కోహ్లి ఒప్పుకుంటాడా?
న్యూఢిల్లీ: యూత్ ఐకాన్ గా మారిన టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి మరో మంచి పనికి పూనుకోనున్నాడు. ర్యాగింగ్ కు వ్యతిరేకంగా గళం విప్పనున్నాడు. అతడితో ర్యాగింగ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్ ఆర్డీ) శాఖ భావిస్తోంది. దీని గురించి ప్రభుత్వాధికారులు తనను సంప్రదిస్తే కోహ్లి ఒప్పుకుంటాడా, లేదా అనేది వేచి చూడాలి.
గతేడాది 399 ర్యాగింగ్ కేసులు నమోదయ్యాయి. విద్యాలయాల్లో ర్యాగింగ్ నివారణకు పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోహ్లి లాంటి జనాకర్షణ కలిగిన సెలబ్రిటీతో ప్రచారం చేయిస్తే సందేశంలో వెంటనే లక్ష్యిత వర్గాలకు చేరుతుందని సర్కారు యోచిస్తోంది.
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ర్యాగింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ర్యాగింగ్ వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి వివరిస్తూ పోస్టర్లు, ప్రకటనలు, లఘుచిత్రాలు రూపొందించాలని యూజీసీని ప్రభుత్వం ఆదేశించింది. ఉచిత మొబైల్ యాప్ కూడా తీసుకురానుంది. ర్యాగింగ్ పై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1800-180-5522 ను అందుబాటులోకి తెచ్చింది.