యూ టర్న్ తీసుకున్న పాకిస్థాన్
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్ గూఢచారిగా పాకిస్థాన్ ఆరోపణలు చేసిన కుల్‌భూషణ్ జాదవ్ అప్పగింత విషయంలో ఆ దేశం యూ టర్న్ తీసుకుంది. తమ దేశంలో జాదవ్ విద్రోహ చర్యలకు పాల్పడ్డాడని, తమ దగ్గర బలమైన ఆధారాలున్నాయని, ఆయన్ను భారత్‌కు అప్పగించబోమని పాక్ విదేశీ వ్యవహారాల శాఖ అధికారి సర్తాజ్ అజీజ్ చెప్పారు. జాదవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు.
గతేడాది మార్చి 3న పాకిస్థాన్‌లోని బెలూచిస్తాన్‌లో జాదవ్‌ను అరెస్ట్ చేశారు. జాదవ్ రా ఏజెంట్ అని, ఆయన 2013 నుంచి తమ దేశంలో విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడని పాక్ అధికారులు ఆరోపించారు. పాక్ ఆరోపణలను భారత్ అప్పట్లో ఖండించింది. గతేడాది డిసెంబర్‌లో అజీజ్ మాట్లాడుతూ.. జాదవ్ నేరం చేసినట్టు తగిన ఆధారాలు లేవని చెప్పారు. దీంతో ఆయన్ను భారత్‌కు అప్పగిస్తారని భావించారు. అజీజ్ తాజాగా మాటమారుస్తూ.. పాక్‌లో జాదవ్ విద్రోహ, ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డాడని, ఆయనపై కేసు నమోదు చేశామని చెప్పారు. పాక్ ఆరోపణల్ని భారత్ తోసిపుచ్చింది. పాక్ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని, జాదవ్ దారితప్పి పాక్ భూభాగంలోకి వెళ్లాడని భారత్ అధికారులు చెప్పారు.