మీడియాతో మాట్లాడుతున్న రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తంరెడ్డి
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): అన్ని వర్గాల భాగస్వామ్యం లేని అమరావతి రాజధాని ఎలా అవుతుందని రాయలసీమ మేధావుల ఫోరం ప్రశ్నించింది. రాజధాని ఏర్పాటు సమయంలో శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను గత సర్కారు విస్మరించిందని పేర్కొంది. అమరావతిలో 50 నుంచి వంద మంది వ్యక్తం చేసే అభిప్రాయం రాçష్టం మొత్తానికి వర్తిస్తుందా? అని నిలదీసింది. అమరావతి రైతుల పేరుతో చేపట్టిన ఉద్యమంలో నిజాయితీ లేదని, కేవలం వ్యాపార దృక్పథం మాత్రమే ఉందని ఫోరం స్పష్టం చేసింది. అది ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన నాయకులు, ప్రజాభిమానాన్ని కోల్పోయిన పార్టీలు నడిపిస్తున్న పెయిడ్ ఉద్యమమని విమర్శించింది. అమరావతి రైతుల పేరిట రాయలసీమ వాసులను రెచ్చగొట్టవద్దని హెచ్చరించింది.
రాయలసీమకు హైకోర్టు వద్దని అడ్డుపడుతున్న వారు ఎస్వీయూలో బహిరంగ సభ నిర్వహిస్తామంటే ఎలా అనుమతిస్తామని సూటిగా ప్రశ్నించింది. తిరుపతిలో సభ నిర్వహించేందుకు వీలు లేదని, ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే సంబంధిత వ్యక్తులు, సంస్థలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఫోరం ప్రకటించింది. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై అందరూ స్పందించాలని, ఈ అంశంపై బుధవారం నుంచి ప్రజల్లోకి వెళ్తామని ఫోరం ప్రకటించింది. శ్రీకాళహస్తి, పుత్తూరు, ఎస్వీ యూనివర్సిటీల్లో అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులను జాగృతం చేస్తామని స్పష్టం చేసింది. ‘ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ ఆలోచన – రాయలసీమ ప్రజల మనోగతం’ అనే అంశంపై రాయలసీమ మేధావుల ఫోరం మంగళవారం ఎస్వీయూలో మీడియా సమావేశాన్ని నిర్వహించింది.
ఢిల్లీ ఎక్కడుంది?
‘రాజధాని నడిబొడ్డున ఉండాలన్న నిబంధన ఎక్కడుంది? దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉందా?’ అని ఎస్వీయూ విశ్రాంత ప్రొఫెసర్ జి.జయచంద్రారెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ఆధారంగా ఏమూల నుంచైనా పాలన సాగించవచ్చన్నారు. తమిళనాడు నుంచి రాయలసీమకు వస్తున్న పెట్టుబడులను గత ప్రభుత్వం అడ్డుకుని అమరావతిలోనే పెట్టాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి అందరికీ తెలుసని చెప్పారు.
డబ్బులు వెదజల్లి రెచ్చగొట్టే యత్నాలు..
అమరావతి ఒక వర్గానికి సంబంధించిన రాజధాని అని ప్రొఫెసర్ ఎ.సుధాకరయ్య పేర్కొన్నారు. రాయలసీమలో హైకోర్టు ఉంటే అమరావతి రైతులకు వచ్చే నష్టం ఏమిటని ప్రొఫెసర్ నాగోలు కృష్ణారెడ్డి ప్రశ్నించారు. అమరావతి ఉద్యమం పేరిట డబ్బులు వెచ్చించి ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు జరుగుతున్న కుట్రని చెప్పారు. రాయలసీమలో ఎక్కడ సభ తలపెట్టినా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు కర్నూలులో రాజధాని, హైకోర్టు ఏర్పాటును ఏనాడు ప్రశ్నించలేదని ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. కోస్తా ప్రజలకు రాజధాని అడిగే హక్కు న్యాయపరంగా, నైతికంగా లేదన్నారు. తాము ఉత్తరాంధ్రతో కలిసి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తామన్నారు.
సీమవాసుల మద్దతు దుష్ప్రచారమే..
మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో రాయలసీమపై దుష్ప్రచారం జరుగుతోందని ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ వాసులు అమరావతికి మద్దతిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సీమ ప్రజలు తమ ప్రాంతానికి రాజధాని వద్దని చెబుతున్నట్లు నమ్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు తిరస్కరించిన ఒకరిద్దరు నాయకులు మినహా ఎవరూ అమరావతి ఉద్యమాన్ని అంగీకరించడం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పేరిట ఇప్పటికే మోసానికి గురై మద్రాస్, కర్నూలు నుంచి రాజధాని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త నగరం రావాలంటే అది రాయలసీమకే దక్కాలని స్పష్టం చేశారు.
ఇక్కడ గ్రామీణ వాతావరణం గల పట్టణాలే తప్ప ఒక్క నగరం కూడా లేదని గతంలో శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని గుర్తు చేశారు. అమరావతి రైతులు రాజధానికి భూములు త్యాగం చేశారని కొందరు నాయకులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. అమరావతి రైతులు చేసింది త్యాగం కాదని, వ్యాపారమని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి, విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీకి భూములిచ్చిన రైతులదే నిజమైన త్యాగమన్నారు. కర్నూలుకు హైకోర్టు రావాలని గతంలో బీజేపీ, వామపక్షాలు ఒప్పుకున్నాయని, రాయలసీమ వాసుల మౌనాన్ని అలుసుగా తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గత సర్కారు పద్మావతి మహిళా మెడికల్ కళాశాలలోసీమకు మెడికల్ సీట్లు రాకుండా నష్టం కలిగించిందని, దీనిపై ఉద్యమిస్తే అడ్డుకుందని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment