తెలంగాణకు నాలుగో గ్రేడ్‌ | HRD Ministry Gradings To States Over School Education | Sakshi
Sakshi News home page

 తెలంగాణకు నాలుగో గ్రేడ్‌

Published Thu, May 9 2019 2:59 AM | Last Updated on Thu, May 9 2019 2:59 AM

HRD Ministry Gradings To States Over School Education - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాఠశాల పనితీరు, ప్రమాణాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు తదితర అంశాల ఆధారంగా రాష్ట్రాలకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎంహెచ్చార్డీ) గ్రేడింగ్‌ ఇచ్చింది. పెర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌ ఆన్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో మొదటిసారిగా గ్రేడింగ్‌ను ప్రకటించింది. అభ్యసన సామర్థ్యాలు, ప్రమాణాలు, ఫలితాలు, పాఠశాల ప్రగతి, పాలన, నిర్వహణ, అందుబాటులో పాఠశాల, మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజనం వంటి పథకాల అమలు తదితర 70 అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ గ్రేడ్లను కేటాయించింది. ఒక్కో అంశానికి 10–20 పాయింట్ల చొప్పున పరిగణనలోకి తీసుకొని మొత్తంగా 1000 పాయింట్ల ఆధారంగా ఈ గ్రేడ్లను నిర్ణయించింది. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పాఠశాలలకు గ్రేడ్లను కేటాయించింది. 2017–18 విద్యా సంవత్సరం లెక్కల ఆధారంగా వీటిని కేటాయించిన నివేదికను ఎంహెచ్‌ఆర్‌డీ ఇటీవల విడుదల చేసింది. 

ప్రతి ఏటా నివేదిక 
జాతీయ స్థాయిలో పెర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండె క్స్‌ నివేదికను ఇకపై ప్రతి ఏటా జనవరిలో, రాష్ట్రాల వారీ నివేదికను ప్రతి ఏటా ఏప్రిల్‌లో వెల్లడిస్తామని హెచ్చార్డీ తెలిపింది. రాష్ట్రాలు, అక్కడి పాఠశాలల పనితీరు ఆధారంగానే ఆయా రాష్ట్రాల్లోని పాఠశాలలకు భవిష్యత్తులో నిధులను కేటాయించనున్నట్లు ఈ నివేదికలో స్పష్టం చేసింది. రాష్ట్రాల వారీగా కొన్ని ప్రధాన అంశాల్లో పనితీరును ఎంహెచ్‌ఆర్‌డీ ప్రశంసించింది. తెలంగాణ విషయంలో.. విద్యార్థుల ఆన్‌లైన్‌ హాజరు విధానం భేష్‌ అని ప్రశంసించింది. పాఠశాల పాలన, నిర్వహణలో గుజరాత్‌ మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్‌ పద్ధతిలో అధిక సంఖ్యలో టీచర్ల బదిలీలను బాగా చేశారని వెల్లడించింది. అరుణాచల్‌ప్రదేశ్‌ విద్యకు బడ్జెట్‌ను ఎక్కువ కేటాయిస్తోందని, స్టేట్‌ షేర్‌ బాగా ఇస్తోందని పేర్కొంది. చత్తీస్‌గఢ్‌లో స్టూడెంట్స్‌ యూనిక్‌ ఐడీ విధానం బాగుందని తెలిపింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో 9, 10 తరగతుల విద్యార్థులకు పెద్ద ఎత్తున వృత్తి విద్యా కోర్సులను నేర్పిస్తున్నారని తెలిపింది. జార్ఖండ్‌లో పేర్కొన్న దానికంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నారని వెల్లడించింది. కేరళలో సింగిల్‌ టీచర్‌ స్కూళ్లు చాలా తక్కువ ఉన్నాయని వివరించింది. 

ఇవీ వివిధ రాష్ట్రాలకు లభించిన గ్రేడ్లు.. 

  • కేరళ, చండీగఢ్, గుజరాత్‌ రాష్ట్రాలకు 801–850 మధ్య పాయింట్లతో మొదటి గ్రేడ్‌ లభించింది. 851–1000 పాయింట్లు ఏ ఒక్క రాష్ట్రానికి లభించలేదు. 
  • 751–800 పాయింట్లతో దాద్రానగర్‌ హవేలీ, హరియాణా, పంజాబ్, రాజస్తాన్, తమిళనాడు రాష్ట్రాలకు గ్రేడ్‌–2 లభించింది. 
  • 701–750 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్, అసోం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గోవా, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు గ్రేడ్‌–3 లభించింది. 
  • 651–700 పాయింట్లతో డయ్యూ డామన్, మహారాష్ట్ర, మిజోరాం, పుదుచ్చేరి, తెలంగాణ, సిక్కిం రాష్ట్రాలకు నాలుగో గ్రేడ్‌ ఇచ్చింది. 
  • 601–650 పాయింట్లతో అండమాన్‌ నికోబార్, బిహార్, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, లక్షద్వీప్, మణిపూర్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు గ్రేడ్‌–5లో ఉన్నాయి. 
  • 551–600 పాయింట్లతో అరుణాచల్‌ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాలకు ఆరో గ్రేడ్‌ లభించింది. 
  • ఏడో గ్రేడ్‌లో ఏ రాష్ట్రాలు లేవు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement