HRD Ministry
-
విద్యా విధానంలో భారీ మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నూతన జాతీయ విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే మానవ వనరుల శాఖ పేరును విద్యా శాఖగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. నూతన విద్యా విధానంలో భాగంగా మూడేళ్ల నుంచి 18 ఏళ్ల వరకు విద్యను కేంద్రం తప్పనిసరి చేసింది. విద్యార్థులపై కరికులమ్ భారం తగ్గించాలనేది నూతన విధానం ఉద్దేశమని స్పష్టం చేసింది. 2030 నాటికి అందరీకి విద్య అందించాలనేది తమ లక్ష్యమని పేర్కొంది. బహుభాషల బోధన దిశగా నూతన విద్యా విధానం ఉండనున్నట్టు తెలిపింది. ఇకపై ఆర్ట్స్, సైన్స్ కోర్సుల విద్యా బోధనలో పెద్దగా తేడాలు ఉండవని వెల్లడించింది. (కరోనా: మార్కెట్లోకి హెటిరో ‘ఫావిపిరవిర్’ ట్యాబ్లెట్) అలాగే ప్రస్తుతం ఉన్న విధానంలో కేంద్రం భారీ మార్పులు తీసుకువచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం ప్రకారం.. ప్రస్తుతం ఉన్న 10+2(పదో తరగతి, ఇంటర్) విధానాన్ని 5+3+3+4 మర్చారు. ఇందులో మూడేళ్ల ప్రీ స్కూలింగ్/అంగన్‌వాడితోపాటుగా 12 ఏళ్ల పాఠశాల విద్య ఉండనుంది. ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఒకే కరికులమ్ అమలు చేయనున్నారు. ఆరో తరగతి నుంచే విద్యార్థులకు కోడింగ్, ప్రోగామింగ్ కరికులమ్ ప్రవేశపెట్టనున్నారు. ఆరో తరగతి నుంచే వొకేషన్ కోర్సులను తీసుకురానున్నారు. విద్యార్థులపై పాఠ్యాంశాల భారం తగ్గించి కాన్సెప్ట్ నేర్పే ప్రయత్నం చేయనున్నారు. ఎమ్‌ఫిల్ కోర్సును పూర్తిగా రద్దు చేశారు. (ఆ రాష్ట్రంలో ప్యూన్లుగా టీచర్లు..!) కాగా, ప్రస్తుతం ఉన్న జాతీయ విద్యా విధానాన్ని 1986లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1992లో దాన్ని సవరించారు. కాగా, బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో దేశంలో నూతన విద్యా విధానం తీసుకురానున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే. -
జాతీయ విద్యా విధానానికి ఆమోదం
-
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ (హెచ్ఆర్డీ) శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చే ప్రతిపాదనను బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇస్రో మాజీ చీఫ్ కే కస్తూరిరంగన్ సారథ్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ తొలుత మంత్రిత్వ శాఖ పేరు మార్చాలని సిఫార్సు చేసింది. నూతన విద్యా విధానం డ్రాఫ్ట్‌లో ఇది కీలక సిఫార్సు కావడంతో పేరు మార్పునకు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. విద్య, బోధన, సాధన ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించే దిశగా హెచ్ఆర్డీ శాఖను విద్యా మంత్రిత్వ శాఖగా మార్చాలని ఈ కమిటీ సూచించింది. జాతీయ విద్యా విధానానికీ కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చదవండి : సినిమాలు, జిమ్స్ తెరవొచ్చు! -
స్కూళ్ల పునఃప్రారంభంపై సంప్రదింపులు షురూ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి నెలలో మూతపడిన పాఠశాలలను ఎప్పటి నుంచి పునఃప్రారంభించాలన్న దానిపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, ఈ అంశంతో సంబంధం ఉన్న వారితో(స్టేక్ హోల్డర్లు) చర్చిస్తోంది. సోమవారం సంప్రదింపులు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి అనితా కార్వాల్ వివిధ రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులతో మాట్లాడారు. పాఠశాలలను తెరవడంపై యాజమాన్యాల సన్నద్ధత, విద్యార్థుల ఆరోగ్యం, పాఠశాలల్లో పరిశుభ్రత, ఆన్లైన్, డిజిటల్ ఎడ్యుకేషన్ తదితర అంశాలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యం పాఠశాలల పునఃప్రారంభంపై రాష్ట్రాల నుంచి వచ్చిన అభిప్రాయాలను క్షుణ్నంగా పరిశీలించి, తదుపరి చర్యల నిమిత్తం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు, హోంశాఖకు నివేదించనున్నట్లు మానవ వనరుల అభవృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. రాష్ట్రాలతో సంప్రదింపులు ఇప్పుడే మొదలయ్యాయని, స్కూళ్ల పునఃప్రారంభంపై తుది నిర్ణయం కేంద్ర హోంశాఖదేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
స్కూల్స్ తెరుచుకునేది అప్పుడే !
సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ కారణంగా మూతబడిన స్కూళ్లు ఎప్పుడు పునః ప్రారంభం కానున్నాయో కేంద్ర మానవ వనరుల శాఖా వర్గాలు వెల్లడించాయి. అయితే కరోనా వైరస్ పరిస్థితలు నేపథ్యంలో ఆ తేదీలు మారవచ్చని కూడా హెచ్ఆర్డీ మంత్రత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా విజృంభించిన మహమ్మారి కరోనా వైరస్ దేశంలో కూడా వేగంగా విస్తరిస్తుండటంతో దాని కట్టడికి మే 23 నుంచి లాక్డౌన్ విధించారు. అయితే లాక్డౌన్ కంటే ముందే మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా స్కూళ్లన్నింటిని మూసివేశారు. (‘6 రోజులుగా అక్కడ ఒక్కరు మరణించలేదు’) లాక్డౌన్లో సడలింపుల కారణంగా దాదాపు సినిమా థియేటర్లు, పబ్‌లు లాంటివి మినహా అన్ని తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలను తిరిగి తెరవడానికి కేంద్రప్రభుత్వం ఎప్పుడు అనుమతిస్తుంది అన్నది చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆగస్టు 15 నుంచి పాఠశాలలను తెరుచుకునేందుకు అనుమతినిస్తామని, ఇది అప్పటి కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని కేంద్ర మానవనరుల శాఖ స్పష్టం చేసింది. దీనిపై స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అనిత కర్వాల్ మాట్లాడుతూ, స్కూళ్లు తిరిగి ప్రారంభిస్తే తీసుకోవలసిన చర్యలు, అనుసరించాల్సిన విధానాలు, టీచర్ల పాత్ర మొదలైన అన్ని విషయాలపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. కరోనాకు ముందు వాయిదా వేసిన డిజిటల్ క్లాస్‌లను లాక్డౌన్ కారణంగా ప్రారంభించామని అనిత తెలిపారు. (ఇక ‘ఆరోగ్య సేతు’ బాధ్యత వారిదే..) -
ఆన్లైన్ క్లాసులు: హెచ్ఆర్డీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: భారత్‌లో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో విద్యా సంస్థలు తెరిచే అంశంలో సందిగ్ధత నెలకొంది. విద్యా సంవత్సరం ప్రారంభ సమయం సమీపించినప్పటికీ మహమ్మారి భయాల దృష్ట్యా చాలా మంది తల్లిదండ్రులు పాఠశాలలు ఇప్పుడే తెరవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ బోధనకు అనుమతినిస్తూ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థుల కోసం ఎన్సీఈఆర్టీ అభివృద్ధి చేసిన ఆల్టర్నేటివ్ అకడమిక్ క్యాలెండర్ (హయ్యర్ సెకండరీ స్టేజ్)ను విడుదల చేసింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇంట్లోనే అత్యుత్తమ విద్యా బోధనకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.(పెనుముప్పుగా నిబంధనల ఉల్లంఘన..!) ఈ మేరకు మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ సందేశాన్ని విడుదల చేశారు.‘‘కోవిడ్-19 విజృంభణతో భారత్ సహా వివిధ ప్రపంచ దేశాల్లో విపత్కర పరిస్థితులు తలెత్తాయి. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విద్యార్థులు, టీచర్లు ఇంటికే పరిమితమయ్యారు. ఇ- పాఠశాల, ఎన్ఆర్ఓఈఆర్, స్వయం, దీక్షా తదితర ఆన్లైన్ ప్లాట్‌ఫాంలతో క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇ- వనరులు, ఇ- పుస్తకాలతో ఆన్లైన్లో విద్యా బోధన జరుగుతోంది. ఉన్నత పాఠశాల విద్యార్థులు తమంతట తాముగా కొంతవరకు చదువుకోగలరు. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల సహాయం తప్పనిసరి.(కోవిడ్ మరణాల రేటు 2.82%) ఈ నేపథ్యంలో ఇంట్లో ఉంటూనే క్రమపద్ధతి ప్రకారం విద్యా బోధన జరిగేందుకు ఎన్సీఈఆర్టీ అభివృద్ధి చేసిన ఆల్టర్నేటివ్ అకడమిక్ క్యాలెండర్ విడుదల చేశాం. ఫోన్, రేడియో, ఎస్ఎంఎస్, టీవీ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా టీచర్లు విద్యార్థులను గైడ్ చేయవచ్చు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విద్యార్థులకు ఈ వెసలుబాటు కల్పిస్తాయని ఆశిస్తున్నా. అంతేకాదు మన ఉపాధ్యాయులు విద్యార్థులు ఒత్తిడిని దూరం చేయడమే కాకుండా వారికి ప్రశాంత వాతావరణంలో నాణ్యమైన విద్య అందించి.. వారిలో స్ఫూర్తి నింపుతారని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు. కాగా క్యాలెండర్ విషయంలో ఏవైనా సందేహాలు ఉన్నా.. ఇంకేమైనా సూచనలు చేయాలన్నా director.ncert.@nic.in లేదా cg ncert 2019@gmail.com ను సంప్రదించవచ్చని ఎన్సీఈఆర్టీ పేర్కొంది. -
జులైలో స్కూల్స్ పునఃప్రారంభం!
సాక్షి, న్యూఢిల్లీ : సుదీర్ఘ లాక్డౌన్లతో స్కూల్స్ ఎప్పుడు తెరుచుకుంటాయనే ఉత్కంఠ కొనసాగుతుండగా జులై నుంచి స్కూళ్లను దశలవారీగా పున:ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. తొలుత గ్రీన్, ఆరెంజ్ జోన్లలో స్కూళ్లను తెరిపించి హైస్కూల్ విద్యార్ధులనే అనుమతించాలని, ప్రాథమిక తరగతుల విద్యార్ధులను తదుపరి దశలో స్కూళ్లకు అనుమతించాలని భావిస్తున్నారు. స్కూళ్లలో 30 శాతం మందే హాజరయ్యేలా రెండు షిఫ్ట్‌లలో పనిచేసేలా నిబంధనలు రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపడతారు. దేశవ్యాప్తంగా స్కూళ్ల పున:ప్రారంభానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలను వచ్చేవారంలో కేంద్ర ప్రభుత్వం జారీచేయనుంది. కాగా కేవలం 30 శాతం హాజరుతోనే పాఠశాలలు పనిచేస్తాయని మానవవనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఇటీవల ఉపాధ్యాయులతో జరిగిన వెబినార్‌లో పేర్కొన్నారు. ఇక కాలేజీలు, యూనివర్సిటీల పునఃప్రారంభానికి అవసరమైన భద్రతా పరమైన మార్గదర్శకాలను యూజీసీ వెల్లడిస్తుందని ఇదే వెబినార్‌లో మంత్రి స్పష్టం చేశారు. చదవండి: ఏపీలో ఆగస్టు 3నుంచి స్కూల్స్ ప్రారంభం -
జులై 1 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ : పెండింగ్‌లో ఉన్న పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) జులైలో నిర్వహిస్తుందని వెల్లడించింది. ఈ తరగతులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సబ్జెక్టుల పరీక్షలను సీబీఎస్ఈ జులై 1 నుంచి 15 వరకూ నిర్వహిస్తుందని మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా అంతకుమందు విద్యార్ధులతో లైవ్‌లో ముచ్చటించిన హెచ్ఆర్డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ పది, పన్నెండో తరగతి పరీక్షలపై సీబీఎస్ఈ ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇదే సమావేశంలో జేఈఈ మెయిన్, నీట్ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి ప్రకటించారు. ఈ ఎంట్రన్స్ పరీక్షలు జులై ద్వితీయార్ధంలో జరుగుతాయని తెలిపారు. కాగా పెండింగ్‌లో ఉన్న పది, పన్నెండో తరగతి పరీక్షలను రద్దు చేయలేదని, వాటిని నిర్వహిస్తామని సీబీఎస్ఈ ఇటీవల వివరణ ఇచ్చింది. పరీక్షల నిర్వహణకు ముందు విద్యార్ధులకు ప్రిపరేషన్ కోసం తగినంత సమయం ఇస్తామని స్పష్టం చేసింది. చదవండి : పెండింగ్‌లో ఉన్న పరీక్షలు నిర్వహిస్తాం -
ఆగస్ట్ 23న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల తేదీ ఖరారు అయింది. ఆగస్ట్ 23న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి జెఈఈ (మెయిన్) పరీక్ష జూలై 18 నుంచి 23 వరకు జరుగుతుందని, మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి నీట్ పరీక్ష జూలై 26 న జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. కాగా ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థలైన జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో ప్రవేశాల కోసం గత జనవరిలో మెుదటి విడత జేఈఈ మెయిన్‌ను నిర్వహించింది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్‌తో ఏప్రిల్ 5 నుంచి 11 వరకు నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ను కేంద్రం ఆదేశాల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాయిదా వేసిన విషయం తెలిసిందే. -
కోవిడ్-19 : దేశవ్యాప్తంగా టెన్త్ పరీక్షలు లేనట్టే!
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాప్తితో సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తూర్పు ఢిల్లీ విద్యార్ధులకు మినహా కేంద్ర విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న వారికి పెండింగ్‌లో ఉన్న పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించబోమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఇక తూర్పు ఢిల్లీ విద్యార్ధులకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించేముందు ప్రిపరేషన్ కోసం పది రోజుల సమయం ఇస్తామని హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఇక సీఏఏ అల్లర్లతో అట్టుడుకిన తూర్పు ఢిల్లీలో మాత్రం వాయిదా పడిన పదవ తరగతి పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు సాగిస్తున్నారు. చదవండి : కోవిడ్-19 : మహిళా రైతు ఔదార్యం 📢Attention class X students! No examination to be held for class X students nationwide, except for students from North-East Delhi. An adequate time of 10 days will be given to all students for the preparation of exams.#EducationMinisterGoesLive pic.twitter.com/x4QJAInvtT — Ministry of HRD (@HRDMinistry) May 5, 2020 -
క్యాంపస్ ఎంపికలను రద్దు చేయకండి
న్యూఢిల్లీ: వివిధ ప్రైవేట్ కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్లలో భాగంగా చేసిన ఎంపికలను లాక్డౌన్ కారణంగా రద్దు చేయరాదని కేంద్రం కోరింది. లాక్డౌన్ కారణంగా దేశంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఎంపికయిన అభ్యర్థుల్లో ఉన్న ఆందోళనను తొలగించాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆయా సంస్థలకు సూచించింది. ఎంపికయిన అభ్యర్థులను యథా ప్రకారం ఉద్యోగాల్లోకి తీసుకోవాలని పేర్కొంది. లాక్డౌన్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ కాలం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల ప్రభావం క్యాంపస్ ఎంపికలపై పడకుండా చూసుకోవాలని గతవారం 23 ఐఐటీల డైరెక్టర్లను మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో క్యాంపస్ ఎంపికలను రద్దు చేసుకోవద్దని రిక్రూటర్లను కోరినట్టు ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ వి. రాంగోపాల్‌రావు తెలిపారు. -
జేఎన్‌యూ వీసీ జగదీష్ కుమార్‌కు హెచ్ఆర్డీ సమన్లు
-
జేఎన్‌యూ విద్యార్ధులు, అధికారులతో కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూలో ఫీజుల పెంపుపై మూడు నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన వీడేందుకు విద్యార్ధులు, వర్సిటీ అధికారులతో శుక్రవారం మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్డీ) కీలక సమావేశం ఏర్పాటు చేసింది. మరోవైపు జేఎన్‌యూ వీసీ ఎం జగదీష్ కుమార్‌ను తొలగించే ప్రసక్తి లేదని హెచ్ఆర్డీ స్పష్టం చేసింది. జేఎన్‌యూ విద్యార్ధులు, వర్సిటీ అధికారుల మధ్య సరైన కమ్యూనికేషన్ కొరవడిన క్రమంలో ఆయా అంశాలపై విస్తృతంగా చర్చించేందుకు విద్యార్థి సంఘం సభ్యులతో పాటు అధికారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని ఉన్నత విద్య కార్యదర్శి అమిత్ ఖరే పేర్కొన్నారు. జేఎన్‌యూ వీసీగా జగదీష్ కుమార్‌ను తప్పించాలన్న విద్యార్ధుల డిమాండ్‌పై స్పందిస్తూ వర్సిటీలో ముందుకొచ్చిన సమస్యలను ఎలా పరిష్కరించాలన్నదే ప్రధాన అంశమని, ఏ ఒక్కరినో తొలగించడమనేది అప్రధాన అంశమని తెలిపారు. మరోవైపు వీసీని తొలగించాలని మాజీ హెచ్ఆర్డీ మంత్రి బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ ట్వీట్ చేయడం గమనార్హం. ఫీజుల పెంపుపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను వీసీ విస్మరించడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. -
'దేశంలో మగ టీచర్లే అధికం'
ముంబై: మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశంలోని ఉపాధ్యాయులపై చేపట్టిన లింగ నిష్పత్తి సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తెలిపిన వివరాల ప్రకారం, దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లోని బోధన సిబ్బందిలో ఆడవారి కంటే ఎక్కువ మంది మగ ఉపాధ్యాయులు ఉన్నారని వెల్లడించింది. అంతేకాక ఉపాధ్యాయుల లింగనిష్పత్తి అత్యల్పంగా బీహార్‌లో నమోదైనట్లు పేర్కొంది. కానీ ఒక్క నర్సింగ్ కోర్సులోని ఉపాధ్యాయుల్లో మాత్రం భిన్నంగా.. మగవారి కంటే ఎక్కువగా ఆడవారు ఉన్నారు. యూనివర్సిటీలు, కాలేజీల్లోని బోధనేతర సిబ్బందిలోనూ మహిళల కంటే ఎక్కువగా మగవారే ఉన్నట్లు ఈ సర్వేలో నిరూపితమయింది. దేశంలో బోధన సిబ్బంది సంఖ్య మొత్తం 14 లక్షలకు పైగా ఉపాధ్యాయులు ఉండగా.. అందులో మగవారు 57.8 శాతం, మహిళలు 42.2 శాతం ఉన్నారు. బీహార్ మాత్రం అతి తక్కువ మహిళ టీచర్లను కలిగి.. అత్యల్ప లింగ నిష్పత్తితో ప్రథమ స్థానంలో ఉంది. అక్కడి ఉపాధ్యాయుల్లో 78.97 శాతం మగవారు ఉండగా, 21.03 శాతం మంది మహిళలు ఉన్నారు. ఇదేకోవలో జార్ఖండ్ రెండవ స్థానాన్ని, ఉత్తరప్రదేశ్ మూడవ స్థానాన్ని ఆక్రమించాయి. అయితే వీటికి విరుద్ధంగా కొన్ని రాష్ట్రాల్లో (కేరళ, పంజాబ్, హర్యానా, చంఢీగర్, మేఘాలయ, నాగాలాండ్, ఢిల్లీ, గోవా) మగ ఉపాధ్యాయుల కంటే ఎక్కువగా మహిళా ఉపాధ్యాయులు ఉన్నారని సర్వే నివేదిక వెల్లడించింది. అఖిల భారత స్థాయి బోధన సిబ్బందిలో.. ప్రతి 100 మంది మగ ఉపాధ్యాయులకు.. విశ్వవిద్యాలయ స్థాయిలో 58 మంది మహిళలు ఉన్నారు. అదేవిధంగా కళాశాల, స్టాండ్-అలోన్ సంస్థల వారిగా చూసినట్లయితే వరుసగా.. 76, 71 శాతం మంది మహిళలు ఉన్నారు. ముస్లిం మైనారిటీకి చెందిన వారిలో 57 శాతం మంది మహిళలు ఉండగా, ఇతర మైనారిటీల్లో ప్రతి 100 మంది మగవారికి 151 మంది మహిళలు ఉన్నారు. ఇక వికలాంగ(పీడబ్ల్యూడీ) వర్గానికి చెందిన బోధన సిబ్బందిలో.. మగవారికంటే తక్కువగా 37 మంది మహిళలు ఉన్నారు. అయితే మగవారి కంటే అత్యధిక మహిళా ఉపాధ్యాయులు కలిగిన ఏకైక కోర్సు నర్సింగ్. మగ ఉపాధ్యాయులను తోసిరాజని మహిళలు ముందుకు దూసుకుపోతున్నారు. నర్సింగ్ కోర్సులలో 100 మంది మగ ఉపాధ్యాయులకు అత్యధికంగా 330 మంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారని సర్వే తెలిపింది. -
ఉన్నత విద్యలో మరో ‘నీట్’
సాక్షి, న్యూఢిల్లీ: ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాలు వచ్చేలా విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు కేంద్రం నేషనల్ ఎడ్యుకేషనల్ అలయన్స్ ఫర్ టెక్నాలజీ (ఎన్‌ఈఏటీ) అనే పథకాన్ని ప్రకటించింది. ‘విద్యార్థుల అవసరాల మేరకు వారి వ్యక్తిగత అభిరుచుల సహకరించేలా కృత్రిమ మేథస్సును ఉపయోగించడం దీని లక్ష్యం. దీనికి సంబంధించిన స్టార్టప్ సంస్థలను ఒక వేదిక పైకి తెచ్చి తద్వారా సాంకేతికతను విద్యార్థులకు సులభంగా అందుబాటులోకి తేనున్నాం. తద్వారా విద్యార్థులు దీన్ని సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఎడ్ టెక్ కంపెనీలు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సొల్యూషన్స్ తయారీ, విద్యార్థుల నమోదు కార్యక్రమాలు చూస్తాయి. విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజును కూడా వసూలు చేస్తాయి. నవంబర్ నుంచి ప్రారంభమయ్యే ఈ పథకంలో భాగంగా ఆ కంపెనీలు మొత్తం సీట్లలో పేద విద్యార్థులకు 25 శాతం కేటాయించాల్సి ఉంటుంది’ అని మానవ వనరుల అభివృద్ధి శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. -
తెలంగాణకు నాలుగో గ్రేడ్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాఠశాల పనితీరు, ప్రమాణాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు తదితర అంశాల ఆధారంగా రాష్ట్రాలకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎంహెచ్చార్డీ) గ్రేడింగ్ ఇచ్చింది. పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్ పేరుతో మొదటిసారిగా గ్రేడింగ్‌ను ప్రకటించింది. అభ్యసన సామర్థ్యాలు, ప్రమాణాలు, ఫలితాలు, పాఠశాల ప్రగతి, పాలన, నిర్వహణ, అందుబాటులో పాఠశాల, మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజనం వంటి పథకాల అమలు తదితర 70 అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ గ్రేడ్లను కేటాయించింది. ఒక్కో అంశానికి 10–20 పాయింట్ల చొప్పున పరిగణనలోకి తీసుకొని మొత్తంగా 1000 పాయింట్ల ఆధారంగా ఈ గ్రేడ్లను నిర్ణయించింది. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పాఠశాలలకు గ్రేడ్లను కేటాయించింది. 2017–18 విద్యా సంవత్సరం లెక్కల ఆధారంగా వీటిని కేటాయించిన నివేదికను ఎంహెచ్ఆర్డీ ఇటీవల విడుదల చేసింది. ప్రతి ఏటా నివేదిక జాతీయ స్థాయిలో పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండె క్స్ నివేదికను ఇకపై ప్రతి ఏటా జనవరిలో, రాష్ట్రాల వారీ నివేదికను ప్రతి ఏటా ఏప్రిల్‌లో వెల్లడిస్తామని హెచ్చార్డీ తెలిపింది. రాష్ట్రాలు, అక్కడి పాఠశాలల పనితీరు ఆధారంగానే ఆయా రాష్ట్రాల్లోని పాఠశాలలకు భవిష్యత్తులో నిధులను కేటాయించనున్నట్లు ఈ నివేదికలో స్పష్టం చేసింది. రాష్ట్రాల వారీగా కొన్ని ప్రధాన అంశాల్లో పనితీరును ఎంహెచ్ఆర్డీ ప్రశంసించింది. తెలంగాణ విషయంలో.. విద్యార్థుల ఆన్లైన్ హాజరు విధానం భేష్ అని ప్రశంసించింది. పాఠశాల పాలన, నిర్వహణలో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆన్లైన్ పద్ధతిలో అధిక సంఖ్యలో టీచర్ల బదిలీలను బాగా చేశారని వెల్లడించింది. అరుణాచల్‌ప్రదేశ్ విద్యకు బడ్జెట్‌ను ఎక్కువ కేటాయిస్తోందని, స్టేట్ షేర్ బాగా ఇస్తోందని పేర్కొంది. చత్తీస్‌గఢ్‌లో స్టూడెంట్స్ యూనిక్ ఐడీ విధానం బాగుందని తెలిపింది. హిమాచల్ ప్రదేశ్‌లో 9, 10 తరగతుల విద్యార్థులకు పెద్ద ఎత్తున వృత్తి విద్యా కోర్సులను నేర్పిస్తున్నారని తెలిపింది. జార్ఖండ్‌లో పేర్కొన్న దానికంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నారని వెల్లడించింది. కేరళలో సింగిల్ టీచర్ స్కూళ్లు చాలా తక్కువ ఉన్నాయని వివరించింది. ఇవీ వివిధ రాష్ట్రాలకు లభించిన గ్రేడ్లు.. కేరళ, చండీగఢ్, గుజరాత్ రాష్ట్రాలకు 801–850 మధ్య పాయింట్లతో మొదటి గ్రేడ్ లభించింది. 851–1000 పాయింట్లు ఏ ఒక్క రాష్ట్రానికి లభించలేదు. 751–800 పాయింట్లతో దాద్రానగర్ హవేలీ, హరియాణా, పంజాబ్, రాజస్తాన్, తమిళనాడు రాష్ట్రాలకు గ్రేడ్–2 లభించింది. 701–750 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్, అసోం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గోవా, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు గ్రేడ్–3 లభించింది. 651–700 పాయింట్లతో డయ్యూ డామన్, మహారాష్ట్ర, మిజోరాం, పుదుచ్చేరి, తెలంగాణ, సిక్కిం రాష్ట్రాలకు నాలుగో గ్రేడ్ ఇచ్చింది. 601–650 పాయింట్లతో అండమాన్ నికోబార్, బిహార్, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, లక్షద్వీప్, మణిపూర్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు గ్రేడ్–5లో ఉన్నాయి. 551–600 పాయింట్లతో అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు ఆరో గ్రేడ్ లభించింది. ఏడో గ్రేడ్‌లో ఏ రాష్ట్రాలు లేవు. -
హెచ్చార్డీ మంత్రిగా వారుంటేనే మంచిది : ఆర్బీఐ మాజీ గవర్నర్
దావోస్ : భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ విద్యావిధానంలో సమూల మార్పులు రావాల్సిన అవసరముందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ‘మనం యువతరాలను మాత్రమే నిర్మించగలుగున్నాం. కానీ, ప్రపంచంతో పోటీ పడేవిధంగా వారిని తయారు చేయలేకపోతున్నాం’ అని వ్యాఖ్యానించారు. దేశ భవిష్యత్‌కు అతి ముఖ్యమైన ‘మానవ వనరుల అభివృద్ధి’ అనే అంశాన్ని సరిగా పట్టించుకోవడం లేదన్నారు. మానవ వనరుల అభివృధ్ది శాఖ (హెచ్చార్డీ)కు అత్యంత సమర్థులు మంత్రిగా కొనసాగాలని ఆకాక్షించారు. నాణ్యమైన విద్యతోనే భారత యువత అన్ని రంగాల్లో దూసుకుపోతుందని చెప్పారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) లో పాల్గొనేందుకు వచ్చిన రాజన్ ఓ జాతీయ మీడియాతో ఈ విషయాలు వెల్లడించారు. డబ్ల్యూఈఎఫ్ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘భవిష్యత్‌లో భారత్ చైనా ఆర్థిక వ్యవస్థను కూడా దాటిపోవచ్చు. మౌలిక వసతుల కల్పనలో ఆ దేశం కంటే మెరుగైన స్థానంలో నిలవొచ్చునని, దేశాల మధ్య ఇలాంటి పోటీ మంచిదే’ అని రాజన్ అన్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ మూడేళ్ల పాటు పనిచేసిన సంగతి తెలిసిందే. -
కోటా కోసం 16,000 సీట్ల పెంపు
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కోటా అమలు కోసం ఢిల్లీ యూనివర్సిటీ కసరత్తు చేపట్టింది. ఈబీసీ కోటాను వర్తింపచేసేందుకు 2019-20 విద్యాసంవత్సరంలో వివిధ కోర్సుల్లో అదనంగా 16,000 సీట్లను పెంచాలని ఢిల్లీ యూనివర్సిటీ నిర్ణయించింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మొత్తం సీట్లలో 25 శాతం పెరుగుదల ఉండాలని కేంద్ర మానవ వనురుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా ఢిల్లీ యూనివర్సిటీలో ప్రస్తుతం గ్రాడ్యుయేట్ అడ్మిషన్లు 56,000 కాగా, పీజీ అడ్మిషన్ల కింద 9500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పది శాతం కోటాను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ధేశించడంతో ఆయా విద్యాసంస్ధలు మౌలిక వసతులను మెరుగుపరచకుండానే సీట్ల సంఖ్యను పెంచాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇక ఐఐటీ ఢిల్లీ, జేఎన్‌యూలు ఇప్పటికే తమ సీట్ల సంఖ్యను వరుసగా 590, 346 సీట్లకు పెంచాయి. ఈ విద్యా సంస్ధల్లో హాస్టల్ వసతి పరిమితంగా ఉండటంతో పెరిగే విద్యార్ధులకు వసతి కల్పించడంపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్ధల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే జనరల్ కేటగిరీలో అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తామని హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బడి బ్యాగుల భారం ఇక తేలిక!
వెన్నెముక విరిగేలా పుస్తకాల బరువు మోయలేక ఆపసోపాలు పడుతున్న బడి పిల్లలకు శుభవార్త! ఇక నుంచి అన్ని పుస్తకాలు, అంత బరువు మోయాల్సిన పనిలేదని, బరువును వెంటనే తగ్గించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. స్కూలు పిల్లల తరగతుల వారీగా ఎంతెంత బరువుండాలో మార్గదర్శకాలు రూపొందించింది. సాక్షి, అమరావతి/సత్తెనపల్లి: బడి పిల్లలకు పుస్తకాల బ్యాగుల బరువు భారం తగ్గనుంది. ఒకటి, రెండు తరగతుల పిల్లలకు హోంవర్క్ ఇవ్వరాదని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఏ తరగతి చదివే పిల్లలకు పుస్తకాల బ్యాగులు ఎంత బరువు ఉండాలో నిర్ధారిస్తూ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని స్కూల్స్‌లో నిర్ధారించిన బరువు కన్నా ఎక్కువ బరువు గల బ్యాగులను అనుమతించరాదని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించింది. నిబంధలు బేఖాతరు నిబంధనల ప్రకారం పుస్తకాల సంచి బరువు ఆ విద్యార్థి శరీర బరువులో పదో వంతు మాత్రమే ఉండాలి. ఈ నిబంధనలు పాటిస్తున్న పాఠశాలలు తక్కువ. ఫలితంగా వయసుకు మించిన పుస్తకాల భారాన్ని మోస్తూ సాయంత్రానికి ఇంటికి వచ్చేసరికి విద్యార్థులు నీరసించి పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం తాజాగా ఇచ్చిన ఆదేశాలను అనుసరించి రాష్ట్ర, జిల్లా పాఠశాల విద్యా శాఖ తప్పనిసరిగా నిబంధనలు అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. 2006 చట్టం ఏం చెబుతోంది? పాఠశాల విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ 2006లోనే చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం.. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు ఎలాంటి బరువులతో కూడిన పుస్తకాల సంచులను మోయకూడదు పై తరగతులకు చెందిన విద్యార్థులు తమ శరీర బరువులో పుస్తకాల సంచి బరువు పది శాతానికి మించకూడాదు రోజూ పాఠశాలకు తీసుకెళ్లాల్సిన పుస్తకాలపై తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు అవగాహనతో ముందుకెళ్లాలి ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలను భద్రపరచడానికి ఏర్పాట్లు చేపట్టాలి. ప్రైవేటు పాఠశాలల్లో ప్రత్యేకంగా పుస్తకాలు ఉంచడానికి అరలు ఉండాలి. ఇలాంటి సదుపాయాలు ఏర్పాటు చేయని ప్రైవేటు పాఠశాలలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. రూ.3 లక్షలు అపరాధ రుసుము విధించవచ్చు. ఆదేశాలు పాటించకుంటే ఆయా పాఠశాలల గుర్తింపు రద్దు చేయవచ్చు. బరువు సంచితో నష్టాలు పుస్తకాల సంచి భారంతో వంగి నడుస్తూ తరచూ తలెత్తి చూడడం వల్ల మెడనరాలపై భారం పడి నొప్పి వస్తుంది అధిక బరువు వల్ల సంచి భుజాలపై నుంచి కిందకి లాగేటట్లు వేలాడుతోంది. దీని వల్ల భుజాల నొప్పి వస్తుంది వంగి నడవడం వల్ల నడుము, దానికి కింది భాగం, వెన్నెముక దెబ్బతింటుంది మోకాలి నొప్పుల వల్ల రాత్రి వేళ సరిగా నిద్రపట్టదు. నరాలు లాగేసినట్లు అనిపిస్తుంది. తిమ్మిరి వచ్చి పట్టు కోల్పోతారు. బరువు సంచి మోయడం వల్ల పిల్లలు తొందరగా అలిసి పోతారు. దీని వల్ల చదువు పై ఏకాగ్రత పెట్టలేరు. ఆదేశాలివీ.. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఇంటి పని (హోంవర్క్) ఇవ్వకూడదు. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి సూచించిన ప్రకారం ఒకటి, రెండు తరగతుల పిల్లలకు పాఠశాలల్లో సంబంధిత భాష, గణితం మాత్రమే ఉండాలి. 3 నుంచి 5 తరగతుల విద్యార్థులకు వీటితోపాటు పరిసరాల విజ్ఞానం మాత్రమే ఉండాలి. విద్యార్థులను ఎలాంటి అదనపు పుస్తకాలను తెచ్చుకోవాలని చెప్పకూడదు. ఎన్సీఈఆర్టీ నిర్ధారించిన సబ్జెక్టులను మాత్రమే మూడు నుంచి ఐదో తరగతి పిల్లలకు బోధించాలి. కేంద్రం ఆదేశాల ప్రకారం పుస్తకాల సంచి బరువు ఇలా ఉండాలి.. తరగతి బరువు(కిలోలు) 1-2 1.5 3-5 2.3 6 -7 4 8-9 4.5 10 5 -
త్వరలో ‘జాతీయ మదర్సా బోర్డు’
న్యూఢిల్లీ: దేశంలోని మదర్సాలన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు వీలుగా జాతీయ మదర్సా బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు మైనారిటీ విద్య జాతీయ పర్యవేక్షణ కమిటీ (ఎన్‌ఎంసీఎంఈ) వెల్లడించింది. ఇందుకోసం ముందుగా గుర్తింపు లేకుండా పెద్ద సంఖ్యలో నడుస్తున్న మదర్సాల వివరాలను సేకరించనున్నట్లు తెలిపింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్చార్డీ) శాఖ నేతృత్వంలో పనిచేసే ఈ కమిటీ ఇటీవల సమావేశమై పలు ప్రతిపాదనలు రూపొందించింది. అన్ని రాష్ట్రాల్లో మదర్సా బోర్డులు ఏర్పాటు చేయాలంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, విద్యావేత్తలు, వివిధ సంస్థల కార్యకర్తలు, హెచ్చార్డీ అధికారులు సభ్యులుగా ఉంటారు. -
కేంద్రం గుప్పిట ఉన్నత విద్య
యూజీసీ స్థానంలో భారత ఉన్నత విద్యా సంస్థ ఏర్పాటు కోసం కేంద్రం ప్రతిపాదించిన కొత్త బిల్లు వల్ల ప్రయోజనం కన్నా చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎందుకంటే మొదట– కేవలం ఉద్యోగాలు వచ్చే కోర్సులు ప్రవేశ పెట్టాలి. రెండోది, ఆ కోర్సులకయ్యే వ్యయాన్ని ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచే వసూలు చేయాలి. ఇంకా మార్కెట్ అవసరాలను తీర్చే కోర్సులు రూపొందించి, ప్రవేశపెట్టే బాధ్యత కూడా ఆయా సంస్థలపై ఉంటుంది. దీని వల్ల చదువే విద్యా మార్కెట్‌గా మారి ఉన్నత విద్యా లక్ష్యానికే భంగం కలుగుతుంది. ఈ పరిణామం విశ్వవిద్యాలయం అనే భావనకే విరుద్ధం. ఉన్నత విద్యారంగంలో సంస్కరణల పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రయోగాలు ఎప్పుడో మొదలెట్టింది. కొత్త విద్యా విధానం తీసుకొస్తానని చెబుతోంది. నిజానికి కేంద్ర సర్కారు కొత్తగా తెస్తున్నదేమీ లేదనే చెప్పాలి. సంస్కరణల పేరుతో ఇప్పటికే పనిచేస్తున్న సంస్థల రూపురేఖలు మార్చివేసి తన అధికారగణంతో నింపుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన వెంటనే ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటు చేసింది. పేరు మారినా చేసే పని ఒకటే. కాంగ్రెస్ హయాంలో స్థాపించిన సంస్థలను నిర్వీర్యం చేస్తూ వాటిని తన కబంధ హస్తాల్లోకి తీసుకుంటోంది. ఏమాత్రం అనుభవంలేని వారిని ఈ సంస్థల చైర్మ న్లుగా, సభ్యులుగా నియమించింది. మరో పక్క పాఠ శాల విద్యలోని సిలబస్‌ను సగానికి సగం తగ్గిస్తున్నా మని ప్రకటించింది. చివరికి చేసిందేమంటే, గతంలో వామపక్ష, లౌకిక భావాలున్నవారు రూపొందించిన పాఠ్య ప్రణాళికను తొలగించి, పాలకపక్ష భావజా లంతో దాన్ని నింపడానికి ప్రయత్నించడమే. పేరుకు విద్యార్థులకు చదువుల భారం తగ్గిస్తానని చెబు తున్నా, స్కూల్ బ్యాగ్‌ల బరువు తగ్గించాలని ప్రొఫె సర్ యశ్పాల్ కమిటీ చేసిన సిఫార్సులను తుంగ లోకి తొక్కి కొత్తగా చేసేదేమీ లేదన్నట్టు వ్యవహరి స్తోంది. విద్యను కాషాయీకరించడానికే ఈ పను లన్నీ చేస్తోందని స్పష్టమౌతోంది. యూజీసీ స్థానంలో నూతన సంస్థ ఇప్పుడు నేరుగా యూనివర్సిటీ గ్రాంట్ల కమిషన్ (యూజీసీ) స్థానంలో కిందటి నెల 27న భారత ఉన్నత విద్యా సంఘం(హెచ్ఈసీఐ–హెసీ) ఏర్పాటు ప్రతిపాదన ముందుకు తెచ్చింది. ఉన్నత విద్యను కేంద్రీకరించడంలో భాగంగా ఈ సంస్థను స్థాపి స్తోంది. ప్రజాస్వామ్య సూత్రమైన వికేంద్రీకరణకు ఇలా గండికొడుతోంది. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) 1953 డిసెంబర్ 28న అవతరిం చింది. పార్లమెంటు చేసిన చట్టం ద్వారా 1956లో ఇది అధికార వ్యవస్థగా రూపుదిద్దుకుంది. యూని వర్సిటీల్లో ఉన్నత విద్య పరిశోధన, బోధన స్థాయి పెంచడమే ప్రధాన లక్ష్యంగా యూజీసీని నెలకొ ల్పారు. రాజకీయాలకు అతీతంగా పనిచేసే సంస్థగా దీనికి మంచి పేరొచ్చింది. ఉన్నత విద్యారంగానికి చెందిన యూనివర్సిటీలు, కాలేజీలకు నిధులు సమ కూరుస్తూ వాటికి మార్గదర్శకంగా ఉండే ఓ స్వతంత్ర ప్రతిపత్తి గల కేంద్ర సంస్థగా ఇది అప్పటి నుంచీ పని చేస్తూ వస్తోంది. దీనికి మరింత స్వాతంత్య్రం, సంపూర్ణ అభివృద్ధికి వీలు కల్పించే విధంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్చార్డీ) ఓ కొత్త బిల్లు తీసుకొచ్చింది. ‘తక్కువ ప్రభుత్వం– ఎక్కువ పాలన’ అనే నినాదంతో ఈ బిల్లును కేంద్ర సర్కారు రూపొందించింది. ఇప్పటికే పనిచేస్తున్న శిఖర సంస్థల నియంత్రణాధికారాలు తగ్గించడం, నిధులు అందించే విధానంలో మార్పులు తీసుకురా వడం, విద్య నాణ్యత పెంచడం, చివరగా యూజీసీ చట్టాన్ని రద్దుచేయడం దాని ముఖ్య ఉద్దేశం. ఈ బిల్లు వల్ల దేశంలోని సుమారు 850 విశ్వవిద్యాల యాలు, స్వయం ప్రతిపత్తి గల 40 వేల కళాశాలల పని విధానంలో చాలా మార్పులు చోటుచేసుకుం టాయి. అంతేగాక, యూజీసీ గుర్తించిన నకిలీ యూనివర్సిటీలను పూర్తిగా రద్దుచేసి, అవసరమైతే వాటిపై శిక్షలు కూడా వేస్తారని అంటున్నారు. ఇంకా, యూజీసీని ఓ నియంత్రణా వ్యవస్థగా మార్చి, పూర్తి అధికారాలను ఎంహెచ్చార్డీకి బదలాయిస్తారు. ఇది కేవలం ముసాయిదా బిల్లు అయినప్పటికీ దీన్ని– భారత ఉన్నత విద్యా కమిషన్ చట్టం, 2018 (విశ్వ విద్యాలయాల గ్రాంట్ల సంఘాన్ని రద్దు చేయడం) అని కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో ప్రకటించారు. ఉన్నత విద్యకు సంబంధించిన వాటాదారులు అంటే విద్యా ర్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, అధ్యాపకులు, ప్రజల నుంచి సలహాలను ఈ నెల ఏడో తేదీ లోగా స్వీకరించాలని ప్రభుత్వం కోరింది. ఇంత తక్కువ సమ యంలో ఇది సాధ్యంకాని పని అని సర్కారుకు తెలుసు. పైకి ఇలా ప్రజాభిప్రాయానికి అవకాశమిచ్చి నట్టుగా కనిపిస్తుంది. అదే సమయంలో బిల్లును చట్టంగా మార్చడానికి ముందుకెళ్లవచ్చు. వైద్యం మినహా అన్ని శాఖలకు వర్తింపు! కొత్తగా అవతరించే భారత ఉన్నత విద్యా సంఘం (హెచ్ఈసీఐ–హెసీ) ఉన్నత విద్యారంగంలో వైద్యం మినహా మిగిలిన శాఖలకు విస్తరిస్తుంది. ఇందులో వ్యవసాయం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కింద పనిచేస్తున్న విద్యాసంస్థలన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఉన్నత విద్యను నియంత్రించడం నుంచి నిధులు అందించే పద్ధతిని విడదీస్తుంది. ఇప్పుడైతే మానవ వనరుల శాఖే నేరుగా నిధులందించే పని చేస్తోంది. అంటే ఇక ముందు ప్రభుత్వ కనుసన్నల్లో విద్యా సంస్థలు పనిచేయాల్సి ఉంటుంది. లెక్కకు మించిన అనేక సంస్థలను నియత్రించడం ఈ కొత్త కమిషన్‌కు భారమౌతుంది. 1980ల నుంచి 1990ల వరకూ ఉదార ఆర్థిక విధానాల్లో భాగంగా వచ్చిన ప్రయివేటీ కరణ వల్ల కుప్పలు తెప్పలుగా ప్రయివేటు యూనివ ర్సిటీలు, కాలేజీలు పుట్టుకొచ్చాయి. వాటి వల్ల వచ్చిన సవాళ్లు అన్నీ ఇన్నీ కాదు. వృత్తి విద్యకు సంబంధించిన నియంత్రణా సంస్థలైన ఎన్సీటీఈ, ఎంసీఐ, ఏఐసీటీఈ, బీసీఈ కూడా సరిగ్గా పనిచే యడం లేదనే విమర్శ ఉంది. సంస్థలు ఎక్కువైతే అజమాయిషీ తక్కువయ్యే ప్రమాదముంది. కొత్తగా వస్తున్న కమిషన్ విద్యా విషయాలతోపాటు ఆర్థికప రమైన విధులు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. అనుభవమున్న వారిని ఈ కమిషన్‌లో నియమించక పోతే పాత పరిస్థితే నెలకొంటుంది. దేశంలో ముఖ్య మైన ప్రతి యూనివర్సిటీని, ఇంకా ఎఫ్టీఐఐ, ఐసీఎ స్సెస్సార్ తదితర విద్యా సంస్థలను ఆరెసెస్ మద్దతు దారులకు అప్పజెప్పారు. వారిలో చాలా మందికి ఇలాంటి ఉన్నత విద్యాసంస్థలను నడిపించే అను భవం ఏ మాత్రం లేదు. పరిశోధన, ఇతర విష యాల్లో ‘సంఘ్’ ఎజెండాను అమలుపరచడం వల్ల కొన్ని యూనివర్సిటీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదు రవుతోంది. నియంత్రణ హెచ్ఈసీఐకి భారమే! తామర తంపరగా పుట్టుకొస్తున్న ప్రయివేటు విద్యా సంస్థలను సరైన మార్గంలో పెట్టి, క్షీణిస్తున్న విలువ లకు అడ్డుకట్ట వేయడం హెచ్ఈసీఐకి భారంగా మారుతుంది. సంస్థల విద్యా విషయాలను ఈ బిల్లు ఏ విధంగా మెరుగుపరుస్తుందనే విషయం పక్కన పెడితే, వృత్తి విద్యకు సంబంధించిన సంస్థలను ఏ విధంగా అదుపు చేస్తుందో తెలియదు. కేవలం నిధులు కేటాయించడమే పని అయితే హెచ్ఈసీఐ స్థాపనే ప్రశ్నార్థకంగా మారుతుంది. దేశంలో అత్యు న్నత సంస్థలుగా(సెంటర్స్ ఆఫ్ ఎక్సెలెన్స్) గుర్తింపు పొందిన వంద కంటే ఎక్కువ సంస్థలకు ప్రస్తుతం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిధులు కేటా యిస్తోంది. ఇందులో ముఖ్యంగా ఐఐటీలు, ఐఐ ఎస్సీ, ఎన్ఐటీలు, ఐఐఎసీఈఆర్ వంటి సంస్థలు న్నాయి. అలాగే దేశంలోని 47 కేంద్ర విశ్వవిద్యాల యాలకు కూడా ఈ శాఖ నిధులనందిస్తోంది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల విషయానికి వచ్చేసరికి 50 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులుంటేనే నిధులు ఇస్తా నంటోంది. ప్రస్తుతం వీటికి రాష్ట్రీయ ఉచ్ఛతర శిక్షా అభియాన్(రూసా) నుంచి నిధులు సమకూరుస్తు న్నారు. ఈ విషయంలో హెచ్ఈసీఐ పాత్ర ఎంత సమర్థంగా ఉంటుందో కాలమే చెబుతుంది. ఈ బిల్లు తీసుకురావడానికి ప్రధాన కారణాల్లో ముఖ్యమైనవి– ఐఐఎం వంటి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలకు పూర్తి స్థాయి స్వాతంత్య్రం ఇవ్వడం, కొత్తగా వచ్చే సంస్థలకు విడతల వారీగా స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడం, నిధులతో సంబంధం లేకుండా నడిచే వాటిని ప్రోత్సహించడం. మరో ముఖ్య లక్ష్యం ప్రభుత్వ అధీనంలో నడిచే సంస్థలను తమ సొంత నిధులతో పనిచేసేలా ప్రోత్సహించడం. ఇందుకు అవసరమైన ఉపయోగ రుసుములు వసూలు చేసుకునే హక్కును వాటికి కల్పిస్తారు. అవసరమైతే హెచ్ఈసీఐనుంచి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వ సంస్థలు హెచ్ ఈసీఐ అనే మరో ప్రభుత్వ సంస్థ నుంచి రుణాలు తీసుకుని తగిన సమయంలో వడ్డీతో పాటు అసలు చెల్లించాలన్నమాట. దీన్ని బట్టి చూస్తే హెచ్ఈసీఐ కేవలం నిధులందించడానికే పరిమితమౌతుంది. ప్రయోజనాల కన్నా సమస్యలే అధికం! ఈ బిల్లు వల్ల ప్రయోజనం కన్నా చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదట–కేవలం ఉద్యోగాలు వచ్చే కోర్సులు ప్రవేశ పెట్టాలి. రెండోది, ఆ కోర్సులకయ్యే వ్యయాన్ని ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచే వసూలు చేయాలి. ఇంకా మార్కెట్ అవసరాలను తీర్చే కోర్సులు రూపొందించి, ప్రవేశపెట్టే బాధ్యత కూడా ఆయా సంస్థలపై ఉంటుంది. ఒకేసారి ఎక్కువ ఫీజు చెల్లించలేని విద్యార్థులకు ఎలాగూ వాయిదాల్లో అప్పుతీసుకుని కట్టే రాయితీ ఉంది. దీనివల్ల చదువే విద్యా మార్కెట్‌గా మారి ఉన్నత విద్యా లక్ష్యానికే భంగం కలుగుతుంది. ఈ పరిణామం విశ్వవిద్యా లయం అనే భావనకే విరుద్ధం. సమయానికి రుణాలు తీర్చలేని విద్యార్థులు అపరాధభావంతో కుమిలిపోతారు. అంతేగాక ఆర్థిక ఇబ్బందులకు గుర వుతారు. ఇప్పటికీ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో కేవలం ఒక శాతం మాత్రమే బడ్జెట్లో కేటాయి స్తున్నారు. దీన్ని కనీసం రెండు శాతానికైనా పెంచా ల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్యాసంస్థలను విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలంటే వాటిని వైజ్ఞానిక పరిశోధనా కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. పరిశోధనకు పెద్ద పీట వేయాలి. దీనితోపాటు అసంఖ్యాకంగా ఉన్న దళిత, ఆదివాసీ, పేద విద్యార్థులకు కులమత భేదం లేకుండా అవకాశాలు కల్పించాలి. చదివిన కోర్సులకు ఉద్యోగిత (ప్రొడక్టివిటీ) ఉండేలా చూడాలి. ఈ విద్యా సంస్థల్లో అధ్యాపకుల కొరత రాకుండా నిరంతరం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ ధనం వెచ్చించి తనకు తానుగా పెట్టుబడి పెట్టకుండా ప్రభుత్వం ఉన్నత విద్యను సరైన దారిలో పెట్టాలనుకోవడం అత్యాశే అవు తుంది. వ్యాసకర్త: ప్రొ. కె.పి.సుబ్బారావు, విశ్రాంత ఆచార్యులు, ఆంధ్రా యూనివర్సిటీ -
ప్రపంచశ్రేణి విద్యాసంస్థలు
మన విద్యకూ, విద్యాసంస్థలకూ ప్రపంచశ్రేణి గుర్తింపు తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ కృత నిశ్చయం మెచ్చదగిందే. అందుకోసం విద్యా సంస్థలను ఎంపిక చేసి వాటికి సకల వనరులూ కల్పించి తీర్చిదిద్దాలన్న సంకల్పమూ మంచిదే. కానీ తాము ప్రపంచశ్రేణి విద్యా సంస్థలుగా రూపొం దుతామని ఇచ్చిన వాగ్దానాన్ని ఓ కమిటీ పరిశీలించి, వాటికి ఆ సామర్థ్యం ఉన్నదని అంచనా వేసుకుని, ఆ వెనువెంటనే వాటికి ఘనతర విద్యాసంస్థలన్న భుజకీర్తులు కట్టబెట్టడం భావ్యమేనా అన్న సందేహం సహజంగానే తలెత్తుతుంది. సోమవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) మంత్రిత్వ శాఖ వెలువరించిన జాబితాలో చోటు దక్కిన సంస్థలు సరే... దక్కని సంస్థలేమిటో గమనిస్తే ఎంపికకు కమిటీ అనుసరించిన ప్రాతిపదికలేమిటన్న గందరగోళం ఏర్ప డుతుంది. మొన్న ఏప్రిల్‌లో ఇదే హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పది అత్యుత్తమ యూనివర్సిటీల జాబితాలో బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)కి ప్రథమ స్థానం వస్తే, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయిదో స్థానంలో ఉంది. ఇంకా జాదవ్‌పూర్ యూనివర్సిటీ, సావిత్రిబాయి ఫూలే యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వగైరాలున్నాయి. ఈ సంస్థలన్నీ అత్యుత్తమ సంస్థల జాబితాలో ఎప్పుడూ అగ్ర భాగానే ఉంటాయి. కానీ ఇందులో ఇప్పుడు ఒక్క ఐఐఎస్సీకి తప్ప మరే విద్యా సంస్థకూ చోటు దొరకలేదు. ఏప్రిల్‌నాటి జాబితాలో ఎక్కడో ఉన్న ఢిల్లీ ఐఐటీ, బాంబే ఐఐటీలు మాత్రం తాజా జాబితాలో చేరాయి. హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ ఈ ఘనతర విద్యాసంస్థల ఎంపిక బాధ్యతను త్వరలో రద్దు కాబోతున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)కి అప్పజెప్పింది. యూజీసీ ఇందుకోసం మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్. గోపాలస్వామి నేతృత్వంలో 13మందితో సాధికార నిపుణుల కమిటీ ని నియమించింది. మొదట్లో పబ్లిక్ రంగంలో పది, ప్రైవేటు రంగంలో పది విద్యా సంస్థల్ని ఎంపిక చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా చెరో మూడింటితో సరిపెట్టారు. ఎంపికైన పబ్లిక్ రంగ విద్యాసంస్థకు ఒక్కోదానికి ఏడాదికి రూ. 1,000 కోట్లు సమకూర్చాలని నిర్ణయించినందువల్ల కావొచ్చు...జాబితా చిక్కిపోయింది. పది సంస్థల్ని గనుక ఎంపిక చేస్తే వీటికోసం ఏడాదికి రూ. 10,000 కోట్లు ప్రత్యేకించి కేటాయించాల్సివస్తుంది. అది పెనుభారం కావొచ్చునన్న ఉద్దేశంతో ఇప్పుడు మూడింటికే పరిమితమైనట్టు కనబడుతోంది. ఇక ప్రైవేటు రంగ సంస్థలు సొంతంగా నిధులూ, ఇతర వనరులూ సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఈ సంస్థలన్నీ నియంత్రణ వ్యవస్థ నుంచి విముక్తమవుతాయి. ఎలాంటి ప్రమాణాలు నిర్దేశించాలో, ప్రవేశాలకు ఏ ప్రాతిపదికలు నిర్ణయిం చాలో, ఎవరిని అధ్యాపకులుగా తీసుకోవాలో, ఏ కోర్సులు ప్రవేశపెట్టాలో, ఏ ప్రపంచ విశ్వ విద్యాలయాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలో, ఏ ఏ రంగాల్లో పరిశోధనలకు స్థానమీయాలో ఇవి సొంతంగా నిర్ణయించుకుంటాయి. ఎంపికైన ప్రభుత్వ రంగ సంస్థలు ప్రస్తుత చట్టాలకూ, నియం త్రణలకూ లోబడే పనిచేస్తాయని చెప్పినా... వాటికి కొన్ని వెసులుబాట్లు కల్పిస్తామని నిరుడు విడుదల చేసిన పత్రం తెలిపింది. ఆ వెసులుబాట్లలోనే ఒక ప్రమాదం పొంచి ఉంది. విద్యార్థుల నుంచి ఎంత ఫీజు వసూలు చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ వీటికిచ్చారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థికైనా ప్రవేశం నిరాకరించకుండా స్కాలర్షిప్లు, రుణ సదుపాయం అందు బాటులో ఉంచాలని సూచించినా ఆచరణలో అది ఎందరికి దక్కుతుందో చూడాలి. ఈ జాబితాలోని ప్రైవేటు సంస్థల గురించి చెప్పుకోవాలి. వీటిలో మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, బిట్స్ పిలానీ, రిలయన్స్‌కు చెందిన జియో ఇనిస్టిట్యూట్ ఉన్నాయి. ఇందులో మణిపాల్ అకాడమీ, బిట్స్ పిలానీలకున్న పేరు ప్రఖ్యాతుల గురించి వేరే చెప్పుకోనవసరం లేదు. కానీ ఇంకా కళ్లు తెరవని జియో ఇనిస్టిట్యూట్‌కు ఘనతర శ్రేణి విద్యా సంస్థల జాబితాలో చోటెలా దక్కిందో అనూహ్యం. దీనికి గ్రీన్‌ఫీల్డ్ కేటగిరీలో ఇచ్చామని, అది కూడా ‘అంగీకారపత్రమే’ తప్ప పూర్తి స్థాయి హోదా కాదని హెచ్ఆర్డీ చెబుతోంది. వచ్చే మూడేళ్లలో నిరూపించుకుంటే ఆ హోదా దక్కుతుందని వివరిస్తోంది. అలాంటపుడు ముందే దాన్ని ఇతర అగ్రశ్రేణి సంస్థల జాబితాలో చేర్చడం ఎందుకు? అగ్రశ్రేణిలో ఉంటామని చెబుతున్న సంస్థ ప్రస్తుత పనితీరు, మరింత ఉన్నతంగా ఎదగడానికి అది అనుసరించదల్చుకున్న విధానాలు బేరీజు వేసుకుని, అందుకు దానికున్న అవకాశాలేమిటో, సామర్థ్యమెంతో పరిగణనలోకి తీసుకుని నిర్ణయిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. జియో ఇనిస్టిట్యూట్‌కు రిలయన్స్ వంటి అగ్రగామి సంస్థ దన్ను ఉంది. ఆర్థిక వనరులూ పుష్కలంగా ఉన్నాయి. వాటినెవరూ కాదనరు. కేవలం సంస్థ వెనకుండే నిధులు, దాని స్థిరాస్తులు చూసి ఇప్పటికిప్పుడు జాబితాలో చోటు ఇవ్వడానికి బదులు మూడేళ్ల తర్వాత నిరూపించుకున్నాకే ఆ స్థాయి కల్పించవచ్చుకదా అనే సందేహం ఎవరికైనా వస్తుంది. నిజానికి అశోకా యూనివర్సిటీ, జిందాల్ యూనివర్సిటీ వంటి ప్రైవేటు రంగ సంస్థలు ఇప్పటికే ఖ్యాతి గడించాయి. వాటినెందుకు విస్మ రించారో ఎవరికీ తెలియదు. 1995లో చైనా ‘ప్రాజెక్టు–211’ పేరిట వంద విశ్వవిద్యాలయాలు నెల కొల్పాలని నిశ్చయించుకుని వాటికి పుష్కలంగా నిధులు మంజూరు చేసింది. దాదాపు పాతికేళ్లు గడిచేసరికి అవన్నీ విద్యలో, పరిశోధనల్లో ప్రపంచంలోనే మేటిగా తయారయ్యాయి. మన ఉన్నత స్థాయి విద్యాలయాలు నిధుల కొరతతో, సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడుతున్నాయి. కాంట్రాక్టు అధ్యాపకులతో నెట్టుకొస్తున్నాయి. విద్యార్థులకు ఇక్కడ నాసిరకం విద్యే దిక్కవుతున్నది. వీటన్నిటికీ జవసత్వాలు చేకూర్చే విస్తృత ప్రణాళికలు రూపొందించడానికి బదులు కేవలం కొన్నిటికే నిధుల వరద పారించి, ఇతర సంస్థల కడుపు మాడ్చడం వల్ల దేశానికి ఒరిగేదేమిటో పాలకులే చెప్పాలి. -
జియోకు స్టేటస్, కేంద్రం నవ్వుల పాలు
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి నవ్వుల పాలైంది. జియో ఇన్స్టిట్యూట్ కనీసం ఏర్పాటు చేయనప్పటికీ ఈ విద్యాసంస్థకు ‘ప్రఖ్యాత సంస్థ’ స్టేటస్‌ను అందించింది. కనీసం ఈ ఇన్స్టిట్యూట్ సంబంధించి ఒక్క భవనం లేనప్పటికీ, ఒక్క విద్యార్థి కూడా ఆ ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ పొందనప్పటికీ, ‘ప్రఖ్యాత సంస్థ’ స్టేటస్‌ను ఎలా కేటాయిస్తారంటూ విమర్శల వర్షం కురుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సోమవారం ఆరు ఇన్స్టిట్యూట్లకు ‘ప్రఖ్యాత సంస్థ’ స్టేటస్‌ను కేటాయించింది. వాటిలో రెండు ప్రతిష్టాత్మకమైన ఐఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, బిట్స్ పిలానీ, మనిపాల్ ఉన్నత విద్యా అకాడమీతో పాటు జియో ఇన్స్టిట్యూట్ కూడా ఆ స్టేటస్‌ను దక్కించుకుంది. ‘వరల్డ్ క్లాస్’ ఇన్స్టిట్యూషన్లుగా మార్చడానికి ఇది ఎంతో సహకరిస్తుంది. కానీ రిలయన్స్ గ్రూప్‌కు చెందిన జియో ఇన్స్టిట్యూట్ను ఈ స్టేటస్ కేటగిరీలో చేర్చడమే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు ఇప్పటి వరకు ఈ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేకుండా ఈ స్టేటస్‌ను అందించడం విడ్డూరంగా ఉందని హెచ్ఆర్డీపై మండిపడుతున్నారు. జియో ఇన్స్టిట్యూట్ దీనిలో చేర్చడం మరో బిగ్ స్కాం అని ట్విటర్ యూజర్లంటున్నారు. ఈ ఇన్స్టిట్యూట్ను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని, కనీసం వెబ్సైట్ కూడా లేదని.. అలా ఎలా హెచ్ఆర్డీ ‘ప్రఖ్యాత సంస్థ’ ట్యాగ్‌ను జియో ఇన్స్టిట్యూట్కు ఇస్తుందని మండిపడుతున్నారు. కేవలం ఈ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయనున్నట్టు మాత్రమే నీతా అంబానీ 2018 మార్చి 11న ప్రకటించారు. ఈ ఇన్స్టిట్యూట్ ప్రారంభం కావడానికి ఇంకా మూడేళ్లు పడుతుంది. ఈ ఇన్స్టిట్యూట్ ఇప్పటి వరకు ఎంహెచ్ఆర్డీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ 2018 ర్యాంకింగ్స్ జాబితాలోనే లిస్ట్ కాలేదని, ఎందుకు టాప్ ర్యాంక్ కలిగిన పబ్లిక్ ఇన్స్టిట్యూట్లకు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లకు పక్కన బెట్టి మరీ జియోకు ఈ స్టేటస్ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఐఐటీ మద్రాస్ లేదా ఐఐటీ ఖరగ్‌పూర్‌ల లాంటి పలు చరిత్రాత్మక ఇన్స్టిట్యూషన్ల కంటే జియో ఇన్స్టిట్యూటే మెరుగైనదని ఎలా నిర్ణయించారని మరో ట్విటర్ యూజర్ ప్రశ్నించారు. ఏర్పాటు చేస్తున్న సమయంలో ఈ స్టేటస్ ఇవ్వడం నిజంగా చాలా సిగ్గుచేటన్నారు. అయితే తమ ఈ నిర్ణయాన్ని హెచ్ఆర్డీ కార్యదర్శి(ఉన్నత విద్య) ఆర్ సుబ్రమణ్యం సమర్థించుకున్నారు. గ్రీన్‌ఫీల్డ్ కేటగిరీ కింద ఈ ఇన్స్టిట్యూట్ను ఎంపిక చేశామని చెప్పారు. ఎలా టాప్-క్లాస్ ఇన్స్టిట్యూట్లగా మార్చుకుంటారో తెలుపుతూ వారి ప్లాన్ల వివరాలు అందించాలని కోరామని కూడా చెప్పారు. యూజీసీ(వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ డీమ్డ్ టూ బి యూనివర్సిటీస్) రెగ్యులేషన్స్ 2016 కింద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటుచేసే అధికార నిపుణుల కమిటీ ఈ ఇన్స్టిట్యూట్లను ఎంపిక చేసింది. -
ఉన్నత విద్య ప్రక్షాళన ఇలాగేనా?!
ఏటా ప్రకటించే అంతర్జాతీయ ర్యాంకుల్లో ఎప్పుడూ తీసికట్టుగానే కనిపించే మన ఉన్నత విద్యా రంగ సంస్థలను ప్రక్షాళన చేయడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ)మంత్రిత్వ శాఖ పూనుకుంది. ఇప్పుడున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ను రద్దు చేసి దాని స్థానంలో భారత ఉన్నత విద్యా కమిషన్(హెచ్ఈసీఐ)ను నెలకొల్పబోతున్నట్టు తెలిపింది. దానికి సంబంధించిన బిల్లు ముసాయిదాను బుధవారం విడుదల చేసి పదిరోజుల్లో...అంటే వచ్చే నెల 7 లోగా ఎవరైనా అభిప్రాయాలు చెప్పవచ్చునని ప్రకటించింది. వచ్చే నెల 18నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో హెచ్ఈసీఐ బిల్లును ప్రవేశపెడతామని కూడా ఆ శాఖ వివరించింది. గత నెలలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జావ్డేకర్ ఉన్నత విద్యారంగంపై అధికారులతో కూలంకషంగా చర్చించినప్పుడు యూజీసీని, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)ని విలీనం చేసి ఒకే నియంత్రణ సంస్థ నెలకొల్పాలన్న ప్రతిపాదన వచ్చింది. అలా చేస్తే అనవసర వివాదాలు బయల్దేరతాయి గనుక ఏ సంస్థకా సంస్థను సంస్కరించాలని నిర్ణయించారు. హెచ్ఈసీఐ వ్యవహారం పూర్తయితే కేంద్రం ఏఐసీటీఈపై దృష్టి సారించదల్చుకుంది. అయితే ఉన్నత విద్యా రంగానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోవడా నికి ముందు విద్యారంగ నిపుణుల, మేధావుల అభిప్రాయాలు తీసుకోవాలనీ, వివిధ దేశాలు అమలు చేస్తున్న విధానాలనూ, అక్కడి నియంత్రణ వ్యవస్థలనూ పరిశీలించాలని కేంద్రప్రభుత్వా నికి తోచకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభంకాని ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం పది రోజుల వ్యవధిలో అందరూ అభిప్రాయాలు చెప్పటం, వాటి మంచిచెడ్డ లపై చర్చ జరగటం సాధ్యమేనా? ప్రభుత్వం ఆలోచించాలి. నాలుగేళ్లక్రితం అధికారంలోకొచ్చినప్పుడే విద్యా రంగాన్ని సంస్కరిస్తామని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి టీఎస్ఆర్ సుబ్రమణియన్ అధ్యక్షతన ఒక సంఘం ఏర్పాటైంది. అది సవివరమైన నివేదికలిచ్చి రెండేళ్లు దాటుతోంది. మూడు దశలుగా వెలువడిన ఆ నివేదికలపై అందరి అభిప్రాయాలూ సేకరించారు. అయితే నిర్దిష్టంగా ఉన్నత విద్యా రంగంలో భారీ సంస్కరణలను ప్రతిపాదించి, యూజీసీ స్థానంలో కొత్త సంస్థను నెలకొల్పాలను కున్నప్పుడు దాని లక్ష్యాలపై, పరిమితులపై, నియమనిబంధనలపై... వాటి మంచిచెడ్డలపై లోతుగా చర్చించాల్సిన అవసరం లేదా? మన ఉన్నత విద్యారంగం మొదటినుంచీ వెలవెలబోతోంది. యూజీసీ ఛత్రఛాయలో దాదాపు 850 విశ్వవిద్యాలయాలు, 37,204 కళాశాలలు ఉన్నాయి. కానీ వీటిల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటైన పరిశోధనలు లేవు. అసలు అందుకవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. బోధనకు అవసరమైనంతమంది అధ్యాపకులు లేరు. ఉన్నవారిపై భారం ఎక్కువగా పడటంతో వారు పరిశోధనల్లో పాలుపంచుకోవటం సాధ్యపడటం లేదు. ఇది బోధనా ప్రమాణాలపైనా, విద్యార్థుల్లో పెంపొందాల్సిన సృజనాత్మకతపైనా ప్రభావం చూపుతోంది. చాలా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు కాంట్రాక్టు అధ్యాపకులతో నెట్టుకొస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌తో పని కానిస్తున్నామన్న సంబరమేగానీ... అందుమూలంగా ప్రమాణాలు పతనమవుతున్నాయని, ప్రతిభాపాటవాల్లో మన పట్టభద్రులు అంతంతమాత్రంగానే ఉంటున్నారని గుర్తించటం లేదు. కొత్త నియంత్రణ వ్యవస్థ వీటన్నిటినీ సరిచేసేలా ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ముసా యిదాను చూస్తే అలాంటి ఆశ కలగదు. కొత్త వ్యవస్థ సంపూర్ణంగా విద్యారంగ ప్రమాణాలపైనే దృష్టి సారిస్తుందని ఊరిస్తున్నారు. ప్రభుత్వ ప్రమేయం తగ్గించటం దీని ప్రధాన ఉద్దేశమంటున్నారు. ఇన్నాళ్లూ బోగస్ విశ్వవిద్యాలయాల, బోగస్ కళాశాలల జాబి తాను మాత్రమే యూజీసీ విడుదల చేసేది. కొత్తగా ఏర్పడే సంస్థకు వాటిని రద్దు చేసే అధికారం ఉంటుంది. అలాగే తగిన ప్రమాణాలు సాధించని సంస్థలపై చర్య తీసుకునే అధికారం కూడా ఇచ్చారు. తనిఖీ రాజ్‌కు స్వస్తి పలకడం, పూర్తిస్థాయిలో నాణ్యతా ప్రమాణాల సాధనకు కృషి చేయటం కొత్త సంస్థ లక్ష్యమంటున్నారు. నిధుల మంజూరు వ్యవహారాన్ని దీన్నుంచి తప్పిస్తామని, ఇకపై నేరుగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆ పని చూసుకుంటుందని ముసాయిదాతో పాటు విడుదల చేసిన నోట్ వివరించింది. ఒకపక్క ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గిస్తామని చెబుతూ నిధుల మంజూరు అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకోవటం వింత కాదా? ఉన్నత విద్యారంగాన్ని పూర్తిగా ఆ రంగంలోని నిపుణులకు వదిలిపెట్టడమే యూజీసీ నెలకొల్పడంలోని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం యూజీసీకి నిధులిస్తే వాటిని ఎలా వ్యయం చేయాలో ఆ సంస్థ నిర్ణయించుకుంటుందని అనుకు న్నారు. కానీ యూజీసీకి నేతృత్వం వహించినవారిలో చాలాకొద్దిమంది మాత్రమే స్వతంత్రంగా వ్యవ హరించగలిగారు. సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారు. చాలామంది అధికారంలో ఉన్నవారి ఇష్టా యిష్టాలకు లోబడే వ్యవహరించారు. యూజీసీకిచ్చే నిధుల్లో రాను రాను కోత పడటం మొదలైంది. అది ఆ బడ్జెట్లోనే సర్దుకోవటానికి సిద్ధపడింది. దాని ప్రభావం కొత్త కోర్సుల ప్రారంభంపైనా, ఉన్న కోర్సుల కొనసాగింపుపైనా, అధ్యాపక నియామకాలపైనా పడింది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సుల పేరుతో విద్యను పేద వర్గాల పిల్లలకు అందుబాటులో లేకుండా చేశారు. వీటన్నిటి ఫలితంగా విశ్వ విద్యాలయాలు నీరసించటం మొదలైంది. సంస్థల ప్రమాణాలెలా ఉన్నాయో ఎప్పటికప్పుడు చూసి నిధులు మంజూరు చేయటం యూజీసీ విధి. కానీ కొత్త బిల్లు చట్టమైతే ప్రమాణాలను సమీక్షించడం వరకే దాని పని. నిధుల మంజూరు వ్యవహారం ప్రభుత్వానిది. ఈ స్థితి ఉన్నదాన్ని మెరుగుపరు స్తుందో, మరింత దిగజారుస్తుందో ఎవరికైనా సులభంగానే బోధపడుతుంది. మన విశ్వవిద్యాల యాలు బోధనలో, పరిశోధనలో మేటిగా ఉండటానికి, అత్యున్నత ప్రమాణాలు సాధించడానికి ఇంత కంటే మెరుగైన కార్యాచరణను ప్రతిపాదించటం అవసరమని పాలకులు గుర్తించాలి. -
ఆ విద్యా సంస్థలకు రూ లక్ష కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక వసతుల మెరుగుదలకు కేంద్రం భారీగా నిధులు వెచ్చించనుంది. ఆయా సంస్థల్లో మౌలిక వసతుల ఆధునీకరణకు ఉన్నత విద్య ఫండింగ్ ఏజెన్సీ (హెచ్ఈఎఫ్ఏ) రూ లక్ష కోట్లు ఖర్చు చేస్తుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. 2022 నాటికి ఉన్నత విద్యా రంగంలో మౌలిక సౌకర్యాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించి, వ్యవస్థలను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్రం భారీగా నిధులను వెచ్చించాలని నిర్ణయించిందని చెప్పారు. ఉన్నత విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులకు అదనంగా హెచ్ఈఎఫ్ఏ నిధులు సమకూరుస్తుందన్నారు. గత నాలుగేళ్లలో విద్యా రంగంలో బీజేపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులను చేపట్టిందని ప్రకాష్ జవదేకర్ తెలిపారు. కాగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016-17 కేంద్ర బడ్జెట్లో హెచ్ఈఎఫ్ఏ ఏర్పాటును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ నిధులను సమీకరించి ఉన్నత విద్యాసంస్థలకు వడ్డీరహిత రుణాలుగా నిధులను అందుబాటులోకి తెస్తుంది. హెచ్‌ఈఎఫ్‌ఏను ఆర్బీఐ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థగా (ఎన్బీఎఫ్సీ) గుర్తించింది. -
జేఈఈ అడ్వాన్స్డ్: సప్లిమెంటరీ మెరిట్ జాబితా
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ 2018 అర్హుల సంఖ్య పెరిగింది. తొలుత ఆదివారం జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫలితాలకు అదనంగా మరికొంత మంది అర్హుల జాబితాను గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఐఐటీ కాన్పూర్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆదివారం విడుదలైన ఫలితాల్లో 18,138 మంది అర్హత సాధించారు. తాజాగా అనుబంధ(సప్లిమెంటరీ) మెరిట్ జాబితాలో 13,842 మంది అదనంగా అర్హత సాధించినట్టు పేర్కొన్నారు. అంటే మొత్తం 31,980 మంది విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు పొందనున్నారు. గత ఏడేళ్లతో పోలిస్తే ఈ ఏడాదే తక్కువ మంది అర్హత సాధించడంతో కేంద్ర మానవ వనరులు శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. భారీగా ఐఐటీ సీట్లు ఉండటం, ఒక్కో సీటుపై కేంద్ర ప్రభుత్వం భారీగా వెచ్చిస్తుండటంతో.. కొత్త మెరిట్ లిస్ట్‌ను రూపొందించాల్సిందిగా ఐఐటీ కాన్పూర్‌కు సూచించింది. ఈ సందర్భంగా కేంద్ర మానవ వనరులు శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఐఐటీ సీట్లు ఖాళీగా ఉండటానికి వీల్లేదన్నారు.. ప్రభుత్వం ఐఐటీల కోసం భారీగా ఖర్చు చేస్తుందని గుర్తుచేశారు. దీంతో కట్ ఆఫ్ తగ్గించిన ఐఐటీ కాన్పూర్ కొత్త జాబితాను రూపొందించింది. అయిన్పటికీ గతేడాదితో పోల్చితే ఇది తక్కవే అని చెప్పాలి. 2017లో 50,455 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించారు. ఈ ఏడాది మే 20న నిర్వహించిన ఈ పరీక్షకు 1,55,158 మంది విద్యార్థులు హాజరయ్యారు. -
కేంద్ర మంత్రికి అనంతపురం విద్యార్థి ఫిర్యాదు!
న్యూఢిల్లీ : అనంతపురం కేంద్రీయ విద్యాలయం తొమ్మిదో తరగతి విద్యార్థి మోహన్ బాబు స్కూలు యాజమాన్యం తనను వేధింపులకు గురిచేస్తోందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేవకర్‌కు లేఖ రాశాడు. ‘పీఈటీ టీచర్లు నన్ను, నా సోదరున్ని కాళ్లపై కొట్టడంతో నా తండ్రి స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై టీచర్‌పై చర్యలు తీసుకోకుండా మమ్మల్ని సర్టిఫికెట్లు తీసుకుని వెళ్లిపోవాలని బెదిరించారు. వారు ఈవిధంగా వేధింపులకు పాల్పడటానికి కారణం.. స్కూల్లో జరిగిన సెక్యూరిటీ గార్డుల నియామకం గురించిన వివరాలు తెలియజేయాలంటూ ఆర్టీఐలో దరఖాస్తు చేయడమే’ అని మోహన్ బాబు లేఖలో ఆరోపించాడు. మోహన్ బాబు తండ్రి నాగరాజు కూడా కేంద్రీయ విద్యాలయంలో పనిచేస్తున్నాడు. 2013లో కేంద్రీయ విద్యాలయ సెక్యూరిటీ గార్డుల నియామకం గురించిన వివరాలు తెలియజేయాలంటూ ఆర్టీఐలో అతను దరఖాస్తు చేశాడు. అయితే అప్పటినుంచి స్కూలు యాజమాన్యం తనను, తన కుటుంబాన్ని వేధిస్తోందని మోహన్ బాబు ఈ నెల 3న మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రికి లేఖ రాశాడు. మోహన్ బాబు అతని కుటుంబంతోపాటు ఢిల్లీ వెళ్లగా మంగళవారం అతని తండ్రి మంత్రి జవదేకర్‌ను కలిసి ఫిర్యాదు లేఖ అందజేశాడు. అదే రోజు సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్‌దాస్ అథవాలేను కూడా కలిసి దళితులమైన తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పామని విద్యార్ధి తండ్రి తెలిపాడు. విద్యార్థి ఆరోపణలను ప్రిన్సిపాల్ భారతీదేవి ఖండించారు. 2010 నుంచి నాగరాజు అతడిని, అతని పిల్లలను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఫిర్యాదు చేస్తూనే ఉన్నాడని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని ఆమె తెలిపారు. స్కూలు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తామని, ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడాల్సిన అవసరం తమకు లేదని ఆమె పేర్కొన్నారు. -
పరీక్షల నిర్వహణపై కమిటీ
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణ, లోపాలపై సమీక్షించేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. లీక్ తదితర లోపాల్లేకుండా సాంకేతికత సాయంతో భద్రమైన పద్ధతిలో పరీక్షలు నిర్వహించేందుకు ఈ కమిటీ తగు సూచనలు చేయనుంది. బుధవారం ఏర్పాటుచేసిన ఈ ఏడుగురు సభ్యుల కమిటీకి హెచ్చార్డీ మాజీ కార్యదర్శి వినయ్‌శీల్ ఒబెరాయ్ నేతృత్వం వహిస్తారు. మే 31కల్లా ఈ కమిటీ కేంద్రానికి నివేదిక అందజేస్తుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ వెల్లడించారు. సీబీఎస్ఈ వ్యవస్థలో భద్రతాపరమైన లోపాలను ఈ కమిటీ సమీక్షిస్తుందని, ట్యాంపరింగ్ లేకుండా ప్రశ్నపత్రాలు నేరుగా పరీక్షాకేంద్రాలకు చేరటంపైనా సూచనలు చేస్తుందన్నారు. పునఃపరీక్ష బోర్డు విచక్షణాధికారమే ప్రశ్నపత్రం లీక్ అయిన 12వ తరగతి ఎకనమిక్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలన్న సీబీఎస్ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ఐదు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. పునఃపరీక్ష నిర్వహించటం సీబీఎస్ఈ విచక్షణ పరిధిలోకి వస్తుందని.. దీన్ని కోర్టు ప్రశ్నించలేదని జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్ఏ బాబ్డేల ధర్మాసనం స్పష్టం చేసింది. -
ర్యాగింగ్ చేస్తే ఇక ఫిర్యాదు ఈజీ
న్యూఢిల్లీ : ర్యాగింగ్‌ను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి తెలపాలని లోక్ సభలో అడిగిన ప్రశ్నకు మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా సంస్థల్లో రాగింగ్‌ను అరికట్టేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) 2009లో నిబంధనలు రూపొందించింది. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రతీ సంవత్సరం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ర్యాగింగ్‌ను నిరోధించడం కోసం యాంటీ ర్యాగింగ్ టోల్ ఫ్రీ నంబర్‌ను రూపొందించామన్నారు. ర్యాగింగ్‌కు సంబంధించి ఫిర్యాదులు చేయాలనుకుంటే 1800-180-5522 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఇందుకోసం 12 భాషల్లో కాల్ సెంటర్ల సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఫిర్యాదులు స్వీకరించడానికి యాంటీ ర్యాగింగ్ వెబ్సైట్ www.antiragging.in ను కూడా రూపొందించామన్నారు. ఫిర్యాదులకు సంబంధించిన వివరాలు, స్టేటస్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు. గతేడాది మే 17న యాంటీ ర్యాగింగ్ మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించామని, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. యాంటీ ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థుల తల్లిదండ్రుల స్పందన గురించి, బాధితుల మానసిక వేదనకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా అప్లోడ్ చేశామన్నారు. యూజీసీ వెబ్‌పేజీ http://www.ugc.ac.in/page/Videos-Regarding-Ragging.aspx లో చూడవచ్చని, సీబీఎస్సీ కూడా ర్యాగింగ్ వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఫిర్యాదులు స్వీకరించి www.cbseaff.nic.inలోని నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ర్యాగింగ్‌ను అరికట్టేందుకు పలు చర్యలు తీసుకుంటున్న హెచ్ఆర్డీ శాఖ బాధితుల గురించి అనేక సంక్షేమ చర్యలు తీసుకుంటోందన్నారు. బాధితులతో పాటు నేరస్తుల మానసిక ఆరోగ్యం గురించి పర్యవేక్షించేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాధితులకు కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని విద్యా సంస్థల్లో ఓరియెంటేషన్, స్వాగత కార్యక్రమాలు నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా రూపొందించిన నిబంధనలు అమలయ్యేలా వైస్ చాన్స్లర్లకు కూడా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. -
కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, ఔరంగాబాద్ : ఛార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవపరిణామక్రమ సిద్ధాంతాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. మానవజాతి భూమి మీద అలాగే ఉండేదని అన్నారు. ఈ నేపథ్యంలో డార్విన్ సిద్ధాంతం పూర్తిగా తప్పని చెప్పారు. ఈ సిద్ధాంతాన్ని కళాశాలలు, పాఠశాలల్లో అధ్యాపకులు బోధించడం ఆపాలని పిలుపునిచ్చారు. డార్విన్ సిద్ధాంతం ప్రతిపాదించిన విధంగా మానవ పరిణామ క్రమం గురించి పురాతన భారతీయ గ్రంథాల్లో ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన చెప్పారు. డార్విన్ పేర్కొన్న జీవపరిణామక్రమ సిద్ధాంతం శాస్త్రీయంగా కూడా నిరూపితం కాలేదని అన్నారు. భూమి ఏర్పడ్డనాటి నుంచి మనిషి.. మనిషిగానే సంచరించాడని, అలాగే ఎదిగాడని తెలిపారు. డార్విన్ సిద్ధాంతం తప్పని 35 ఏళ్ల కిందటే శాస్త్రవేత్తలు నిరూపించారని గుర్తు చేశారు. -
డబ్బు రూపంలో ఫీజులు తీసుకోవద్దు: కేంద్రం
న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను పెంచేందుకే కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో ఫీజుల్ని నగదు రూపంలో స్వీకరించరాదని కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిజిటల్ విధానంలో ఫీజుల్ని చెల్లించే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర మానవవనరుల శాఖ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ను ఆదేశించింది. క్యాంటీన్‌తో పాటు హాస్టల్లో అందిస్తున్న సేవలకు చెల్లింపుల కోసం ‘భీమ్’ యాప్‌ను వాడేలా విద్యార్థులను ప్రోత్సహించాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం ఓ నోడల్ అధికారిని నియమించి యూజీసీకి నెలవారీ రిపోర్టులు పంపాలని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. -
ఆధార్ లేకున్నా సబ్సిడీ ప్రయోజనాలు: కేంద్రం
న్యూఢిల్లీ: ఆధార్ కార్డు లేనంత మాత్రాన ఎవరికీ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనాలను నిరాకరించలేమని, ఇతర గుర్తింపు కార్డులనూ అంగీకరిస్తామని కేంద్రం స్పష్టతనిచ్చింది. ఉపకారవేతనాలు, మధ్యాహ్న భోజన పథకాలకు కేంద్ర మానవ వనరుల శాఖ ఆధార్‌ను తప్పనిసరిచేయడం పట్ల పలు ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఆధార్ లేనందుకు ఎవరూ ప్రభుత్వ సబ్సిడీలకు దూరం కాకూడదు. ఆధార్ పొందే వరకూ ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాల ద్వారా వారికి ప్రయోజనాలు అందుతాయి’ అని అధికార ప్రకటన వెలువడింది. మధ్యాహ్న భోజనం, సమీకృత పిల్లల అభివృద్ధి పథకాల కింద లబ్ధిదారుల ఆధార్ వివరాలు సేకరించాలని పాఠశాలలు, అంగన్వాడీలను కోరతామని, కార్డు లేనివారు అందుకు నమోదుచేసుకునేలా అధికారులు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. -
నవోదయ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు
న్యూఢిల్లీ: జవహర్ నవోదయ విద్యాలయాల్లో (జేఎన్వీ) ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకోడానికి గడువును అక్టోబరు 16కు పెంచారు. వాస్తవానికి గడువు సోమవారంతో ముగిసింది. వెబ్సైట్లో సాంకేతిక సమస్య వల్ల దరఖాస్తు పూర్తి చేయలేకపోయామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు కొందరు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. దరఖాస్తు చేసినవారు మార్పులు చేసుకోడానికి అక్టోబర్ 17 నుంచి 20 వరకు అవకాశం కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. -
స్మృతి ఇరానీ చేయలేనిది జవదేకర్ చేశారు!
న్యూఢిల్లీ: వివాదాస్పద నాయకురాలు స్మృతి ఇరానీ నుంచి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పగ్గాలు చేపట్టిన జవదేకర్ తనదైన నిర్ణయాలతో ముందుకెళుతున్నారు. దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూళ్లు అయిన ఐఐఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్)కు మరింతగా స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చే నూతన బిల్లుకు జవదేకర్ ఆమోదం తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఐఐఎం బిల్లులో ప్రతిపాదించిన మార్పులన్నింటినీ ఆయన అంగీకరించారు. గతంలో హెచ్చార్డీ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ ఐఐఎంలకు ఇప్పుడు ఉన్నదాని కన్నా ఎక్కువ స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వడానికి అంగీకరించలేదు. తాజా ప్రతిపాదనల ప్రకారం ఐఐఎంలన్నింటికి సంబంధించిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (బీవోజీ) చైర్మన్ నియామకంలోనూ ప్రభుత్వ పాత్ర ఉండకూడదన్న అంశానికి కూడా హెచ్చార్డీ ఆమోదం తెలిపింది. గతంలో జూలైలో స్మృతి నుంచి జవదేకర్ హెచ్చార్డీ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐఐఎం బిల్లులో పలు సవరణలు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ సవరణలకు సంబంధించిన సప్లిమెంటరీ కేబినెట్ నోట్‌ను హెచ్చార్డీ ఇప్పటికే కేబినెట్ ముందు ఉంచింది. తాజా ముసాయిదా బిల్లు ప్రకారం ఐఐఎంలు స్వతంత్రంగా తమ డైరెక్టర్లను నియమించుకోవచ్చు. ప్రస్తుతం సెలెక్షన్ కమిటీ కుదించిన జాబితాలోని పేర్లలో ఒకరిని డైరెక్టర్‌గా కేంద్ర నియామకాల కేబినెట్ కమిటీ నియమిస్తూ వస్తున్నది. అదేవిధంగా ఐఐఎంల బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (బీవోజీ)కు సాధికారిత కల్పించేందుకు బిల్లు అంగీకరించింది. ఇక నుంచి కుదించిన జాబితాలోని పేర్లలో ఒకరిని డైరెక్టర్‌గా నియమించే అధికారం బీవోజీకి కల్పించనున్నారు. -
రోహిత్ దళితుడు అనేందుకు ఆధారాలు లేవు
రిజర్వేషన్ల కోసమే రోహిత్ తల్లి కులం సర్టిఫికెట్ తీసుకున్నారు * వ్యక్తిగత విషయాలే రోహిత్ ఆత్మహత్యకు కారణం * రోహిత్ ఆత్మహత్యలో రాజకీయ జోక్యం లేదు * ఇందులో హెచ్‌సీయూ యాజమాన్యం, ప్రభుత్వానికి బాధ్యత లేదు * కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయకు క్లీన్చిట్ * హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించిన రూపన్వాల్ కమిషన్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల దళితుడు అనేందుకు ఆధారాలు లేవని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్ఆర్డీ) శాఖ నియమించిన ఏక సభ్య కమిషన్ నిర్ధారించింది. రోహిత్ తల్లి రాధిక రిజర్వేషన్ల లబ్ధి కోసమే తనని తాను దళిత్‌గా ప్రకటించుకున్నారని పేర్కొంది. రోహిత్ తల్లి రాధిక కన్నతల్లిదండ్రులు ఎవ్వరో తెలియకుండా ఆమెను పెంచిన తల్లి.. రాధిక ఎస్సీ అని చెప్పడం సరికాదని కమిషన్ అభిప్రాయపడింది. ఆమె దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది. రాధిక వాంగ్మూలం ఆధారంగా రోహిత్‌కు కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసినట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే రూపన్వాల్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ఆగస్టు 1న హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖకు 41 పేజీల నివేదికను సమర్పించింది. 50 మందిని విచారించిన కమిషన్ రోహిత్ ఆత్మహత్యపై దుమారం చెలరేగడంతో ఈ ఏడాది జనవరి 28న హెచ్ఆర్డీ శాఖ నియమించిన ఏకసభ్య కమిషన్ మొత్తం 50 మందిని విచారించినట్టు పేర్కొంది. అందులో అత్యధికులు వర్సిటీ అధ్యాపకులు, సిబ్బందే. ఇందులో సామాజిక న్యాయ ఐక్య పోరాట కమిటీ నేతృత్వంలో ఉద్యమించిన ఐదుగురు విద్యార్థి జేఏసీ నాయకులు సైతం ఉన్నారని కమిషన్ వివరించింది. వాస్తవానికి రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన విషయాల్లోని నిజానిజాలు.. విద్యార్థులెదుర్కొంటున్న సమస్యలకు ప్రస్తుతం ఉన్న పరిష్కారాలు.. అదనంగా తీసుకోవాల్సిన చర్యలపై కమిషన్ విచారించాల్సి ఉంది. అయితే అందుకు భిన్నంగా చాలా అంశాలను ముఖ్యంగా రోహిత్ కులంపై కమిషన్ అత్యంత ఆసక్తిని ప్రదర్శించినట్టు కనిపిస్తోంది. పలు సిఫార్సులు చేసిన కమిషన్ విద్యార్థుల కోసమే కాక రీసెర్చ్ స్కాలర్ల కోసం తగిన కౌన్సెలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. అలాగే రోహిత్ మాదిరిగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను, సమాన అవకాశాల కేంద్రాలను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. నివేదికను స్వాగతించిన వీసీ అప్పారావు హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి రూపన్వాల్ కమిషన్ సమర్పించిన నివేదికపై హెచ్‌సీయూ వీసీ పొదిలె అప్పారావు హర్షం వ్యక్తం చేశారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో వీసీ అప్పారావు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాము ఇప్పటి వరకూ నివేదికను చూడలేదని, అయితే అందులోని అంశాలపై ఒక యూనివర్సిటీగా తాము సంతోషంగా ఉన్నామని అప్పారావు చెప్పారు. రోహిత్ ఆత్మహత్యతో విశ్వవిద్యాలయానికి సంబంధం లేదంటూ ఏకసభ్య కమిషన్ నిర్ధారించడాన్ని తాము గతిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రులకు క్లీన్చిట్ యూనివర్సిటీలో జరిగిన విష యాల్లో రాజకీయ జోక్యం ఏమాత్రం లేదని కమిషన్ స్పష్టం చేసింది. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతిఇరానీ వారి బాధ్యతలను వారు నిర్వర్తించారు తప్ప వర్సిటీ అధికారులపై ఎలాంటి ఒత్తిడీ తీసుకురాలేదని నివేదికలో రూపన్వాల్ కమిషన్ క్లీన్చిట్ ఇచ్చినట్టు తెలిసింది. రోహిత్‌ను వర్సిటీ హాస్టల్ నుంచి బహిష్కరిస్తూ అధికారులుతీసుకున్న నిర్ణయం సహేతుకమైనదని పేర్కొన్నట్టు తెలిసింది. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య.. రోహిత్ మరణానికి వ్యక్తిగత అంశాలే కారణ మని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. రోహిత్ నిరాశా నిస్పృహతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అంతే తప్ప వివక్ష అతని ఆత్మహత్యకు కారణం కానేకాదని తేల్చి చెప్పింది. రోహిత్ ఆత్మహత్యకు ప్రభుత్వం కానీ, యాజమాన్యం కానీ కారణం కాదని, అది అతని స్వయంకృతాపరాధమేనని పేర్కొంది. రోహిత్ ఆత్మహత్యకు అప్పటికప్పుడు యూనివర్సిటీలో తన చుట్టూ జరిగిన విషయాలేవీ కారణం కాదని, ఇదే విషయాన్ని అతని లేఖ స్పష్టం చేస్తోందని నివేదిక పేర్కొంది. ఒకవేళ ప్రభుత్వం కానీ, యాజమాన్యం కానీ రోహిత్ ఆత్మహత్యకు కారణం అయితే అదే విషయాన్ని అతను తన లేఖలో ప్రస్తావించి ఉండేవాడని స్పష్టం చేసింది. తన ఆత్మహత్యకు కారణం ఫలానా అని అతను ఎక్కడా పేర్కొనకపోగా, తాను బాల్యం నుంచి ఒంటరితనాన్ని అనుభవించానని, మెచ్చుకోలుకి కూడా నోచుకోలేదని స్వయంగా రాసుకున్నాడని రిపోర్టు తెలియజేసింది. దీన్ని బట్టి అతను నిరాశా నిస్పృహలతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని నివేదిక తేల్చింది. -
'రోహిత్ ఆత్మహత్య'పై మళ్లీ ప్రకంపనలు
హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖ నియమించిన కమిటీ అందించిన రిపోర్టుతో మళ్లీ వివాదం రేగింది. రోహిత్ దళితుడు, కాదని, అతని ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని తేల్చిన కమిటీపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మాజీ న్యాయమూర్తి అశోక్ కుమార్ రూపన్ వాల్ నేతృత్వంలోని ఏక సభ్య కమిటీతాజాగా తన రిపోర్టును మంత్రిత్వ శాఖకు అందజేసింది. రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులుకారని, అది 'దురదృష్టకరమైన సంఘటన' అని తన నివేదికలో పేర్కొంది. దీంతో పాటు కొన్ని సిఫారసులను కూడా చేసింది. వీటిని మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. రోహిత్ దళితుడు కాదని, ఓబీసీ అని తేల్చిన కమిటీ వాస్తవానికి తన రిపోర్టును ఆగస్టు 1న నివేదించాల్సి ఉంది. అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో దాన్ని బహిర్గతం చేయలేదని సమాచారం. కమిటీ రిపోర్టుపై అటు విద్యార్థులు, ప్రజాసంఘాలు, అధ్యాపక బృందం మండిపడుతోంది. ఉద్యమానికి సిద్ధమవుతోంది. రోహిత్ ఆత్మహత్య ఘటనపై కమిటీ వాస్తవాలను తారుమారు చేసిందని ఆరోపిస్తు జాయింట్ యాక్షన్ కమిటీగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళను దిగనున్నాయి. అటు విశ్వవిద్యాలయానికి చెందిన సుమారు వందమంది లెక్చరర్లు, నగరంలో నిర్వహించే 'మహా ధర్నా'కు మద్దతు నివ్వనున్నట్టు ప్రకటించారు. దాదాపు 33 ప్రజా సంఘాలు, ఇతర సంస్థలు వీరి పోరాటానికి అండగా నిలవనున్నాయి. అలాగే మిగిలిన రాష్ట్ర, కేంద్రీయ విశ్వ విద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు రోహిత్ ఆత్మహత్య లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలను కమిటీ ప్రతిపాదించింది. ముఖ్యంగా మనోవేదనకు గురైన విద్యార్థుల కోసం ప్రస్తుతం ఉన్న ఫిర్యాదుల కమిటీని మరింత పటిష్టం చేయాలని, తక్షణం సహాయం అందించేలా కౌన్సిలింగ్ సెంటర్ ఉండాలని సిఫారసు చేసింది. విశ్వవిద్యాలయం నుంచి సస్పెండ్ చేసినపుడు ఫిర్యాదు చేసే అవకాశంలేకపోవడం రోహిత్ ఆత్మహత్యకు ప్రధాన కారణంగా కమిటీ పేర్కొంది. -
స్మృతి ఇరానీ అలిగారా?
కేంద్ర మంత్రివర్గంలో అత్యంత కీలక శాఖల్లో ఒకటి... మానవ వనరుల మంత్రిత్వ శాఖ. నిన్న మొన్నటి వరకు ఈ శాఖ స్మృతి ఇరానీ వద్ద ఉండగా, తాజా మార్పులలో భాగంగా ఇది ప్రకాష్ జవదేకర్‌కు వెళ్లింది. జవదేకర్ తన కొత్త బాధ్యతలను గురువారం చేపట్టారు. స్మృతి ఇరానీకి అంతగా ప్రాధాన్యం ఏమీ లేని చేనేత, జౌళి శాఖ దక్కింది. ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలలో స్మృతి మీద జోకులు బాగానే పేలాయి. దాంతో ఆమె అలిగినట్లు కనపడుతున్నారు. గురువారం నాడు ప్రకాష్ జవదేకర్ మానవ వనరుల మంత్రిత్వశాఖ బాధ్యతలు చేపట్టిన కార్యక్రమానికి ఆమె డుమ్మా కొట్టారు. సాధారణంగా అయితే.. మంత్రులు శాఖలు మారినప్పుడు పాత మంత్రి దగ్గరుండి కొత్త మంత్రికి ఆ బాధ్యతలు అప్పగించడం, కుర్చీ చూపించడం అనవాయితీ. ఇతర శాఖల్లో కూడా ఇలాగే జరిగింది. కానీ, తన ప్రాధాన్యాన్ని గణనీయంగా తగ్గించడం, దానికి తోడు తన మీద సోషల్ మీడియాలో జోకులు పేలడంతో ఆమె నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆమె ప్రకాష్ జవదేకర్‌కు దగ్గరుండి బాధ్యతలు అప్పగించకుండా.. అసలు ఆ కార్యక్రమానికే రాకుండా ఊరుకున్నారని అంటున్నారు. -
స్మృతి ఇరానీపై ట్విట్టర్ లో సెటైర్లు
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి స్మృతి ఇరానీని తప్పించి, ఆమెకు తక్కువ ప్రాధాన్యత గల జౌళి శాఖను కేటాయించడం పట్ల సోషల్ మీడియా, ముఖ్యంగా ట్విట్టర్లో వ్యంగోక్తులు వెల్లివెరిశాయి.‘విద్యా రంగంలో ఒకే ఒక భారీ సంస్కరణ జరిగింది. అదే స్మృతి ఇరానీని ఆ శాఖ నుంచి తప్పించడం’ అని కొందరు వ్యాఖ్యానించారు. ఆమె ఆధ్వర్యంలోనే విద్యా సంస్కరణల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెల్సిందే. ఆ ప్రక్రియ పూర్తి కాకముందే ఆమెను ఆ పదవి నుంచి తప్పించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘నా పని విధానం ఎలా ఉందండీ మోదీగారు? అంటూ ఇరానీ ప్రశ్నించారు. అందుకు మోదీ తగిన సమాధానం ఇచ్చారు.....నా పనిని జడ్జ్ చేయండి అని మోదీని అడిగి ఉండాల్సిందికాదు, బాస్ తీర్పు ఇచ్చారు....జౌళి శాఖ ఇవ్వడంతో ఇక ఆమె ఇంట్లోని కబోర్డులన్నీ జౌళీ వస్త్రాలతో నిండిపోతాయి....మోదీజీ మీరు ఓ జీనియస్.....ఆహా ఇదెంత ఉపశమనం.....ఇక స్మృతి ఇరానీ బీజేపీకి మరో కిరణ్ బీడీ అవుతారు....2019 తర్వాత టీవీ సీరియళ్లుకు మంచి సీరియళ్లు ప్రింట్ చేసుకోవచ్చు.....ఇక బాలాజీ టెలీ ఫిల్మ్స్ కోసం స్మృతి ఇరానీ, ఫ్యాషన్ డిజైనర్ షైనా ఎన్సీ కలసి పనిచేసుకోవచ్చు....మోదీ రైట్ నౌ, పూర్ ఇరానీ....జౌళి శాఖకు మారక ముందు ఆ తర్వాత (కామెంట్‌తో ఆమె నవ్వుతున్న ఫొటోను, ఏడుస్తున్న ఫొటోను పోస్ట్ చేశారు)....’ ఇలా వ్యంగోక్తులు హల్చల్ చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా విద్యార్థుల ఉద్యమాలు చెలరేగడానికి ఆమె తొందరపాటు నిర్ణయాలు కారణమయ్యాయని బీజీపీ అధిష్టానం గుర్తించడంతోనే ఆమె శాఖపై వేటు పడింది. ముఖ్యంగా ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ, హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థుల్లో అలజడికి ఆమె తీసుకున్న నిర్ణయాలే కారణమన్న విషయం తెల్సిందే. -
కోహ్లి ఒప్పుకుంటాడా?
న్యూఢిల్లీ: యూత్ ఐకాన్ గా మారిన టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి మరో మంచి పనికి పూనుకోనున్నాడు. ర్యాగింగ్ కు వ్యతిరేకంగా గళం విప్పనున్నాడు. అతడితో ర్యాగింగ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్ ఆర్డీ) శాఖ భావిస్తోంది. దీని గురించి ప్రభుత్వాధికారులు తనను సంప్రదిస్తే కోహ్లి ఒప్పుకుంటాడా, లేదా అనేది వేచి చూడాలి. గతేడాది 399 ర్యాగింగ్ కేసులు నమోదయ్యాయి. విద్యాలయాల్లో ర్యాగింగ్ నివారణకు పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోహ్లి లాంటి జనాకర్షణ కలిగిన సెలబ్రిటీతో ప్రచారం చేయిస్తే సందేశంలో వెంటనే లక్ష్యిత వర్గాలకు చేరుతుందని సర్కారు యోచిస్తోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ర్యాగింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ర్యాగింగ్ వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి వివరిస్తూ పోస్టర్లు, ప్రకటనలు, లఘుచిత్రాలు రూపొందించాలని యూజీసీని ప్రభుత్వం ఆదేశించింది. ఉచిత మొబైల్ యాప్ కూడా తీసుకురానుంది. ర్యాగింగ్ పై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1800-180-5522 ను అందుబాటులోకి తెచ్చింది. -
విద్యార్థుల కోసం యాప్
న్యూఢిల్లీ: ఇటీవల ఐఐటీ పరీక్షకు సిద్ధమయ్యే పేద విద్యార్థుల ప్రిపరేషన్ కోసం ఒక యాప్ ను రూపొందిస్తామని ప్రకటించిన కేంద్ర మానవ వనరుల శాఖమంత్రి స్మృతి ఇరానీ తాజాగా పాఠశాలల్లో డ్రాపవుట్స్ (మధ్యలో బడి మానేయడం) ను తగ్గించేదుకు మరో యాప్ ను ప్రారంభించనున్నారు. పాఠశాలల్లోని విద్యార్థుల వ్యక్తిగత మార్కుల రాకార్డుతో పాటు, వారి డ్రాపవుట్స్ సమాచారాన్ని ఈ సాప్ట్ వేర్లో పొందుపరచనున్నారు. దీనికి ' షాలా అస్మిత' గా నామకరణం చేయనున్నారని , ఈ విద్యా సంవత్సరం జూన్ మధ్యలో దీనిని ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. విద్యార్థుల ఆధార్ నంబర్ ను ఈ యాప్ లో అనుసంధానిస్తారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాల సాయంను తీసుకోనున్నారు. స్థానిక అధికారులు డాటాను ఎప్పటికప్పుడు దీనిని పర్యవేక్షిస్తారు. ఈ యాప్ తో విద్యార్థుల సమాచారం పూర్తిగా అందుబాటు లోకి రానుంది. మధ్యాహ్న భోజన పథకంలో పారదర్శకతకు కూడా ఈ యాప్ ను ఉపయోగించనున్నారు. -
రోహిత్ పేరు ప్రస్తావించలేదు
న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ లోక్ సభలో స్పందించారు. తాను రాసిన లేఖలో రోహిత్ పేరును ప్రస్తావించలేదని ఆయన మంగళవారం సభలో స్పష్టం చేశారు. హెచ్‌సియు విద్యార్థుల వివాదం సందర్భంగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో తాను ఏ విద్యార్థి పేరును పేర్కొనలేదని దత్తాత్రేయ వివరణ ఇచ్చారు. అనవసరంగా తనమీద అభాండాలు వేసి, ఈ వివాదంలోకి లాగారన్నారు. ఈరోజు ఉదయం ప్రారంభమైన లోక్ సభ వాయిదా అనంతరం 12 గంటలకు తిరిగి సమావేశమైన తరువాత రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నకు బండారు దత్తాత్రేయ సమాధానమిచ్చారు. ఈ వివాదంలో కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా తన ప్రతిష్టను దిగజార్చారంటూ మండిపడ్డారు. కాగా హెచ్సియూలోని ఎబీవీపీ, అంబేడ్కర్ విద్యార్థుల వివాదం నేపథ్యంలో పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ఈ అంశంపై దత్తాత్రేయ జోక్యంతోనే రోహిత్ సహా మరి కొందరి విద్యార్థులను యూనివర్శిటీ అధికారులు సస్పెండ్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
207 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఎగరాలి!
* సెంట్రల్ వర్సిటీల వీసీ భేటీలో స్మృతి ఇరానీ * కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్, సీపీఎం సూరజ్‌కుండ్: విద్యార్థుల్లో జాతీయ భావన పెంచేందుకు దేశంలోని 46 సెంట్రల్ వర్సిటీల్లో ప్రతిరోజూ 207 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకం ఎగరేయాలని వీసీల సమావేశం నిర్ణయించింది. మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో సూరజ్‌కుండ్‌లో జరిగిన సెంట్రల్ వర్సిటీల వీసీల సమావేశంలో ఈమేరకు తీర్మానం చేశారు. తొలి పతాకాన్ని జేఎన్‌యూలో ఎగురవేయనున్నారు. ఇప్పటికే వర్సిటీల్లో జాతీయ జెండా ఎగురుతోంది. అయితే.. అన్ని చోట్లా దీని ఎత్తు సమానంగా ఉండాలని నిర్ణయించారు. 2012 యూజీసీ చట్టం (వర్సిటీల్లో సమానత్వ భావన పెంచటం, ఎస్సీ, ఎస్టీల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించటం) అమలుపై ల చర్చించారు. కాగా, ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. జాతీయ పతాకాన్ని ఎగరేయటం, వందేమాతర గీతాన్ని ఆలపించటం వల్లే జాతీయ భావం పెంపొందుతుందా అని ప్రశ్నించింది. సీపీఎం నాయకురాలు బృందా కారత్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. -
రోహిత్ మృతిపై ద్విసభ్య కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ మృతిపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ...ఇద్దరు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు షకీలా శంషూ, సురత్ సింగ్ లు సోమవారం సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. హెచ్‌సీయూలో ఏం జరిగిందన్న అంశంపై కమిటీ సభ్యులు విచారణ జరిపి రెండు రోజుల్లో నివేదిక సమర్పించనున్నారు. మరోవైపు రోహిత్ భౌతికకాయానికి ఉస్మానియాలో పోస్ట్ మార్టం పూర్తయింది. అనంతరం ఉప్పల్‌లోని అతని స్వగృహానికి తరలించారు. కాగా రోహిత్ కేసులో వీసీ అప్పారావును బర్తరఫ్ చేయాలని, రోహిత్ మృతికి కారణమైన దత్తాత్రేయపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత, అధ్యాపక సంఘాలు సోమవారం విశాఖ త్రి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. -
రాజీనామా బాటలో ఢిల్లీ ఐఐటీ డీన్లు!
న్యూఢిల్లీ: అకడమిక్ వ్యవహారాలలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (హెచ్చార్డీ) జోక్యం చేసుకోవడంపై ఢిల్లీ ఐఐటీ సెనేట్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నది. హెచ్చార్డీ తీరు మారకపోతే రాజీనామా చేస్తామని ఢిల్లీ ఐఐటీకి చెందిన ముగ్గురు డీన్లు హెచ్చరించారు. ఒక పార్ట్ టైం పీహెచ్డీ విద్యార్థిని అడ్మిషన్ ను రద్దుచేయడంపై పునరాలోచన చేయాలని ఢిల్లీ ఐఐటీ సెనేట్ ను హెచ్చార్డీ కోరింది. అలీషా తంగ్రీ అనే విద్యార్థిని తన ఉద్యోగ అనుభవం గురించి వాస్తవాలు దాచిపెట్టడంతో ఆమె అడ్మిషన్ ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తరఫున తండ్రి అలీషా తంగ్రీ పిటిషన్ పెట్టుకున్నారు. ఈ పిటిషన్ పై స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం.. ఈ అంశాన్ని హెచ్చార్డీకి నివేదిస్తూ.. సరైన చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో ఈ పిటిషన్‌ను పరిష్కరించాల్సిందిగా కోరుతూ హెచ్చార్డీ .. ఢిల్లీ ఐఐటీ సెనేట్ కు పంపింది. దీనిని సెనేట్ నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఆ విద్యార్థిని పిటిషన్‌ను ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి లేదా ఐఐటీ డైరెక్టర్ కు నివేదించాల్సి ఉండాలని, అకడమిక్ ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత వారిపైనే ఉందని సెనేట్ భావిస్తున్నది. ఈ విషయంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జోక్యాన్ని నిరసిస్తూ సెనేట్ లోని ఆరుగురు డీన్లలో ముగ్గురు రాజీనామా చేయాలని భావిస్తున్నారు. దీంతో హెచ్చార్డీ, ఢిల్లీ ఐఐటీ మధ్య మరోసారి వివాదం తలెత్తే పరిస్థితి కనిపిస్తున్నది. -
కొన్ని అదృశ్య శక్తులు నాపై కుట్ర పన్నాయి
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో సెయింట్ స్టీఫెన్స్ కళాశాల ప్రిన్సిపల్ వాల్సన్ తంపూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను మొదట్నించి ఖండిస్తున్న ఆయన తనకు వ్యతిరేకంగా రాజకీయ కుట్ర జరుగుతోందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. లైంగిక ఆరోపణల కేసు విచారణ నిమిత్తం మానవ వనరుల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగిన నేపథ్యంలో తంపూ ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్నిశక్తులు తనకు వ్యతిరేకంగా పీహెచ్డీ విద్యార్థినిని వాడుకుంటున్నాయని తంపూ ఆరోపిస్తున్నారు. నిగూఢమైన ప్రయోజనాల కోసం ఆమెను వాడుకుంటున్నారనీ, ఈ విషయం ఆమెకు ఆర్థం కావడంలేదని అన్నారు. ఇదంతా చివరకు నాశనానికి దారి తీస్తుందంటూ తన అసహనాన్ని ప్రదర్శించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలో ఆడియో టేపుల నిజాలు నిగ్గుతేలతాయని తంపూ వ్యాఖ్యానించారు. అయితే ఆ కొంతమంది ఎవరనేది వెల్లడించడానికి మాత్రం ఆయన నిరాకరించారు. ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ పీహెచ్డీ విద్యార్థిని తనను గైడ్ వేధిస్తున్నాడంటూ కేసు నమోదు చేసింది. కాలేజీ హెడ్‌గా తనకు అండగా నిలవాల్సిన ప్రిన్సిపల్ తంపూ , నిందితుడికి వత్తాసు పలుకుతూ కేసు వెనక్కి తీసుకోమని బెదిరిస్తున్నాడంటూ కొన్ని ఆడియో టేపులను ఆమె విడుదల చేసింది. ఈ టేపులు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో వివాదం రగులుకుంది. ఈ నేపథ్యంలోనే మానవవనరుల శాఖ రంగంలోకి దిగింది. దీనిపై విచారణ చేయాల్సిందిగా యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశించింది. మరోవైపు మహిళా సంఘాలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ..పీహెచ్డీ విద్యార్థినికి మద్దతుగా న్యాయ పోరాటానికి దిగాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులకు కఠినంగా శిక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తూ సోమవారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాయి. -
'స్మృతి' విద్యార్హతలపై 25న విచారణ
న్యూఢిల్లీ: ఎన్నికల అఫిడవిట్లో కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ తప్పుడు వివరాలు పొందుపరిచారన్న ఆరోపణల కేసుపై పాటియాల కోర్టు ఏప్రిల్ 25 వాదోపవాదాలు విననుంది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు స్మృతి తాను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి 1996 బీఏ కోర్సులో ఉత్తీర్ణత పొందినట్లు పేర్కొన్నారని.. కానీ 2014 ఎన్నికల్లో మాత్రం అదే ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి 1996లో బీకామ్ పూర్తి చేసినట్లు వెల్లడించారని అహ్మర్ ఖాన్ అనే వ్యక్తి ఆమెపై ఫిర్యాదు చేశారు. ఇలా విద్యార్హతలను ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు విధంగా పేర్కొన్న ఆమె పదవికి అనర్హురాలని, ఆమెపై చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. దీనిపై కోర్టు ఈ నెల 25న విచారణ జరపనుంది. -
సీమాంధ్రకు ఐఐటీ, ఐఐఎం!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేస్తూ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు తమ నివేదికలను కేంద్ర హోంశాఖకు సమర్పించాయి. విభజన నిర్ణయంతో అట్టుడుకుతున్న సీమాంధ్ర ప్రాంతానికి ఊరట కలిగించే పలు ప్రతిపాదనలను అందులో చేర్చాయి. సీమాంధ్ర ప్రాంతంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ మానవవనరుల మంత్రిత్వ(హెచ్ఆర్డీ) శాఖ నివేదిక ఇవ్వగా.. జల వివాదాలు తలెత్తకుండా చూడటానికి నీటి కేటాయింపుల పర్యవేక్షణకు ఉన్నతస్థాయి జల నియంత్రణ బోర్డును ఏర్పాటు చేయాలని జల వనరుల మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. సీమాంధ్ర ప్రాంతంలో ఒక ఐఐటీ, ఒక ఐఐఎం, మరో మూడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు హెచ్ఆర్డీ శాఖ ఆమోదం తెలిపింది. వీటితో పాటు రెండు ట్రిపుల్‌ఐటీలు, ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఈఆర్)ని కూడా ఏర్పాటుచేయాలని పేర్కొంది. ఈ సంస్థల ఏర్పాటుకు రూ.6 వేల నుంచి రూ.7 వేల కోట్లు ఖర్చు కావచ్చని అంచనా వేసింది. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయన్న వాదనల నేపథ్యంలో.. తెలంగాణ,సీమాంధ్ర ప్రాంతాల మధ్య సమతౌల్యాన్ని సాధించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. హెచ్ఆర్డీ శాఖ పంపిన ప్రతిపాదనలను జీవోఎం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. సీమాంధ్రలో ప్రఖ్యాత విద్యాసంస్థలను ఏర్పాటుచేసి, ఏడాదిలోగా విధులు ప్రారంభించాలని కోరుతూ జీఓఎంకు పలువురు ఇప్పటికే వినతిపత్రాలు సమర్పించారు. అన్ని కేంద్ర సంస్థలనూ ఓ బిల్లు ద్వారా ఏర్పాటుచేయాలని, దానిపై అన్ని జాతీయ పార్టీలు సంతకాలు చేయాలని కోరారు. కాకినాడ ఎంపీ పళ్లంరాజు హెచ్ఆర్డీ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, సహజ వనరులు జాతీయ సంపద అని, గ్యాస్‌లో రాష్ట్రాలకు వాటా ఇవ్వడానికి ప్రస్తుత విధానంలో ఆస్కారం లేనందున దీనిపై జీవోఎంనే తేల్చాలని పెట్రోలియం,సహజవాయువు మంత్రిత్వశాఖ తమ నివేదికలో స్పష్టంచేసింది. ఆయా శాఖలు ఇచ్చిన నివేదికలను హోంశాఖ జీవోఎం ముందుంచుతుంది. -
‘ఆకాశ్-4’కు పచ్చజెండా
న్యూఢిల్లీ: విద్యార్థులకు అతి తక్కువ ధరకే టాబ్లెట్ పీసీని అందించాలన్న కేంద్ర మానవ వనరుల శాఖ ప్రణాళిక ఫలించనుంది. చవకైన టాబ్లెట్ పీసీల ఉత్పత్తిపై వివిధ దశల్లో జరిగిన చర్చల అనంతరం ఆకాశ్-4 ప్రాజెక్టుకు ఆ శాఖ పచ్చజెండా ఊపినట్టు కేంద్ర ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. ఒక్కొక్క టాబ్లెట్ ధర రూ. 2150 ఉండే ఈ టాబ్లెట్లను దాదాపు 22 లక్షలకు పైగా సేకరించి తొలి దశలో ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు సబ్సిడీపై అందించనున్నట్టు వివరించాయి. ఈ ప్రాజెక్టుకు రూ. 330 కోట్లు ఖర్చు కానుందని, వచ్చే ఏడాది జనవరి నాటికి టాబ్లెట్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నాయి. ఆకాశ్-4 టాబ్లెట్‌లో ఆడియో, వీడియో సహా హిందీ, వివిధ ప్రాంతీయ భాషలను చదివేందుకు, కంపోజ్ చేసేందుకు అవకాశముంది. ఇదిలావుంటే, ఆకాశ్-4 ప్రాజెక్టును ఐఐటీ రాజస్థాన్‌కు ఇవ్వాలని మానవ వనరుల శాఖ సిద్ధమైంది. అయితే, కాగ్ జోక్యంతో దీనిని ఐఐటీ బాంబేకు అప్పగించారు. -
అక్రెడిటేషన్ బిల్లులో మార్పులు
న్యూఢిల్లీ: ఉన్నత విద్యాసంస్థలకు అక్రెడిటేషన్‌ను తప్పనిసరి చేసే ఉద్దేశంతో రూపొందించిన అక్రెడిటేషన్ బిల్లులో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ స్వల్ప మార్పులు చేసింది. నిబంధనలను ఉల్లంఘించే వారికి జైలు శిక్ష విధించనున్నట్లు రూపొందించిన నిబంధనను బిల్లు నుంచి తొలగించింది. ‘ఉన్నత విద్యాసంస్థలకు జాతీయ అక్రెడిటేషన్ నియంత్రణ ప్రాధికార సంస్థ బిల్లు-2011’కు ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో ఆమోదం ప్రభుత్వం సమాయత్తమవుతోంది. దీని ప్రకారం దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలకూ అక్రెడిటేషన్ సంస్థల నుంచి అక్రెడిటేషన్ తప్పనిసరి. తప్పనిసరి అక్రెడిటేషన్ నిబంధనను ఉల్లంఘించిన వారికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.10 లక్షల జరిమానా లేదా ఏకకాలంలో రెండూ విధించనున్నట్లు బిల్లులోని క్లాజ్-41లో పేర్కొన్నారు. అయితే, వివిధ భాగస్వాములు, పార్లమెంటరీ స్థాయీ సంఘం అభిప్రాయాల మేరకు ఈ నిబంధనలో మార్పు చేయాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ బిల్లు పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే ఆమోదం పొందగలదని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.