రాజకీయ పార్టీలకు జస్టిస్ లక్ష్మణరెడ్డి సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి తలెత్తిన సమస్యలను పరిష్కారించాలనే చిత్తశుద్ధి కేంద్రానికి ఉంటే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఆరో ఆప్షన్‌లో పొందుపరిచిన సూచనలను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక రాష్ట్ర నేత జస్టిస్ లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా అందులో సూచించిన అత్యుత్తమ పరిష్కార మార్గాన్ని ఆమోదించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన వేదిక రాష్ట్ర కో-ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి, సభ్యులు రాంబాబు, సూర్యనారాయణలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాజకీయ పార్టీలు సొంత ఎజెండాను పక్కనపెట్టి ప్రజల ప్రయోజనాల దృష్ట్యా శ్రీ కృష్ణ కమిటీ సూచించిన ఆ ఆప్షన్‌ను అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకమంటూ ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు సీపీఎం, మజ్లిస్ పార్టీలు స్పష్టం చేయటాన్ని అభినందిస్తున్నట్టు వెల్లడించారు. మిగతా రాజకీయపార్టీలు కూడా విభజనకు వ్యతిరేకమంటూ కేంద్ర హోంశాఖకు లేఖల రూపంలో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఈనెల 7న భేటీ అవుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో సమైక్య ఉద్యమ తీవ్రతను తెలిపేలా ఆరు, ఏడు తేదీల్లో రహదారులను దిగ్బంధించాలని వేదిక కో-ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. సీమాంధ్రలోని అన్ని జిల్లాల్లో ఈనెల 8న ‘వంద రోజుల సమైక్య ఉద్యమ’సమీక్షను నిర్వహించి అన్ని ఉద్యమ కమిటీలు, వేదిక జిల్లా కమిటీలు భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర విభజనకు తోడ్పడే కేంద్ర మంత్రుల బృందాన్ని, అఖిల పక్ష సమావేశాలను బహిష్కరించాలని కోరారు.
‘ఆరో ఆప్షన్’ అమలుకు ఒత్తిడి తెండి
Published Tue, Nov 5 2013 2:11 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement