సంఘీభావం తెలుపుతున్న విద్యార్థులు, రాయలసీమ మేధావుల ఫోరం నేతలు
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): పుట్టిన గడ్డకు ద్రోహం చేస్తున్న సీమ నాయకులు సిగ్గుపడాలని రాయలసీమ మేధావుల ఫోరం మండిపడింది. అమరావతి రైతుల పేరుతో 50 నుంచి 100 మంది నిర్వహిస్తున్న పాదయాత్రకు కొందరు నాయకులు హారతులిచ్చి స్వాగతం పలకడం సీమకు ద్రోహం తలపెట్టడమేనని స్పష్టం చేసింది. పాదయాత్రకు మద్దతివ్వడమంటే మన గొంతు మనమే కోసుకున్నట్లని పేర్కొంది. ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలోని ఎస్వీయూ ఆడిటోరియంలో నిర్వహించిన సదస్సులో తరతరాలుగా రాయలసీమకు జరుగుతున్న నష్టాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే రెండు సార్లు రాజధానిని కోల్పోయిన సీమ ప్రజలు ఇప్పుడు పోరాడకపోతే పూడ్చలేని నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది.
19 గ్రామాల ప్రయోజనం కోసం...
కమిటీల నివేదికలను చంద్రబాబు తుంగలో తొక్కి ఏకపక్షంగా రాజధానిపై నిర్ణయం తీసుకున్నారని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి విమర్శించారు. కేవలం 19 గ్రామాల ప్రజల కోసం రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించారని దుయ్యబట్టారు. రాయలసీమ అభివృద్ధి నినాదంతో తిరుపతిలో 17న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు.
త్యాగం.. ఎవరిది?
శ్రీశైలం ప్రాజెక్టు కోసం 80 వేల ఎకరాలను ఇచ్చిన రాయలసీమ రైతులది త్యాగమా? లేక తమ స్వార్థం కోసం భూములిచ్చి కౌలు, రుణమాఫీ, ఇతర ప్రయోజనాలు పొందుతున్న అమరావతి వాసులది త్యాగమా? అని మాకిరెడ్డి ప్రశ్నించారు. సొంతగడ్డకు నష్టం జరగాలని కోరుకుంటున్న వారికి కొందరు రాయల సీమ నేతలు మద్దతు పలకడం బాధాకరమన్నారు.
విద్యార్థులదే కీలకపాత్ర..
పాదయాత్రపై ఓ వర్గం మీడియా అవాస్తవాలను ప్రచారం చేస్తోందని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎస్వీయూ పాలకమండలి సభ్యుడు సీ.ద్వారకనాథరెడ్డి పేర్కొన్నారు. రాయలసీమలోనే హైకోర్టు, రాజధానిని ఏర్పాటు చేయాలన్నారు. వికేంద్రీకరణ, ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టాలని సీనియర్ జర్నలిస్టు ఆదిమూలం శేఖర్ కోరారు. ఈ పోరాటంలో విద్యార్థులదే కీలక పాత్రని రచయిత్రి మస్తానమ్మ చెప్పారు.
సీమ అభివృద్ధిని అడ్డుకుంటూ పాదయాత్రలా?
రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటున్న అమరావతి పెయిడ్ ఉద్యమకారులకు తిరుపతిలో అడుగుపెట్టే అర్హత లేదని, వారి యాత్రను అడ్డుకుంటామని వైఎస్సార్ విద్యార్థి విభాగం హెచ్చరించింది. అమరావతి రైతుల పేరుతో సాగుతున్న పాదయాత్రను వ్యతిరేకిస్తూ శుక్రవారం ఎస్వీయూ పరిపాలనా భవనం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అమరావతి పెయిడ్ ఆరిస్టులు గో బ్యాక్ అంటూ నినదించారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అమలు చేయాలని, రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం చంద్రబాబు పుట్టిన గడ్డకు ద్రోహం చేస్తున్నారని విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎల్.రాజశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. ఇటీవల కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు ఛీ కొట్టినా ఆయన వైఖరి మారలేదని, చంద్రబాబు కనుసన్నల్లోనే పాదయాత్ర జరుగుతోందని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment