సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేస్తూ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు తమ నివేదికలను కేంద్ర హోంశాఖకు సమర్పించాయి. విభజన నిర్ణయంతో అట్టుడుకుతున్న సీమాంధ్ర ప్రాంతానికి ఊరట కలిగించే పలు ప్రతిపాదనలను అందులో చేర్చాయి. సీమాంధ్ర ప్రాంతంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ మానవవనరుల మంత్రిత్వ(హెచ్‌ఆర్‌డీ) శాఖ నివేదిక ఇవ్వగా.. జల వివాదాలు తలెత్తకుండా చూడటానికి నీటి కేటాయింపుల పర్యవేక్షణకు ఉన్నతస్థాయి జల నియంత్రణ బోర్డును ఏర్పాటు చేయాలని జల వనరుల మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది.
సీమాంధ్ర ప్రాంతంలో ఒక ఐఐటీ, ఒక ఐఐఎం, మరో మూడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు హెచ్‌ఆర్‌డీ శాఖ ఆమోదం తెలిపింది. వీటితో పాటు రెండు ట్రిపుల్‌ఐటీలు, ఒక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్‌ఈఆర్)ని కూడా ఏర్పాటుచేయాలని పేర్కొంది. ఈ సంస్థల ఏర్పాటుకు రూ.6 వేల నుంచి రూ.7 వేల కోట్లు ఖర్చు కావచ్చని అంచనా వేసింది. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయన్న వాదనల నేపథ్యంలో.. తెలంగాణ,సీమాంధ్ర ప్రాంతాల మధ్య సమతౌల్యాన్ని సాధించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
హెచ్‌ఆర్‌డీ శాఖ పంపిన ప్రతిపాదనలను జీవోఎం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. సీమాంధ్రలో ప్రఖ్యాత విద్యాసంస్థలను ఏర్పాటుచేసి, ఏడాదిలోగా విధులు ప్రారంభించాలని కోరుతూ జీఓఎంకు పలువురు ఇప్పటికే వినతిపత్రాలు సమర్పించారు. అన్ని కేంద్ర సంస్థలనూ ఓ బిల్లు ద్వారా ఏర్పాటుచేయాలని, దానిపై అన్ని జాతీయ పార్టీలు సంతకాలు చేయాలని కోరారు. కాకినాడ ఎంపీ పళ్లంరాజు హెచ్‌ఆర్‌డీ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, సహజ వనరులు జాతీయ సంపద అని, గ్యాస్‌లో రాష్ట్రాలకు వాటా ఇవ్వడానికి ప్రస్తుత విధానంలో ఆస్కారం లేనందున దీనిపై జీవోఎంనే తేల్చాలని పెట్రోలియం,సహజవాయువు మంత్రిత్వశాఖ తమ నివేదికలో స్పష్టంచేసింది. ఆయా శాఖలు ఇచ్చిన నివేదికలను హోంశాఖ జీవోఎం ముందుంచుతుంది.
సీమాంధ్రకు ఐఐటీ, ఐఐఎం!
Published Wed, Nov 6 2013 2:01 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement