ఆ రెండూ విభజన పార్టీలే: లక్ష్మణరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నైజం బయటపడిందని, ఈ రెండు పార్టీలు విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయనేది స్పష్టమైందని జస్టిస్ లక్ష్మణరెడ్డి ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలు రెండు ప్రాంతాల్లో ఓట్లు, సీట్ల కోసం నాటకమాడుతున్నాయని దుయ్యబట్టారు. సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర కోరుకునే వాళ్లంతా తమ ప్రాంత ప్రజాప్రతినిధులు వ్యవహరించే తీరుపై ఆసక్తిగా ఎదురుచూస్తుంటే... టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో ప్రజలు అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారని శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ విమర్శించారు.
ఆయన ప్రస్తావించిన అంశాల్లోని ముఖ్యాంశాలు...
విభజనకు వ్యతిరేకమా, అనుకూలమా అన్నదానిపై ఓటింగ్ అడగడంలేదు. చివరిదాకా చర్చలతో కాలయాపన చేసి, చివరి దశలో విభజనవాదులతో రచ్చ చేయించి బిల్లును కేంద్రానికి పంపించేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి సమైక్యంపై మాట్లాడకుండా ఎప్పుడో వైఎస్ చెప్పారు.. టీడీపీ లేఖ ఇచ్చిందంటూ అసందర్భోచితంగా మాట్లాడుతూ ప్రజలు విరక్తి చెందేలా చేశారు.
అన్ని రాష్ట్రాల విభజనలనూ చూశానని చెబుతున్న సభాపతి, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడులు ఓటింగ్‌పై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దురదృష్టం. రెండు ప్రాంతాల్లో పార్టీని బతికించుకోవడం కోసం అసెంబ్లీలో డ్రామాలు ఆడుతున్నారు.
ఓ వైపు పయ్యావుల కేశవ్ ఓటింగ్ గురించి అడుగుతారు కానీ.. ఎప్పుడు పెట్టాలో అడగరు. సమైక్య తీర్మానం చేయాలని గతంలో డిమాండ్ చేసిన ముద్దుకృష్ణమనాయుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఇది దేనికి సంకేతం?
ఓటింగ్ పెడితే విభజనకు వ్యతిరేకంగా వేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఘంటాపథంగా చెబుతుంటే... వాళ్లను టార్గెట్ చేయడం ఘోరం.