ఏటా ప్రకటించే అంతర్జాతీయ ర్యాంకుల్లో ఎప్పుడూ తీసికట్టుగానే కనిపించే మన ఉన్నత విద్యా రంగ సంస్థలను ప్రక్షాళన చేయడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ)మంత్రిత్వ శాఖ పూనుకుంది. ఇప్పుడున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ను రద్దు చేసి దాని స్థానంలో భారత ఉన్నత విద్యా కమిషన్(హెచ్‌ఈసీఐ)ను నెలకొల్పబోతున్నట్టు తెలిపింది. దానికి సంబంధించిన బిల్లు ముసాయిదాను బుధవారం విడుదల చేసి పదిరోజుల్లో...అంటే వచ్చే నెల 7 లోగా ఎవరైనా అభిప్రాయాలు చెప్పవచ్చునని ప్రకటించింది. వచ్చే నెల 18నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో హెచ్‌ఈసీఐ బిల్లును ప్రవేశపెడతామని కూడా ఆ శాఖ వివరించింది. గత నెలలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జావ్డేకర్ ఉన్నత విద్యారంగంపై అధికారులతో కూలంకషంగా చర్చించినప్పుడు యూజీసీని, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)ని విలీనం చేసి ఒకే నియంత్రణ సంస్థ నెలకొల్పాలన్న ప్రతిపాదన వచ్చింది.
అలా చేస్తే అనవసర వివాదాలు బయల్దేరతాయి గనుక ఏ సంస్థకా సంస్థను సంస్కరించాలని నిర్ణయించారు. హెచ్‌ఈసీఐ వ్యవహారం పూర్తయితే కేంద్రం ఏఐసీటీఈపై దృష్టి సారించదల్చుకుంది. అయితే ఉన్నత విద్యా రంగానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోవడా నికి ముందు విద్యారంగ నిపుణుల, మేధావుల అభిప్రాయాలు తీసుకోవాలనీ, వివిధ దేశాలు అమలు చేస్తున్న విధానాలనూ, అక్కడి నియంత్రణ వ్యవస్థలనూ పరిశీలించాలని కేంద్రప్రభుత్వా నికి తోచకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభంకాని ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం పది రోజుల వ్యవధిలో అందరూ అభిప్రాయాలు చెప్పటం, వాటి మంచిచెడ్డ లపై చర్చ జరగటం సాధ్యమేనా? ప్రభుత్వం ఆలోచించాలి.
నాలుగేళ్లక్రితం అధికారంలోకొచ్చినప్పుడే విద్యా రంగాన్ని సంస్కరిస్తామని ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి టీఎస్‌ఆర్ సుబ్రమణియన్ అధ్యక్షతన ఒక సంఘం ఏర్పాటైంది. అది సవివరమైన నివేదికలిచ్చి రెండేళ్లు దాటుతోంది. మూడు దశలుగా వెలువడిన ఆ నివేదికలపై అందరి అభిప్రాయాలూ సేకరించారు. అయితే నిర్దిష్టంగా ఉన్నత విద్యా రంగంలో భారీ సంస్కరణలను ప్రతిపాదించి, యూజీసీ స్థానంలో కొత్త సంస్థను నెలకొల్పాలను కున్నప్పుడు దాని లక్ష్యాలపై, పరిమితులపై, నియమనిబంధనలపై... వాటి మంచిచెడ్డలపై లోతుగా చర్చించాల్సిన అవసరం లేదా? మన ఉన్నత విద్యారంగం మొదటినుంచీ వెలవెలబోతోంది.
యూజీసీ ఛత్రఛాయలో దాదాపు 850 విశ్వవిద్యాలయాలు, 37,204 కళాశాలలు ఉన్నాయి. కానీ వీటిల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటైన పరిశోధనలు లేవు. అసలు అందుకవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. బోధనకు అవసరమైనంతమంది అధ్యాపకులు లేరు. ఉన్నవారిపై భారం ఎక్కువగా పడటంతో వారు పరిశోధనల్లో పాలుపంచుకోవటం సాధ్యపడటం లేదు. ఇది బోధనా ప్రమాణాలపైనా, విద్యార్థుల్లో పెంపొందాల్సిన సృజనాత్మకతపైనా ప్రభావం చూపుతోంది. చాలా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు కాంట్రాక్టు అధ్యాపకులతో నెట్టుకొస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌తో పని కానిస్తున్నామన్న సంబరమేగానీ... అందుమూలంగా ప్రమాణాలు పతనమవుతున్నాయని, ప్రతిభాపాటవాల్లో మన పట్టభద్రులు అంతంతమాత్రంగానే ఉంటున్నారని గుర్తించటం లేదు.
కొత్త నియంత్రణ వ్యవస్థ వీటన్నిటినీ సరిచేసేలా ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ముసా యిదాను చూస్తే అలాంటి ఆశ కలగదు. కొత్త వ్యవస్థ సంపూర్ణంగా విద్యారంగ ప్రమాణాలపైనే దృష్టి సారిస్తుందని ఊరిస్తున్నారు. ప్రభుత్వ ప్రమేయం తగ్గించటం దీని ప్రధాన ఉద్దేశమంటున్నారు. ఇన్నాళ్లూ బోగస్ విశ్వవిద్యాలయాల, బోగస్ కళాశాలల జాబి తాను మాత్రమే యూజీసీ విడుదల చేసేది. కొత్తగా ఏర్పడే సంస్థకు వాటిని రద్దు చేసే అధికారం ఉంటుంది. అలాగే తగిన ప్రమాణాలు సాధించని సంస్థలపై చర్య తీసుకునే అధికారం కూడా ఇచ్చారు. తనిఖీ రాజ్‌కు స్వస్తి పలకడం, పూర్తిస్థాయిలో నాణ్యతా ప్రమాణాల సాధనకు కృషి చేయటం కొత్త సంస్థ లక్ష్యమంటున్నారు. నిధుల మంజూరు వ్యవహారాన్ని దీన్నుంచి తప్పిస్తామని, ఇకపై నేరుగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆ పని చూసుకుంటుందని ముసాయిదాతో పాటు విడుదల చేసిన నోట్ వివరించింది. ఒకపక్క ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గిస్తామని చెబుతూ నిధుల మంజూరు అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకోవటం వింత కాదా?
ఉన్నత విద్యారంగాన్ని పూర్తిగా ఆ రంగంలోని నిపుణులకు వదిలిపెట్టడమే యూజీసీ నెలకొల్పడంలోని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం యూజీసీకి నిధులిస్తే వాటిని ఎలా వ్యయం చేయాలో ఆ సంస్థ నిర్ణయించుకుంటుందని అనుకు న్నారు. కానీ యూజీసీకి నేతృత్వం వహించినవారిలో చాలాకొద్దిమంది మాత్రమే స్వతంత్రంగా వ్యవ హరించగలిగారు. సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారు. చాలామంది అధికారంలో ఉన్నవారి ఇష్టా యిష్టాలకు లోబడే వ్యవహరించారు. యూజీసీకిచ్చే నిధుల్లో రాను రాను కోత పడటం మొదలైంది. అది ఆ బడ్జెట్‌లోనే సర్దుకోవటానికి సిద్ధపడింది. దాని ప్రభావం కొత్త కోర్సుల ప్రారంభంపైనా, ఉన్న కోర్సుల కొనసాగింపుపైనా, అధ్యాపక నియామకాలపైనా పడింది.
సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సుల పేరుతో విద్యను పేద వర్గాల పిల్లలకు అందుబాటులో లేకుండా చేశారు. వీటన్నిటి ఫలితంగా విశ్వ విద్యాలయాలు నీరసించటం మొదలైంది. సంస్థల ప్రమాణాలెలా ఉన్నాయో ఎప్పటికప్పుడు చూసి నిధులు మంజూరు చేయటం యూజీసీ విధి. కానీ కొత్త బిల్లు చట్టమైతే ప్రమాణాలను సమీక్షించడం వరకే దాని పని. నిధుల మంజూరు వ్యవహారం ప్రభుత్వానిది. ఈ స్థితి ఉన్నదాన్ని మెరుగుపరు స్తుందో, మరింత దిగజారుస్తుందో ఎవరికైనా సులభంగానే బోధపడుతుంది. మన విశ్వవిద్యాల యాలు బోధనలో, పరిశోధనలో మేటిగా ఉండటానికి, అత్యున్నత ప్రమాణాలు సాధించడానికి ఇంత కంటే మెరుగైన కార్యాచరణను ప్రతిపాదించటం అవసరమని పాలకులు గుర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment