కేంద్రం గుప్పిట ఉన్నత విద్య | Higher Education In The Arms Of Central Government | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 12 2018 2:33 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

Higher Education In The Arms Of Central Government - Sakshi

యూజీసీ స్థానంలో భారత ఉన్నత విద్యా సంస్థ ఏర్పాటు కోసం కేంద్రం ప్రతిపాదించిన కొత్త బిల్లు వల్ల ప్రయోజనం కన్నా చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎందుకంటే  మొదట– కేవలం ఉద్యోగాలు వచ్చే కోర్సులు ప్రవేశ పెట్టాలి. రెండోది, ఆ కోర్సులకయ్యే వ్యయాన్ని ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచే వసూలు చేయాలి. ఇంకా మార్కెట్‌ అవసరాలను తీర్చే కోర్సులు రూపొందించి, ప్రవేశపెట్టే బాధ్యత కూడా ఆయా సంస్థలపై ఉంటుంది. దీని వల్ల చదువే విద్యా మార్కెట్‌గా మారి ఉన్నత విద్యా లక్ష్యానికే భంగం కలుగుతుంది. ఈ పరిణామం విశ్వవిద్యాలయం అనే భావనకే విరుద్ధం.

ఉన్నత విద్యారంగంలో సంస్కరణల పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రయోగాలు ఎప్పుడో మొదలెట్టింది. కొత్త విద్యా విధానం తీసుకొస్తానని చెబుతోంది. నిజానికి కేంద్ర సర్కారు కొత్తగా తెస్తున్నదేమీ లేదనే చెప్పాలి. సంస్కరణల పేరుతో ఇప్పటికే పనిచేస్తున్న సంస్థల రూపురేఖలు మార్చివేసి తన అధికారగణంతో నింపుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన వెంటనే ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ ఏర్పాటు చేసింది. పేరు మారినా చేసే పని ఒకటే. కాంగ్రెస్‌ హయాంలో స్థాపించిన సంస్థలను నిర్వీర్యం చేస్తూ వాటిని తన కబంధ హస్తాల్లోకి తీసుకుంటోంది.

ఏమాత్రం అనుభవంలేని వారిని ఈ సంస్థల చైర్మ న్లుగా, సభ్యులుగా నియమించింది. మరో పక్క పాఠ శాల విద్యలోని సిలబస్‌ను సగానికి సగం తగ్గిస్తున్నా మని ప్రకటించింది. చివరికి చేసిందేమంటే, గతంలో వామపక్ష, లౌకిక భావాలున్నవారు రూపొందించిన పాఠ్య ప్రణాళికను తొలగించి, పాలకపక్ష భావజా లంతో దాన్ని నింపడానికి ప్రయత్నించడమే. పేరుకు విద్యార్థులకు చదువుల భారం తగ్గిస్తానని చెబు తున్నా, స్కూల్‌ బ్యాగ్‌ల బరువు తగ్గించాలని ప్రొఫె సర్‌ యశ్‌పాల్‌ కమిటీ చేసిన సిఫార్సులను తుంగ లోకి తొక్కి కొత్తగా చేసేదేమీ లేదన్నట్టు వ్యవహరి స్తోంది. విద్యను కాషాయీకరించడానికే ఈ పను లన్నీ చేస్తోందని స్పష్టమౌతోంది.

యూజీసీ స్థానంలో నూతన సంస్థ
ఇప్పుడు నేరుగా యూనివర్సిటీ గ్రాంట్ల కమిషన్‌ (యూజీసీ) స్థానంలో కిందటి నెల 27న భారత ఉన్నత విద్యా సంఘం(హెచ్‌ఈసీఐ–హెసీ) ఏర్పాటు ప్రతిపాదన ముందుకు తెచ్చింది. ఉన్నత విద్యను కేంద్రీకరించడంలో భాగంగా ఈ సంస్థను స్థాపి స్తోంది. ప్రజాస్వామ్య సూత్రమైన వికేంద్రీకరణకు ఇలా గండికొడుతోంది. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) 1953 డిసెంబర్‌ 28న అవతరిం చింది. పార్లమెంటు చేసిన చట్టం ద్వారా 1956లో ఇది అధికార వ్యవస్థగా రూపుదిద్దుకుంది. యూని వర్సిటీల్లో ఉన్నత విద్య పరిశోధన, బోధన స్థాయి పెంచడమే ప్రధాన లక్ష్యంగా యూజీసీని నెలకొ ల్పారు.

రాజకీయాలకు అతీతంగా పనిచేసే సంస్థగా దీనికి మంచి పేరొచ్చింది. ఉన్నత విద్యారంగానికి చెందిన యూనివర్సిటీలు, కాలేజీలకు నిధులు సమ కూరుస్తూ వాటికి మార్గదర్శకంగా ఉండే ఓ స్వతంత్ర ప్రతిపత్తి గల కేంద్ర సంస్థగా ఇది అప్పటి నుంచీ పని చేస్తూ వస్తోంది. దీనికి మరింత స్వాతంత్య్రం, సంపూర్ణ అభివృద్ధికి వీలు కల్పించే విధంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్చార్డీ) ఓ కొత్త బిల్లు తీసుకొచ్చింది. ‘తక్కువ ప్రభుత్వం– ఎక్కువ పాలన’ అనే నినాదంతో ఈ బిల్లును కేంద్ర సర్కారు రూపొందించింది.

ఇప్పటికే పనిచేస్తున్న శిఖర సంస్థల నియంత్రణాధికారాలు తగ్గించడం, నిధులు అందించే విధానంలో మార్పులు తీసుకురా వడం, విద్య నాణ్యత పెంచడం, చివరగా యూజీసీ చట్టాన్ని రద్దుచేయడం దాని ముఖ్య ఉద్దేశం. ఈ బిల్లు వల్ల దేశంలోని సుమారు 850 విశ్వవిద్యాల యాలు, స్వయం ప్రతిపత్తి గల 40 వేల కళాశాలల పని విధానంలో చాలా మార్పులు చోటుచేసుకుం టాయి. అంతేగాక, యూజీసీ గుర్తించిన నకిలీ యూనివర్సిటీలను పూర్తిగా రద్దుచేసి, అవసరమైతే వాటిపై శిక్షలు కూడా వేస్తారని అంటున్నారు. ఇంకా, యూజీసీని ఓ నియంత్రణా వ్యవస్థగా మార్చి, పూర్తి అధికారాలను ఎంహెచ్చార్డీకి  బదలాయిస్తారు.

ఇది కేవలం ముసాయిదా బిల్లు అయినప్పటికీ దీన్ని– భారత ఉన్నత విద్యా కమిషన్‌ చట్టం, 2018 (విశ్వ విద్యాలయాల గ్రాంట్ల సంఘాన్ని రద్దు చేయడం) అని కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో ప్రకటించారు. ఉన్నత విద్యకు సంబంధించిన వాటాదారులు అంటే విద్యా ర్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, అధ్యాపకులు, ప్రజల నుంచి సలహాలను ఈ నెల ఏడో తేదీ లోగా స్వీకరించాలని ప్రభుత్వం కోరింది. ఇంత తక్కువ సమ యంలో ఇది సాధ్యంకాని పని అని సర్కారుకు తెలుసు. పైకి ఇలా ప్రజాభిప్రాయానికి అవకాశమిచ్చి నట్టుగా కనిపిస్తుంది. అదే సమయంలో బిల్లును చట్టంగా మార్చడానికి ముందుకెళ్లవచ్చు.

వైద్యం మినహా అన్ని శాఖలకు వర్తింపు!
కొత్తగా అవతరించే భారత ఉన్నత విద్యా సంఘం (హెచ్‌ఈసీఐ–హెసీ) ఉన్నత విద్యారంగంలో వైద్యం మినహా మిగిలిన శాఖలకు విస్తరిస్తుంది. ఇందులో వ్యవసాయం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కింద పనిచేస్తున్న విద్యాసంస్థలన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఉన్నత విద్యను నియంత్రించడం నుంచి నిధులు అందించే పద్ధతిని విడదీస్తుంది. ఇప్పుడైతే మానవ వనరుల శాఖే నేరుగా నిధులందించే పని చేస్తోంది. అంటే ఇక ముందు ప్రభుత్వ కనుసన్నల్లో విద్యా సంస్థలు పనిచేయాల్సి ఉంటుంది. లెక్కకు మించిన అనేక సంస్థలను నియత్రించడం ఈ కొత్త కమిషన్‌కు భారమౌతుంది.

1980ల నుంచి 1990ల వరకూ ఉదార ఆర్థిక విధానాల్లో భాగంగా వచ్చిన ప్రయివేటీ కరణ వల్ల కుప్పలు తెప్పలుగా ప్రయివేటు యూనివ ర్సిటీలు, కాలేజీలు పుట్టుకొచ్చాయి. వాటి వల్ల వచ్చిన సవాళ్లు అన్నీ ఇన్నీ కాదు. వృత్తి విద్యకు సంబంధించిన నియంత్రణా సంస్థలైన ఎన్సీటీఈ, ఎంసీఐ, ఏఐసీటీఈ, బీసీఈ కూడా సరిగ్గా పనిచే యడం లేదనే విమర్శ ఉంది. సంస్థలు ఎక్కువైతే అజమాయిషీ తక్కువయ్యే ప్రమాదముంది. కొత్తగా వస్తున్న కమిషన్‌ విద్యా విషయాలతోపాటు ఆర్థికప రమైన విధులు కూడా నిర్వహించాల్సి ఉంటుంది.

అనుభవమున్న వారిని ఈ కమిషన్‌లో నియమించక పోతే పాత పరిస్థితే నెలకొంటుంది. దేశంలో ముఖ్య మైన ప్రతి యూనివర్సిటీని, ఇంకా ఎఫ్‌టీఐఐ, ఐసీఎ స్సెస్సార్‌ తదితర విద్యా సంస్థలను ఆరెసెస్‌ మద్దతు దారులకు అప్పజెప్పారు. వారిలో చాలా మందికి ఇలాంటి ఉన్నత విద్యాసంస్థలను నడిపించే అను భవం ఏ మాత్రం లేదు. పరిశోధన, ఇతర విష యాల్లో ‘సంఘ్‌’ ఎజెండాను అమలుపరచడం వల్ల కొన్ని యూనివర్సిటీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదు రవుతోంది.

నియంత్రణ హెచ్‌ఈసీఐకి భారమే!
తామర తంపరగా పుట్టుకొస్తున్న ప్రయివేటు విద్యా సంస్థలను సరైన మార్గంలో పెట్టి, క్షీణిస్తున్న విలువ లకు అడ్డుకట్ట వేయడం హెచ్‌ఈసీఐకి భారంగా మారుతుంది. సంస్థల విద్యా విషయాలను ఈ బిల్లు ఏ విధంగా మెరుగుపరుస్తుందనే విషయం పక్కన పెడితే, వృత్తి విద్యకు సంబంధించిన సంస్థలను ఏ విధంగా అదుపు చేస్తుందో తెలియదు. కేవలం నిధులు కేటాయించడమే పని అయితే హెచ్‌ఈసీఐ స్థాపనే ప్రశ్నార్థకంగా మారుతుంది. దేశంలో అత్యు న్నత సంస్థలుగా(సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌) గుర్తింపు పొందిన వంద కంటే ఎక్కువ సంస్థలకు ప్రస్తుతం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిధులు కేటా యిస్తోంది.

ఇందులో ముఖ్యంగా ఐఐటీలు, ఐఐ ఎస్సీ, ఎన్‌ఐటీలు, ఐఐఎసీఈఆర్‌ వంటి సంస్థలు న్నాయి. అలాగే దేశంలోని 47 కేంద్ర విశ్వవిద్యాల యాలకు కూడా ఈ శాఖ నిధులనందిస్తోంది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల విషయానికి వచ్చేసరికి 50 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులుంటేనే నిధులు ఇస్తా నంటోంది.  ప్రస్తుతం  వీటికి రాష్ట్రీయ ఉచ్ఛతర శిక్షా అభియాన్‌(రూసా) నుంచి నిధులు సమకూరుస్తు న్నారు. ఈ విషయంలో హెచ్‌ఈసీఐ పాత్ర ఎంత సమర్థంగా ఉంటుందో కాలమే చెబుతుంది. ఈ బిల్లు తీసుకురావడానికి ప్రధాన కారణాల్లో ముఖ్యమైనవి– ఐఐఎం వంటి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలకు పూర్తి స్థాయి స్వాతంత్య్రం ఇవ్వడం, కొత్తగా వచ్చే సంస్థలకు విడతల వారీగా స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడం, నిధులతో సంబంధం లేకుండా నడిచే వాటిని ప్రోత్సహించడం.

మరో ముఖ్య లక్ష్యం ప్రభుత్వ అధీనంలో నడిచే సంస్థలను తమ సొంత నిధులతో పనిచేసేలా ప్రోత్సహించడం. ఇందుకు అవసరమైన ఉపయోగ రుసుములు వసూలు చేసుకునే హక్కును వాటికి కల్పిస్తారు. అవసరమైతే హెచ్‌ఈసీఐనుంచి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వ సంస్థలు హెచ్‌ ఈసీఐ అనే మరో ప్రభుత్వ సంస్థ నుంచి రుణాలు తీసుకుని తగిన సమయంలో వడ్డీతో పాటు అసలు చెల్లించాలన్నమాట. దీన్ని బట్టి చూస్తే హెచ్‌ఈసీఐ కేవలం నిధులందించడానికే పరిమితమౌతుంది.

ప్రయోజనాల కన్నా సమస్యలే అధికం!
ఈ బిల్లు వల్ల ప్రయోజనం కన్నా చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే  మొదట–కేవలం ఉద్యోగాలు వచ్చే కోర్సులు ప్రవేశ పెట్టాలి. రెండోది, ఆ కోర్సులకయ్యే వ్యయాన్ని ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచే వసూలు చేయాలి. ఇంకా మార్కెట్‌ అవసరాలను తీర్చే కోర్సులు రూపొందించి, ప్రవేశపెట్టే బాధ్యత కూడా ఆయా సంస్థలపై ఉంటుంది. ఒకేసారి ఎక్కువ ఫీజు చెల్లించలేని విద్యార్థులకు ఎలాగూ వాయిదాల్లో అప్పుతీసుకుని కట్టే రాయితీ ఉంది. దీనివల్ల చదువే విద్యా మార్కెట్‌గా మారి ఉన్నత విద్యా లక్ష్యానికే భంగం కలుగుతుంది. ఈ పరిణామం విశ్వవిద్యా లయం అనే భావనకే విరుద్ధం. సమయానికి రుణాలు తీర్చలేని విద్యార్థులు అపరాధభావంతో కుమిలిపోతారు. అంతేగాక ఆర్థిక ఇబ్బందులకు గుర వుతారు.

ఇప్పటికీ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో కేవలం ఒక శాతం మాత్రమే బడ్జెట్‌లో కేటాయి స్తున్నారు. దీన్ని కనీసం రెండు శాతానికైనా పెంచా ల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్యాసంస్థలను విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలంటే వాటిని వైజ్ఞానిక పరిశోధనా కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. పరిశోధనకు పెద్ద పీట వేయాలి. దీనితోపాటు అసంఖ్యాకంగా ఉన్న దళిత, ఆదివాసీ, పేద విద్యార్థులకు కులమత భేదం లేకుండా అవకాశాలు కల్పించాలి. చదివిన కోర్సులకు ఉద్యోగిత (ప్రొడక్టివిటీ) ఉండేలా చూడాలి. ఈ విద్యా సంస్థల్లో అధ్యాపకుల కొరత రాకుండా నిరంతరం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ ధనం వెచ్చించి తనకు తానుగా పెట్టుబడి పెట్టకుండా ప్రభుత్వం ఉన్నత విద్యను సరైన దారిలో పెట్టాలనుకోవడం అత్యాశే అవు తుంది.

వ్యాసకర్త: ప్రొ. కె.పి.సుబ్బారావు, విశ్రాంత ఆచార్యులు, ఆంధ్రా యూనివర్సిటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement