సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూలో ఫీజుల పెంపుపై మూడు నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన వీడేందుకు విద్యార్ధులు, వర్సిటీ అధికారులతో శుక్రవారం మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్‌డీ) కీలక సమావేశం ఏర్పాటు చేసింది. మరోవైపు జేఎన్‌యూ వీసీ ఎం జగదీష్ కుమార్‌ను తొలగించే ప్రసక్తి లేదని హెచ్‌ఆర్‌డీ స్పష్టం చేసింది. జేఎన్‌యూ విద్యార్ధులు, వర్సిటీ అధికారుల మధ్య సరైన కమ్యూనికేషన్ కొరవడిన క్రమంలో ఆయా అంశాలపై విస్తృతంగా చర్చించేందుకు విద్యార్థి సంఘం సభ్యులతో పాటు అధికారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని ఉన్నత విద్య కార్యదర్శి అమిత్ ఖరే పేర్కొన్నారు.
జేఎన్‌యూ వీసీగా జగదీష్ కుమార్‌ను తప్పించాలన్న విద్యార్ధుల డిమాండ్‌పై స్పందిస్తూ వర్సిటీలో ముందుకొచ్చిన సమస్యలను ఎలా పరిష్కరించాలన్నదే ప్రధాన అంశమని, ఏ ఒక్కరినో తొలగించడమనేది అప్రధాన అంశమని తెలిపారు. మరోవైపు వీసీని తొలగించాలని మాజీ హెచ్‌ఆర్‌డీ మంత్రి బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ ట్వీట్ చేయడం గమనార్హం. ఫీజుల పెంపుపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను వీసీ విస్మరించడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment