నరేంద్ర మోదీ - ముఖేష్ అంబానీ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి నవ్వుల పాలైంది. జియో ఇన్‌స్టిట్యూట్ కనీసం ఏర్పాటు చేయనప్పటికీ ఈ విద్యాసంస్థకు ‘ప్రఖ్యాత సంస్థ’ స్టేటస్‌ను అందించింది. కనీసం ఈ ఇన్‌స్టిట్యూట్ సంబంధించి ఒక్క భవనం లేనప్పటికీ, ఒక్క విద్యార్థి కూడా ఆ ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ పొందనప్పటికీ, ‘ప్రఖ్యాత సంస్థ’ స్టేటస్‌ను ఎలా కేటాయిస్తారంటూ విమర్శల వర్షం కురుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సోమవారం ఆరు ఇన్‌స్టిట్యూట్లకు ‘ప్రఖ్యాత సంస్థ’ స్టేటస్‌ను కేటాయించింది. వాటిలో రెండు ప్రతిష్టాత్మకమైన ఐఐటీలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, బిట్స్ పిలానీ, మనిపాల్ ఉన్నత విద్యా అకాడమీతో పాటు జియో ఇన్‌స్టిట్యూట్ కూడా ఆ స్టేటస్‌ను దక్కించుకుంది. ‘వరల్డ్ క్లాస్’ ఇన్‌స్టిట్యూషన్లుగా మార్చడానికి ఇది ఎంతో సహకరిస్తుంది. కానీ రిలయన్స్ గ్రూప్‌కు చెందిన జియో ఇన్‌స్టిట్యూట్‌ను ఈ స్టేటస్ కేటగిరీలో చేర్చడమే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు ఇప్పటి వరకు ఈ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేకుండా ఈ స్టేటస్‌ను అందించడం విడ్డూరంగా ఉందని హెచ్‌ఆర్డీపై మండిపడుతున్నారు.
జియో ఇన్‌స్టిట్యూట్ దీనిలో చేర్చడం మరో బిగ్ స్కాం అని ట్విటర్ యూజర్లంటున్నారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌ను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని, కనీసం వెబ్‌సైట్ కూడా లేదని.. అలా ఎలా హెచ్‌ఆర్‌డీ ‘ప్రఖ్యాత సంస్థ’ ట్యాగ్‌ను జియో ఇన్‌స్టిట్యూట్‌కు ఇస్తుందని మండిపడుతున్నారు. కేవలం ఈ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు మాత్రమే నీతా అంబానీ 2018 మార్చి 11న ప్రకటించారు. ఈ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం కావడానికి ఇంకా మూడేళ్లు పడుతుంది. ఈ ఇన్‌స్టిట్యూట్ ఇప్పటి వరకు ఎంహెచ్‌ఆర్‌డీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ 2018 ర్యాంకింగ్స్ జాబితాలోనే లిస్ట్ కాలేదని, ఎందుకు టాప్ ర్యాంక్ కలిగిన పబ్లిక్ ఇన్‌స్టిట్యూట్లకు, ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్లకు పక్కన బెట్టి మరీ జియోకు ఈ స్టేటస్ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఐఐటీ మద్రాస్ లేదా ఐఐటీ ఖరగ్‌పూర్‌ల లాంటి పలు చరిత్రాత్మక ఇన్‌స్టిట్యూషన్ల కంటే జియో ఇన్‌స్టిట్యూటే మెరుగైనదని ఎలా నిర్ణయించారని మరో ట్విటర్ యూజర్ ప్రశ్నించారు. ఏర్పాటు చేస్తున్న సమయంలో ఈ స్టేటస్ ఇవ్వడం నిజంగా చాలా సిగ్గుచేటన్నారు.
అయితే తమ ఈ నిర్ణయాన్ని హెచ్‌ఆర్‌డీ కార్యదర్శి(ఉన్నత విద్య) ఆర్ సుబ్రమణ్యం సమర్థించుకున్నారు. గ్రీన్‌ఫీల్డ్ కేటగిరీ కింద ఈ ఇన్‌స్టిట్యూట్‌ను ఎంపిక చేశామని చెప్పారు. ఎలా టాప్-క్లాస్ ఇన్‌స్టిట్యూట్లగా మార్చుకుంటారో తెలుపుతూ వారి ప్లాన్ల వివరాలు అందించాలని కోరామని కూడా చెప్పారు. యూజీసీ(వరల్డ్ క్లాస్ ఇన్‌స్టిట్యూషన్స్ డీమ్‌డ్ టూ బి యూనివర్సిటీస్) రెగ్యులేషన్స్ 2016 కింద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటుచేసే అధికార నిపుణుల కమిటీ ఈ ఇన్‌స్టిట్యూట్లను ఎంపిక చేసింది.
Comments
Please login to add a commentAdd a comment