jnu controversy
-
జేఎన్‌యూ విద్యార్ధులు, అధికారులతో కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూలో ఫీజుల పెంపుపై మూడు నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన వీడేందుకు విద్యార్ధులు, వర్సిటీ అధికారులతో శుక్రవారం మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్డీ) కీలక సమావేశం ఏర్పాటు చేసింది. మరోవైపు జేఎన్‌యూ వీసీ ఎం జగదీష్ కుమార్‌ను తొలగించే ప్రసక్తి లేదని హెచ్ఆర్డీ స్పష్టం చేసింది. జేఎన్‌యూ విద్యార్ధులు, వర్సిటీ అధికారుల మధ్య సరైన కమ్యూనికేషన్ కొరవడిన క్రమంలో ఆయా అంశాలపై విస్తృతంగా చర్చించేందుకు విద్యార్థి సంఘం సభ్యులతో పాటు అధికారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని ఉన్నత విద్య కార్యదర్శి అమిత్ ఖరే పేర్కొన్నారు. జేఎన్‌యూ వీసీగా జగదీష్ కుమార్‌ను తప్పించాలన్న విద్యార్ధుల డిమాండ్‌పై స్పందిస్తూ వర్సిటీలో ముందుకొచ్చిన సమస్యలను ఎలా పరిష్కరించాలన్నదే ప్రధాన అంశమని, ఏ ఒక్కరినో తొలగించడమనేది అప్రధాన అంశమని తెలిపారు. మరోవైపు వీసీని తొలగించాలని మాజీ హెచ్ఆర్డీ మంత్రి బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ ట్వీట్ చేయడం గమనార్హం. ఫీజుల పెంపుపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను వీసీ విస్మరించడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. -
కీలక బిల్లులకు మద్దతిస్తాం.. కానీ!
రాజ్యసభలో జేఎన్‌యూపై చర్చించాల్సిందే: విపక్షాలు అంగీకరించిన సర్కారు న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన జేఎన్‌యూ వివాదంతోపాటు దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో జరుగుతున్న ఆందోళనలపై రాజ్యసభలో చర్చించాలని.. అలాంటప్పుడే కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపేందుకు అంగీకరిస్తామని విపక్షాలు స్పష్టం చేశాయి. ఇందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. రాజ్యసభలో చర్చించాల్సిన అంశాలు, సభ జరిగే తీరుపై శనివారం రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ అధ్యక్షతన అఖిలపక్షం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, రాజ్యసభ పక్షనేత అరుణ్‌జైట్లీ, డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్‌తోపాటు విపక్షనేతలు హాజరయ్యారు. సభ సజావుగా జరిగేలా అన్ని పార్టీలు సహకరించాలని ఈ సందర్భంగా అన్సారీ కోరారు. అయితే.. దేశవ్యాప్తంగా వివిధ వర్సిటీల్లో విద్యార్థుల ఆందోళనలు, హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ, జేఎన్‌యూలో గొడవ తదితర అంశాలపై చర్చించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన బీజేపీ పక్షనేత అరుణ్‌జైట్లీ.. ప్రభుత్వం ఈ ఆందోళనలతోపాటు.. విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ‘అన్ని పార్టీలు సభను సజావుగా నడిచేలా సహకరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ముఖ్యమైన బిల్లులన్నీ ఆమోదం పొందేందుకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపాయి’ అని పార్లమెంటు వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ భేటీ అనంతరం తెలిపారు. రాష్ట్రాలకు 4లక్షల కోట్లు రాష్ట్రాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా సంక్రమించాల్సిన మొత్తంలో మొదటి విడతగా.. 4 లక్షల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కేంద్రం ప్రకటించింది. మిగిలిన నిధులను మార్చి చివరి వరకు మూడు విడతల్లో చెల్లించనున్నట్లు వెల్లడించింది. 14వ ఆర్థిక సంఘం ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి రతన్ వతల్ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రాలకిచ్చే పన్నుల వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచుతూ ఇటీవల తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా.. ఈ మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
కన్హయ్యను ఎవరూ కొట్టలేదు: బస్సీ
న్యూఢిల్లీ : జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ను పాటియాలా కోర్టుకు తీసుకువస్తుండగా అతడిని ఎవరూ కొట్టినట్లు తాను భావించడంలేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ బుధవారం పేర్కొన్నారు. కన్హయ్య కుమార్ కు వ్యతిరేకంగా తమ వద్ద తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని బస్సీ మరోసారి స్పష్టం చేశారు. విద్యార్థి నాయకుడ్ని కోర్టుకు తీసుకెళ్తుండగా పరిస్థి కాస్త అదుపుతప్పిందని అయితే, ఆ సమయంలో ఎవరూ కన్హయ్యపై దాడి చేసినట్లు తాను అనుకోవడం లేదన్నారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ మీడియాతో మాట్లాడారు. విద్యార్థి సంఘం నాయకుడ్ని పాటియాలా హౌస్ కోర్టుకు పటిష్ట భద్రతతో తీసుకొచ్చామన్నారు. అయితే, అనుకోకుండా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో ఆ సమయంలో కన్హయ్య తన చెప్పులు పోగొట్టుకున్నాడని వివరించారు. ఈ వివాదంలో కేవలం జేఎన్‌యూ విద్యార్థులే కాక మరికొంతమంది బయటివాళ్లు కూడా ఈ ఘటనలో ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని, ఈ కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు. తమవద్ద గట్టి ఆధారాలున్నాయని, ఎలాంటి పక్షపాతం లేకుండానే తాము ఈ కేసు విషయంలో ముందుకు వెళ్తున్నామని బస్సీ తెలిపారు. -
'కన్హయ్యపై గట్టి సాక్ష్యాలున్నాయి'
జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌కు వ్యతిరేకంగా తమ వద్ద తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ స్పష్టం చేశారు. అందుకే అతడిని అరెస్టు చేశామని తెలిపారు. జేఎన్‌యూ వివాదం.. ఈ కేసు విచారణ తదితర అంశాలపై పీఎంఓకు ఆయన వివరణ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ వివాదంలో కేవలం జేఎన్‌యూ విద్యార్థులే కాక మరికొంతమంది బయటివాళ్లు కూడా ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని, ఈ కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు. తమవద్ద గట్టి ఆధారాలున్నాయని, ఎలాంటి పక్షపాతం లేకుండానే తాము ఈ కేసు విషయంలో ముందుకు వెళ్తున్నామని బస్సీ తెలిపారు. జేఎన్‌యూ అధికారులు తమతో పూర్తిగా సహకరిస్తున్నారని, దేశ సమగ్రత గురించి ఆలోచించేవాళ్లంతా ఈ కేసు దర్యాప్తులో తమకు సహకరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనవైపు వేళ్లు చూపించేవాళ్లకు ఏమీ అర్థం కావట్లేదని అన్నారు. 'నువ్వు సృష్టించిన ప్రపంచానికి ఏమైందో చూడు దేవుడా.. ఎంత మారిపోయాడో ఈ మనిషి' అంటూ కవి ప్రదీప్ రాసిన కవిత తనకు గుర్తుకువస్తుందని బస్సీ చెప్పారు. ఓవైపు తాము కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తుంటే జనం మాత్రం ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మరోవైపు ఈ కేసు గురించి సుప్రీంకోర్టు కూడా స్పందించింది. తీవ్రవాద భావాలు దేశసుస్థిరతను దెబ్బతీస్తాయని, ప్రజలు కాస్త వివేచనతో వ్యవహరించాలని కోర్టు వ్యాఖ్యానించింది. పాటియాలా హౌస్ కోర్టు వద్ద జరిగిన ఘర్షణను ప్రస్తావిస్తూ న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారు. మనమంతా దేశభక్తులమేనని, మాతృదేశాన్ని అస్థిరపరిచే పనులు ఎవరూ చేయకూడదని వ్యాఖ్యానించారు. ఇక న్యాయవాదులు చట్టాన్ని తమ చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.